11, అక్టోబర్ 2020, ఆదివారం

ప్రహ్లాదుడు

  🌺 *ఓం నమో నారాయణాయ* 🌺

*12. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁ డై; యొక్కఁడు నేడుచు నొక్కచోట; నశ్రాంత హరిభావనారూఢచిత్తుడ; యుద్ధతుఁ డై పాడు నొక్కచోట; విష్ణుఁ డింతియ కాని వేఱొండు లేదని; యొత్తిలి నగుచుండు నొక్కచోట; నళినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని; యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ; బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ బ్రణయహర్ష జనిత బాష్పసలిల మిళితపులకుఁ డై నిమీలితనేత్రుఁ డై యొక్కచోట నిలిచి యూరకుండు.*


భావము:- పరీక్షిన్మహారాజా! ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరచిపోయి "విష్ణుధ్యానములో విరామం కలిగిం" దని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు; ఒక్కక్క చోట విష్ణువు మీద మనసు నిలిపి, ఆనందం అతిశయించగా గొంతెత్తి గానం చేస్తూ ఉంటాడు; ఒక్కోసారి "విష్ణువు తప్ప ఇతరం ఏమీ లేదు లే" దని గట్టిగా అంటూ పకపక నవ్వుతూ ఉంటాడు; ఒక్కోచోట "నలినాక్షుడు (విష్ణువు) అనే పెన్నిధి కన్నులారా కన్నా" అంటూ గంతులేస్తాడు; ఇంకోచోట భక్తిపారవశ్యంతో ఆనందభాష్పాలు రాలుస్తూ "పరమేశ్వరా! కేశవా!" అని పిలుస్తూ ఉంటాడు; మరింకోచోట భక్తి తాత్పర్యాదులతో ఒడలు గగుర్పొడుస్తుండగా కనులు మూసికొని నిర్లిప్తంగా ఉంటాడు

*13. ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతం బైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణ భావంబున విస్తరించుచు నప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబునం దన చిత్తం బన్యాయత్తంబు గానీక నిజాయత్తంబు చేయుచు నప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణిగణ గరిష్ఠుండును, పరమభాగవత శ్రేష్ఠుండును, కర్మబంధ లతా లవిత్రుండును, పవిత్రుండును నైన పుత్రుని యందు విరోధించి సురవిరోధి యనుకంపలేక చంపం బంపె" నని పలికిన నారదునకు ధర్మజుం డిట్లనియె.*



భావము:- ఇలా ప్రహ్లాదుడికి పూర్వజన్మలో పరమ భాగవతులతో చేసిన సత్సంగం వలన గొప్ప విష్ణు పాద భక్తి లభించింది. అతను అఖర్వ నిర్వాణ భావం విస్తరిస్తున్నప్పటికి, దుర్జనులతో సాంగత్యం కలిగి తన మనసు అన్యాయత్తంబు కానివ్వటం లేదు. అతడు ఆత్మావలోకనం చేసుకుంటూ అప్రమత్తుడై ఉంటాడు. సాంసారిక వృత్తులన్నీ వదిలేశాడు. అతను విజ్ఞులకు విధేయుడిగా ఉంటాడు. రత్నాలలాంటి సర్వ సుగుణాల రాశితో గొప్ప భాగ్యవంతుడు. పరమ భాగవతులలో ఉత్తముడు. కర్మబంధలన్నీ వదుల్చుకున్నవాడు. అటువంటి పవిత్రుడైన పుత్రుడితో విరోధించి జాలి లేకుండా చంపమని తండ్రి అయిన హిరణ్యకశిపుడు పంపాడు” అని పలికిన నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు.

కామెంట్‌లు లేవు: