16, సెప్టెంబర్ 2020, బుధవారం

మత్స్యావతారము


      ( మంజరీ ద్విపద )

గతమందు జరిగిన కల్పాంతవేళ
ధరయందు వెల్గొందు ద్రవిడదేశమును
సత్యవ్రతుండను సత్త్వశోభితుడు
పరిపాలనముజేసె ప్రజలు సుఖించ

ఆతడత్యంతగా హరినిష్ఠతోడ
యశనంబుగా నీరె నరయ గ్రోలుచును
నొనరంగ నిష్ఠతో నొకయేటితటిని
గావించు చుండెను గాఢమౌతపము

కృతమాలికనియడా యేటిలో నిలిచి
యత్యంత నిష్ఠతో నవని నాథుండు
సల్పుచూ నుండెను జలతర్పణంబు
అత్తరి యవనీశు డాశ్చర్య మొంద
దోచె మీనొక్కటి దోసిలియందు 
ఆ చేపపిల్లనా యధిపతిగాంచి
నులికె నత్యంతగా నొడలెల్ల కదల
సత్యవ్రతుండంత సలిలంబులోకి
జలచరంబును దాన్ని జాలితొ విడచె

ఆరీతి విడివడి యంభశ్చరంబు
మగిడి నీటిని జేరె మారాజు కతన
జలచర పోతంబు జనపతి తోడ
నయ్యడ నిట్లనె నభ్యర్థ నమున
"నరనాథ !వినవయ్య నా దీన గాధ
దయలేక వదలకు దక్కిన నన్ను
చిరుమీను లనుబట్టి చేరియు జంపు
జ్ఞాతి ఘాతకులైన ఝషములు పెక్కు
పాపవర్తనులౌచు బ్రతికుదు రిచట
పాపజాతి ఝషపు పాలన బడక
తప్పించు కొనుటకై దారిని వెదికి
నీ దోషి టందున నేజేరి యుంటి
అరయ రక్షించక యార్తినౌ నన్ను
దయమాలి విడుతువే దారుణంబుగను
నట్టేటికిని మఱల నెట్టంగ దగునె
ఆపదొండు గలదు నంతియే గాక
వేటాడు జాలర్లు యేటికి వచ్చి
వదలక మామీద వలలని పన్ని
యేఱంత కెలికియు యెఱలను బెట్టి
గట్టిగా బట్టేరు కడు లాఘవమున
మిడిసిపోనీకను మెడపట్టుకొనిన
నపుడెందు బోదును యనఘుడా ! నేను
ఝషములు వేటాడి జాలి చూపకను
పట్టినన్ సులువుగా భక్షించ గలవు
జాలించుకను లేక జాలర్లు నన్ను
పట్టియు సులువుగా భక్షించ గలరు
ఇరు యాపదలనుండి వెఱగు జూపించి
రాగంబుతో నన్ను రక్షించు మిపుడు
ప్రక్షీణులను గావ భాగ్యంబు గలుగు "
మత్స్య మారీతిగా మాట్లాడి నంత
సత్త్వ శొభితుడైన సత్యవ్రతుండు
కరుణతో దానిని కాపాడ దలచె

అంత నా మీనును యధిపతి తనదు
హజ్త కమండలు నందులో నునిచి
గొపోయె నింటికి గురు కృపతోడ
అంతనా యద్భుత యంభశ్చరంబు
నొనరంగ గడచిన నొకరాత్రి యందె
యా కమండలు నిండి నయ్యె పెద్దదిగ
" ఇచ్చొట నుండుట కిబ్బంది యయ్యె
సరిపోదు యీ పాత్ర సంచరించుటకు
వెఱొక పాత్రలో విడువుము నన్ను "
యనుచు నభ్యర్థించె నా రాజప్రముఖు .
అంతనా జనపతి యంగీక రించి
కరుణతో దానిని ఘటమందు నునిచె
సలిల మధ్యంబున సంచరించదియు
నొక ముహూర్తపు వేళ నొనర వెన్వెంట
మూడు చేతుల దీర్ఘ ముండునట్లు గను
నా యుదంచము నిండె యద్భుతంబుగను.
అంత వేఱొక పాత్ర నదుగగా చేప
యత్యంత కరుణకు యాటపట్టైన
మహరాజు దానిని మడుగులో నుంచె
ఆ మడుగున గూడ యంభశ్చరంబు
యంతకంతకు పెద్ద దయ్యెను మిగుల
సనచరించగ నిది కొంచెమే యనియు
యర్థించె వేఱొక యన్య దెశముకు
అంత నా జనపతి యంగీక రించి
నద్దాని నొక పెద్ద హ్రదముకు జేర్చె
అత్యద్భుతంబుగా యంత నా చేప
యంతకంతకు బెర్గి హ్రదమంత నిండె
'ఇబ్బంది గా నుండె యిటనుండ నాకు '
యనుచు నభ్యర్ధించె నన్య ప్రాంతముకు .
సంభ్రమాశ్చర్యాల సత్య వ్రతుండు
యా తిమిన్ గాంచియు నచ్చెరు వొంది
సరగున దానిని సంద్రాన నునిచె
సంద్రంబు నందునా చాలక మీను
యర్థించె పెట్టగా నార్ణవమందు
అంతట జనపతి యాలకించియును
పెట్టెను దానిని పెను సంద్రమందు
ఆ మహార్ణవమున నయ్యది జేరి
యనె నిట్లు రాజుతో నభ్యర్థ నమున
" ఈ మహార్ణవమున నెన్నియో పెక్కు
మదమెక్కి తిరిగెడి మకరంబు లుండు
అవలీలగా మ్రింగు నయ్యవి నన్ను
ఇంతకాలము నన్ను నీరీతి గాచి
నంత్యాన నెమునికి నర్పించ దగునె !
రాజేంద్ర ! కరుణతో రక్షించు నన్ను "

గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: