20, సెప్టెంబర్ 2020, ఆదివారం

వేదాంత పంచదశి"*

 ఓం నమః శివాయ:

*45) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


పాదోస్య సర్వా భూతాని త్రిపాదస్తి స్వయంప్రభః ౹

ఇత్యేక దేశ వృత్తిత్వం మాయాయా వదతి శ్రుతిః ౹౹ 55 ౹౹


55. బ్రహ్మమునందలి ఒక భాగము మాత్రమే ఈ విశ్వము భూత జాతమైనది. మిగిలిన మూడు భాగములు స్వయం ప్రకాశములు అని శ్రుతియు మాయ బ్రహ్మము యొక్క అంశమును మాత్రమే ఆచరించుటను చెప్పు చున్నది.(బ్రహ్మము నందు అంశములు లేకపోయినను సృష్టి యొక్క అల్పత్వమును సూచించుటకు ఇట్లు చెప్పబడినది.)



విష్ట భ్యాహమిదం కృత్స్నమే కాంశేన స్థితో జగత్ ౹

ఇతి కృష్ణోఽ ర్జనాయాహ జగతస్త్వేక దేశతామ్ ౹౹ 56 ౹౹


56. భగవద్గీత యందు (10.42)

శ్రీ కృష్ణుడు అర్జునునితో సకల జగత్తును తాను ఏకాంశము చేతనే భరించి ఉన్నానని చెప్పును.దీనిచే బ్రహ్మము నందొక అంశమే సృష్టియని ప్రమాణీకరింపబడినది.



స భూమిం విశ్వతో వృత్వా హ్యత్యతిష్ఠద్దశాంగులమ్ ౹

వికారావర్తి చాత్రాస్తి శ్రుతి సూత్ర కృతోర్వచః ౹౹ 57 ౹౹


57.శ్రుతియు దీనినే బలపరచుచున్నది.

‘ఆ పరతత్త్వము జగత్తు అంతా అన్నివైపుల వ్యాపించి దానిని 

పదివ్రేళ్ళ మేరకు అతిక్రమించియున్నది’.

బ్రహ్మసూత్రకారుడును బ్రహ్మము భేద జగత్తున కతీతమని చెప్పెను.



వాఖ్య:-పదివ్రేళ్ళ మేరకు అని చెప్పుట బ్రహ్మము జగత్తు మాత్రమే కాదనీ దానిని అతిక్రమించినదనీ కరతలామలకవతుగా సూచించుటకు మాత్రమే.

దశదిశలనీ అర్థము చెప్పవచ్చును.


ఈ ప్రపంచమందు బ్రహ్మమయమయిన ఒక నియమమున్నది.అది”చైతన్య శక్తి”

దాని రూపము స్పందము(చలనము),ఇది ఇట్లుండవలెనన్నదియే దాని ఉనికి,అది సమస్త కల్పములయందు వ్యాపించి యుండును.


సర్వ వ్యవహార వ్యవస్థ కు ఆమహా నియతియే మూలము.


దాని వలననే జ్ఞానుల దేహధారణముగూడ సంభవించును.


ఆ శక్తియే విశ్వము నందలి ప్రతి విషయము యొక్క స్వభావమును శాసించును.


ఆ శక్తిని(చిచ్ఛక్తిని)మహాసత్త,

మహాచితి,మహాశక్తి,మహాదృష్టి,

మహాక్రియ, మహోద్భవము, మహాస్పందము అని వ్యవహరింతురు.


ఈ శక్తియే ప్రతి వస్తువునకు దాని సహజమయిన గుణము లను కలుగజేయును.


కానీ ఈ శక్తి అఖండ బ్రహ్మము కంటె భిన్నముగానీ, స్వతంత్రముగానీ కాదు.


 అది,మాయ(భ్రాంతి)మయమగు భావిసౌఖ్యశ ఎంత సత్యమో అంతే సత్యము. 


జ్ఞానులుబ్రహ్మ-శక్తులమధ్య శబ్ద భేదమును కల్పించి సృష్టి శక్తికార్యమని ప్రకటింతురు.


మానవుడు దేహమును గూర్చి(మొత్తముగాను)దాని అవయవములను గూర్చి చెప్పినట్లుగానే ఆభేదము శబ్దగతము.


వ్యక్తి తన దేహావయవములను తెలుసికొనునట్లే,అనంత చైతన్యము గూడ తన అంతర్గత శక్తిని తెలిసికొనును.


ఆ తెలివియే(ఎరుకయే)నియతి అనబడును(ప్రకృతిని నిర్ణయించు అఖండ బ్రహ్మశక్తి).దానిని దైవము లేక దైవవిధానము అని కూడ అందురు.


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: