20, సెప్టెంబర్ 2020, ఆదివారం

అంతటా నిండిన పరమాత్మ

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam --3 by Pujya Guruvulu 

Brahmasri Chaganti Koteswara Rao Garu


అంతటా నిండిన పరమాత్మ ఒక అవతారము దాల్చడానికి ముందు దేవతలో, ఋషులో చేసిన స్తోత్రము, ప్రార్థనను మన్నించి ఒక రూపము పొందుతాడు. లలితాదేవి అలా ఒక స్వరూపమును పొంది ఆవిర్భవించింది. భండాసురుని సంహరించిన తరవాత – ‘మీకు కావలసినవి చేసిపెట్టాను. లోకములు ప్రశాంతతను, ఉత్సాహము, సంతోషమును పొందాయి. అన్ని జాతులు మళ్ళీ పెరుగుతాయి. నా నిజస్థావరమైన మణిద్వీపమునకు వెళతాను’ అంటే దేవతలు, ఋషులు అమ్మవారిని ప్రార్థన చేసి – ‘ అమ్మా! కష్టము ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నీ యొక్క గొప్ప అనుగ్రహమునకు కారణము అయింది. నువ్వు మేరుపర్వతము, నిషధపర్వతము, హేమకూటము, హిమాలయము, గంధమాదనము, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణసముద్రము, ఇక్షుసముద్రము, సురాసముద్రము, ఘృతసముద్రము, దధిసముద్రము, క్షీరసముద్రము, జలసముద్రము పదహారు చోట్లస్థిర నివాసముగా – కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, భేరుండాపురి, భక్తివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యపురి ఈ పేర్లతో పదహారుచోట్ల భూమండలము మీద ఉండాలి. ఆ పురములను నిర్మించడానికి విశ్వకర్మను, మయుని పిలుస్తాము అన్నారు. అన్నిటికి శ్రీపురమనే పేరు. పదహారుపేర్లతో పదహారుప్రాంతములలో అమ్మవారు వెలిసి ఈ బ్రహ్మాండము అంతటినీ తన రక్షణకవచములోకి తీసుకున్నది. అలా ఆవిర్భవించిన దేవికి వాళ్ళు ‘లలిత’ అని పేరు పెట్టారు. వాళ్ళు దేవి అనుగ్రహమును పొంది వదిలి పెట్టలేదు. అందువలన మనకి లలితాసహస్రనామము వచ్చింది. అమ్మ ప్రధానతత్త్వము దయ. అమ్మవారు ఆవిర్భవించినప్పుడు దేవతలు ఈ నామములను చెప్పలేదు. దయాస్వరూపిణి అయిన లలితాదేవి నామములు విష్ణ్వంశలో ఉన్న హయగ్రీవుడు రహస్యనామములని అగస్త్యులవారికి ఉపదేశము చేసాడు. కుంభసంభవా! లలితాసహస్ర నామములకు అంత ప్రాధాన్యత, అంత శక్తి ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? వీటిని గురించి నీకు చెపుతాను జాగర్తగా ఆలకించు. ఎంత తవ్వుకుంటే అన్ని మాణిక్యగనులయిన శ్రీలలితాసహస్ర నామములను అమ్మవారు వశిన్యాదిదేవతలతో చెప్పించింది. 


ఒకనాడు లలితాదేవి పెద్దసభ తీర్చింది. అమ్మవారిని సేవించడము కోసము అన్ని బ్రహ్మాండముల నాయకులు, కొన్ని కోట్లమంది రుద్రులు, కోట్లమంది బ్రహ్మలు, కోట్లమంది సరస్వతులు, కోట్లమంది విష్ణువులు, కోట్లమంది లక్ష్ములు వచ్చి సభలో కూర్చున్నారు. అమ్మవారు ఒక పెద్ద సింహాసనము మీద కూర్చుని ఉన్నది. సభలో– అరుణాదేవి, కామేశ్వరీదేవి, కౌళినీదేవి, జయనీదేవి, మోదినీదేవి, నళినీదేవి, విమలాదేవి, సర్వేశ్వరీదేవి ఎనిమిదిమంది వశిన్యాదిదేవతలు ఉన్నారు. వశినీదేవి పేరు కల దేవతను అన్వయము చేస్తూ వశిన్యాది దేవతలు అంటారు. వారిని వాగ్దేవతలని పిలుస్తారు. వాగ్దేవతా అనుగ్రహమును అమ్మవారి అనుగ్రహముగా భక్తులకు ప్రసరింప చేస్తారు. వారితో అమ్మవారు – ‘మీకు నా పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి కనుక మిమ్ములను అనుగ్రహిస్తూ ఉంటాను. నా శక్తి మీలో ప్రవేశిస్తుంది. మీరు మాట్లాడినట్టు కనపడుతుంది. మీలో ఉండి మాట్లాడుతున్నది నేనే అయి ఉంటాను. నాకు సంబంధించిన శ్రీచక్రముల రహస్యములు, నామముల వెనక ఉన్న అన్ని రహస్యములు మీకు తెలుసు. ఇవాళ నేను మీతో ఒకటి మాట్లాడించాలి అనుకుంటున్నాను’ అన్నది. ఈ నామములను వారిచేత పలికించి లోకమును కటాక్షించాలి. శ్రీచక్రరహస్యములు, స్తోత్ర రహస్యములు తెలియాలి అంటే ఈ నామముల ద్వారా తెలియాలి. శ్రీచక్రరహస్యము, స్తోత్ర రహస్యము తెలియకపోయినా పరవాలేదు. నామము చెప్పడము రావాలి. ఈ స్తోత్రమును చేస్తున్నవారికి వెంటనే నా పట్ల అపారమైన భక్తిని ఇస్తాను. వారి పట్ల ప్రీతి చెంది సమస్తకోరికలు తీరుస్తాను. మీ నోటివెంట అటువంటి ఓషధీ స్తోత్రము రావాలి. నామ స్తోత్రానికి చివర ‘అంకితం’ ప్రకటించండి. నా నామముతో స్తోత్రం వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను’ అన్నది. అమ్మవారి నామము పక్కన శివస్పర్శ ఉంటుంది. శివ – శివాని, రుద్ర – రుద్రాణి అని ఉంటాయి. ఈ స్తోత్రములో అలా పిలవడము కష్టము. అందుకే ‘ఏవం లలితా నామ్యాం’ అనే పిలిచి లలితా నామములని చివర అంకితం చేసారు. 


శ్రీలలితాసహస్రనామస్తోత్రం వశిన్యాదిదేవతలు చెపితే అమ్మవారి అనుగ్రహముతో చెప్పారు. స్వరూపము అమ్మదే అయినా ‘శ్రీమాతా’ అని మొదలు పెట్టారు. అమ్మ ఎంత గొప్పదయినా పేరుతో మొదలు పెట్టకూడదు. ఆవిడ లలితాదేవి అయినా ఆమాట అనడానికి వశిన్యాదిదేవతలు సాహసించలేదు. ఆవిడ పరబ్రహ్మము అన్నిటినీ ఇవ్వగలదు. లలితాసహస్రనామస్తోత్రం చదివి అమ్మను కీర్తిస్తే ఇహములో సుఖము కలుగుతుంది, భోగములు కలుగుతాయి. గతజన్మలలో వచ్చిన పాపరాశిని ధ్వంసము చేసి ఉత్తరజన్మలు మంచివి కలిగేట్లు దిద్దుబాటు చేయకలదు. 

ఇది ఒక్క అక్షరము కూడా అవసరములేనిది ఉన్నదని నిరూపిద్దామంటే కుదరని గొప్ప లలితాసహస్రనామస్తోత్ర వైభవము. పెద్దలు ఇందులో లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని తొమ్మిది లహరులను 182 శ్లోకములలో నడిపించారు. ఒక్కక్కలహరి ఇరవై శ్లోకములతో ఉంటుంది. ఒక్క నామముతో మనసారా పిలిస్తే చాలు అమ్మవారి అనుగ్రహం ఉత్తరక్షణములో కలుగుతుంది. బీజాక్షరములను పలికితే శౌచము, ఉచ్ఛారణ తెలియాలి. నామములోనే రహస్యముగా బీజాక్షరములు ఉంటాయి. బీజాక్షర సంపుటీకరణము చేత ఉత్తరక్షణములో అనుగ్రహము ప్రసరణ జరుగుతుంది.

కామెంట్‌లు లేవు: