27, అక్టోబర్ 2020, మంగళవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -8


.ధృవుండు తపంబు చేయుట 


(హరిని) స్వధర్మాయత్తమైన ఏకాగ్రచిత్తంలో నిలిపి ఆరాధించు. ఆ మహాత్ముని కంటె నీ దుఃఖాన్నితొలగింప గలిగినవాడు మరొకడు లేడు.” అన్నది సునీతి. పరమార్థసిద్ధికి కారణాలైన తల్లి మాటలను ధ్రువుడు విని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చి పట్టణం నుండి బయలుదేరాడు. ఆ సమయంలో నారదమహర్షి ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని ధ్రువుని దగ్గరకు వచ్చి, అతని కోరికను తెలుసుకొని, పాపాలన్నిటినీ పారద్రోలే తన చల్లని చేతితో అతని శిరస్సును స్పృశించాడు. ‘గౌరవహానిని సహింపని క్షత్రియుల తేజస్సు అద్భుతమైనది కదా! పసివాడై కూడ పినతల్లి పలికిన దుర్వాక్కులను మనస్సులో ఉంచుకొని నగరంనుండి వెళ్ళిపోతున్నాడు’ అని మనస్సులో ఆశ్చర్యపడి “నాయనా! సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు? బంధువులు చేసిన అవమానంచేత బాధపడుతున్నట్లున్నావు” అని పలుకగా ధ్రువుడు ఇలా అన్నాడు “సవతితల్లి మాటల వల్ల అయిన గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధంతో నయం చేసుకొంటాను”. ధ్రువుని మాటలు విన్న నారదుడు ఇలా అన్నాడు.నాయనా! విను. ఎల్లప్పుడు ఆటలందు ఆసక్తిని చూపవలసిన ఈ పసివయస్సులో గౌరవాగౌరవాలను పట్టించుకొనవలసిన పని లేదు. 

కనుక మంచి చెడులను నిర్ణయించే వివేకం నీకు ఉన్నా విచారించకు. మానవులు తమ పూర్వకర్మలను బట్టి కలిగే సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. కనుక తెలివి గల మానవుడు తనకు కలిగే సుఖదుఃఖాలను దైవసంకల్పం వల్ల కలిగినవని భావించి, వానితోనే తృప్తిపడతాడు. కాదు, నీవు నీ తల్లి చెప్పిన యోగమార్గాన్ని అనుసరించి భగవంతుని దయను పొందుతాను అన్నట్లయితే...పుణ్యాత్మా! యోగీంద్రులు పెక్కు జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించి కూడ ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ హరిని ఆరాధించడం నీకు చాల కష్టం. కాబట్టి వ్యర్థమైన ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. మోక్షాన్ని కోరుకున్నట్లయితే ముసలితనంలో దానికోసం ప్రయత్నించు. దైవవశాన సుఖదుఃఖాలలో ఏది కలిగినా మనస్సులో సంతోషించేవాడు విజ్ఞాని అనిపించుకుంటాడు. ఇంకా గుణవంతుని చూసి సంతోషిస్తూ, గుణహీనుని చూసి జాలిపడుతూ, తనతో సమానుడైనవానితో స్నేహం చేస్తూ ప్రవర్తించేవాని దరికి తాపత్రయాలు చేరవు” అన్న నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! సుఖదుఃఖాల వల్ల తెలివి కోల్పోయిన వారికి శాంతి లభించదని అన్నావు. శత్రువులకు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని నేను అవలంబించాను. కనుక నాకు వినయం ఎక్కడిది? సురుచి పలికిన దుర్భాషలు అనే బాణాలచేత బ్రద్దలైన నా హృదయంలో శాంతికి తావు లేదు. కాబట్టి ముల్లోకాలలోను శ్రేష్ఠమైనది, ఇతరు లెవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను. అందుకు నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు. నీవు బ్రహ్మ ఊరువునుండి జన్మించి, నేర్పుతో వీణను మ్రోగిస్తూ, లోకాలకు మేలును కూర్చే నిమిత్తం సూర్యభగవానిని వలె సంచరించే మహానుభావుడివి” అని చెప్పగా (నారదుడు) విని...నారదు డిలా అన్నాడు “పుణ్యాత్మా! నాయనా! విను. నిన్ను మోక్షమార్గాన్ని పొందడానికి ప్రేరేపించినవాడు పురుషోత్తముడైన వాసుదేవుడే. కనుక...నీవు ఆ మహాత్ముని ఏకాగ్రమైన చిత్తంతో సేవించు.ధర్మార్థకామమోక్షాలు అనబడే నాలుగు పురుషార్థాలను శ్రేయస్సును పొందాలి అని అనుకునే మానవునికి హరి పాదపద్మాలు తప్ప మరొక ఉపకరణము లేదు.అందుచేత సుగుణనిధీ! యమునానది ఒడ్డున హరికి నివాసస్థానమూ, పవిత్రమూ, పుణ్యప్రదమూ అయిన మధువనానికి వెళ్ళు. అక్కడ నీకు మేలు కలుగుతుంది. శుభాలను కలిగించే ఆ యమునానది నీటిలో స్నానం చేసి, నిశ్చలమైన బుద్ధితో నారాయణునికి నమస్కరించు. యమ నియమాలను అవలంబించు. ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోను, జింకచర్మంతోను స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని, పూరకము రేచకము కుంభకము అనే ఈ మూడు విధాలైన ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోమలాలను పొగొట్టుకొని, చాంచల్య దోషాలను తొలగించుకొని, స్థిరమైన మనస్సుతో (హరిని ధ్యానించు).శ్రీహరి ఆశ్రితుల యెడ అపారమైన కృపారసం చూపేవాడు. సుప్రసన్నమైన ముఖం, చల్లని చూపులు, అందమైన ముక్కు, సొగసైన కనుబొమలు, చిక్కని చెక్కిళ్ళు కలిగిన చక్కనివాడు. ఇంద్రనీల మణులవలె ప్రకాశించే మేను కల పడుచువాడు. ఎఱ్ఱని నేత్రాలు, పెదవులు కలవాడు. దయాసముద్రుడు. పురుషార్థాలను ప్రసాదించేవాడు. నమస్కరించే వారికి ఆశ్రయ మిచ్చేవాడు. శుభాలను కలిగించేవాడు. శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ కలవాడు. సర్వలోక రక్షకుడు. సర్వమూ చూచేవాడు. ఉత్తమ లక్షణాలు కలిగిన పురుషోత్తముడు. పుణ్యస్వరూపుడు. నీలమేఘశ్యాముడు. అవ్యయుడు.

ఇంకా. . . .ఆ శ్రీహరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉంటాడు. ఆయన ఆశ్రితులను పోషించేవాడు. అతని కటిప్రదేశం అందమైన మొలత్రాడుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలను ధరిస్తాడు. కౌస్తుభం అనే మణికాంతులతో అందమైన కంఠమాలను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖ చక్ర గదా పద్మాలను నాలుగు చేతులలో ధరించి ఉంటాడు. ఆయన లోకప్రసిద్ధుడు. కమ్మని సువాసన గల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆయన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడు. మేలిమి బంగారు అందెలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. దర్శించవలసినవాడు. ఆ శ్రీహరి ఆశ్రితుల మనస్సులకు, కన్నులకు ఆనందాన్ని కలిగించేవాడు. భక్తుల హృదయ పద్మాలలో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు. సాటిలేని శాంత స్వభావుడు. మహానుభావుడు.అటువంటి పురుషోత్తముని పూజించు. హృదయంలో కుదురుకున్నవాడూ, అనురాగమయ వీక్షణాలు వెదజల్లేవాడూ, వరాలను ఇచ్చేవాడూ అయిన నారాయణుని అచంచలమైన మనస్సుతో ధ్యానించు. అప్పుడు ఆ పురుషోత్తముని దివ్యమంగళ విగ్రహం మనస్సులో సాక్షాత్కరించి స్థిరంగా నిలిచిపోతుంది. ఏ మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుందో, ఓంకారంతో కూడి, పన్నెండు అక్షరాలు కలిగి, దేశకాల విభాగాలను తెలుసుకొని జపించవలసిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ఆ వాసుదేవ మంత్రాన్ని 

జపించాలి. గరికపోచలవలె శ్యామలవర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో, అందమైన పద్మాలవంటి కన్నులు కలిగినవానిని పద్మాలతో, తులసిదండలు ధరించేవానిని తులసీదళాలతో, మాలిన్యం లేని శీలం కలవానిని పూలమాలలతో, పక్షివాహనుని పత్రాలతో, లోకాలకు ఆదిమూలుడైన మహానుభావుని వనమూలికలతో, పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవానిని నారబట్టలతో సేవించాలి. భగవంతుణ్ణి మృణ్మయ, శిలామయ, దారుమయ ప్రతిమలలో కాని, నిర్మల జలాలలో కాని, పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి. 

“ఓం నమో భగవతే వాసుదేవాయః” అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధృవునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహా మంత్రపూరిత ఘట్టమిది.మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై, సదాచార సంపన్నుడై, శ్రీహరి కళ్యాణగుణాలను వర్ణిస్తూ కందమూలాలను మితంగా స్వీకరిస్తూ ఉండాలి.పురుషోత్తముడైన పుండరీకాక్షుడు తన మాయామహిమతో ఇచ్ఛానుసారంగా పెక్కు అవతారాలను ధరించి చేసిన లీలావిశేషాలను మనస్సులో భావించాలి. ఆత్మార్పణ బుద్ధితో చేసే పూజలను ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవునకు సమర్పించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించేవారు విష్ణుమాయలో చిక్కుకొనరు. వారికి భగవంతుడు ధర్మార్థకామమోక్షాలు అనే పురుషార్థాలలో కోరిన దానిని అనుగ్రహిస్తాడు. విరక్తితో ముక్తిని కోరువాడు, ఎడతెగని భక్తిభావంతో సేవిస్తూ ఉంటాడు” అని నారదుడు ఉపదేశించగా ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి, మహర్షులు నివసించేది, కోరిన కోరికలను ప్రసాదించేది, భగవంతుని పాదపద్మాలచేత అలంకరింపబడింది అయిన మధువనానికి బయలుదేరాడు.నారదుడు ఉత్తానపాదుని దగ్గరకు వెళ్ళి, ఆ రాజు చేసిన నానావిధాలైన పూజలను అందుకొని, ఆనందంతో ఉన్నతాసనంపై కూర్చున్నవాడై ఆ రాజు వంక చూచి...ఇలా అన్నాడు. రాజా! నీ వదనసరోజం వాడి ఉన్నది. నీ మనస్సులోని విచారానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించిన నారదునితో ఉత్తానపాదుడు ఇలా అన్నాడు. మునీంద్రా! నా ప్రియపుత్రుడు ధ్రువుడు ఐదేండ్లవాడు. మంచి తెలివితేటలు గలవాడు; పాపం ఎరుగనివాడు; అతనిని నేను దయమాలి అవమానించాను. అందుకు వాడు అలిగి తల్లితో పాటు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి భయంకరమైన అడవిలో ప్రవేశించి మార్గాయాసంతోను, ఆకలి బాధతోను ముఖపద్మం వాడిపోయిన నా కుమారుణ్ణి, ఏపాపం ఎరుగని పసివాణ్ణి తోడేళ్ళు, సర్పాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూరజంతువులు పొట్టన బెట్టుకున్నాయేమో అనే భయంతో, బాధతో లోలోపల కుమిలిపోతున్నాను. మహానుభావా! ఇలా జరిగినందుకు నేను దుఃఖిస్తున్నాను. అటివంటి ఉత్తముడైన బాలుణ్ణి నా ఒడిలో కూర్చోనివ్వక అవమానించాను. మునీంద్రా! నా చిన్న భార్య సురుచి మీది వలపుతో ఈ దుర్మార్గపు పని చేశాను.”ఉత్తానపాదుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు “రాజా! దేవతల కిరీటాల రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కల శ్రీహరి చేత రక్షింపబడే నీ కుమారుడు సమస్త లోకాలు ప్రస్తుతించే కీర్తి సంపదతో ప్రసిద్ధికెక్కిన చరిత్ర కలవాడు. అతనికోసం దుఃఖించడ మెందుకు?రాజా! ఉత్తానపాదా! లోకపావనుడైన నీ పుత్రుని ప్రభావం నీకు తెలియదు కాని. మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యంతో తులసీదళదాముడైన నారాయణుని సేవించి లోకపాలకులు సైతం పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. అంతేకాక...పుణ్యాత్మా! నీ కుమారుడు నీ కీర్తిని కల్పాంతం వరకు సుస్థిరంగా ఉండేటట్లు చేస్తాడు. అతడు సుగుణ రత్నాకరుడు. అచిరకాలంలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ పుత్రుని కోసం నీవు దుఃఖించవద్దు.”

అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి, ప్రియపుత్రుని తలచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: