20, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఆదిపర్వము – 25

 ఆదిపర్వము – 25


ధృతరాష్ట్రుడి వివాహం


ధృతరాష్ట్రుడు, పాండు రాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారందరికి ఉపనయన సంస్కారం చేయించాడు. ముగ్గురు కుమారులు అన్ని విద్యలలో ఆరితేరారు. తరువాత భీష్ముడు ధృతరాష్ట్రునికి యౌవ్వ రాజ్య పట్టాభిషేకం చేసాడు. విదురుని బుధ్ధి బలంతోనూ తన పరాక్రమంతోనూ, కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు.


ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని సంకల్పించాడు భీష్ముడు. గాంధార దేశాధీశుని కుమార్తె గాంధారిని తగిన కన్యగా నిశ్చయించాడు. విదురునితో చర్చించాడు.


“విదురా, గంధారి తనకు నూర్గురు పుత్రులు ఒక పుత్రిక కలిగేటట్టు వరం పొందింది. అందువల్ల కురు వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గాంధారిని మన ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చెద్దాము” అని అన్నాడు. విదురుడు సరే అన్నాడు. వెంటనే పురోహితులను గాంధార రాజు వద్దకు పంపాడు.


గాంధార రాజు సుబలుడు ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించాడు. గాంధారిని ధృతరాష్ట్రునకు ఇచ్చి వివాహం చేస్తానని వాగ్ధానం చేసాడు. కాని బంధువులు ఒప్పుకోలేదు. పుట్టు గుడ్డికి పిల్లను ఇవ్వటం ఏమిటన్నారు.


ధృతరాష్ట్రుని వివాహం చేసుకోవడానికి గాంధారి అంగీకరించింది. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుడే తన భర్త అని నిశ్చయించుకుంది. భర్తకు కళ్లు లేవు కాబట్టి తను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది.


గాంధార రాజు సుబలుడు తన కుమారుడు శకునిని, కుమార్తె గాంధారిని సకల లాంచనాలతో హస్తినా పురానికి పంపాడు. భీష్ముడు దగ్గర ఉండి ధృతరాష్ట్రునకు గాంధారికి వివాహం జరిపించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి చెళ్లెళ్లు పది మందిని అదే ముహుర్తానికి వివాహమాడాడు. భీష్ముడు మరొక నూరు మంది కన్యలను తీసుకు వచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. నూట పదకొండు మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సకల భోగాలు అనుభవిస్తున్నాడు.

కామెంట్‌లు లేవు: