గణపతి ఉపనిషత్తు 🙏
రెండవ భాగం
సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5
సర్వం జగదిదం త్వత్తో జాయతే!
ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది.
సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి!
ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది.
సర్వం జగదిదం త్వయి లయమేష్యతి
ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే.
సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి
ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది.
త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః
నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి.
త్వం చత్వారి వాక్పదాని
పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పదాలు నీవే.
త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!
త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6
త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి. నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.
నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే. త్రిమూర్తులు, ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.
గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!
తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!
సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7
"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).
అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.
తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.
ఇది అతని యొక్క మంత్ర రూపము.
(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)
“గం” బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం, అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.
ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.
“ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్”!
ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్
రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!
రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్
రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!
భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!
ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9
ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దదైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులుముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజిlతుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.
హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు (శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే... పోతన గారు కూడా మహానందాంగనా డింభకుడు అని అంటారు. మహా ఆనందము అనే అంగనకు డింభకుడు) వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.
ఇక చివరగా ఫల శ్రుతి....
ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.
సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.
దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.
ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.
భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్… అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.
దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు (నభిభేతి)
గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.
ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.
సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.
ఓం శాంతిః శాంతిః శాంతిః
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ