11, అక్టోబర్ 2020, ఆదివారం

*ధార్మికగీత - 44*

    *ధార్మికగీత - 44*

                        *****

      *శ్లో:- సతాం సాప్తపదీ మైత్రీ ౹*

              *సత్సతాం త్రిపదీ మతా ౹*

              *సత్సతా మపి యే సన్తి ౹*

              *తేషాం మైత్రీ పదే పదే ౹౹*

                            *****

 *భా:- "సంబంధం సాప్తపదీనమ్" అని ప్రసిద్ధి. ఏడడుగులతో ఎలాంటి బంధమైనా ఏర్పడుతుందని అర్థము. సజ్జనులతో ఏడడుగులు నడిచినా, ఏడు మాటలు అన్నా, విన్నా , కన్నా ఇట్టే మైత్రీభావం ఏర్పడుతుంది. అదే సజ్జన శ్రేష్ఠులతో నైతే కేవలం మూడు అడుగులు గాని, మూడు మాటలు గాని సరిపోతాయి. వెనువెంటనే గాఢమైన స్నేహ భావం స్థిరపడుతుంది. ఇక సజ్జనశ్రేష్ఠులలో అగ్రేసరులతో నైతే స్నేహబంధం అడుగడుగునా ఏర్పడుతుంది. ఒక అడుగులో, ఒక మాటలోనే ఏర్పడి చిరకాలం కొన సాగుతుంది. ఇదే దుర్జన స్నేహబంధం శరత్ కాల మేఘము వలె త్వరగా ఏర్పడినా, క్షణంలో తేలిపోతుంది. కాన సజ్జన దర్శనము, స్పర్శనము, భాషణము మన సకల పాపాలను, తాపాలను, దైన్యాన్ని బాపగల సామర్ధ్యము కలిగినవి. నారదుని సత్సంగం వల్ల ఒక కీటకము పావురముగాను, లేగదూడగాను, రాజన్యునిగాను జన్మాంతరాలను పొంది జన్మ సార్ధక్యత పొందగలిగింది. నేటికి వివాహ ప్రక్రియలో "సప్తపది" పేరిట మూడుముళ్లు, ఏడడుగులు, మూడుప్రమాణాలతో స్త్రీ పురుషులు అన్యోన్యప్రేమ, అవినాభావసాహచర్యములో నూరేండ్ల పంట పండించుకోవడం సనాతన సంప్రదాయంగా వస్తున్నదే. సజ్జన సాంగత్యం చిరకాలం కొనసాగించాలనేదే మానవ జీవితానికి అర్థము. పరమార్థము*. 

                                 *****

                   *సమర్పణ : పీసపాటి* 

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: