20, సెప్టెంబర్ 2020, ఆదివారం

పోత‌న త‌ల‌పులో ....58


 కృష్ణ‌ప‌ర‌మాత్మ ద్వార‌కా న‌గ‌రాన్ని స‌మీపించాడు. పాంచ‌జ‌న్యాన్ని పూరించి ద్వార‌కాపురి ప్ర‌జ‌ల‌ను ధ‌న్యుల‌ను చేశాడు.


                            ***

జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకం,

గలహంసావృతహేమపద్మపరిఖా కాసారకం, దోరణా

వళిసంఛాదితతారకం, దరులతావర్గానువేలోదయ

త్ఫలపుష్పాంకుర కోరకన్, మణిమయప్రాకారకన్, ద్వారకన్.

                           ***

బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది; కలహంసలతో కాంచనవర్ణ కమలాలతో అలరారే అగడ్తలు చుట్టూ కలది; చుక్కలు తాకే చక్కని తోరణాలు, పండ్లు, పువ్వులు, చివుళ్లు, మొగ్గలుతో నిండిన లతాకుంజాలు, పంక్తులు పంక్తుల వృక్షాలు కలది; రత్నఖచిత ప్రాకారాలు కలది అయిన ద్వారకానగరాన్ని తామరరేకుల లాంటి కళ్ళున్న శ్రీకృష్ణుడు సమీపించాడు.

                               ***


అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్

ధన్యులై వినఁ బాంచజన్యము, దారితాఖిలజంతు చై

తన్యమున్, భువనైకమాన్యము, దారుణధ్వని భీతరా

జన్యముం, బరిమూర్చితాఖిలశత్రుదానవసైన్యమున్.

                             ***

ఆత్మీయులే కాక అన్యులు సైతం అభినందించే ధైర్యసాహసాలు కల గోవిందుడు సమస్త ప్రాణులను నిశ్చేష్టులను చేసేడెది, లోకం ప్రశంసలు అందుకోగలిగినది, చెవులు బద్దలయ్యె శబ్దంతో రాజులను బెదరగొట్టేడిది, ప్రతిపక్షులైన రాక్షసయోధు లందరినీ మూర్ఛిల్లచేసేది అయిన పాంచజన్య మనే తన శంఖాన్ని పూరించాడు. మాన్యులైన యదుకులాగ్రగణ్యు లందరూ ఆ శంఖధ్వనిని విని ధన్యులైనారు.


  🏵️ పోత‌న ప‌ద్యం🏵️పాంచ‌జ‌న్య శంఖారావం

కామెంట్‌లు లేవు: