11, అక్టోబర్ 2020, ఆదివారం

శ్రీమన్నారాయణ అథర్వశీర్షము ..2

 శ్రీమన్నారాయణ అథర్వశీర్షము ..2


✍️ గోపాలుని మధుసూదన రావు 


ఉచ్చరించ వలయు "నోం" కార మాది 

పదపడి " నమః " యని బలుకంగ వలయు 

" నారాయణా " యని నయముగా చివర 

పావన నామంబు బలుకంగ వలయు 

" ఓం " యన మొదటిది నొక యక్షరంబు 

యిక " నమః " యనునవి రెండక్షరములు 

" నారాయణాయ " యీ యైదక్షరములు 

నంతయు మొత్తంబు యష్టాక్షరములు 

" అష్టాక్షరీమంత్ర " మనబడ నిదియె

అష్టాక్షరీమంత్ర మనయంబు నెవరు 

సతతంబు భక్తితో జపియింతు రతుల 

మధురమౌ యా మంత్ర మననంబు కతన 

యాయురారోగ్యముల్ యనయంబు బొంది 

కీర్తివంతుండౌను క్షితి పైన మిగుల 

పశువులు , సంపద పరిఢ విల్లంగ

సంతతి తోడను సంవృద్ధి జెందు .

ఇట్లు "సామము" బల్కె నింపుగా నెలమి 


అరయ "అ" "ఉ" "మ" కార మైక్యరూపంబు 

వెరసి "ఓంకార" మై వెలసె విశ్వమున 

ఉత్కృష్ట " ఓం కార " యుద్ఘాటనమున

ప్రణవమౌ  " ఓం కార "పఠనంబు కతన 

యోగులు గేస్తులు నుర్విజనంబు 

జన్మ పరంపర జాలంబు నుండి 

మోక్షంబు పొందియు ముక్తు లయ్యేరు 

ఈశ్వర స్తుతమైన యీ ప్రణవంబు

ప్రత్యగానందంబు బ్రహ్మ రూపంబు 

నతులిడి "ఓం నమో నారాయణాయ " 

యనెడి యష్టాక్షరి మంత్రరాజమును

మది జపియించెడి మహిత మానవుడు 

చేరు వైకుంఠంబు చిద్విలాసమున 

హృదిపుండరీకాన ముదమొప్పుచుండ 

మధుసూదనుండుండు మహిమాన్వితముగ

సర్వేశ్వరుండతడు సర్వ ప్రాణులకు 

ఉత్పత్తి స్థితి లయ ముఖ్యకారణుడు

వివరంగ మూటికి  హేతువేయైన 

యెరుగంగ నాతడు హేతువు కాడు

అని " యథర్వణ " వేద మఱయంగ జెప్పె 


ఈ యథర్వణవేద మిచ్చు శీర్షమును 

ప్రాభాత సమయాన పఠియించి తేని

యరయ ప్రభాతాన నధ్యయనంబు 

సేయ పాపౌఘము ఛిద్రంబుయౌను 

సాయ మధ్యయనంబు సల్పిన యడల

పగటి పాపంబులు పరిహార మగును 

ఉభయసంధ్యల యందు నుద్యమించంగ 

చప్పున పాపముల్ సర్వంబు సమయు

మధ్యాహ్న సమయాన మార్తాండునకును 

యెదురుగా నిలబడి యివ్విధం బొప్ప 

యధ్యయనము జేయ నాతండు మిగుల 

పంచ మహా పాతపాశంబు నుండి 

ముక్తుడై తప్పక మోక్ష మందేను 

సర్వ వేదంబులు చదివిన యట్టి 

యుత్కృష్ట పుణ్యంబు యొనగూరు నఱయ

శ్రీమహావిష్ణుని చేరు సత్వరము 

ఇయ్యదే వేదంబు  యిది వేద మఱయ

అఱయ నథర్వణంబద్భుతంబైన 

యుత్కృష్టమైనది యుపనిషత్తిదియె

ఓం శాంతి  ఓం శాంతి  ఓం శాంతి శాంతి

కామెంట్‌లు లేవు: