27, అక్టోబర్ 2020, మంగళవారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


114 - విరాటపర్వం.


జుగుప్సాకరమైన కీచకుని మృత కళేబరంచూసి, బంధు మిత్రులు అమితంగా విలపించారు. కీచకుని నూట అయిదుగురు సోదరులు, ఉపకీచకులు అనేవారు కూడా ఆ బంధుగణంలో వున్నారు. వారు దుఃఖిస్తూనే, తదుపరి చెయ్యవలసిన కర్మకాండకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగా ఆసమయంలో, ఒక స్థంభం చాటునుండి యీ తతంగమంతా చూస్తున్న సైరంధ్రి వారి కంటబడింది. 


తన అన్నగారి మరణానికి కారణమైన సైరంధ్రిని చూసి కోపం ఆపుకోలేకపోయారు. అయితే అన్నగారు వలచి, ఆమె పొందుకోరి , ఆమె భర్తల చేతిలో అసువులు బాసిన సంగతి గుర్తుకువచ్చి, కనీసం మృతి చెందిన తరువాత అయినా తమ అగ్రజుని ఆత్మకు శాంతి కలగాలని, ఆమెనుకూడా కీచకుని మృతదేహంతో కలిపి, దహనం చెయ్యడానికి సంకల్పించారు, ఉపకీచకులు. 


ఆహా ! అంతులేనివి కదా యీకష్టాలు. అయోనిజకు అడుగడుగునా ఆపదలు. ఒక ఆపద గట్టెక్కిందనుకుంటే, యింకొకటి పొంచిచూస్తూనే వున్నది. ఆలోచన వచ్చినదే తడవుగా విరాటరాజు అనుమతి తీసుకుని, ద్రౌపదిని కూడా సజీవంగా మృత్యు శకటంపై యెక్కించి, అంతిమయాత్ర జరుపుతున్నారు, కీచకుని దేహానికి.


ద్రౌపది మళ్ళీ భర్తలపైనే ఆశలు పెట్టుకుని, వారి సంకేతనామాలైన జయ, జయంతి, విజయ, జయత్సేన, జయద్బల అనేపేర్లతో వారిని యెలుగెత్తి, తన గంధర్వ భర్తలను పిలుస్తున్నట్లు పిలుస్తూ రోదిస్తున్నది, ఆశకటం పైనుండి. ఆమె ఆర్తనాదం, మొదటగా భీముడే విన్నాడు. ఏమి జరుగుతున్నదో, తెలుసుకుని, హుటాహుటిన తన వేషం మార్చుకుని, పెరటిగుమ్మం ద్వారా, ఆ శకటం కంటే వేగంగా శ్మశానవాటికకు చేరుకొని, పొడవైన తాటిచెట్టును ఒకదానిని పెకలించి భుజాలపై పెట్టుకుని, మృత్యుపాశం పట్టుకున్న యమధర్మరాజులాగా ఉపకీచకుల రాకకై నిరీక్షిస్తున్నాడు.  


మృత్యుశకటం ప్రక్కన నడుస్తూ, ఉపకీచకులు రానేవచ్చారు. వారిని చూస్తూనే, ఆకలి గొన్న చిరుత, లేళ్ల సమూహం పైకి దూకినట్లు, ఆతాటిచెట్టుతో పెడబొబ్బలు పెడుతూ వారిపై లంఘించాడు, భీమసేనుడు. భీముని ఆకారం, అతడు పెడుతున్న కేకలకు, మీదకు యెగసివస్తున్న తీరుకు, యీ పరిణామము యేమాత్రం ఊహించని, ఉప కీచకులు, భయంతో, తలా ఒకదిక్కుకు పారిపోయారు. తోడుగా వచ్చిన వూరి ప్రజలు కూడా, ఈ వింతగంధర్వుని చూసి, వెనుకకు మరలి వేగంగా నగరిలోనికి వెళ్లిపోయారు.  


ఎప్పుడైతే ఉపకీచకులు భయం ప్రదర్శించి, వెనుకకు తగ్గారో, యిక ఆలశ్యం చెయ్యకుండా, నూట అయిదుగురిని, వెంబడించి, వేటాడి, యేమి జరుగుతున్నదో వారు తెలుసుకునే లోపే అందరినీ యమపురికి, వారి అన్నకు తోడుగా పంపాడు. బాధతో, అవమానంతో రోదిస్తున్న ద్రౌపదిని బంధవిముక్తురాలను చేసి, ఓదార్చి, ' ద్రౌపదీ ! నిష్కారణంగా, నిన్ను బాధించే యిలాంటివారు యెవరైనా యీవిధంగా నే నాచేతిలో చంపబడతారు. ఇది భీమశాసనం. దీనికి తిరుగులేదు. నీకు నేటితో కష్టాలు తొలగిపోయాయని నేను భావిస్తున్నాను. నిర్భయంగా నగరంలోకి వెళ్లి, నీ గంధర్వభర్తల చేతిలో ఉపకీచకులందరూ వధింప బడ్డారని గర్వంగా ప్రకటించు. ' అని ఆమెను పంపించాడు.  


జరిగిన విషయమంతా విరాటరాజుకు, మంత్రులు, ద్రౌపది నగరం లోనికి ప్రవేశించే ముందే తెలియజేశారు. సైరంధ్రిని దేశ బహిష్కరణ చెయ్యమని సలహా యిచ్చారు. విరాటరాజు తొందరపడకుండా, సుధేష్ణ మందిరానికి వెళ్లి, ఆమెతో విషయం చర్చించి, సైరంధ్రిని సాగనంపే బాధ్యత ఆమెపై వుంచాడు. 


అక్కడ ద్రౌపది, భీముడు చెప్పిన ధైర్యవచనాలతో, నిర్భయంగా తన స్నానం ముగించుకుని, బట్టలను శుభ్రం చేసుకుని, యేమీ జరుగనట్లే, విరాటనగరం లోనికి ప్రవేశిస్తున్నది . అయితే నగరవాసులు, ఆమెను ఒక అపశకునంగా, దుష్టశక్తిగా, భావిస్తూ, భయంగా అటూ యిటూ పరుగులు తీస్తూ, ఆమెను చూడకుండా వుండడానికి, కనులు మూసుకుని మరీ పరుగెడుతున్నారు.  


ద్రౌపది యివేమీ పట్టించుకోకుండా, పాకశాలమీదుగా వస్తూ, ' నాకు బంధవిముక్తి కలిగించిన గంధర్వరాజాయ నమోనమ: ' అని భీమసేనునికి కృతజ్ఞతగా అభివాదం చేసింది. ' దేవీ ! నీ ఆజ్ఞకువశులై నీ భర్తలు యేమిచేయడానికైనా సిద్ధంగా వున్నారు. ఇక స్వేచ్ఛగా నీపనులు చూసుకో ! ' అని వుత్సాహంగా సమాధానం యిచ్చాడు భీముడు.  


భీముని మాటలకు ఆనందిస్తూ, నర్తనశాల మీదుగా ఆమె నగరంలోనికి వస్తున్నది. బృహన్నల వేషంలో వున్న అర్జునుడు, తన శిష్యురాండ్రతో చేస్తున్న నాట్య విన్యాసాలు ఆపి, బయటకు వచ్చి ఆమెను ఆదరంగా చూశాడు. ఆయన శిష్యురాండ్రు, ' సైరంధ్రీ ! నీవలన విరాటనగర నారీజనానికి భద్రత యేర్పడింది. ఆ కీచకుడు నీభర్తల చేతిలో చచ్చాడు. ' అని ఆమెను మెచ్చుకున్నారు.  


ఊరుకున్నవాడు వూరుకోకుండా, బృహన్నల " సైరంధ్రీ ! అసలు యేమి జరిగిందో వివరంగా చెప్పు. నాకు వినాలని కుతూహలంగా వున్నది. ' అన్నాడు. అంతే ! ద్రౌపదిలోని బాధ మళ్ళీ విజృంభించింది. ' బృహన్నలా ! నాట్యకత్తెల నడుమ నర్తనశాలలో వుండే నీకు, సైరంధ్రి బాధలతో పనేమిటి ? జరిగినది విని యేమి ఆనందిద్దామని అనుకుంటున్నావు ? నా బాధ నీకు ఆనందించే కథలాగా కనబడుతున్నదా ? ' అని బాధగా ప్రశ్నించింది. 


దానికి అర్జునుడు అంతే వేదనతో, ' సైరంధ్రీ ! నీ బాధ నాకు అర్ధమైంది. ఏ అల్ప ప్రాణితో కూడా తూగలేని, యీ నపుంసకత్వ రూపం లో వుండి, నేను నీ గురించి తెలుసుకుని, యేమి సహాయం చెయ్యగలను. ఈ నపుంసకరూపం లో నేను పడుతున్న వేదన యెవరితో చెప్పుకోను. ఒకరి బాధలు యింకొకరికి అర్ధం కావు అనే విషయం నీ మాటలద్వారా నాకు సుస్పష్టం అయ్యింది. ' అని శిష్యురాండ్ర ముందు బయట పడకుండా, తనబాధను ఆమెకు తెలియజేశాడు.


ఆ తరువాత, ద్రౌపది, నాట్యగత్తెలు తోడురాగా, సుధేష్ణాదేవి మందిరం సమీపించింది.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: