23, అక్టోబర్ 2020, శుక్రవారం

పొత‌న త‌ల‌పులో....91

 పొత‌న త‌ల‌పులో....91


నార‌దా..కూర్మావ‌తార విశేషం గురించి విను.....


                               ***

అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్, మందరా

గముఁ గవ్వంబుగఁ జేసి యబ్ధిదఱువంగాఁ గవ్వపుంగొండ వా

ర్థి మునుంగన్ హరి కూర్మరూపమున నద్రిం దాల్చెఁ దత్పర్వత

భ్రమణవ్యాజత వీఁపుఁదీట శమియింపం జేయఁగా నారదా!

                                ***

నారద! పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వంగా జేసుకొని క్షీరసాగరాన్ని మథించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపుదురద తొలగించుకోవటానికా అన్నట్లు కూర్మరూపం ధరించాడు.


                                 ***


ఇక  నృసింహావతారం గురించి వివరిస్తాను. విను...


సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా

ధరుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రా కరాళస్య వి

స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ

కరభాస్వన్నఖరాజిఁ ద్రుంచె ద్రిజగత్కల్యాణసంధాయియై.


                                     ***

ఒకప్పుడు రాక్షసుడైన‌ హిరణ్యకశిపుడు, దేవలోకంపై దండెత్తి దేవతలను బాధించసాగాడు. ప్రచండమైన గదాదండం చేబూని వస్తున్న ఆ దానవుణ్ణి శ్రీహరి చూచాడు. వాణ్ణి ఫరిమార్చి ముల్లోకాలకు క్షేమం కలిగించాలనుకొన్నాడు. వెంటనే కోరలతో భీతికొలిపే నోరు, కోపంతో ముడివడ్డ కనుబొమ్మలు కలిగిన నరసింహావతారం ధరించాడు. వాడి గోళ్లతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి హతమార్చాడు.

                                       ***


 ఆదిమూలావతారము వివరము తెలుపుతాను. ఆలకించు.....


కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై వేయి వ

త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్

హరి నీవే శరణంబు నా కనినఁ గుయ్యాలించి వేవేగ వా

శ్చరముం ద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా!

                       ***


 నారద! గజేంద్రుడు మొసలిచేత పట్టువడి దుఃఖించసాగాడు. వేయి సంవత్సరాలు దానితో పెనగులాడుతు రక్షణకై విశ్వమయునికి మొరపెట్టుకొన్నాడు. నీవే నాకిక దిక్కు అని ఆర్తుడై ఆక్రందనం చేసాడు. తక్కిన దేవతలు  అతని ఆపద మాస్పలేక పోయారు. అప్పుడతడు అది విని వెనువెంటనే పరమాత్ముడైన‌ శ్రీహరి ఆదిమూల స్వరూపుడై వచ్చి పరమోత్సాహంతో మకరిని చంపి కరిని కాపాడాడు.

                        ***

వామనావతారంబు వినుము......


యజ్ఞేశ్వరుండగు హరి విష్ణుఁ డదితి సం-

  తానంబునకు నెల్లఁ దమ్ముఁ డయ్యుఁ

బెంపారు గుణములఁ బెద్ద యై వామన-

  మూర్తితో బలిచక్రవర్తిఁ జేరి

తద్భూమి మూడు పాదమ్ము లనడిగి ప-

  దత్రయంబునను జగత్త్రయంబు

వంచించి కొనియును వాసవునకు రాజ్య-

  మందింప నీశ్వరుండయ్యు మొఱఁగి



యర్థిరూపంబు గైకొని యడుగ వలసె

ధార్మికుల సొమ్ము వినయోచితముగఁ గాని

వెడఁగుఁదనమున నూరక విగ్రహించి

చలనమందింపరాదు నిశ్చయము పుత్ర!


                    ***

యజ్ఞాధిపుడైన విష్ణువు అదితి బిడ్డలలో కనిష్ఠుడు ఐనా ఉత్తమ గుణాలలో అందరికంటే జ్యేష్ఠుడు. అయన వామనాకారంతో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగుల నేల అతణ్ణి యాచించి పుచ్చుకొన్నాడు. ఆ మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించి  అపహరించాడు. తాను సర్వేశ్వరుడై వుండికూడ ఇంద్రుడికి రాజ్యం ముట్టజెప్పడానికై ఆయన వంచనతో బలిని యాచించవలసి వచ్చింది. సత్య ధర్మాత్ముల సొమ్ము వినయంగా వెళ్లి ఉచిత పద్ధతిలో గ్రహించాలి. అంతే కాని మూర్ఖత్వంతో పోట్లాడి ఆక్రమించ గూడదు సుమా. ఇది నిజం.

              ***

బలి నిజమౌళి నవ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము

త్కలిక ధరించి, తన్నును జగత్త్రయమున్ హరికిచ్చి, కీర్తులన్

నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వహానికిం

దలఁకక శుక్రు మాటల కుఁదారక భూరివదాన్యశీలుఁడై.

                       **

పరమదాత అయిన బలిచక్రవర్తి, ఆ బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని ఉత్సుకతతో తలమీద చల్లుకున్నాడు. తనతోపాటు మూడులోకాలను నారాయణుడికి ధారాదత్తం చేసాడు. విశ్వమంతట శాశ్వతమైన యశస్సు నిలుపుకొన్నాడు. ఆ దానంవల్ల దేవలోకం మీద తనకున్న పెత్తనం పోతుందని జంక లేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా లక్ష్య పెట్టలేదు.

                          **

ఓ నారద! అంతేకాదు, ఆ పరమేశ్వరుడు హంసావతార మెత్తాడు. అతిశయమైన భక్తి యోగంతో సంతసించిన వాడు అయ్యాడు. నీకు, ఆత్మతత్త్వం తెలయపరచే భాగవత మనే మహాపురాణం ఉపదేశించాడు. మనువుగా అవతరించి తన తేజోమహిమతో అమోఘమైన చక్రం చేబూని దుర్జనులైన రాజులను శిక్షించాడు, సజ్జనులను రక్షించాడు. తన కీర్తిచంద్రికలు సత్యలోకంలో ప్రకాశింప జేశాడు. ఇంకా ధన్వంతరిగా అవతారం దాల్చాడు. తన నామస్మరణతోనే భూమిమీది జనానికి రోగాలన్నీ పోగొట్టుచు ఆయుర్వేదం కల్పించాడు.

                                     **

 ఇక పరశురామావతారం ఎలా జరిగిందో వివరిస్తాను,శ్ర‌ద్ధ‌గా విను....

                                   **

ధరణీ కంటకులైన హైహయనరేంద్రవ్రాతమున్ భూరివి

స్ఫురితోదారకుఠారధారఁ గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం

బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ

జిర కీర్తిన్ జమదగ్నిరాముఁ డన మించెం దాపసేంద్రోత్తమా

                               ***

మునీంద్రులలో అగ్రగణ్యుడవైన నారద!.....

 హైహయరాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించారు. వాళ్లను శిక్షించడానికి శ్రీమన్నారాయణమూర్తి జమదగ్నిసుతుడైన ఆ పరశురాముడుగా అవతరించాడు. రణరంగంలో ఇరవై యొక్కసార్లు ఈ రాజసమూహాన్ని దారుణమైన తన గండ్రగొడ్డలితో చెండాడు. బ్రాహ్మణులు వేడుకోగా భూమండల మంతా వాళ్లకు దానం చేసాడు. ఆ భార్గవరాముడు అలా శాశ్వత కీర్తితో వెలుగొందాడు.....


🏵️పోత‌న ప‌దం🏵️

🏵️మ‌హిమాన్వితం🏵️

కామెంట్‌లు లేవు: