23, అక్టోబర్ 2020, శుక్రవారం

జీవితం సుమధురం

 *జీవితం సుమధురం*


జీవితమంటే గొప్పగొప్ప త్యాగాలు, బాధ్యతలు కావు. చిన్న చిన్న ఆనందాలు, కాస్త దయ, నిరంతరం చిరునవ్వు... అదే జీవితం!

భారతీయ ఆలోచనల ప్రకారం- స్వధర్మం సాధించడాన్ని లక్ష్యంగా చెబుతారు. అంతరంగ సూత్రం... స్వభావాన్ని తెలుసుకునే లక్ష్యసాధన. అంతా ఎవరికి వారు తమ తమ పాత్రలను పోషించేవారే. ఉనికి లక్ష్యం- యథార్థంతో జీవించడం. యథార్థంలో జీవించేవారు ప్రయాసకు గురిచేసే జీవిత నాటకంలో పరిష్కారం కనుక్కోగలుగుతారు.

ఎన్నో అవరోధాలను తొలగించుకుంటూ వెళ్ళడం- అదొక అభ్యాసం, ఒక కళ. విధించుకునే షరతులు అనేక సందర్భాల్లో కష్టమనిపిస్తాయి. మనమేం చేస్తున్నాం, ఎరువు తెచ్చుకున్నవేమిటి అనే విశ్లేషణ ముఖ్యం. ఏది సత్యం, ఏదసత్యం అనే వివేకం కలగడం కష్టం. ప్రతికూల ప్రభావాలు తేలిగ్గా దురలవాట్లకు గురిచేస్తాయి. ఆరోగ్యాన్ని హరిస్తాయి.యథార్థమెరిగి బతకడం మొదలుపెడితే ఆనందానికి, శ్రేయస్సుకు సరైన తాళం చెవి దొరికినట్లే!

ప్రసూతిగదిలోంచి బయటకు పసి ఏడుపు వినిపించగానే బాబో పాపో తెలియని ఆత్రుత... చేతుల్లోకి తీసుకునేంతవరకు ఉత్కంఠే... అటువంటి భావనే జీవితంలో వేర్వేరు ఘట్టాల్లో అద్భుతమైన అనుభూతికి అవకాశమిస్తుంది. జీవితంలో ప్రతి స్థాయిలోనూ ఆసక్తితో కూడిన ఆనందాన్ని కలిగిస్తుంటుంది.

క్రీడల్లో గెలుపు, విపణివీధిలో ఊహించని లాభాలు, పరీక్షల్లో విజయావకాశాలు... ఎన్నో. తరవాతి క్షణం ఎలా ఉంటుందో, ఏ కొత్త అనుభవం దాగి ఉందో తెలియదు. మార్పులు, మలుపులు... అన్నీ జీవితంలో అంతర్భాగమే.

జీవితం ఎప్పుడూ నిరీక్షణతోనే నిండి ఉంటుంది. ఈ నిరీక్షణ ఫలితం మనిషిని ఒక్కోసారి ‘నేను చేశాను, నా వల్లనే’ అనే అహం నుంచి పడేసి నేలమీద కాళ్లు ఆనేలా చేస్తుంటుంది. మనిషి కృషితో, నిజాయతీతో ప్రయత్నం చేస్తే ఫలితాలను దైవం నిర్వచిస్తాడు. ముందే అన్నీ తెలిసిపోతే జీవితంలో కుతూహలం మాయమవుతుంది. ఆ తెలియకపోవడంలోనే మాధుర్యం, ఉత్తేజం, ఉత్సాహం. ఆదుర్దా పడకుండా అనుభవం పొందాలన్నా, అనుభూతి చెందాలన్నా నిరీక్షణే మార్గం. అప్పుడే జీవితం సుందరం, సుమధురం!

ఉదయం వరకూ అతను బారిష్టరే. రైలెక్కేదాకా కూడా. దక్షిణాఫ్రికాలో తెల్లవారు దుర్భాషలాడి రైలుబోగీ నుంచి తోసేసినప్పుడు, అవమానానికి గురైనప్పుడూ బారిష్టరే. ఆ తరవాతి క్షణమే... మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ- మహాత్మాగాంధీ అయ్యారు.

ప్రతి మనిషి జీవితంలోనూ మలుపులుంటాయి. ఎదురయ్యే పరిస్థితులకు స్పందించే సామర్థ్యం, సుదృఢ స్వభావం ఉండి పోరాడితే- కొత్త చరిత్ర పురుడు పోసుకుంటుంది.

ప్రతి ఉదయం ఒకేలా అనిపిస్తుంది కానీ... వాస్తవంలో అది నిజం కాదు. ప్రతి క్షణం ఒకేలా కదిలివెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది కానీ... దేనికదే వేర్వేరు. అందుకే మనిషి ఎరుకతో జీవించాలి. నమ్మకంతో నిరీక్షించాలి.

జీవితంలో విజయం తాలూకు గుర్తులే కాదు, అపజయం తాలూకు ముద్రలూ కనిపిస్తాయి. సూర్యాస్తమయం లేకుండా సూర్యోదయం కాదు. వర్షాన్ని భరించినప్పుడే ఇంద్రధనుస్సు అనుభూతి దక్కుతుంది!

(ఈనాడు అంతర్యామి)✍🏻మంత్రవాది మహేశ్వర్‌

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     9985831828*

కామెంట్‌లు లేవు: