16, సెప్టెంబర్ 2020, బుధవారం

భీష్ముడి శపథం

ఆదిపర్వము – 21



ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో విహరిస్తున్నాడు. దూరం నుండి మంచి పరిమళం వస్తూ ఉంది. ఆ పరిమళం వస్తున్న వైపుగా వెళ్లగా, అక్కడ ఒక అందమైన కన్యను చుసాడు శంతనుడు. ఆమె యోజన గంధి(సత్యవతి). ఆమె ఒంటి మీద నుండి వచ్చే పరిమళాన్ని, ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోయాడు శంతనుడు.

“ఓ సుందరీ, నీవు ఎవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకు పడవ నడుపుతున్నావు?” అని అడిగాడు.

“ఓ రాజా, నేను దాశ రాజు కూతురిని. తండ్రిగారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను” అని బదులు చెప్పింది సత్యవతి.

శంతనునికి ఆమెను వివాహం చేసుకొన వలెనని కోరిక కలిగింది. వెంటనే శంతనుడు దాశ రాజు దగ్గరకు వెళ్లి, తన కోరిక వెల్లడించాడు.

“మహారాజా, ఆడపిల్ల పుట్టిన వెంటనే ఒక వరుని చేతిలో పెట్టడం సంప్రదాయం.. నా కుమార్తెను నీ నీ వంటి వరునికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది. కాని, నాది ఒకకోరిక ఉన్నది” అని అన్నాడు దాశరాజు.

“అదేమిటో చెప్పు” అని అడిగాడు శంతనుడు.

“నా కుమార్తెకు పుట్టబోయే సంతానానికి రాజ్యాధికారం దక్కాలి” అని కోరాడు దాశరాజు.

దానికి శంతనుడు ఒప్పుకోలేదు. గాంగేయుడికి తప్ప వేరే వారికి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు. వేరే ఏదైనా కోరుకో అన్నాడు శంతనుడు.

“నాకు మరేమీ ఇష్టం లేదు” అన్నాడు దాశరాజు.

విచారంతో శంతనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అప్పటినుండి శంతనుడు రాచకార్యాలు సరిగా చూడ్డంలేదు, ఎప్పుడూ ఏదో విచారంగా ఉంటున్నాడు. గాంగేయుడు ఇది చూసాడు.

“తండ్రీ, మీ మనోవేదనకు కారణమేమి?” అని అడిగాడు

“గాంగేయా, ఒకే పుత్రుడు కలవాడు, అసలు సన్ర్తానం లేని వాడు సమానమే అని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. నీకు తోడుగా మరికొంత మంది కొడుకులను కనాలని కోరికగా ఉంది. పైగా, నువ్వు అస్త్ర, శస్త్ర విద్యలలో ఆరితేరిన వాడవు. శత్రువుల పట్ల క్రూరుడవు. అత్యంత సాహసికుడవు. కాబట్టి, నీకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంది. నువ్వు ఎన్నాళ్లు బతుకుతావో తెలియదు. కాబట్టి, ఇంకా కొంతమంది పుత్రులు ఉంటే బాగుంటుంది అని అన్నాడు.

తండ్రికి మరల వివాహం చేసుకొనె వలెనని కోరికగా ఉంది అని గాంగేయునికి అర్థం అయింది. మంత్రులతో ఆలోచించి అసలు విషయం తెలుసుకున్నాడు. దాశరాజు దగ్గరకు వెళ్లాడు.

“దాశరాజా, నీ కుమార్తె యోజన గంధిని నా తండ్రి శంతనునికి ఇచ్చి వివాహము చేయుము” అని అడిగాడు.

“చాలా సంతోషము, నీవు నీ తండ్రి కొరకు కన్యను అడగడానికి వచ్చిన ధర్మాత్ముడివి. ఈ కన్య సామాన్యురాలు కాదు. ఉపరిచర వసువు వీర్యానికి జన్మించింది. ఆ ఉపరిచర వసువు ఈ కన్యను శంతన మహారాజుకే ఇమ్మని చెప్పాడు. అందుకే ఇది వరకు దేవలుడు అడిగినా ఇవ్వలేదు. కాని నాది ఒక కోరిక. నా కూతురికి పుట్టే పుత్రులు సవతి కుమారులూవుతారు. కాబట్టి ఆ దోషం లేకుండా చెయ్యి” అని చెప్పాడు దాశరాజు.

గాంగేయునికి దాశరాజు ఆంతర్యం అర్థం అయింది. వెంటనే అక్కడ ఉన్న వారిననందరిని పిలిచి “ఇక్కడ చేరిన రాజులు అమాత్యులు, ప్రజలు అందరూ వినండి. నా తండ్రికి కాబోయే భార్య అయిన ఈ యోజన గంధికి పుట్టబోయే పుత్రులే ఈ రాజ్యానికి వారసులు అవుతారు. అతనే మన అందరికి ప్రభువు” అని చెప్పాడు.

కాని దాశరాజుకు ఒక సందేహం కలిగింది.

“గాంగేయా, నీవు రాజ్యాధికారాన్ని వదులుకున్నావు. కాని నీకు పుట్టబోయే పుత్రులు ఊరుకోరు కదా. వారు నీ మాటను అంగీకరిస్తారా?” అని అడిగాడు.

“దాశరాజా నాకు పుత్రులు కలిగితేనే కదా ఆ సమస్య వచ్చేది. అందుకే నేను ఈ రోజు నుండి బ్రహ్మచర్య వ్రతాన్న్ని స్వీకరించాను. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను. నీ కూతురిని నా తండ్రికి ఇచ్చి వివాహం చెయ్యడానికి అభ్యంతరం లేదుగా” అని అన్నాడు గాంగేయుడు.

గాంగేయుడు చేసిన ఈ భీషన్ణమైన ప్రతిజ్ఞ “భీష్మ ప్రతిజ్ఞ గా” చరిత్రలో నిల్చిపోయింది. దేవతలు పూలవాన కురిపించారు. ఆరోజు నుండి గాంగేయుడు “భీష్ముడు”గా ప్రసిద్ధి చెందాడు.

దాశరాజు వెంటనే తన కూతురు యోజన గంధి(సత్యవతి)ని శంతనునికి ఇచ్చి వివాహం జరిపించాడు. తన కుమారుడైన గాంగేయుడు, తన కోర్కె తీర్చడం కోసం చేసిన త్యాగాన్ని శంతనుడు ఎంతగానో ప్రశంసించాడు.

“కుమారా, నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను. నీకు స్వచ్ఛంద మరణం ప్రసాదిస్తున్నాను. నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు మరణించవచ్చు” అని వరం ఇచ్చాడు.

కామెంట్‌లు లేవు: