11, అక్టోబర్ 2020, ఆదివారం

🥀 #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-26 🥀

 🥀 #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-26 🥀 


 💮శ్లోకం 20💮


మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః||

అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||


183. మహేష్వాసః --- తిరుగులేని, గొప్ప బాణములు ప్రయోగించువాడు; బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు; గొప్ప విలుకాడు.

184. మహీభర్తా --- భూభారమును వహించినవాడు - ఆదికూర్మమై భూమిని భరించియుండు కూర్మావతార మూర్తి, పాతాళాంతర్గతయైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి.

185. శ్రీనివాసః --- సిరికి నిలయమైనవాడు, శ్రీమహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా నున్నవాడు.

186. సతాంగతిః --- సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.

187. అనిరుద్ధః --- ఎవరివల్లను, ఎన్నడైనను నిరోధింపబడనివాడు; అపరిమిత చేష్టామూర్తి.

188. సురానందః --- దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు.

189. గోవిందః --- దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు; మహార్ణవమునుండి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; గోవులను కాచేటి గోపాలుడు; వేదములనొసగిన, వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు.

190. గోవిదాం పతిః --- వేదార్ధములనెఱిగిన జ్ఞానులకు రక్షకుడు.


శ్లో. మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసః సతాంగతిః


అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః !!20!!


41. కార్ముకము ధరించు, కాశ్యపి నాథుడు,


లక్ష్మిపతియె, చూడ లక్షణముగ


సాధు సంతులకును శ్రయము నిచ్చుచునుండు


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : మహేష్వాసః ... మహేష్వాసో అంటే గొప్ప బాణప్రయోగము కలవాడు, మహీ భర్తా ... మహీభర్త అనగా భూమిని భరించువాడు, శ్రీనివాసః ... లక్ష్మీపతి, సతాంగతిః .. సాధుసంతులకు సమాశ్రయం కల్పించువాడు.


భావము : సారంగమను గొప్ప విల్లు (మహా ఇష్వాసం అనగా కార్ముకము అనగా విల్లు అనే యర్థాలూ ఉన్నవి గదా) ధరించిన,మరియూ దానిని గొప్పగా ప్రయోగించగల వాడు(ఎంత గొప్పగా బాణాలు ప్రయోగించగలడో, రామాయణంలో మనకు కొన్ని చోట్ల కనబడుతుంది. ), భూమికి భర్తయై సదా కాపాడు వాడు(కాశ్యపి అంటే భూమి అనే అర్థమూ ఉన్నది కదా), లక్ష్మి నివాసముగా గలవాడు లక్ష్మీపతి, సాధు సంతులకు సజ్జనులకు కూడా ఆశ్రయమిస్తూ తనలో కలుపుకునేవాడు(శ్రయము అన్నా ఆశ్రయము అన్నా ఒకటే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)


42. ఎదురు లేని వాడె, యదితిజుల వరుడు


గోవు నెపుడు గాచు గోపతిగను


వేదములను కాయు వేద వేద్యుడతడె


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : అనిరుద్ధః ... ఎదురు లేనివాడు, సురానందః ... దేవతలకు ఆనందము చేకూర్చువాడు, గోవిందః ... గో సంరక్షకుడు, గోవిదాం పతిః ... వేద సంరక్షకుడు.


భావము : తన కార్యక్రమాలలో ఏ విధమైన అడ్డంకులు ఎదురుకానివాడు, దేవతలకు (అదితిజులు అనగా అదితి పుత్రులే కదా) ఆనందం చేకూర్చేవాడు (వరుడు అనగా వరింపదగినవాడు... కోరదగిన వాడు), గోవు అంటే భూమి, వాక్కు, ఆవు, వేదములనే నానార్థాలున్నవి కనుక వాటిలో దేనికైనా అధినాథుడు, గోవిదాంపతి అనగా వేదములు తెలిసినవారిని రక్షించువాడు అని, వేదములు తెలిసినవారిలో మేటి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)


-ఓం నమో నారాయణాయ.

కామెంట్‌లు లేవు: