20, సెప్టెంబర్ 2020, ఆదివారం

45) కఠోపనిషత్తు

 ఓం నమః శివాయ:

*45) కఠోపనిషత్తు*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


ఎప్పుడైతే నిష్కామ కర్మకి అవకాశం లేదో, అప్పుడు తనలోపలికి తాను ముడుచుకుంటాడన్నమాట! తన యందు తాను రమిస్తూ వుంటాడు. తన యందే తాను స్థిరమై ఉంటాడన్నమాట! అలా లోపలికి ముడుచుకోవడం చేతనైనటువంటి వాడు అన్నమాట. దీనిని ఏమన్నారు అంటే? ఇంద్రియ నిగ్రహం అన్నారు. 



ఈ బుద్ధి గుహయందు సర్వేంద్రియములను నిక్షిప్తం చేయడం ఏదైతే ఉన్నదో, దానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు. అంతేకానీ, బహిర్ వ్యాపారంలో ఒకచోట చేయుట, ఒక చోట చేయకుండుట కర్మ వ్యాపారంతో ఇంద్రియ నిగ్రహం బోధించబడుట లేదు. ఇంద్రియములు వ్యవహరించినను, వ్యవహరించకున్ననూ, తాను వ్యవహరించుట లేదు. తాను సదా ఈ ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై, ఆత్మానందమగ్నుడై ఉన్నాడు.



 కాబట్టి సామాన్య వ్యవహారం ఏదైతే ఉన్నదో, అట్టి సామాన్య వ్యవహారమునకు సుఖ దుఃఖ ఆసక్తిని పొందక, శీతోష్ణాది ద్వంద్వముల చేత కుంగక, శరీరాది జరామరణాది వార్థక్యరూప జరా మృత్యు వార్థక్యరూపమైనటువంటి వాటి చేత కుంగక, పొంగక, యవ్వనాది విశేషముల చేత లాభింపక, శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక, సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఈ జ్ఞాని అని పిలువబడుతున్నాడు. అర్థం అయిందా అండి.



          ‘జ్ఞాని’ అంటే అర్థం ఏమిటంటే “ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి, ఈ ఆత్మానంద భావమునందుకున్నారో, వాళ్ళందరూ జ్ఞానులు” కాబట్టి, వీళ్ళు మాత్రమే ఇలా ఈ క్రమంలో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైనటువంటి, వారు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు. అంతేకాని, విషయవ్యావృత్తి కలిగినటువంటి, విషయావృత్తం అయినటువంటి, విషయములu యందు రమించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మను తెలియలేరు. ఎప్పటికీ తెలియలేరు.



        జిలేబీ బాగుందా? పులిహోరా బాగుందా? దద్దోజనం బాగుందా? పచ్చిమిరపాకాయ బజ్జీ బాగుందా? ఆవకాయ బాగుందా? మాగాయి బాగుందా? అని పదార్థముల వెంటపడి వెళ్ళేవారు ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల యందు మనస్సు లగ్నం చేసేవారు కానీ, కర్మల యందు ఫలాపేక్ష చేత, రమించేటటువంటి వారు కానీ, ఈ ఆత్మను తెలుసుకొన లేరు. అనగా ప్రవృత్తి మార్గంలో వున్నటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు. 



జనన మరణ మృత్యురూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు. శబ్ద గ్రాహ్యత యందు కానీ, స్పర్శ గ్రాహ్యత యందు కానీ, రూప గ్రాహ్యత యందు కానీ, రస గ్రాహ్యత యందు గానీ, గంథ గ్రాహ్యత యందు గానీ బుద్ధిని రమింప చేసేటటువంటి వారు, బుద్ధిని బహిర్ముఖముగా వ్యవహరింప చేసేటటువంటి వారు, ఈ ఆత్మను తెలియజాలరు. కాబట్టి బుద్ధిని ఒకదానిని బుద్ధి ఇంద్రియములకు రాజు వంటిది. దానిని వేరు చేయాలి.



        ఇంద్రియముల నుంచీ వేరుచేయాలి. ఇంద్రియముల యందు రమించి తాను పొందే సుఖము నుంచీ వేరు చేయాలి. ఇంద్రియములు ఇచ్చే సంవేదనల ద్వారా తాను పొందే దుఃఖము నుంచీ బుద్ధిని వేరుచేయాలి. వేరు చేసి, తాను తానుగా ఉండగలిగేటటువంటి, వ్యవహరించ గలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి. 



అటువంటి విరమణ అనేటటువంటి యజ్ఞాన్ని, విరమణ అనేటటువంటి క్రతువును, విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవరైతే చేస్తాడో, ఈ నిరసించేటటువంటి విధానంలో ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలబడి ఉంటాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది ఉంటాడో, ఆచలుడై ఉంటాడో, అంతర్ముఖుడై ఉంటాడో, సర్వవ్యాపియై ఉంటాడో, ఫలాపేక్ష రహితముగా వుంటాడో, సంగత్వ రహితంగా ఉంటాడో, అటువంటి వారు మాత్రమే ఆత్మానంద స్థితిలో ఉంటారని స్పష్టముగా చెపుతున్నారు.



        ఈ ఆత్మ శరీరము లేనివాడు కనుక అశరీరయనబడును శరీరములు అనిత్యంలు జీర్ణించి పోవునవి. ఆత్మ నిత్యుడు, సర్వవ్యాపకుడును అచలుడునై అంతటా ఎల్లప్పుడూ ఉండును. అందుచేత అనిత్యములైన శరీరములందు నిత్యుడై యుండును. అట్టి గోప్పవాడును, సర్వ వ్యాప్తియునగు ఆత్మను ధ్యానాదులు మూలమున తెలిసికొనిన జ్ఞాని శోకింపడు.



ఇంకా ఆత్మయొక్క లక్షణాలను విశేషంగా చెప్తున్నారు. ఈ విశేషం గా చెప్పేటటువంటి అంశాలలో ఆత్మకు శరీరం లేనివాడు. అసలు ఆత్మకు శరీరమే లేదు. కుండకు లోపల బయటా ఆకాశం ఎలా సర్వవ్యాపకముగా ఉన్నదో, ఆత్మ ఈ శరీరమునకు లోపల, బయటా అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఏ రకమైన శరీరమూ లేదు. అష్టవిధ శరీరములు లేవు. అష్టతనువులు లేవు. కనుక ఆత్మ అశరీరి. శరీరములు అనిత్యములు. శరీరము అంటే అసలు అర్థమేమిటి? ‘శీర్యతే ఇతి శరీరః’ - అంటే, తనకు తానుగా నశించిపోవునది ఏదో, అదే శరీరము. తనకు తా పుట్టినది, తనకు తా నశించిపోవునది.



        అనగా అర్థమేమిటంటే, సముద్రపు అలల మీద నురుగు వస్తుంది, ఆ నురుగులో బుడగలు వస్తాయి. ఆ బుడగల మధ్యలో గాలి ఉంటుంది. బుడగల బయట కూడా గాలి వుంటుంది. బుడగలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఆ బుడగ ఎంత సేపు ఉంటుంది? ఎంత సేపటికి పోతుంది? అంటే ఎవరైనా చెప్పగలరా? గాలి లోపలా ఉన్నది, గాలి బయటా ఉన్నది. కానీ సముద్రము లేదా ఆ బుడగలో..? ఆ నీళ్ళు లేవా? వీటి అన్నిటి యొక్క సంయోజనీయత ఉన్నట్లుగా తోచుచున్నది. ఆ గాలి బుడగ బ్రద్దలైంది. బ్రద్దలైతే ఏమైంది? ఆ గాలి గాలిలో కలిసిపోయింది, నీరు నీటిలో కలిసిపోయింది. ఇంక ఎక్కడా ఏమీ లేవు. దానికి రూపమే లేదు, ఆకారమే లేదు. అప్పటివరకూ ఉన్న బుడగ ఎక్కడికి పోయిందయ్యా? ఏ గాలిలో పుట్టిందో, ఆ గాలిలోకే పోయింది. ఏ నీటితో పుట్టిందో, ఆ నీటిలోకే పోయింది. ఏ పంచభూతాలతో పుట్టిందో, ఆ పంచభూతాలలోకే పోయింది.



        ఇట్లా క్షణ భంగురమైనటువంటి శరీరము అనంతముగా వ్యాపించి యున్న విశ్వము అనేటటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మము యొక్క కాలమానం దృష్ట్యా చూసినప్పుడు, ఒక మానవుడు పుట్టి, జీవించి, పోవడం అనేటటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది. దానికి ఎంత విలువ వుందో, దీనికి అంతే విలువ ఉంది. కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది. అనంత విశ్వ వ్యాపకమైనటువంటిది. బృహద్వ్యాపకమైనటువంటిది. కాబట్టి అది అశరీరి. శరీరములు అనిత్యములు. జీర్ణించి పోవునవి. పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ నిత్యుడు. 



ఎప్పుడైతే ఆ నిత్యత్వం అంటే సర్వకాల సర్వావస్థల యందును ‘ఉండుట’ అనేటటువంటి లక్షణం కలిగియున్నదో ఆ ఆత్మ నిత్యత్వమును కలిగియున్నది. సర్వ వ్యాపకుడు. ఎంతగా సర్వవ్యాపకుడు అంటే, దీనికి కంటే అవతల ఎల్లలు లేవు ఇక. ఎంతమేరకు చెబితే అంతమేరకు వ్యాపించి ఉన్నది. సర్వము గురించి చెబితే అంత మేరకు వ్యాపకధర్మమును కలిగి వున్నది. 



అచలుడు - అంతగా వ్యాపించి ఉండటం చేత, కదలడానికే అవకాశం లేనంత స్థితి వరకూ వ్యాపించడం చేత అది (ఆత్మ) కదలికే లేకుండా ఉంది. ఇది అచలము. అంతటా ఎల్లప్పుడూ ఉన్నది. ‘ఉండుట’ అన్నది మాత్రమే కలిగియున్నది. అందుచేత అనిత్యములైనటువంటి శరీరములందు నిత్యుడై ఉన్నది. శరీరము అనిత్యమే కానీ, ఆత్మ నిత్యము. ఆత్మ అనే ఆధారమే లేకుండా శరీరము అనేటటువంటిది ఉండే అవకాశమే లేదు. శరీరము - అనునది ఉన్నట్లుగా తోచినప్పటికి, అది ఆత్మ అనే దానియందు అంశీభూతమై యున్నది.



        అనేకముగా అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రము నుంచి అనేకములైన బుడగలు పుట్టినంత మాత్రమున, అలలు పుట్టినంత మాత్రమున అవన్నీ సముద్రములో భాగములు కావా? అట్లే, అఖండముగా వ్యాపించియున్నటువంటి బ్రహ్మమునందు అనేక జీవులు, ఈ అలలవలె, నురుగు వలె, బుడగల వలె ఉత్పన్నమౌతున్నవి. అయినచొ అందంతటను వ్యాపించినది ఒకే ఒక బ్రహ్మము మాత్రమే. ఒకే ఒక ఆత్మయే. 



అట్టి గొప్పవాడును సర్వవ్యాపి అగు ఆత్మ, ధ్యానాదుల మూలమున తెలుసుకున్న జ్ఞాని శోకింపడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. శోక రహితమైన స్థితిని.. ఋషులు, మునులు కూడా చెప్పినటువంటి పద్ధతి ఇదే!


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: