27, అక్టోబర్ 2020, మంగళవారం

రామాయణమ్ 105

 రామాయణమ్ 105

...

భరతుడిని అన్ని విధాలుగా విచారించి  నీవు నారచీర జటలు ధరించి ఇచటికి ఎందుకు వచ్చావు కారణమేమిటి? అని ప్రశ్నించాడు రాముడు.

.

.నేను నీ దాసుడను నన్ను అనుగ్రహించి దేవేంద్రుడిలాగా  రాజ్యాభిషిక్తుడవు కమ్ము! .మన తల్లులు ,మన ప్రజలు అందరూ ఆశగా నీ వద్దకు వచ్చినారు .మమ్ములను నీవు అనుగ్రహించవలెను.

.

మనవంశాచారమును బట్టి జ్యేష్ఠుడవైన నీకే రాజ్యాధికారము కలదు! ఈ రాజ్యము నీది దీనిని స్వీకరించు!

.

ఈ సచివులు ,నేను ఇక్కడచేరిన ప్రజలంతా శిరస్సువంచి నమస్కరిస్తూ ప్రార్ధిస్తున్నాము ఈ రాజ్యలక్ష్మిని స్వీకరించు.

నీ సోదరుడను ,నీ శిష్యుడను,నీ దాసుడను నన్ను అనుగ్రహించు.

.

మహాబాహువైన భరతుడు అన్నను ప్రార్ధించి కన్నీరు కారుస్తూ ఆయన పాదాలను మరలమరల తాకి నమస్కరిస్తూ వేడుకుంటున్నాడు.

.

అంత రాముడు భరతునితో నాయనా ఉత్తమవంశములో జన్మించినవాడు రాజ్యము కొరకు పాపము చేయునా ? ( నీ విషయంలో నాకేమీ అనుమానం లేదని అర్ధం)

.

భరతా నీలో ఏవిధమైన దోషములేదు ,బాలుడి వలే నీ తల్లిని నీవు నిందించవద్దు.తన భార్యా పుత్రులవిషయములో మన తండ్రి నిర్ణయాన్ని నీవు తప్పుపట్టవద్దు!. అంతేకాక మహారాజుగా ఆయనకు మనలను శాసించే అధికారమున్నది .

.

ధర్మశీలురైన నా తల్లితండ్రులు ఇరువురూ అరణ్యమునకు వెళ్ళమని ఆజ్ఞాపించగా ఇంకొక విధముగా నేనెలా ప్రవర్తించగలను.( కైకేయి విషయములో రామునకు స్వంత తల్లా,సవతితల్లా అనేభేదభావములేదు   ,గమనించగలరు)

.

మన తండ్రి గారు నిన్ను అయోధ్యలో రాజ్యపాలనము గావించమన్నారు ,నన్ను దండకారణ్యములో నివసించమన్నారు ఇది ఆయన చేసిన పంపకము.

.

మహారాజు నిర్ణయమే ప్రమాణము .తండ్రిగారు నీకిచ్చిన భాగాన్ని నీవు అనుభవించు ! నా కిచ్చిన భాగాన్ని నేను అనుభవిస్తాను.

.

అన్నా మన వంశమునకు ఉన్నధర్మము ,అనాదిగా అందరూ పాటించేది జ్యేష్ఠుడు రాజుగా బాధ్యతలు స్వీకరించడం ,నేను ఆ విషయంలో ధర్మహీనుడను కాలేను. నాకు రాజ్యముతో పనిలేదు ,నాకు దాని వలన ప్రయోజనమూ లేదు.

.

రామా నీవు మాతో కూడి అయోధ్యకు రావలే! రాజ్యాభిషిక్తుడవు కావలే.

.

.మన తండ్రిగారు నిన్ను అడవికి పంపిన తరువాత నీ వియోగము వలన కలిగిన శోకము భరించలేక స్వర్గస్తులైనారు.

.

నా తల్లి మూలముగా ఆయన తన కీర్తిని శాశ్వతముగా నశింప చేసే ఈ పాపపు పనికి ఒడిగట్టినాడు.

.

నా తల్లి కోరినది రాజ్యము! 

కానీ 

ఆవిడకు లభించినది మాత్రము వైధవ్యము!

.


.

అన్నా!. నీవు సీతా లక్ష్మణసమేతుడవై అరణ్యమునకు వెళ్ళిన వెంటనే ఆ బాధ భరించలేక ,దుఃఖపీడితుడై దశరధమహారాజు  స్వర్గస్తుడైనాడు.

.

రామా ! లేచి తండ్రిగారికి జలతర్పణాలిమ్ము ! నేనూ శత్రుఘ్నుడూ ఇంతకుపూర్వమే ఆయనకు తర్పణాలు ఇచ్చియున్నాము.

.

నీవు దూరమైన పిదప నిన్నుగూర్చి ఆలోచిస్తూ ,దుఃఖిస్తూ నిన్ను చూడవలెనని కోరుకుంటూ ,నిన్ను స్మరిస్తూ నీయందే లగ్నమైన మనస్సును మరల్చలేక ఆయన మరణించాడు.ఆయనకు అపరక్రియలు చేయవలసినవాడవు, ఆయన ప్రియపుత్రుడవైన నీవే!.

.

ఇంతసేపటి తరువాత భరతుడు ఎరిగించిన తండ్రి మరణవార్త విని రాముడు స్పృహతప్పి మూర్ఛపోయాడు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: