22, ఫిబ్రవరి 2023, బుధవారం

నిద్ర పట్టనివారికి

 నిద్ర పట్టనివారికి నిద్రని కలిగించు సులభ ఔషధ యోగము  - 


    ఒక ఇనుప పాత్రలో 100 గ్రాముల స్వచ్చమైన నువ్వుల నూనెని తీసుకుని బాగా మరిగించాలి . దాని యందు 10 గ్రాముల ముద్ద కర్పూరం పొడి చేసి నువ్వులనూనె లో కలిపి బాగా కలిసేంత వరకు తిప్పి పొయ్యి మీద నుంచి క్రిందికి దింపి చల్లారాక ఒక బాటిల్ నందు నిలువ చేసుకుని ప్రతిరోజూ రాత్రిపూట ఆ నూనెతో అరికాళ్లుకు మర్దన చేసుకొనుచున్న సుఖవంతమైన నిద్రపట్టును . 


     పైన చెప్పిన యోగముతో పాటు రాత్రి సమయములో ఆహారం తీసుకొనిన అర్థగంట తరువాత అశ్వగంధ చూర్ణమును ఒక స్పూన్ మోతాదులో ( 3 గ్రా ) గోరువెచ్చని పాలతో కలిపి తీసుకొనుచున్న త్వరగా నిద్రపట్టును . 


          మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

శంకరులవారి ఖండనమంతా మీమాంసమీద

 శంకరులవారి ఖండనమంతా మీమాంసమీద, సాంఖ్యం మీద, బౌద్ధంమీద కాదు పార్ట్ 1


టోక్యో విశ్వవిద్యాలయంలో భారతీయ వేదాంతాచార్యులుగా ఉద్యోగం చేస్తున్న హజ్మి నకముర అనేవారికి 1960, జాన్యువరి 22 శుక్రవారం రాత్రి కంచి కామకోటి పీఠ జగద్గురువులు చంద్రశేఖర యతీంద్రసరస్వతులవారు 'నంబాల్' గ్రామంలోని తమ విడిదిలో దర్శనం అనుగ్రహించారు. ఆచార్య నకమురతోపాటు టోక్యో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మియమోటో అనే ఫ్రెంచి భాషాచార్యులు కూడా వెంట వచ్చారు.


వారి సమావేశం విడిదిలోగాక విడిగావున్న ఓ కుటీరంలో జరిగింది. డాక్టర్ టి.ఎం.పి. మహదేవన్, ప్రెసిడెన్సీ కళాశాల ప్రిన్సిపాల్ టి. బాలకృష్ణనాయర్, ఆచార్య ఎస్. రామస్వామి అతిథులను కుటీరంలోకి తీసుకువెళ్లారు. పూజానంతరం స్వామివారు పదిన్నర ప్రాంతాల కుటీరంలోనికి వచ్చేసరికి అందరూ భక్తితో లేచినిలబడి సాష్టాంగ ప్రణామం చేశారు. 


స్వామివారందరినీ కూర్చోండని సెలవిచ్చారు. బాలకృష్ణ నాయర్, రామస్వామి ఆ ఇద్దరు అతిథులనూ స్వామివారికి పరిచయం చేశారు. శంకరభగవత్పాదులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యంతోసహా అనేక భారతీయ వేదాంత గ్రంథాలకు నకముర అనువాదాలు చేశారు. శంకరులకు పూర్వమున్న వేదాంతాన్ని గురించి విపులంగా వ్రాశారు. ఫ్రెంచి భాషనుండి శ్రీ రామకృష్ణ పరమహంస జీవితాన్ని, స్వామి వివేకానందుల జీవితాన్ని ఆచార్య మియమోటో జాపనీస్ భాషలోకి అనువదించారు.


సంస్కృత భాషలో నకముర సంభాషణ ప్రారంభించారు. స్వామి వారిని కలుసుకున్నందుకూ వారితో సంభాషిస్తున్నందుకు తాము ధన్యులమన్నారు.


సుప్రసిద్ధులైన గౌడ పాదాచార్యులవారు చేసిన రచనలతోనూ, మాండూక్యకారిక, వాక్యపదీయంవంటి గ్రంథాలతోనూ తనకున్న అభినివేశాన్ని గురించి నకముర చెప్పారు. అలాటి రచనలు చాలా వున్నాయని స్వామివారనగానే వారు బోధాయనుణ్ణీ, అలాటి మరికొందరు ప్రముఖులనూ పేర్కొన్నారు. 


“శంకరులకు పూర్వమున్న వేదాంతాన్ని గురించి సేకరించారు?” అని స్వామివారడిగారు.


“చైనీస్ భాషలోనూ, టిబెటన్ భాషలోనూ ప్రాచీన వేదాంతానికి సంబంధించిన వ్రాతప్రతుల భాగాలు కొన్ని దొరికాయి. దొరికినవన్నీ సేకరించి కాలక్రమంలో అమర్చితే నాలుగు గ్రంథాలయ్యాయి. అవి శంకరాత్పూర్య వేదాంత సమగ్ర చరిత్రను చెప్పగలవని నా విశ్వాసం” అని నకముర చెప్పారు.


"జపాన్ లో సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్నవారు చాలామంది వున్నారు. ప్రత్యేకించి శంకరతత్త్వాన్ని అధ్యయనం చేస్తున్నవారు కూడా చాలామందే వున్నారు. బ్రహ్మసూత్రాలకు శంకరులవారు రచించిన భాష్యాన్ని పూర్తిగా అనువదించాను. అయితే ఇలాటి గ్రంథాలను ప్రచురించటం చాలా కష్టం. నాలాటి విదేశీయునికి ఖండనఖాద్యంలాటి అనంతర గ్రంథాలు అర్థంచేసుకోవటమంటే మాటలుకాదు” అని కూడా అన్నారు.


“నేనొకటి రెండు ప్రశ్నలు తమరిని అడగవచ్చునాండి?” అని జపనీస్ ప్రొఫెసరు స్వామివారినడిగారు. సరే అనిపించుకుని “ఉపాసనకు కచ్చితమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలని యెంతకాలంగానో ఆరాటం. ఈ పదం శంకరభగవత్పాదులవారి గ్రంథాల్లో చాలా చోట్ల కనబడుతుంది. ఉపాసన అంటే ఏదైనా ప్రత్యేకమైన సాధనా? అలాటి సాధన ప్రస్తుతం మీ మఠంలో జరుగుతోందా?” అని ప్రశ్నించారు.


“ధ్యానమేవ ఉపాసనా. ఉపాసనమంటే ధ్యానమే. మనస్సును ఏకాగ్రం చేయటమే తపమ్. మనస్సును కేంద్రీకరించాలంటే ఒకమూర్తి అవసరం. ఉదాహరణకు నీ మనస్సును రెండుచేతుల దేవుడి మీదైనా, ఎనిమిది చేతుల దేవునిమీదైనా కేంద్రీకరించవచ్చు. సత్యం ఒక్కటే. దానికి మార్పుండదు. భగవంతుడు పరమసత్యం కాబట్టి అవ్యయుడు. అంటే ఏ మార్పూ లేనివాడు. కాని ఉపాసన అనేది ఒక ప్రయోజనం కోసం, ఒక లాభం కోసం జరిగేది. రెండు చేతుల దేవుడి మీద మనస్సు లగ్నం చేయటం వల్ల కలిగే ప్రయోజనం వేరు. ఎనిమిది చేతుల దేవుడిమీద మనస్సు లగ్నం చేయటం వల్ల కలిగే ప్రయోజనం వేరు. ఏ దేవుణ్ణి ఎలా ఉపాసిస్తే ఎలాటి ఫలితం కలుగుతుందో శాస్త్రాలు చెప్పాయి. ఉపాసన చెయ్యాలంటే శాస్త్రాలననుసరించక తప్పదు. సత్యాన్ని గ్రహించటానికి - అంటే చరమ గమ్యం చేరుకోటానికి - రకరకాల ఉపాసనలన్ని సోపానాలూ, సాధనాలూ. మనస్సును ఒక శిక్షణలో పెట్టి ఏకాగ్రం చెయ్యటంకోసం శాస్త్రాలు ఈ ఉపాసనమార్గాన్ని నిర్దేశించాయి.” అని స్వామివారు వివరించారు.


మఠంవారు ఉపాసనలేవైనా చేస్తున్నారో లేదో, ఒకవేళ చేస్తుంటే అవి ఏయే ఉపాసనలో తెలుసుకోవాలనుందని నకముర అన్నారు.


“శాస్త్రాలు అనేకవిధాలైన ఉపాసనలను గురించి చెప్పాయి, వాటి నన్నింటిని అంచవలసిన అవసరం లేదు. అన్నిటినీ ఆచరించటం సాధ్యం కాదు కూడా. సాధారణంగా ఒకటి రెండు ఉపాసన పద్దతులు మాత్రం అందరూ అనుసరిస్తారు. పూజాకలాపం నిర్దిష్టకాలంలోనే జరగాలి. ఉపాసన కేవలం వైయక్తికం, సామూహికం కానేకాదు. ఉపాసన పద్ధతి అనేది కుటుంబ సంప్రదాయం మీదో, వ్యక్తి అభిరుచి మీదో, గురువుచేసిన ఉపదేశం మీదో ఆధారపడి వుంటుంది” అన్నారు స్వామివారు.


"అద్వైత వేదాంతాన్ని అర్థం చేసుకోవాలంటే పాశ్చాత్యులైన జిజ్ఞాసువులేం చేయాలో సెలవివ్వండి” అని నకముర అడిగారు. 


స్వామి : వివేకచూడామణి చదవవచ్చు.


వివేకచూడామణి సులభంగా బోధపడుతుందనీ, అది తన్ను చాలా కదిలించిందనీ నకముర అన్నారు.


“వివేకచూడామణి అద్వైతానికి మంచి ప్రవేశిక. 'అపరోక్షానుభూతి' చదవటం తరువాతి మెట్టు. ఈ రెండూ అధ్యయనం చేస్తే అద్వైత వేదాంతాన్ని గురించి ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.”


మాధవాచార్య విద్యారణ్యులవారి గ్రంథాలు పంచదశితోసహా తాను అధ్యయనం చేశానని నకముర చెప్పారు.


ప్రొఫెసర్లను కలుసుకుని మాట్లాడినందుకు తనకు సంతోషంగా వుందనీ, జపనీస్ పండితులను మరికొందరిని కలుసుకోవాలని కుతూహలంగా వుందనీ నకమురకు చెప్పండని స్వామివారు డాక్టర్ మహదేవన్ ని కోరారు.


జగద్గురువులను కలిసి సంభాషించే భాగ్యం కలిగినందుకు మహానందంగా వుందని నకముర అన్నారు.


అద్వైత వేదాంతం అధ్యయనం చెయ్యటానికి భారతదేశంలో దొరుకుతున్న పుస్తకాల మీదికి చర్చ మళ్లింది.


‘సురేశ్వరాచార్యులవారి వార్తికం మరీ విస్తృతంగా వుంది' అన్నారు నకముర. “బృహదారణ్యకోపనిషతునూ, దాని శంకరభాష్యాన్ని చదువుతూ అప్పుడప్పుడూ సందేహనివృత్తికోసమో. అర్థ వివరణకోసమో వార్తికం చూడటం అలవాటు. ఇంచుమించు రెండు శతాబ్దాల క్రితం ధర్మరాజుల వారు వేదాంత పరిభాష వ్రాసేవరకూ సదానందులవారి ‘వేదాంతసారమే' అద్వైత వేదాంతం చదవటానికి ఆధారగ్రంథంగా ఉపయోగపడేది. 'వేదాంత పరిభాష' వచ్చాక - వేదాంతసారాన్ని అధ్యయనం చేయటం మానేశారు. వివరణం అవసరమయినప్పుడు మాత్రమే దాన్ని చూస్తారు” అన్నారు స్వామివారు.


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కాశీలో 9 రోజులు ఉండాలి

 ఓం నమః శివాయ 


నవ_దిన_కాశీ_యాత్ర


కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి


మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలు ఉంటాడు. జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే.. అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి, అ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు..


అయితే కలికాలం లో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు.. దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు. అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశి లో తొమ్మిది రోజులుండి వస్తున్నారు


మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి


విశ్వేశ్వర నామ స్మరణ,

దానాలు చేయటం,

ధర్మ ప్రసంగాలు వినటం,

ఏక భుక్తం,

ప్రాతఃకాల స్నానం,

ఉదయం, రాత్రి విశ్వేశ్వర దర్శనం,

కోపం లేకుండా ఉండటం,

అబద్ధమాడకుండా ఉండటం,

అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి


మొదటి రోజు కార్యక్రమం


ఆగత్య మణి కర్న్యామ్తు –

స్నాత్వా దత్పధనంబహు –

వపనం కారయిత్వాతు –

స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః

సచేల మభి మజద్యా ధ–

కృతా సంధ్యాధిక క్రియాహ్

సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –

కుశ గంధ తిలొదకైహ్’’


మొదటిగా మనసులో ముప్పది మూడు కోట్ల దేవతలు, తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న... శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్ఞ ! అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి. దీనినే చక్ర తీర్ధం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే . అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు.. 

విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణికర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు.


యాత్రీకులు మణికర్ణిక లో స్నానం చేయాలి. బ్రాహ్మణులకు దానాలు చేయాలి..

కేశఖండనం చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి..

మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి..

రుద్రాక్ష మాల ధరించి ఈ కింది శ్లోకం చదువు కోవాలి.


’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం – మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః

అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి చరా చరేషు సర్వేషు- యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే – మణి కర్నీజతే మలే.. 

ఆ గంగా కేశవస్చైవ –

ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –

ఆ మద్ధ్యా ద్దేవ సరితః 

స్వర్ద్వారా న్మణికర్ణికా 

నమస్తే నమస్తే నమః‘’


అని నమస్కరించి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను ,

21 కుడుములను సమర్పించి , 21 సార్లు గుంజీలు తీసి 21 రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.


దున్దీ రాజ గణేశాన –

మహా విఘ్నౌఘనాశన –

నవాఖ్యాదిన యాత్రార్ధం –

దేహ్యాజ్ఞానం కృపయా విభో’’

అని ప్రార్ధించాలి . తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి. ఆ తర్వాతా విశాలాక్షి , జ్ఞానవాపి, సాక్షి గణపతులను చూడాలి..

ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి..

ఫలాలు, పాలు ఆహారంగా గ్రహించాలి.


 ‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –

మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’

అంటూ పదకొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి.


రెండవ రోజు కార్యక్రమం


రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర , అన్నపూర్ణా దర్శనం చేయాలి.

మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా 

ఘట్టం లో స్నానం చేయాలి. తీర్ధ శ్రాద్ధం చేయాలి. వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి.. గురు ఉపదేశం తో ....

‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః ‘’ అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి. మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి. రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి 


 మూడవ రోజు కార్యక్రమం


తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి.. తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరు కూడా ఉంది.. ఇక్కడ స్నానం చేసి శీతలా దేవిని దర్శించాలి .

వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి. పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి. 

కిరణ దూత పాపాచ – పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునా చైవ –

పంచ నద్యోత్ర కీర్తితః ‘’

అని స్మరిస్తూ స్నానం చేయాలి .


తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణి కర్నేశుని, సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి.. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు , పండ్లు మాత్రమె స్వీకరించాలి .


 నాల్గవ రోజు కార్యక్రమం


ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన కాల భైరవుని పూజించాలి..


కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి..‘’ఓం కాశ్యై నమః ‘’అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి.. గుహను, భవానీ దేవిని దర్శించాలి. ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి భోజనం చేయాలి. రాత్రి నామ స్మరణ పాలు,పండ్లు ఆహారం... అంటే ఈ రోజు పది దర్శనాలన్న మాట.


 అయిదవ రోజు కార్యక్రమం


ప్రాతఃకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి.. తర్వాతా తిలా భాన్దేశ్వర , చింతామణి గణపతిని సందర్శనం చేయాలి.. దుర్గా దేవిని చూసి ఒడి బియ్యం దక్షిణా సమర్పించి గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి.. ఈమెనే కౌడీబాయి అంటారు..

అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి, భోజనం చేసి రాత్రి పాలు, పండ్లు తీసుకోవాలి.


 ఆరవ రోజు కార్యక్రమం


సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది, వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి, బేసి సంఖ్యలో జనానికి వాయన దానాన్ని చేయాలి..

వ్యాస కాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని,

శ్రీ శుకులను దర్శించి.., కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి.. తర్వాత భోజనం చేయాలి.. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు, పండ్లను స్వీకరించాలి.


ఏడవ రోజు కార్యక్రమం


గంగాస్నానం, నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే నూట ఎనిమిది తో సరి పెట్టుకోవాలి. ఇరవై ఒక్క ఉండ్రాళ్ళను, నూట ఎనిమిది యెర్ర పూలతో పూజించాలి.. ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువు లకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి..


డుండి వినాయకుడిని అర్చించి , అన్నపూర్ణా ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడిబియ్యం , గాజులు సమర్పించాలి... ఇలాగే విశాలాక్షి కీ చేయాలి . విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన.., సహస్ర బిల్వార్చన ,

హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి. హర సాంబ హర సాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి.


ఎనిమిదో రోజు కార్యక్రమం


గంగాస్నానం, నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు, పాయసం నివేదించాలి. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి.. అయిదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.

దక్షిణా తాంబూలం సమర్పించాలి... భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ 

నిద్ర పోవాలి.


తొమ్మిదో రోజు కార్యక్రమం


గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణా దేవిని దర్శించి, పూజించి,

నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి.. జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణ లివ్వాలి.. ఆశీస్సులు పొందాలి..

రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్ర పోవాలి 


పదవ రోజు కార్యక్రమం


నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్ర నామ పూజ చేసి, అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను, గురు దంపతులను పూజించాలి.. అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి.


ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.


ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః🕉️🚩🕉️

అద్భుత భావనలు

అద్భుత భావనలు 

మనం చూస్తూవున్న చరా చర జగత్తు ఒక అద్భుతం. ప్రతిది మనకు భగవంతుని అపురూప కల్పనగానే గోచరిస్తుంది. ఎక్కడ చూసినా అది ఒక క్రొత్తదానిలా, దానిని మలచిన భగవంతుడు ఒక అద్భుతం. భక్తులు తమ భక్తి పారవశ్యంలో భగవంతుని లీలలను అద్భుతంగ పేర్కొంటారు

శ్రీ ఆది శంకర భగవత్పాదులవారు ఒక శ్లోకంలో అమ్మ భవాని మాత అని నేను నా కష్టాలను మొరపెట్టుకొని నన్ను కావమని ప్రార్ధిస్తే నీవు నా బాధలను ఏవి పట్టించుకోకుండా కేవలం నిన్ను "భావాని" అని పిలిచినదాని మాత్రమే తీసుకొని పదానికి "నేనే నీవు" అనే అర్ధాన్ని గ్రహించి నాకు మోక్షాన్ని సీటున్నావా తల్లి అని వేడుకొంటారు. నిజానికి నేను నిన్ను "భావాని" అన్న నా భావన భావుడైన పరమశివుని పత్నివి అని కానీ నీవు వేరే అర్ధం చేసుకొని నేను అడగకుండానే మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు తల్లి నీవు యెంత గొప్పదాఅనివి అమ్మా అని ఆర్తితో స్పరిస్తారు

ఇంకొక ఉదంతం. ఒక పరమ భక్తుడు ఇలా అంటున్నాడు. పరమేశ్వరా నేను నిన్ను గత జన్మలో భజించలేదుఅంతే కాదు నేను భవిష్యత్తులో కూడా స్మరించను అని అంటున్నాడు అయన భావన ఏమిటో చుడండి

నేను గత జన్మలో నేను స్మరించలేదు కాబట్టి నాకు జన్మను ఇచ్చావు. జన్మలో సదా నేను నిన్ను భజిస్తూ వున్నాను కాబట్టి నా మోర ఆలకించి నాకు కైవల్యాన్ని ప్రసాదిస్తావు. జన్మ రాహిత్యాన్ని పొందిన నేను మరల జ్నామించటమే ఉండదు అటువంటప్పుడు నేను భవిష్యత్తులో నిన్ను ఎలా  స్మరిస్తాను. అని ప్రమేశ్వరుణ్నే ప్రశ్నిస్తున్నాడు భక్తుడు

ఎప్పుడయితే భగవంతునితో భక్తుడు సదా సంబంధం కలిగి నిరంతర ఉపాసన చేస్తూవుంటాడో అప్పుడు మాత్రమే భక్తులకు భగవంతుని మీద అనన్యమైన ప్రేమ, సఖ్యత కలుగుతాయి. అప్పుడు వారు ఇలా భగవంతునితో మాట్లాడ గలుగుతారు

భక్తుడు వేరు, భగవంతుడు వేరు అనే భావన ఉన్నంత వరకే ద్వేత భావన ఉంటుంది. త్వమేవాహం అనే భావం భక్తుని మదిలో కలగటమే మోక్షానికి కారణం

భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే భక్తుడు, భగవంతుడు ఒక్కటే అనే భావం కలగాలి అది కలిగితె అదే మోక్షం అంతకంటే వేరొకటి కాదు.

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ