11, అక్టోబర్ 2020, ఆదివారం

శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము



✍️ గోపాలుని మధుసూదన రావు 


మదగజమప్పుడు మిక్కిలి 

రొద సేయుచు వచ్చి యటకు రోషముతోడన్ 

పదముల కదనము జేసెను 

పదపదమని భీతితోడ పాఱగ జనముల్ 125 


చెంతలొ దంతిని గాంచియు

నింతులు భయమంది పాఱిరిటునటు దిశలన్

నింతుల గాంచిన దంతియు

వింతగు ఘీంకార ధ్వని తొ నింతుల దరిమెన్. 126 



అంతట మదగజ మచ్చట 

పొంతల నున్నట్టి పెక్కు పూపొదరిళ్లన్ 

కాంతలు వెఱగున గాంచగ 

సాంతంబుగ పెఱుకసాగె సంచారమునన్ 127 



ఱంకెలు వేయుచు మావటి 

యంకుశమును చేతబూని నతిరయ గతితో 

పంకము ద్రొక్కుచు వచ్చెను 

బింకముతో కరినినొంచ బిరబిర యంతన్ 128 


కరికరమును హరి బట్టియు 

నరచేతను చరచినంత నఱచుచు కరియున్ 

కరివరదుని కఠినంబుగ 

గురువేగముతోడ నెట్టి గొట్టగ దలచెన్. 129 


హరి యంతట కరిమీదకు 

నుఱికెను నత్యంత వడిగ నుగ్రుండౌచున్ 

హరిమధ్యుడు కరినొంచియు 

వెఱగించుకలేకదాని వీపున మోదెన్ 130 


వడివడిగా పడుచుండెడి 

పిడిగుద్దుల తాళలేక భీకర రవమున్ 

కడువడి సుడిబడి యఱచుచు 

పడిపోయెను ధరణిపైన బలగజమంతన్ 131 


హరి యీవిధి వనమందున 

కరినొంచుట గాంచి పద్మ కడుముదమొందెన్ 

విరిబోణియైన నాయమ 

హరియందున మనసునుంచె నాహ్లాదముగన్ 132 



హరియును యుద్యానంబున 

హరిమధ్యమ పద్మ నెంతొ యనురాగమునన్ 

పరికించి సంతసంబున 

పరిణయమాడంగదలచె భావమునందున్ 133 



అనయము పద్మను దలచుచు 

తినుటయు త్రాగుటయుమాని దీనుని పగిదిన్ 

మనుచుండు తనయు గాంచియు

ననియెను నీ రీతి వకుళ యాప్యాయతతో. 134 


“తనయా ! మనమున శంకతొ 

మనుచుండుట భావ్యమవదు మౌనముతోడన్ 

జననిని నాతో జెప్పుము “ 

ననవిని బిడియంబుపొంది హరి యిట్లనియెన్ 135 



“ అమ్మా ! వనమున నేనొక 

యమ్మాయిని జూచినాను యద్భుతముగనూ 

నమ్మానిని సౌందర్యము 

నెమ్మానినియందులేదు వెదుకగ జగతిన్. 136 


ఆమెను పద్మావతి యని 

భామలు తా బిల్చుచుండ పరికించితినీ 

భూమీశు పుత్రి యాయమ 

నామెను పెండ్లాడ దలతు నమ్మా ! మదిలో.” 137

కామెంట్‌లు లేవు: