20, సెప్టెంబర్ 2020, ఆదివారం

రామాయణమ్.69

 

...

మూర్ఛనుండి తేరుకున్న దశరథ మహారాజు ప్రక్కనే ఉన్న సుమంత్రుని చూసి నీవు వీరి ప్రయాణమునకు కావలసిన ఉత్తమ అశ్వములు పూన్చిన రధాన్ని సిద్ధంచేయి,వీరిని మన దేశమునకు అవతల వున్న వనములలో విడిచిరా !అని ఆజ్ఞపించాడు

.

 గుణవంతుడైన వాడికి జరిగే సత్కారమిది ,రాముడికున్న మంచిగుణములకు కలిగే ఫలమిది ! అని అందరూ అనుకొంటున్నారు ( అని తనలో తనే అనుకున్నాడు దశరథుడు).

.

సుమంత్రుడు వెంటనే రధాన్ని సిద్ధం చేశాడు.

.

కోశాధికారిని పిలిచి కోడలికి పదునాల్గు సంవత్సరములకు అవసరమైన అమూల్యమైన దుస్తులు,ఆభరణములు (లెక్కకట్టిమరీ!) తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దశరథుడు.

.

ఆ ఆభరణాలను చక్కగా అలంకరించుకొని ఉరకలేసే ఉత్సాహంతో ఉన్న సీతమ్మను దగ్గరకు తీసుకొని శిరస్సుపై ఆఘ్రాణించి, 

.

సీతా ! నేడు నాకొడుకు ధనములేని వాడని వాడిని అవమానించకమ్మా! .

.

లోకంలో చాలామంది స్త్రీలు భర్తచేత అంతకుమునుపు ఎన్ని సుఖాలు అనుభవించినప్పటికీ భర్తలకు కష్టకాలము దాపురించినప్పుడు అతనిని చులకనగా చూస్తారమ్మా! అవసరమైతే ఆ భర్తలను వదిలేస్తారు కూడా ! భర్తలపై అనురాగము వారిలో ఒక ఎండమావి! 

.

కానీ గాఢమైన శీలము కలిగిన స్త్రీలు సత్యమునందూ ,శాస్త్రమునందూ ,సద్గుణములయందు స్థిరచిత్తము కలిగినవారి హృదయములో భర్తకు మాత్రమే విశిష్టస్థానముంటుంది ,దానిని ఎప్పటికీ పదిలంగా ఉంచుకొంటారు!.

.

అత్తగారి మాటలు విన్న సీతమ్మ , ఆవిడకు నమస్కరిస్తూ ! పూజ్యురాలా! నా భర్తవిషయములో ఎలా ఉండవలెనో పెద్దలద్వారా విని ఉన్నాను .

.

నన్ను దుష్టస్త్రీల సరసన చేర్చకుమమ్మా! 

.

చంద్రుడినుండి కాంతివిడిపోతుందా ! 

చక్రములేని రధము నడుస్తుందా ! 

తీగలులేని వీణ మ్రోగుతుందా !

 మేమిరువురమూ "ఒకటి" ! 

.

తండ్రికానీ,తల్లిగానీ ,కొడుకుగానీ స్త్రీ కి ఇవ్వగలిగనది పరిమితము! 

.

భర్త ఒక్కడే అపరిమితముగా ఇవ్వగలవాడు ! 

.

ధర్మములోని సామాన్యవిషయములు,విశేషవిషయములు శ్రేష్ఠులైన వారి వద్దనుండి విని ఉండటమువలన నాకు వాటి పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది...

నా భర్తను నేనెట్లా అవమానిస్తాను ! 

అని సవినయంగా బదులిచ్చింది జనకరాజపుత్రి!

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: