11, అక్టోబర్ 2020, ఆదివారం

మహాభారతము ' ...47.

 మహాభారతము ' ...47. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


జరాసంధవధ జరిగిన తరువాత, రాజసూయయాగానికి యేర్పాట్లుచేస్తూ, ధర్మరాజు, ఇంకొందరు ముఖ్యులైన రాజులను కూడా జయించి దిగ్విజయయాత్ర పూర్తి చేసుకో వలెనన్న తలంపుతో, నలుగురు తమ్ములను, నాలుగు దిక్కులకు జైత్రయాత్రకై పంపించాడు.  


భీముడు తూర్పుదిక్కున వున్న కుమార, కోసల, మల్ల, విదేహ, పుండ్రక, జలోద్భవ, నేపాల రాజ్యాలలో పర్యటించి, తాను వచ్చినపని ఆయారాజులకు చెప్పగా, వారంతా, ప్రతిఘటన లేకుండా, సంతోషంతో, విలువైన కానుకలిచ్చి, తమ స్నేహం ప్రకటించారు.  


అర్జునుడు ఉత్తరదిక్కుగా వెళ్లి, పులింద, సుమండల, ప్రాగ్జోతిష, సేనాబిందు, లోహిత, చిత్రాయుధ, కింపురుష రాజ్యాలను జయించి, అశేష ధనరాశులను కప్పంగా సేకరించి ధర్మజునికి ఇచ్చాడు.


నకులుడు పడమరదిక్కుగా వెళ్లి మత్తమయూర, ఆక్రోశ, పంచనద, ఉత్తరజ్యోతిష, శాకల, మాధ్యమిక రాజ్యాల రాజులను ఓడించి, మేనమామ అయిన మద్రదేశరాజు శల్యుని నుండి, సన్నిహితుడు శ్రీకృష్ణుడు కొలువైవున్న ద్వారకనుండి స్నేహపూర్వకం గా కానుకలు స్వీకరించి తన విజయయాత్రను ముగించి ధర్మజుని చేరాడు.  


సహదేవుడు దక్షిణదిక్కుగా వెళ్లి, శూరసేన, మత్స్య, అవంతీ, కాంతారక, పాండ్య, మాహిష్మతీ, ద్రావిడ, ఆంద్ర, కళింగములను జయించి, గో, మణిమయ, రత్నఖచిత ఆభరణములను కానుకలుగా తీసుకుని వచ్చి ధర్మజునికి సమర్పించాడు, తన వంతుగా.  


ఆ విధంగా నలుగురు తమ్ముల పరాక్రమాలతో, జనరంజకంగా, ధర్మబద్ధంగా ధర్మరాజు పరిపాలన చేసేవాడు. జనులందరికీ ఆప్తుడయ్యాడు. అజాతశత్రుడయ్యాడు. అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, కనబడేవి కాదు. చోరులు మచ్చుకు కూడా కనబడేవారు కాదు. అంటే దొంగతనాలు లేవన్నమాట. 


ధనరాశులు, జనరంజకమైన పాలనతో, రాజ్యం స్థిరత్వం సంపాదించుకున్నది. రాజసూయయాగదీక్షకు ధర్మజునికి అధికారం వచ్చింది. అనుకున్న సమయానికి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం వచ్చి, యాగానికి శ్రీకారం చుట్టించాడు. వ్యాసుడు ఋత్విక్కులతో వేంచేశాడు. ముఖ్య స్థానంలో వ్యాసమహర్షి కూర్చున్నాడు. ప్రముఖ మహర్షులందరూ ఋత్విక్కుల స్థానాలు అలంకరించారు.   


రాజ్యంలోని ముఖ్యులందరికీ , ప్రత్యేక వినయవిధేయతలు గల దూతల ద్వారా వర్తమానం పంపి, ఆహ్వానించారు. నకులుడు స్వయంగా హస్తినాపురం వెళ్లి, పెద్దలను, దాయాదులు అందరినీ ఆదర, మర్యాదలతో ఆహ్వానించాడు. వారి రాకకై యెదురు చూస్తూ వుంటామని చెప్పాడు. యాగసమయానికి, హస్తిననుండి అందరూ వచ్చారు. అనేక దేశరాజులు, ఛేదిదేశ ప్రభువు శిశుపాలుడు కూడా వచ్చారు.  


ధర్మరాజు, అందరితో వాత్సల్యపూరితంగా, సందర్భోచితంగా మాట్లాడి, సభాముఖంగా అందరికీ అభివాదం చేసి, అందరి సహకారమూ కోరాడు, యాగనిర్వహణకు. అందరూ సంతోషించి దీవించారు.


ఎంతో స్నేహపూరిత వాతావరణంలో, భోజనశాల కార్యక్రమం అంతా, దుశ్శాసనుడే దగ్గర వుండి పర్యవేక్షించాడు. అతిధులు, సామంతులు అర్పించే కట్న కానుకలను, కప్పములను, దుర్యోధనుడు అందుకుంటున్నాడు. ధర్మరాజు, యీ కార్యక్రమం దుర్యోధనునికి వప్పచెప్పి, తాను దుర్యోధనుని మనసు చూరగొంటాను అనుకున్నాడు. కానీ, మద, మాత్సర్యాలతో నిండివున్న దుర్యోధనుడు లెక్కకు మిక్కిలిగా వస్తున్న ఆ కానుకలను చూసి, కండ్లలో యెర్రటిజీరలతో అసూయ అనే జ్వరం వచ్చినవాడిలాగా, వూగిపోసాగాడు. పగతో రగిలిపోసాగాడు. తానువున్న పరిస్థితి దాచుకోలేక, దుర్యోధనుడు బాహాటంగానే శకునికి చెప్పేశాడు. ఇలా అసూయతో కాలిపోవడం తప్పని తనకు తెలిసినా, తనప్రమేయం లేకుండానే బుద్ధివక్రమార్గాన ఆలోచిస్తున్నది, సమర్ధించు కున్నాడు, మేనమామదగ్గర. తాను పాండవుల వైభవాన్ని చూస్తో జీవించి వుండలేనని చెప్పాడు.


ఇంకొకప్రక్క, యాగానికి వచ్చిన పండితుల, బ్రాహ్మణోత్తముల ,మహర్షుల పాదాలు స్వయంగా నీటితో కడుగుతూ, వారి పాదాలను వస్త్రంపెట్టి తుడుస్తున్నాడు, శ్రీకృష్ణుడు.   


ఇలా యెవరికి అప్పగించిన పనులలో, యెవరికి ఇష్టమైన పనులలో వారు ధర్మజునికి బాసటగావుండి రాజసూయ యాగనిర్వహణకు తమ కర్తవ్యం తాము నిర్వహిస్తున్నారు.  


ఇప్పుడు రాజసూయయాగానికి అవసరమైన అగ్రపూజ, పవిత్ర జలాభిషేచనం కోసం ధర్మరాజు, యాగశాలలో, పెద్దలు కూర్చున్న చోటికి వచ్చి, అగ్రపూజ ఎవరికి చెయ్యవలెనా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ధర్మజుని ఆలోచన పసిగట్టినట్లుగా భీష్ముడు, ' ధర్మజా ! ఈ సభలో నాకు తోచినంతవరకు, ఆశ్రీకృష్ణుడు ఒక్కడే అగ్రపూజకు అర్హుడు. శ్రీకృష్ణుడు చీకటిలో వున్నవారికి వెలుగు లాంటివాడు. తన కరుణారస దృక్కులతో, అందరి బాధలు పోగొట్టగలిగేవాడు. ముందుగా శ్రీకృష్ణుని పూజించు. ' అని నిర్ద్వందంగా చెప్పాడు.  


ఆవిధంగానే శ్రీకృష్ణుని అగ్రాసనం మీద కూర్చుండజేసి, ధర్మరాజు, వింజామర వీస్తుండగా, భీమార్జునులు ఛత్రం పట్టుకొనగా, సహదేవుడు అర్ఘ్యం యివ్వబోతుండగా, సభికులందరినీ ఆశ్చర్య పరుస్తూ, శిశుపాలుడు లేచి నిలబడ్డాడు.  


శిశుపాలుడు యేమి చెబుదామని లేచాడో అని అందరూ వుత్కంఠగా చూడసాగారు.


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత

 రేపు.

తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం

హిందూపురం

9989692844

కామెంట్‌లు లేవు: