16, సెప్టెంబర్ 2020, బుధవారం

ప్రముఖ ప్రజాపతులును

🌺 *ఓం నమో నారాయణాయ* 🌺


*222. ఇ వ్విధంబున వామనుం డయి హరి బలి నడిగి, మహిం బరిగ్రహించి, తనకు నగ్రజుండగు నమరేంద్రునకుం ద్రిదివంబు సదయుం డయి యొసంగె; న త్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును, భవుండును, గుమారుండును, దేవర్షి, పితృగణంబులును, రాజులును, దానును గూడికొని చతురాననుండు గశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు "వామనుండు వల్లభుం" డని నియమించి యంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు వ్రతంబులకు స్వర్గాపవర్గంబులకు "నుపేంద్రుండు ప్రధానుం" డని సంకల్పించె నా సమయంబున.*


*భావము:* ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి, బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్న అయిన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు; శివుడు; కుమారస్వామి; నారదుడు మున్నగు దేవర్షులు; పితృదేవతలు; రాజులుతో పాటు కలిసి బ్రహ్మదేవుడు "లోకాలకూ దిక్పాలకులకూ వామనుడు ప్రభువు" అని శాసనం చేసాడు. ఈ విషయం కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట, "ధర్మానికి కీర్తికీ సంపదలకూ శుభాలకూ దేవతలకూ వేదాలకు స్వర్గానికి మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి" అని నిర్ణయించాడు.



*223. కమలజుఁడు లోకపాలురు నమరేంద్రునిఁగూడి దేవయానంబున న య్యమరావతికిని వామను నమరం గొనిపోయి రంత నట మీఁద నృపా!"*


*భావము:* పరీక్షన్మహారాజా! అటుపిమ్మట బ్రహ్మదేవుడూ దిక్పాలకులూ దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకుని అమరావతికి తీసుకుని వెళ్లారు.



*224. బల్లిదంపుదోడు ప్రాపున నింద్రుని కింద్రపదము చేరు టిట్లు గలిగెఁ; దనకు నాఢ్యుఁడైన తమ్ముఁడుఁ గలిగినఁ గోర్కులన్న కేల కొఱఁత నొందు?*


*భావము:* ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపువల్ల, ఇంద్రుడికి ఇంద్రపదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా.

కామెంట్‌లు లేవు: