8, జులై 2021, గురువారం

న్యాసము..* *(చివరి భాగము)*

 *న్యాసము..* *(చివరి భాగము)*


సాధారణంగా ఏ మంత్రాన్ని ఏ దేవతను మనం జపము ధ్యానము చేయదలచుకున్నామో ఆ మంత్రానికి సంబంధించిన భాగాలను ఆ  దేవత కు సంబంధించిన రూపాన్ని మన శరీరంలో మనసులో ముందుగా నిలుపుకోవాలి. అలా నిలుపుకోవడమే న్యాసము అని పిలుస్తారు. న్యాసము మొదటిది. తరువాతది మంత్రజపము. ఆ తరువాతది మానసిక ధ్యానము. ఆఖరి మెట్టు సగుణోపాసన ( దర్శనము లేదా సాక్షాత్కారానికి ప్రయత్నము). 


 ఈ న్యాసము రెండు విధాలు. కాలి గోరు దగ్గర్నుంచి తల వెంట్రుకల వరకూ ఆపాదమస్తకం ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగాన్ని వివరణాత్మకంగా నూ సమగ్రం గానూ నిలిప డాన్ని మహాన్యాసము అంటారు. అలా కాకుండా ప్రధానమైన శరీర భాగాలు మనసు వీటిలో మంత్రానికి సంబంధించిన దేవత కు సంబంధించిన ముఖ్య విషయాలను నిలపడాన్ని లఘున్యాసము లేదా సాధారణ న్యాసము అంటారు. న్యాసం పూర్తయితే ధ్యానం చేసేవాడి దేహమే దేవాలయం గానూ అందులో ఉండే జీవుడే అతను ధ్యానం చేసే దేవత గాను మారినట్లుగా భావన చెయ్యాలి. 


వ్యవహారంలో వేదంలోని రుద్రాన్ని మహాన్యాస పూర్వకం గా చేస్తే మహాన్యాసం అని మామూలు న్యాసంతో చేస్తే లఘున్యాసం అని వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు మనం చేస్తున్న చర్చ కు రుద్రా ని కి సంబంధం లేదు. 


 సాధారణంగా న్యాసము అంగన్యాసము కరన్యాసము అని రెండు భాగాలుగా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మంత్రాన్ని ప్రధానంగా ఆరు భాగాలుగా చేస్తారు. ఈ ఆరు భాగాలు కాక ఆ మంత్రాన్ని మొదటిసారిగా దర్శించి మానవాళికి అందించిన రుషి పేరును ఆ మంత్రం నిర్మింపబడిన ఛందస్సును ఆ మంత్రం ద్వారా సూచింపబడే దేవతను కలిపి న్యాసం చేస్తారు. ఇవి కాక  బీజాక్షర న్యాసము మాంత్రిక న్యాసము  కూడా ఉన్నాయి. పాంచరాత్ర ఆగమం ప్రకారం లఘున్యాసం లో కూడా 16 భాగాలుంటాయి. ఆ పద్ధతి అంతగా ప్రచారంలో లేదు. 


ప్రస్తుతం వ్యవహారంలో  సాధారణ న్యాసం లో 1. ఋషి 2. చందస్సు 3. దేవత 4. బీజం 5. శక్తి 6. మంత్రం 7. కీలకం 8. అస్త్రం 9. నేత్రం 10. కవచం 11. దిగ్బంధనం 12. ధ్యానం 13. వినియోగం అనే భాగాలు ఉంటాయి. ఏ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటామో సాంప్రదాయం ప్రకారం ఆ మంత్ర భాగాలను చెబుతూ ఆయా శరీర భాగాలను స్పృసించు కోవాలి.  కరన్యాసం లో అయితే చేతి వేళ్ళు అరచెయ్యి చేతి వెనక భాగము వీటిని ముట్టుకోవాలి. కరన్యాసము లో పంచభూతాలను వాటి వాటి బీజాక్షరాలతో చేతి వేళ్ళ చివర న్యాసం చేసి మనం ఉపాసించే దేవత సర్వభూత త్మకమైన శక్తి గా భావించి ఆ శక్తిని చేతిలోకి ఆవాహన చేసుకోవాలి.   అంగన్యాస కరన్యాసాలలో ఏ శరీర భాగం తో ఏ శరీర భాగాన్ని ముట్టుకోవాలో గురువుల దగ్గర కూర్చొని చూసి నేర్చుకోవాలి.


 ఋషి చందస్సు ఇందాక అయిపోయినాయి. దేవత అన్నప్పుడు ప్రార్ధన శ్లోకాన్ని బట్టి ఆ దేవత యొక్క రూపాన్ని ఊహించుకుంటూ ఆ దేవత పేరు చెప్పాలి.  బీజము శక్తి అనేవి మంత్రంలో ముఖ్య భాగములు. కీలకము అంటే కట్టు కొయ్య. ఆవులు మొదలైన జంతువులను తాడుతో కట్టడానికి నేలలో పాతే రాట. ధ్యానం చేసేవాడు కీలకం యొక్క పరిధిని దాటి పోకూడదు. బీజము శక్తితో కూడిన మంత్రానికి ఏకాగ్రతను కలిపితే అది అస్త్రం గా మారుతుంది. అప్పుడు అంతర్ముఖంగా ఉన్న కళ్ళకు బృకుటి దగ్గరగానీ హృదయం దగ్గర కానీ భగవద్దర్శనం జరగాలి. ఇది నేత్రం. ( లో పలి చూపు). ధ్యాన భంగం లోపలి కారణాలవల్ల బయట కారణాలవల్ల రెండు విధాలుగా జరగొచ్చు. వాటిని నిరోధించడానికి కవచము దిగ్బంధం చేసుకోవాలి. ధ్యానం అనేది దేవతా రూపాన్ని తెలియజేసేది. వినియోగం అనేది సంకల్పము. ఇవి న్యాసం లో ఉండే భాగాలు.


Self Hypnotism సాధన చేసేటప్పుడు తల నుంచి కాళ్ల వరకు లేదా కాళ్ళ నుంచి తల వరకు శరీర భాగాలను క్రమక్రమంగా relax చేసుకుంటూ రావాలి. అది పూర్తయిన తర్వాత Self Hypnotism లోపలికి వెళ్తాము. ఇది సైన్స్ అంగీకరించిన విషయము. హిప్నటిజం లోనూ ధ్యానం లోనూ trance లోపలికి వెళ్తాము. 


కానీ... *ధ్యానం అనేది హిప్నాటిజం మించి చాలా ఎత్తులో ఉన్న విషయము. దానిని ప్రస్తుతం సైన్స్ అందుకోలేదు..*

 

పైన చెప్పిన విషయాలను ఉదాహరణ పూర్వకంగా తెలుసుకోవడానికి విష్ణు సహస్రనామ మాలా మంత్రానికి సంబంధించిన న్యాస భాగాలను పరామర్శిద్దాము.


 వేదవ్యాసుడు ఋషి. అనుష్టుప్ ఛందస్సు. శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణుడు దేవత. అమృతాంశూద్భవో భానుః అనేది బీజం. దేవకీనందన స్రష్ట అనేది శక్తి. ఉద్భవః క్షోభనః దేవ అనేది మంత్రము. శంఖ భ్తృత్ నందకీ చక్రీ అనేది కీలకము. శార్జ్ఞధన్వా గదాధర అనేది అస్త్రము. రథాంగపాణిః అక్షోభ్య  అనేది నేత్రము. త్రిసామా సామగస్సామా అనేది కవచము. ఋతు సుదర్శనః కాల అనేది దిగ్బంధము. విశ్వరూప అనేది ధ్యానము. శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్ధం జపించాలి అనేది వినియోగము.


ఈ మంత్రం లో కవచం తర్వాత ఆనందం పర బ్రహ్మేతి యోనిః అని ఉన్నది. మిగతా మంత్రాలలో ఎక్కడా ఇలా ఉండదు. ఆనంద స్వరూపుడు అయిన పరబ్రహ్మమే మూలము అని దాని అర్థం. ఈ మాటకు న్యాసానికి సంబంధం ఏమిటి. న్యాసము అంటే మనలో పలే భగవంతుడిని నిలుపుకోవటం అనుకున్నాం కదా. పైన చెప్పిన మంత్రము ఆ భగవంతుడి లక్షణాన్ని వివరిస్తుంది. పరబ్రహ్మ యొక్క ముఖ్య లక్షణం ఆనందము. ఆ సత్ చిత్ ఆనంద సమాహారమైన పరబ్రహ్మయే సృష్టికి మూలము. నేను నా లోపల దర్శించ బోయే భగవంతుడు సత్ చిత్ ఆనందమయుడై న బ్రహ్మ అనే జ్ఞానాన్ని కూడా ఈ న్యాసంలో ప్రత్యేకంగా ఇమిడ్చారు. ఇది విష్ణు సహస్రనామం తాలూకు న్యాసంలో ఉన్న ప్రత్యేకత. 


విష్ణు సహస్రనామం యొక్క అధిష్టాన దేవత సాకార దేవత అయినప్పటికీ ఆయనే నిరాకారుడైన పరబ్రహ్మము అనే విషయాన్ని సూచించడం వల్ల ధ్యానం చేసేవాడు భగవత్సాక్షాత్కారమే కాకుండా కైవల్య స్థితిని పొందడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇది దీని ప్రత్యేకత. 

 


*పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: