23, అక్టోబర్ 2020, శుక్రవారం

అరణ్యపర్వము – 4

 అరణ్యపర్వము – 4


ద్రౌపది, పాండవుల సంవాదం   


ఒకరోజు ద్రౌపది ధర్మరాజుని చూసి ” దృతరాష్ట్రుడు తన కొడుకు మాటవిని మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాని అతనికి మీ మీద కోపం పోయిందా. పోదు ఎందుకంటే అతని హృదయం పాషాణం. తన కొడుకు మిమ్మల్ని నిష్టూరంగా మాట్లాడినప్పుడు అతడు వారించ లేదు. రాజభోగాలు అనుభవించ వలసిన మీరు అడవులలో కష్టాలు పడుతున్నారు. ఇది నేను భరించలేను. ఆ దృతరాష్ట్రుడి లాగా బ్రహ్మదేవుడు మీకు శత్రువైనాడా ఏమి? ” అని బాధపడి మళ్ళీ ” నీ ఆజ్ఞానువర్తనులైన నీ తమ్ములు తమ పరాక్రమం విడుచి ఉన్నారు. నాడు సామంతుల కిరీట కాంతులతో ఎర్రబడ్డ మీ పాదాలు నేడు బండ రాళ్ళ మీద నడచి ఎర్రబడ్డాయి. అనేక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మీరు కందమూలాలు తింటున్నారు. ఇట్టి దుర్దశలో కోపం విడిచి పెట్టడం తగదు కదా. అమిత బలశాలి భీముడు కందమూలాలు తిని చిక్కి పోయాడు. ధనుర్విద్యా పారంగతుడు అర్జునుడు అడవి జంతువుల మధ్య తిరుగుతున్నారు. వారిని చూసి కూడా ఓర్పు వహిస్తున్నారా? క్షమను తేజస్సును సమయానుకూలంగా ఉపయోగించని రాజు ప్రజల మన్నన పొందజాలడు అనే కథ మన ఇతిహాసంలో ఉంది . పూర్వం బలి చక్రవర్తి క్షమ గొప్పదా ? తేజస్సు గొప్పదా ? అని తన తాత అయిన ప్రహ్లాదుని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు అన్ని సమయాలలో క్షమ పనికిరాదు. అలాగే సదా ప్రతాపం చూపకూడదు రెండూ సమపాళ్ళలో చూపాలి. ఎప్పుడూ క్షమిస్తుంటే సేవకులు పనిచేయరు యజమానిని గౌరవించరు. ఎక్కువ కర్కశంగా ఉంటే ప్రజా కంటకుడౌతాడు ” అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఒక తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ అదేపనిగా తప్పులు చేస్తున్న కౌరవులను క్షమించ వచ్చునా? కనుక ఇది పరాక్రమం, తేజస్సు చూపింఛ వలసిన సమయం ” అన్నది. అందుకు ధర్మరాజు ” ద్రౌపదీ! కోపం మహాపాపం. కోపం కలవాడు కర్తవ్యం విస్మరిస్తాడు. చంపకూడని వారిని చంపుతాడు. కోపం వదిలిన వాడు తేజోవంతుడు ఔతాడు. క్షమ కలవాడికి విజయం సిద్ధిస్తుంది. దుర్యోధనునికి క్షమా గుణం లేదు కనుక అతడు పతనం కాక తప్పదు ” అన్నాడు. అందుకు ద్రౌపది ” ఓ అజాత శత్రువా! నీవు ధర్మంతో వర్ధిల్లుతున్నావు. కానీ క్షమ శత్రువుల వద్ద తగునా? వంచకుల పట్ల వంచనతో ప్రవర్తించాలి ఓ బ్రహ్మదేవా! నీవు వంచకులకు అభ్యుదయాన్నిచ్చి, ధర్మాత్ముల సంపద పోగొడుతున్నావా? వంచకులు నీకు బంధువులు, ధర్మాత్ములు శత్రువులా? ” అని నిర్వేదంతో పలికింది. ధర్మరాజు ” ద్రౌపదీ! నీవు నాస్తికురాలి వలె మాట్లాడుతున్నావు. అది తప్పు కదా? ధర్మాత్ములైన మార్కండేయ, వ్యాస, నారదాది మహా మునులు ధర్మాత్ముడనని నన్ను గౌరవిస్తున్నారు. ఇతరులు నా పట్ల అధర్మంగా ప్రవర్తించినా నేను ఎందుకు ధర్మం తప్పాలి? పుణ్యకార్యాలకు ఫలితం లేకుంటే మునిజనాలు వాటిని ఎందుకు ఆచరిస్తారు. నీవు దుష్టద్యుమ్నుడు పుణ్య ఫలమున పుట్టిన వాళ్ళు కదా ” అన్నాడు. ద్రౌపది ” కర్మఫలానికి విధి కారణం కాదు అనే దానిని కాదు. కాని కర్మ చేయడం మానవ ధర్మం కదా? కర్మ ఫల ప్రాప్తికి మనుష్య ప్రయత్నం తరువాత దైవ బలం సమకూరాలి. పురుషుడు సంకల్పించి తరువాత ప్రయత్నం చేయాలి అప్పుడు దైవం సాయం చేస్తాడు. నువ్వు గింజలో నూనె ఉన్నా, కర్రలో నిప్పు ఉన్నా పురుష ప్రయత్నం లేని ఎడల నూనె రాదు, నిప్పు పుట్టదు కదా? పురుష ప్రయత్నం లేకుండా దైవాన్ని , ధర్మాన్ని నమ్ముకుంటే ఫలితం ఉంటుందా? కనుక మీ తమ్ముల పరాక్రమం ఉపయోగించి లక్ష్యమును నిర్ణయించి ఫలసిద్ధి పొందమని నా ప్రార్థన” అన్నది.


ద్రౌపది మాటలకు భీమసేనుడు వంతపాడాడు. ” అన్నయ్యా! రాజ్యం మన తండ్రి తాతలది దానిని నీవు అన్యుల పరం చేసి ఇక్కడ ధర్మవచనాలు పలుకుతున్నావు. చెడ్డ వారిని ధర్మబుద్ధితో జయించగలమా? అది సాధ్యమా ? పరాక్రమంతో శత్రువులను జయించాలి కాని ధర్మం ధర్మం అంటూ పలవరించడం తగదు. పరాక్రమం లేని వాడు కృంగి పోవాలి కాని నీ వంటి వారు కాదు. ఆ నాడే శత్రువులను చంపి ఉంటే మనకు ఈ వనవాసం ప్రాప్తించేది కాదు. ఒప్పందాన్ని మీరు అతిక్రమించలేక పోవడం కౌరవులకు చులకన అయింది అది మన పిరికితనం అనుకుంటున్నారు. నీవు అనుసరిస్తున్న ధర్మం మనకు ,మన బంధు వర్గాలకు బాధ కలిగిస్తుంది. శత్రువులను జయించడం, ప్రజల భయాన్ని పోగొట్టడం, దానధర్మాలు చేయడం, యజ్ఞయాదులు చేస్తూ బ్రాహ్మణులను పూజించడం క్షత్రియ ధర్మం. కేవలం ధర్మాచరణతో శత్రువులను జయించ లేము. మోసాన్ని మోసంతో జయించాలి. ఒప్పందాన్ని పక్కన పెట్టి వాళ్ళను జయిద్దాం. రాజులంతా మనకు సాయం చేస్తారు. కౌరవ రాజ్యంలోని ప్రజలు నీ పాలన కోరుకుంటున్నారు ” అని భీముడన్నాడు. ధర్మరాజు ” భీమా ! నీ మాటలు ధర్మ సమ్మతమే కానీ నేను సభలో పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తానని చెప్పాను. క్షణిక సుఖాలకు ఆశించి సత్యాన్ని ధర్మాన్ని విడువను. మనకు మేలు జరిగే వరకూ వేచి ఉంటాను ” అన్నాడు. భీముడు ” అన్నయ్యా ! మృత్యువు ఎప్పుడూ మన వెంట పొంచి ఉంటుంది. ఈ జీవితాలు ఆశాశ్వతం కనుక శాశ్వతం అనుకుని వేచి ఉండుట తగునా ? మరణించే ముందు పగ తీర్చుకోవాలి కదా? ” అన్నాడు.” శత్రువులపై ప్రతీకారం చేయాలని నా హృదయం తపిస్తుంది. నా తమ్ముల యొక్క ద్రౌపది యొక్క దుఃఖం తీర్చడం కుండా ధర్మం, దయా అంటూ కూర్చోవడం తగునా? నీవనుసరించే మార్గం బ్రాహ్మణులకు తగును కానీ క్షత్రియులకు కాదు. క్షాత్ర ధర్మం ప్రకారం యుద్ధం చేస్తాము. అడవిలో పన్నెండేళ్ళు గడప వచ్చు. కానీ జనపదాలలో పన్నెండు నెలలు గడపడం అసాధ్యం. జగత్ప్రసిద్ధులమైన మనం దాగుట అసాధ్యం కనుక తిరిగి అరణ్యవాసం అజ్ఞాత వాసం ఇలా ఎన్నాళ్ళు. కనుక ఇప్పటి మన పదమూడు నెలల వనవాసం పదమూడేళ్ళుగా భావించడంలో తప్పేమి లేదు ” అని భీముడన్నాడు. ధర్మరాజు భీమునితో ” భీమా ! నీకు పాండిత్యం, పరాక్రమం, దర్పం ఉన్నాయి. కనుక నేను చెప్పేది ఆలోచించు. కౌరవులతో యుద్ధం సామాన్యమైనది కాదు. కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దూకుడు తగదు. అప్పుడే మనకు దైవం అనుకూలిస్తాడు. దృతరాష్ట్రుని కుమారులు మహావీరులు పైగా దుర్మార్గులు. వారికి కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుల అండ ఉన్నది. రాజసూయయాంలో మనచేత ఓడింపబడిన రాజులంతా కౌరవ పక్షాన చేరారు. కర్ణుడు మహావీరుడు, కవచకుండల ధారి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వంటి మహా యోధులకు మనపట్ల విరోధం లేకున్న ధర్మాన్ని అనుసరించి దుర్యోధనుని పక్షాన యుద్ధం చేస్తారు. వారిని ముందుగా జయించి కాని దుర్యోధనుని జయించ లేము . కనుక యుద్ధానికి ఇది తగిన సమయం కాదు ” అని చెబుతుండగా వ్యాసుడు అక్కడకు వచ్చాడు.


ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి అర్చించాడు.” ధర్మరాజా! నీ మనస్సులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నీవు అర్జునునకు ఉపదేశించు. దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తారు. మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి ” అని చెప్పాడు . వ్యాసుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామ్యక వ నానికి వెళ్ళారు. ధర్మరాజు ఒకరోజు అర్జునినితో ” అర్జునా ! భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని గెలవాలంటే మనకూ దివ్యాస్త్ర సంపద కావాలి. వ్యాసుడు అందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేసాడు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. నీవు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమతమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. పరమ శివుని ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు ” అని చెప్పి అర్జునునకు వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అవే విద్యను ఉపదేశం చేసాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు చేయడానికి గంధ మాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునిని చూసి ” వీరుడా నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంతస్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం. ఆయుధదారివైన నీకు ఇక్కడ ఏమి పని ? నీ ఆయుధములు విడిచి పెట్టు ” అన్నాడు. ఆ మాటలకు చలించకుండా స్థిరంగా ఉన్న అర్జునిని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమైయ్యాడు. ” అర్జునా నీ ధైర్యానికి మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో ” అని అన్నాడు. అర్జునుడు ” నాకు దివ్యాస్త్రాలు కావాలి ” అన్నాడు. ఇంద్రుడు ” ఎలాగూ అవి లభిస్తాయి. అమరత్వం కావాలా? ” అని అడిగాడు. అర్జునుడు ” ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి. అవి నాకు ప్రసాదించండి ” అన్నాడు. ఇంద్రుడు ” అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి ” అన్నాడు.

కామెంట్‌లు లేవు: