11, అక్టోబర్ 2020, ఆదివారం

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 24 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః’

అమ్మవారి బుగ్గలు పద్మరాగమణులతో చెయ్యబడిన అద్దముకన్నా ఎర్రగా ఉంటాయని అర్థము. ఎంత బాగున్నాయో అనే ఉద్దేశ్యముతో అయినా అమ్మవారి బుగ్గల వంక చూడటము మంచిదే. పద్మరాగములనేవి సింహళదేశములో ఎక్కువగా దొరికే చాలా ఎర్రగా ఉండే మణులు. సామాన్యముగా అద్దమునకు ప్రతిబింబము కనపడాలి అంటే వెనక కిరణము అద్దము ద్వారా అవతలకు వెళ్ళకుండా ఎర్రటి రసాయనమును రాస్తారు. ముఖము మీదనుండి బయలు దేరిన కిరణము అద్దము మీద పడి పరావర్తనము చెందుతుంది. బింబము ప్రతిబింబమువలె కనపడుతుంది. వశిన్యాది దేవతలు అమ్మవారి బుగ్గలని అద్దము చేసారు. లోపలది కనపడటము కాక పక్కన కూర్చున్న వాళ్ళ ప్రతిబింబము ఇందులో కనపడాలి. అమరకోశము దర్శ అనగా అద్దమని వ్యాఖ్యానము చేసింది. పద్మరాగమణులతో చేసిన అద్దము ఎంత అందముగా ఉండి ఉంటుందో ఆ అందమును తిరస్కరించ కలిగినటువంటి చెక్కిళ్ళు కల తల్లి అని ఈ నామమునకు అర్థము. పద్మరాగమణుల అద్దము యొక్క కాంతి అమ్మవారి బుగ్గలకాంతి ముందు ఓడిపోయింది. అమ్మవారి పాతివ్రత్యము ప్రకాశిస్తే, మనస్సులో పొంగిపోతే, దానికి పరమశివుడు ప్రసన్నుడైతే ఆ పాదద్వందము తగిలి దాని వలన శరీరము పునీతమైతే మళ్ళీ జన్మ పొందవలసిన అవసరము లేని పునరావృత్తిరహిత శాశ్వతశివసాయుజ్యస్థితిని ఇవ్వకలిగిన జ్ఞానము దగ్గర నుంచి భక్తి, వినయము వరకు పథమునంతటినీ శుభ్రము చేయకలిగిన పరమ శక్తివంతమైన నామము. 

https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: