11, అక్టోబర్ 2020, ఆదివారం

*ఆధ్యాత్మిక ఆదర్శం*

 ప్రతి మనిషికీ ఒక జీవిత ఆదర్శం ఉండితీరాలి. ఆదర్శం అంటే జీవితాన్ని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకునే ఆలోచన, ఆచరణ. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకుంటే, సునాయాసంగా అభివృద్ధి సోపానాలు అధిరోహించవచ్చు. తల్లిదండ్రుల పోరు పడలేక చదవాల్సి వస్తోంది అనుకుంటూ మొక్కుబడిగా చదివితే, ముక్కునపట్టిన విద్య తుమ్మగానే జారిపోతుంది.


విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం చదివే చదువు కాదు. అక్షరంలోనే అనంతజ్ఞానం, అద్భుతశక్తి దాగి ఉన్నాయి. అక్షర తపస్సు చేసినప్పుడే శక్తి లభించి, జ్ఞానఫలాలు దక్కుతాయి. మహామంత్రాలన్నీ బీజాక్షర సంపుటాలే.

తెలుగులో ఉండేవి యాభైఆరు అక్షరాలే. కానీ, అవి వివిధ మేళవింపుల్లో కథలు, కావ్యాలు, గీతాలు, సంగీతాలుగా మారిపోతాయి. ఆ విధంగా వాటిని రూపకల్పన చేయగల నైపుణ్యం కోసమే అక్షరాన్ని ఆత్మగా చేసుకుని అధ్యయనం చెయ్యాలి.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతిరూపమే ఓంకారమని వేదాలు చెబుతున్నాయి. ఇటీవల సూర్య దేవుడి నుంచి వెలువడే ధ్వనితరంగాలు ‘ఓం’కార శబ్దంగా పరిశోధనలు వెల్లడించాయి. మనిషి అజ్ఞానం ఎలా ఉంటుందంటే- తనకు తెలిసిందే జ్ఞానం, తెలియనివన్నీ శూన్యం అనుకుంటాడు. మన నేత్రాలు చూడలేనివి ఎన్నో ఉన్నాయి. మన మేధకు అందనివీ మరెన్నో ఉన్నాయి. ఆ విషయం మనకు అర్థం కానంతవరకూ మనమే ఘనులమనే భ్రమలో బతుకుతుంటాం.

చక్రవర్తి తనను తాను భగవంతుడితో సమం అనుకుంటాడు. మేధావి తానే మహాజ్ఞాని అనుకుంటాడు. మహాధనికుడు తానే అపర కుబేరుడిననుకుంటాడు. సౌందర్యవతి తానే అప్సరసను అనుకుంటుంది. ఇలా ఎవరికి వారు తామే అధికులమని విర్రవీగుతుంటారు.

వారి అహంకారాన్ని కాలం అనాయాసంగా తుడిచిపెట్టేస్తుంది. వారి పరిమితులు ఆయువు తీరేవరకేనని తేటతెల్లం చేస్తుంది.

దైవం ఉన్నాడా లేడా, స్వర్గ నరకాలు నిజమా అబద్ధమా, పాపపుణ్యాలను నమ్మాలా వద్దా... ఇలాంటి తర్క వితర్కాల మద్య జీవితం చివరి మజిలీకి చేరువైపోతుంది. అప్పుడు నోరు తెరుచుకుని కొండచిలువలా మనకోసం ఎదురు చూస్తున్న మృత్యువుకు ఆహారం కాక తప్పదు.

ప్రాపంచిక ఆదర్శాలన్నీ ధనకనక వస్తు వాహనాల ఆర్జన, హోదా, అధికారం, సుఖసౌఖ్యాలకు సంబంధించినవే. ఇందుకు పూర్తి భిన్నమైనది ఆధ్యాత్మిక ఆదర్శం. దీంట్లో పెట్టుబడి స్వల్పం. ఫలితం అనంతం.

శ్రద్ధ, భక్తి- వీటితో పోల్చదగిన ఆధ్యాత్మిక ఆదర్శం మరొకటి లేదు. విశ్వాసం ఈ రెండింటికీ ఇరుసు. భక్తుడు-భగవంతుడు మధ్య అవిశ్వాసం, అతి బద్ధకం, అత్యాశల వంటి అడ్డుగోడలుంటాయి. వీటిని నిర్మలభక్తితో అధిగమించాలి.

మనం నిజాయతీగా ప్రయత్నిస్తే, ఆప్యాయంగా ఆయన చేతులుచాచి మనల్ని తనవైపు లాక్కుంటాడు. మన ఆలోచనకు శబ్దం ఉండదు. కానీ, అది అంతర్యామికి ఆ క్షణంలోనే అర్థమైపోతుంది. మన ఆచరణకు సాక్షులు ఉండకపోవచ్చు. కానీ, ఆయన అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఈ ఎరుక మనకు ఉండి తీరాలి. అది లేనంత వరకు మనకు అంతర్యామి అర్థం కాడు. ఎంత ప్రయత్నించినా అగుపించడు. ఆధ్యాత్మిక ఆదర్శం అంటే- భక్తి నటించకపోవడం, భగవంతుడికి పరీక్షలు పెట్టకపోవడం, మన సర్వశక్తులు ఏకీకృతం చేసి అంతర్యామిని అర్చించడమే!

(ఈనాడు అంతర్యామి)

✍🏻కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

కామెంట్‌లు లేవు: