9, జనవరి 2025, గురువారం

వయసు పెరిగితే

 వయసు పెరిగితే మనకేమీ కొత్తగా కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.


”చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి.


చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు.


అప్పడు చలం…  “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ?” అన్నారు.     ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో  కొంత విజయం సాధించాలి.


వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం మనకు అబ్బడంలేదు.


ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ?


మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా.


కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా   ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు….            శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి.


మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ.


ఏం వదిలివేయాలో చూద్దాం.


”అమ్మాయీ గ్యాసు కట్టేసావా....

గీజర్ ఆఫ్ చేసావా...

ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది..

పాలు ఫ్రిజ్ లో పెట్టావా....

...లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం.


”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు

వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..

కష్టనష్టాలు కూడా వాళ్ళవే.


ఎవరితో ఏపనీ చేయించుకోకుండా  ప్రతీపనీ మన పనే అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా..


నా అభిప్రాయం ఏమిటంటే…  అని అనటం తగ్గించి.. నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ.


నాకూ తెలుసు తో పాటు. నాకు మాత్రమే తెలుసు అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ  నాకంటే ఎక్కువ తెలుసు  కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు.


మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి.


పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు.  ఆరోగ్యం బాగుంది కదా అని దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, షుగర్ కీళ్ళనొప్పులు, నిద్ర పట్టకపోవటం. నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. బాబోయ్.. ఎందుకు అడిగామా  అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.


కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం.


పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను.


అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ...జిహ్వచాపల్యం  తగ్గించుకుని.అన్నింటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించటంలేదు అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి...


భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.


ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.


హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి.


రోజూ అనుకుందాం ఇలా...

I love my self.

I respect my self.

మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది.


మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా...


మనం దిగుతుంటే వారి ముఖాల్లో హమ్మయ్య. అనే  భావం కనిపించాలో...లేక అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా.. అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది.


🌸🌸🌸🙏

శిష్యుడు_ఎలా_ఉండాలి

 #శిష్యుడు_ఎలా_ఉండాలి..?


#గురువు_ఎప్పుడూ_పరమ_ప్రేమ_స్వరూపమే. అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ #శిష్యుని_అభ్యున్నతిని_కోరుతాడు_గురువు. అందులోనూ సందేహం లేదు..


అయితే #గురువు_ప్రసరించే_ప్రేమ_శక్తిని_అందుకునే_స్థాయి_శిష్యునికి&వుండాలి. అదెలా వస్తుంది..?


#గురువు మాత్రమే #తనను_ఉద్ధరించ_గలడు_అనే_పరిపూర్ణ_విశ్వాసాన్ని_కలిగి_వుండటమే_ఆ_స్థాయిని_అందిస్తుంది.


కానీ మనం ఏమి చేస్తున్నాం..?


ఏదో ఒక #సమస్య_పరిష్కారానికి_గురువును_ఆశ్రయంచి_ఉంటున్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు. తీరకపోతే మరో గురువు..


ఇలా కొట్టుకు పోతున్నాం.

గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో వుందని నువ్వు మనసా, వాచా, కర్మణా నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.

సేవాభావం వల్లనూ మరియూ సర్వస్వ శరణాగతి వల్లనూ గురువు ప్రసన్నుడు అవుతాడు..


కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు.


నమ్మకం అచంచలంగా వుందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి..


గురువు మార్గాన్ని చూపిస్తాడు ఆ మార్గంలో నడవటం నీ పని. #గురువు_జ్ఞానాన్ని_అందిస్తాడు… #ఆ_జ్ఞానాన్ని_జీవితంలో_భాగం_చేసుకోవటం_నీ_పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు… ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని. 

గురువు దగ్గరకి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కనపెట్టి వెళ్ళాలి. #గురువుతో_వాదన_పనికిరాదు.


#గురువు_చెప్పే_మాటలను_చెవులతో_కాదు_మనసుతో_వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని, ఇతర చింతనలు లేకుండా నమ్మాలి...


#గురువుకు_నిన్ను_నువ్వు_సమర్పించుకోవడం_అంటే_నీ_హృదయాన్ని_పూర్తిగా_తెరచి_సమర్పించాలి. గురువు #ఉపదేశాన్ని_వినేటప్పుడు_నోరు_మూసుకొని_వినాలి. ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు.


నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు అనుక్షణమూ నీకు అక్షరాభ్యాసమే

నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో వుండవచ్చు. కానీ #గురువు_ముందు_నువ్వు_కేవలం_ఒక_సేవకుడివే..


నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు. కానీ #గురువు_ముందు_పరమ_అజ్ఞానివే.


నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యత గా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనం గా మిగులుతుంది.

నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు

ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకో గలిగితే గురువు నీ వాడు అవుతాడు. 

🙏🙏🙏🙏

విష్ణు సహస్రనామ స్తోత్రము* *రోజూ ఒక శ్లోకం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (14)*


*సర్వగః సర్వ విద్భానుః*

*విష్వక్సేనో జనార్దనః ।*


*వేదో వేదవిదవ్యంగో*

*వేదాంగో వేదవిత్కవిః ॥*


*ప్రతి పదార్థం:~*


*124) సర్వగః - సర్వత్ర వ్యాపించియున్నవాడు, అన్ని చోట్లా ప్రవేశించు వాడు;*


*125) సర్వవిత్ - సర్వము తెలిసినవాడు.*


 *సర్వవిద్భానుః --- (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) సర్వము తెలిసి, అవిరామముగ, అవికారముగ ప్రకాశించేవాడు.*


*126) భానుః - ప్రకాశించువాడు.*


*127) విష్వక్సేనః - విశ్వాన్ని రక్షించేందుకు సైన్యాధిపతిగా వ్యవహరించే వాడు, అసురుల సేనలను నిర్జించినవాడు.*


*128) జనార్దనః - దుష్ట శక్తుల బారినుండి సజ్జనులను రక్షించువాడు;*


*129) వేదః - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు, వేదమూర్తి.*


*130) వేదవిత్ - వేదములను సంపూర్ణముగా నెరిగినవాడు;*


*131) అవ్యంగః - ఏ‌ కొరతయు, ఏ లోపము లేనివాడు.*


*132) వేదాఞ్గః - వేదములనే శరీరఅంగములుగా కలిగినవాడు.*


*133) వేదవిత్ - వేదపరమైన ధర్మమునెరిగినవాడు.*


*134) కవిః -సర్వద్రష్ట యైనవాడు, సూక్ష్మ దృష్టి కలిగిన వాడు; అన్నింటినీ చూచువాడు.*


*భావం:~*


*సర్వత్ర వ్యాపించియున్నవాడును, సర్వము తెలిసినవాడును, అసురుల సేనలను నిర్జించిన వాడును, దుష్ట శక్తుల బారినుండి సజ్జనులను రక్షించువాడు; మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడును, వేదములను సంపూర్ణముగా నెరిగినవాడును, పంచేంద్రియాలకు అతీతుడును, వేదాలను శరీర భాగాలుగా కలిగి ఉన్నవాడును, వేదపరమైన ధర్మమునెరిగినవాడును, సర్వమును చూసేవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకం కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: రోహిణి 2వ పాదం జాతకులు పై 14వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*. *విరచిత* *భజగోవిందం (మోహముద్గరః)*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం (14)*


*జటిలో ముండీ లుంఛితకేశః*

*కాషాయాంబరబహుకృతవేషః|*


*పశ్యన్నపి చన పశ్యతి మూఢో*

*ఉదరనిమిత్తం బహుకృతవేషః||*


*శ్లోకం అర్ధం :-*


*జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉదరపోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నియు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.*


*వివరణ:-*


*వేష బాషలు, భక్తి, జ్ఞానములకు కొలమానములు కావు. బోడి తల చేసుకొని, నామములు పెట్టుకొని, కాషాయ వస్త్రములు ధరించిన మాత్రమున అజ్ఞాని జ్ఞాని కాడు. బాహ్య వేషములు మోసమునకే కాని, మోక్షము సాధించుటకు పనికిరావు.*


*జ్ఞానమునకు చిహ్నములు ఇంద్రియ నిగ్రహము, శాంతము, ప్రేమ, దయ, మనోస్థిరత మొదలగునవి. వల్లె వేసిన వేద మంత్రములు పఠించుచుండి, మనసు భగవంతునిపై లగ్నము కానప్పుడు ఆ పూజలు నిరర్ధకము. పరమార్ధము తెలుసుకొనలేని వ్యక్తి ఏ వేషము వేసినను వ్యర్ధమే. జ్ఞాని మనో వాక్కాయ కర్మలు భగవంతునిపై లగ్నము చేయును. అట్టి మహోన్నతుడు సహనము, ప్రేమ, దయ వంటి ఉత్తమ గుణ సంపన్నుడై ఉండును.  సాటి వారిపై తను అతి కరుణతో ప్రవర్తించును. కోపగించుట, పరులను నిష్కారణముగా దూషించుట, అవమానించుట అనునవి రాక్షస గుణములు. అట్టి అవగుణములకు సత్పురుషులు దూరముగా ఉందురు. అప్పుడు వారిని దైవాంశ సంభూతులుగా మనము గౌరవించెదము.*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

*శ్రీ విష్ణు స్త్రోత్రం*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

           *శ్రీ విష్ణు స్త్రోత్రం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*గరుడ గమన తవ చరణకమలమిహ*

*మనసిల సతు మమ నిత్యం*


*మమతాపమపా కురు దేవ*

*మమపాపమపా కురు దేవ ।*


*తాత్పర్యం:~*


*గరుత్మంతుని అధిరోహించి, లోకములన్నీ సంచరించే ఓ శ్రీహరీ ! నీ పాదపద్మాలు ఎల్లప్పుడూ నా మనసులో వెలసి ప్రకాశించే వరాన్ని ప్రసాదించు ! ప్రపంచ విషయాలయందు నాకున్న తాపత్రయాన్ని, ఈ జన్మలో కౌమార, యౌవన, వార్థక్యాలలో తెలిసి గానీ, తెలియక గానీ నేను చేసిన పాపాల్ని హరింపజేయుము దేవ.*


(1)

*జలజనయన విధి నముచి హరణముఖ*

*విబుధ వినుత పదపద్మ*

*మమతాపమపా కురు దేవ*

*మమపాపమపా కురు దేవ।*


*తాత్పర్యం:~*


*బ్రహ్మ, నముచి అనే రాక్షసుడిని సంహరించిన ఇంద్రుడు మొదలైన దేవతలచే కొలువబడే పద్మములవంటి కన్నులు కలగిన ఓ శ్రీహరీ ! నా పాపాలు, తాపములు పోగొట్టుము దేవ౹*


(2)

*భుజగశయన భవ మదనజనక మమ*

*జనన మరణ భయహారీ*

*మమతాపమపా కురు దేవ*

*మమపాపమపా కురు దేవ।*


*తాత్పర్యం:~*


*శేషతల్పంపై శయనించే సర్వాంతర్యామి, మన్మథుని జనకుడవైన ఓ శ్రీహరీ ! నాకున్న జనన, మరణ భయాలను హరింపజేయుము దేవ।*


(3)

*శంఖచక్రధర దుష్టదైత్యహర*

*సర్వలోక శరణ*

*మమతాపమపా కురు దేవ*

*మమపాపమపా కురు దేవ।*


*తాత్పర్యం:~*


*శంఖ చక్రాలను ధరించి, దుష్టులైన రాక్షసులను సంహరించి అన్ని లోకములకు ఆశ్రయమైన  ఓ శ్రీహరీ ! నా పాపాలు, తాపములు పోగొట్టుము దేవ ।*


(4)

*అగణిత గుణగణ అశరణ శరణద*

*విదళిత సురరిపు జాల*

*మమతాపమపా కురు దేవ*

*మమపాపమపా కురు దేవ।*


*తాత్పర్యం:~*


*లెక్కింపజాలని సుగుణాల సముదాయము కలిగి, దేవతలకు శత్రువులైన రాక్షసులను చీల్చి చెండాడి సంహరించి, దిక్కుతోచని దీనులకు ఆశ్రయమై నిలచే ఓ శ్రీహరీ! నా పాపాలు, తాపములు పోగొట్టుము దేవ।*


(5)

*భక్తవర్యమిహ భూరికరుణయా*

*పాహి భారతీ తీర్థం ।*

*మమతాపమపా కురు దేవ*

*మమపాపమపా కురు దేవ।*


*తాత్పర్యం:~*


*భక్తవర్యుడనైన భారతీ తీర్థ నామధేయుడనైన నన్ను మిక్కిలి దయతో రక్షించి, నా పాపాలు, తాపములు పోగొట్టుము దేవ ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*గరుడ గమన స్తోత్రాన్ని పఠిస్తే అంతే శుభమే జరుగుతుంది. ఈ స్తోత్రాన్ని శృంగేరి మఠ పీఠాధిపతులు అయిన శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామిజి రచించారు. స్వామి భారతి తీర్థ స్వాముల వారు గొప్ప పండితులు మరియు విద్వాంసులు. ఆయన శ్రీ మహావిష్ణువును కీర్తించడానికి ఈ స్తోత్రాన్ని రచించడం జరిగింది.*


*ఈ "గరుడ గమన తవ" శ్లోకాన్ని వింటుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది.మనసులో మరియు మెదడు లో ఉన్న చెడు ఆలోచనలు, ఉద్రికతలు, బాధలు అన్ని మరచిపోతాం.ఈ స్తోత్రానికి   ఉన్న మహిమ మరియు మహత్యం అలాంటిది. ఎలాంటి మనిషి ఐన మాములు స్థితికి తెచ్చే శక్తి ఈ స్తోత్రానికి  ఉంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. బాధలతో సతమతం అవుతున్న వారు, మనశ్శాంతి లేకుండా ఉన్న వారు, నిర్మలమైన మనసుతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే వారి మనసులో ఉన్న బాధలు అన్ని తొలగిపోయి మనః శాంతి లభిస్తుంది.*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

శ్రీమద్ భాగవతం* *(15వ రోజు)*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(15వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️  

*హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుల పుట్టుక*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘నీ మనోభీష్టం తప్పకుండా నెరవేరుస్తాను. అయితే ఇది మూడు సంధ్యలూ ముడిపడే వేళ. ఇది భయంకరులకు కూడా మహా భయంకరమయిన సమయం. రుద్రుడు భూతగణాలతో సంచరించే సమయం. ఈ సమయంలో సంగమించకూడదు. ఓ ఘడియసేపాగు. తర్వాత నీ కోరిక తీరుస్తాను.’’*


*వినలేదు దితి. మన్మథోద్రేకాన్ని తట్టుకోలేకపోయింది. ఒళ్ళు విరుచుకోసాగింది. కామం కళ్ళు కప్పడంతో కశ్యపుని గట్టిగా కౌగిలించుకుంది. విడిపించుకోజూసిన కశ్యపుణ్ణి కదలనీయక, అధరామృతాన్ని అందించింది.*


*‘అంతా దైవప్రేరణ. తప్పదిక.’ అనుకున్నాడు కశ్యపుడు. నిష్ఠని వదలి వేశాడు. దితిని ముద్దిడితూ తీసుకుని వెళ్ళి ఆమె కోరికను తీర్చాడు. తర్వాత నదికి చేరుకుని స్నానం చేసి శుచి అయినాడు. సంధ్యావందనాదులు పూర్తి చేశాడు. మౌనం దాల్చి, బ్రహ్మోపాసన చేయసాగాడు.కోరిక తీరడంతో శరీరం చల్లబడి, తాను చేసిన తప్పేమిటో గ్రహించింది దితి. చేసిన తప్పుకి సిగ్గుపడింది. ఎంతగానో బాధపడింది. భర్తని సమీపించి మన్నించమని వేడుకుంది.‘‘నాథా! నువ్వు చెబుతూనే ఉన్నావు, వినలేదు. పాపాన్ని చేశాను. రుద్రుడికి కోపం కలిగించానేమో! నా గర్భస్థ శిశివుని హింసిస్తాడేమో! దేవతలు ఏ అపకారాన్ని తలపెడతారో! నువ్వే నాకు దిక్కు.’’ అంది దితి.*


*మౌనాన్ని వీడాడు కశ్యపుడు. ఇలా అన్నాడప్పుడు.‘ ‘జరిగిందంతా విధికృతం. దీనిని తప్పించడం ఎవరితరమూ కాదు. అసురసంధ్య వేళ నన్ను కోరావు కనుక నీకందరూ రాక్షసులే జన్మిస్తారు. నీ కొడుకులిద్దరు మహారాక్షసులై లోక కంటకులవుతారు. దేవతలనూ, మునులనూ హింసించి, ముల్లోకాలనూ ఆక్రమించుకుంటారు. ఆఖరికి ఆ శ్రీహరి చేతిలో మరణిస్తారు.’’ దితి అందుకు చాలా దుఃఖించింది.*


*అయితే కొడుకులిద్దరూ భగవంతుని చేతిలో మరణిస్తారని తెలిసినందుకు కొంతలో కొంత మేలనుకుంది. ‘‘నా కడుపున పుట్టిన బిడ్డలంతా రాక్షసులై లోకకంటకులై నానా అల్లరీ చేసి నాకు అమర్యాద కలిగించడమేనా? అంతేనా నా బతుకు? గొప్పవాడు ఒక్కడు కూడా పుట్టే అవకాశమే లేదా?’’  కన్నీరు మున్నీరయింది దితి.* 


*‘‘కొడుకుగా పుట్టే అవకాశం లేదు. గొప్పవాడు నీకు మనవడుగా పుడతాడు. రాక్షసుని కడుపున పుట్టినా అతగాడు గొప్ప హరిభక్తుడై పరమ భాగవతోత్తముడు అవుతాడు. సచ్చరిత్రుడై నీకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు కలిగిస్తాడు. వాడి కీర్తిని సమస్తలోకాలూ గానం చేస్తాయి. చాలా?’’* 


*"చాలు’’ అంది దితి. చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయిందక్కణ్ణుంచి. గర్భవతి అయింది. నూరు సంవత్సరాలు గడిచాయి. అప్పుడామె గర్భంలో ఉన్న తేజస్సు దిక్కులన్నిటా అలుముకుంది. ఆ తేజస్సు ముందు సూర్యచంద్రులు వెలవెలబోయారు. ఏది పగలో ఏది రాత్రో తెలియని స్థితి. మునులకీ, దేవతలకీ అంతు చిక్కలేదేదీ.*


*బ్రహ్మని సమీపించారంతా. నమస్కరించారు. ‘‘ఏమిటి దేవా, ఏమిటిదంతా?’’ అడిగారు. ‘‘ఇదంతా దితి మహిమ. దీనంతటికీ దితి గర్భమే కారణం.’’ అన్నాడు బ్రహ్మ.*


*తర్వాత జయవిజయులిద్దరూ శాపవశాన ఆమె గర్భాన రాక్షసులుగా జన్మించనున్నారని తెలియజేశాడు.*


*భయపడిన మునులనూ, దేవతలనూ చూసి ఇలా చెప్పాడు.‘‘ఆ రాక్షసులిద్దరినీ శ్రీహరి సంహరిస్తాడు. లోకాల్ని కాపాడుతాడు. ’’*


*మునులూ, దేవతలూ అందుకు సంతోషించారు. నిష్క్రమించారక్కణ్ణుంచి.*


*నూరేళ్ళూనిండుకున్నాయి. దితికి ఇద్దరు కొడుకులు పుట్టారు. వారు పుట్టినప్పుడు ఇటు భూమి మీద, అటు అంతరిక్షంలో కూడా అనేక మహోత్పాతాలు సంభవించాయి. దిక్కులన్నీ మండిపోయాయి. చుక్కలు రాలిపోయాయి. పెనువేగంతో గాలి వీచింది. చెట్లు కూలిపోయాయి. పిడుగులు పడ్డాయి. తోకచుక్కలు పుట్టుకొచ్చాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. రక్తవర్షం కురిసింది. కుక్కులూ, నక్కలూ, గుడ్లగూబలూ భయంకరంగా అరవసాగాయి. ఆలయాల్లో దేవతాప్రతిమలన్నీ కన్నీరు పెట్టుకున్నాయి. ఆవుల పొదుగుల నుండి పాలు రాలేదు, పిండకనే రక్తం కారసాగింది. గ్రహాలన్నీ వక్రగతిలో తిరగసాగాయి. ఒకదాన్నొకటి డీకొన్నాయి. ఈ మహోత్పాతాలను గమనించి, మునులూ, దేవతలూ భయకంపితులయినారు. ఆందోళన చెందసాగారు.*


*కఠినంగా కర్కశంగా కనిపిస్తున్న కొడుకుల్ని చూశాడు కశ్యపుడు. పెద్దవాడికి హిరణ్యకశిపుడు అనీ, చిన్నవాడికి హిరణ్యాక్షుడు అనీ నామకరణం చేశాడు. వజ్రదేహులయిన ఆ ఇద్దరూ దినదిన ప్రవర్థమానమై పర్వతాకారులయినారు. వారు నడుస్తుంటే భూమి బద్దలయ్యేది. ఆకాశం అదిరిపడేది. వరప్రసాదులై, మదోన్మత్తులయిన ఆ ఇద్దరూ లోకాలను చీకాకు పరచసాగారు. దేవతలనూ, మునులనూ బాధించసాగారు. అజేయులయిన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను అష్ట దిక్పాలకులు కూడా అదలించ లేకపోయారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

ఉత్తరద్వార దర్శనం!*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀```ముక్కోటి ఏకాదశి రోజున…```



         *ఉత్తరద్వార దర్శనం!*

                 ➖➖➖✍️




```

ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?


అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తర దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.


ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️

తిరుప్పావై 25వ పాశురం*

 🔱ఓం నమః శివాయ🔱:

*తిరుప్పావై 25వ పాశురం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*25.పాశురం*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


        *ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్*

        *ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వళర,*

        *తరిక్కిలానాగిత్తాన్ తీజ్ఞనినైన్ద*

        *కరుతై ప్పిళ్ళైత్తు కఞ్ఙన్ వయిత్తిల్*

        *నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై*

        *ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుతియాకిల్ యామ్పాడి*

        *వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్!!*



*భావం*

*ॐॐॐॐॐॐॐॐॐॐॐ*


భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి, కట్టను - కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా !



అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి, వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపినా ఆశ్రిత వ్యామోహము కలవాడా ! నిన్నే కోరి వచ్చినారము. 'పఱ' అను వాద్యమును ఇచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. 



ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా.



గూఢచారుల వలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి అతని గర్భమున   చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము.



 మాకు యిష్టార్దమైన 'పఱ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్ధిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము సుఖింతుము . నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును.



*అవతారిక*


*ॐॐॐॐॐॐॐॐॐॐॐ*


గోపికలు ఈ పాశురములో శ్రీకృష్ణుని జన్మరహస్యమును కీర్తించుచు దానివలన తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్పుచున్నారు.



కృష్ణుడు అవతరించిన తీరును, పెరిగిన తీరును తలచుకొని ఆ వాత్సల్యమునకు ముగ్ధులై ఆళ్వార్లు మూర్ఛనొందిరి. అట్లే గోపికలు వెనుకటి లీలలన్నిటికంటే చివరగా శ్రీకృష్ణ జనన ప్రకారము అనుభవించి పరవశలగుచున్నారు. 

గోపికలది జ్ఞానముతో కూడిన ప్రేమకాని కేవల వ్యామోహము కాదు.



 భగవత్తత్వముగా ఎరింగి ఆ పరతత్వము మనకై సులభముగా దిగివచ్చి, నాలుగు అడుగులు నడచి వచ్చిన మనలను చూచి శ్రమ అయినదని జాలి పడుచున్నాడే ? మనకై అతడు పడిన శ్రమలో మనము ఆతనిని పొందుటకై పడెడి శ్రమ ఎన్నవ వంతు ? అని అతని జన్మ ప్రకారము అనుసంధించుచున్నారు. 



'మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!' అని అండాళ్ తల్లి స్వామి ఆయా . అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది.



తన సఖులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైన స్వామి 'మీకేమి కావలయున 'నిన; మాకేవైన ప్రతిబంధకములున్న వానినెల్ల నీవే పోగొట్టి. మాలోని, అన్యకామనలేమైనయున్న వాటిని 'నశింపచేసి' మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన అండాళ్ తల్లి యీ (పాశురంలో) అర్ధించుచున్నది.



*బిలహరి రాగము _ ఝుంపెతాళము*

    


    ప ...    పురషార్ద మర్దింప వచ్చినారము స్వామి 

        పురుషార్దమిడి మా మనోరథ మీడేర్పుమా!


    అ...ప...    వరలక్ష్మి యాశించు పరమ సంపదనేల్ల

         కీర్తించి దుఃఖమ్ము బోవ సుఖియింతుము


    చ...    దేవకికి పుత్రునిగ అవతరించిన రాత్రి 

        దేవి యశోధకును వరసుతుడవై పేరుగ

        తా విన్న కంసుడట కీడు దులపగ నెంచ 

        నీవె కంసుని గర్భ మగ్నివలె వ్యాపించి

        ఆ యత్నమంతము వమ్ముజేసిన స్వామి 

        పురుపార్దమర్దింప వచ్చినారము స్వామి 

        పురుషార్ధామిడి మా మనోరథ మీడేర్పుమా!



*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*శ్రీ కృష్ణావతార రహస్యం*

*ఆండాళ్ తిరువడిగలే శరణం*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ఆండాళ్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది, అర్చామూర్తినే పొందింది. ఎవరినో చూపించలా, తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావై ని మనం విశ్వసించాలి. భగవంతుడు మనకోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి, ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కల్గించి చేసే ఉపకారం.



 ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతక గల్గితే మనం ఉన్నచోట భగవంతుణ్ణి సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా, ఇక సృర్తినిచ్చేవిగా ఉండగల్గుతాయి. గోదా దేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది.


ఈ రోజు మనవాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి వీరిని మీరేదొ కోరి వచ్చారుకదా, అదేదో చెప్పండి అని అడిగాడు. వీళ్ళు మేం ఏదికోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు.



అబ్బెబ్బే నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు. అబద్దాలు ఆడకు, నీవెవరో, ఎందుకిక్కడికి వచ్చావో, ఎట్లావచ్చావో, ఎక్కడినుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది సుమా అని చెప్పారు.



అట్లా తెలుసుకొని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి, చివర ఒక మాట చెప్పాడు.


*వీత రాగ భయ క్రోదాః మన్మయా మా ఉపాస్రితాః*

*వహ వహ జ్ఞాన తపసాః పూతాః మద్భావ మాగతాః*


రాగం, భయం, క్రోదాలు మనం భగవంతుణ్ణి విడదీస్తే ఏర్పడుతాయి. భగవంతుణ్ణి గుర్తిస్తే రాగం వాడిపై ఉంటుంది. ఇక భయం, మనకు రాగం కల్గినది దూరం అయితే మనలో కలిగే మానసిక కదలిక భయం అంటాం. మరి మనకు రాగం వాడిపై ఉన్నప్పుడు ఇక వాడి ఉపస్థితి అంతటా ఉండేప్పుడు మనం దేన్నుంచి దూరం అవుతాం కనుక. 



అది ఎప్పుడూ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్నేలేదు కదా. నీవు ఎదోక దానియందు పెంచుకున్న రాగం దూరం అవుతుంటే, దాన్ని దూరం చేసే దానియందు నీ మనస్సులో ఏర్పడే స్పందన క్రోదం అంటాం.



 ఇక నీకు ఏమి దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోదం కలిగే ప్రశ్నేమిటి కనుక. ఇవన్నీ తొలగాలంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినా, చేసేటువంటి వాటి యందు పట్టు లేకుండిన, ఇవన్నీ తనప్రయోజనం కోసం కాదని భావించటంచే తనకు అంటుకోవటం లేదు.



ఈ జ్ఞానం చేతనే వాళ్ళలో ఉండే రాగ, భయ, క్రోదాలు తొలగి పోతాయి. అందుకే *"త్యక్త రాగ భయ క్రోదాలు"* అని అనలేదు స్వామి. త్యక్తం అంటే త్యజించడం, వదలటం. వీత అంటే తొలగిపోయిన అని అర్థం. దీపం వెలిగిస్తే మనం చీకటిని బయటికి వదిలివేయటంలేదు, చీకటి తానంతట తానే తొలగి పోతోంది. మనం రాగ, భయ, క్రోదాలను వదిలివేద్దాం అని అనుకుంటున్న కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టు కుంటున్నాయి. మనం వదలడం కాదు, అవి వదిలి పోవాలి మనల్ని.



ఎప్పుడు పోతాయి అవి మనల్ని విడిచి అంటే, వాడి జ్ఞానం మనకు కల్గి నప్పుడు. ఆండాళ్ ఈ రోజు అదే వివరిస్తుంది. మాకుతొలగాల్సినవి తొలగాయయ్యా. రజస్సు తొలగింది, అహం మమతలు తొలగాయి, మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది. ఆడిన ప్రతి మాట ప్రతి చేష్ట నీవరకు పర్యవసిస్తుంది.  మాకు సరియైన జ్ఞానం కల్గింది, నీవేవరో మాకు తెలిసింది.



 ఇక ఈ జ్ఞానం *"మద్భావ మాగతాః"* తరువాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావుకదా, మా కిప్పుడు కావలసింది అది అన్నారు. అవన్నీ నాకుతెలియవు అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు అదైతే ఇస్తా అన్నాడు స్వామి. అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసును, నీ వెవరివో మాకు తెలుసూ అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్ట పరుస్తున్నారు.



 నీవెవరో మాకు తెలుసు, ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకువి అని అనుకుంటున్నారు, కాని *"ఒరుత్తి మగనాయ్ పిఱందు "* ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. అవతరించాడు అని చెప్పడంలేదు ఆండాళ్ ఎందుకంటే అయన మన తోటి సాటివాడు కావాలని వచ్చాడాయన.  అవతరించాడు అని చెబితే అది ఆయనని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆండాళ్ తల్లి నీవు పుట్టావు అని చెబుతుంది.



ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచి పోయినా సరే, స్వామిపై అంత ప్రేమ. మరి పుట్టింది అద్వితియురాలు అంటే, ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవ్వరికి తెలియకుండా నందగోకులం చేరి, *"ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర"* మరొక అద్వితియురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు.



*"తరిక్కిలానాకి"* సహించలేక పోయాడు ఆ *"త్తాన్"* ఆ నీచుడు, కంసుడు అని పేరుకూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడై పోతుంది అని. ఏం చేయ్యాలని అనుకున్నాడంటే  *"తీంగు నినైంద"* కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో, *"కరుత్తై పిరపిత్తు"* అది వారికే జరిగేట్టు చేసాడు. *"కంజన్ వైత్తిల్ నెరుప్పెన్న నిన్న"* కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది. అదే ప్రేమ అయితే తరించి పోయేవాడు. 



స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్లల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. *"నెడుమాలే"* అయన దీర్గమైన వ్యామోహం, ప్రేమ కల్గినవాడు తనను ఆశ్రయించుకున్నవాళ్ళ యందు, అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడి తమపై ప్రేమలేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా, మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అణుమాత్రం, ఆయన విభువు , అయన కుండేది మనపై ప్రేమ విభువంతా.


సీత హనుమతో రావణుడు నాకు కేవలం రెండు మాసాల గడువిచ్చాడు, రాముడితో చెప్పు *"మార్తా దూర్దం న జీవిష్యే"* నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది.  హనుమ ఈ విషయం చెప్పగానే, రాముడు ఆశ్చర్యంతో *"యది మాసం దరిష్యతి చిరంజీవతి వైదేహి"* అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైన ఉండ వచ్చును.



మరి తనో, *"నజీయేయం క్షణమపి వినాతాం అశితేక్షణాం"* నేను క్షణ కాలం కూడా జీవించలేను అన్నాడు, విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్ళకు ఈరోజు ఆయన కళ్లల్లో అంత వ్యామోహం చూసారు. 



సరే ఇంక ఏంకావాలి అని స్వామి అడిగాడు. *"ఉన్నై అరుత్తిత్తు వందోం"* మేం నిన్ను కోరి వచ్చాం. *"పఱై"*  వ్రత పరికరాలు *"తరుతియాగిల్"* నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాం.



 స్వామి వీళ్ళను పాపం శ్రమ  పడి వచ్చారర్రా అని అనగానే, *"తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్"* లేదు మేం సంతోషంతో వచ్చాం. నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఏ శ్రమా లేదు హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్ గోష్టి వారు.



*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*తిరుప్పావై 25 వ పాశురము తెలుగు పద్యానువాదము*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


 సీసమాలిక.

అంజలింపగా వచ్చు యనుగులమై మేము         

               అర్థులమై యిట వచ్చినాము 

అడిగిన వరమిచ్చు

 యనురాగ గనివని 

      యమ్మలిద్దరి యొడి నందినావు 

దేవకి కోరిన తీరైన బిడ్డగా

    చెర యందు జన్మించి వరములిచ్చె   

కొట్టగా కట్టగా కోరిక యుండగా

       వ్రేపల్లె చేరెను వేడ్క తీర్చ

 దుష్ట కంసుని చంప నష్టమ గర్భాన 

కృష్ణుడై భువి చేరె విష్ణుమూర్తి

 అర్థి సుధల పంట యసుర కడుపుమంట

 స్వామిని చూడగా సంతసించె!!


ఆ వె . పరను వాద్య మిచ్చు పరమాత్ముడంచును అందజేయుమయ్య యార్తనాథ 

సిరుల పంట వనుచు ఇప్పుడే చేరుతుమిప్పుడే 

విరహమెల్ల మేము మరతు మిపుడె

శ్రద్ధ భక్తినిచ్చి బుద్ధి నిమ్ము

శ్రీధరుని మనసున స్థిరము కమ్ము!!


🕉🌞🌎🌙🌟🚩

భజగోవిందం (మోహముద్గరః)

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     
              *విరచిత*
*భజగోవిందం (మోహముద్గరః)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*కాతే కాంతా ధనగతచిన్తా*
*వాతుల కిం తవ నాస్తి నియంతా|*
*త్రిజగతి సజ్జనసంగతిరేకా*
*భవతి భవార్ణవతరణే నౌకా||*

*శ్లోకం అర్ధం :-*

 *ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.*

*వివరణ : -*

*ఓయీ ! పరాత్పరుడైన భగవంతుడు లేడా? అతడు కరుణామయుడు. నారు వేసిన వాడు నీరు పోయడా? పుట్టించినవాడు పూట గడపడా! ఎందుకు నీకు చింత. అయ్యో! నేను లేకున్నా నా భార్యా-బిడ్డల గతి ఏమిటని చింతించకుము. దయా స్వరూపుడైన ఆ దేవుడు అందరికీ తిండి, గుడ్డ, నీడ తప్పక ఇచ్చును. కావున ఈ విషయముల మీద చింతించుట మాని, మనసు పరమాత్మపై లగ్నము చేయుము. సమయమును వృధా చేయక, సత్ సాంగత్యము చేగొని, వారి వలన ధర్మాధర్మములు, మంచి చెడ్డలు తెలుసుకొని, సన్మార్గమును గుర్తించి, భవ సాగరములో జీవిత నావను చక్కగా భగవత్ గమ్యమునకు తీసుకొని పొమ్ము.*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*ఓం నమో నారాయణాయ।*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

పంచ భ్రమలు

 పంచ భ్రమలు 

మనము ఏదైనా బస్సు లేక రైలు ఎక్కినప్పుడు ఒక సీటు దొరకాలని ఎంతో తాపత్రయపడతాము. సీటు దొరికిందా అది పూర్తిగా నా సొంతం అన్నట్లు భావిస్తాము. నిజానికి మనం ఆ సీటుమీద ఒక గంట లేక రెండుగంటలు మన ప్రయాణం అయ్యేవరకు మాత్రమే కూర్చుంటాము. మన గమ్యం రాగానే మనం దిగి వెళ్ళిపోతాము. మనం అప్పటిదాకా కూర్చున్న సీటులో ఎవరు కుర్చున్నారో కూడా చూడము. ఇది నిత్యం మన అనుభవంలో వున్న విషయం. సాధారణ మానవుల భ్రమ ఈ రీతిన ఉంటే నిత్యం భగవంతునితో అనుసందానం అయి వుండే భక్తునికి కూడా ఇలాంటి భ్రమలే ఉంటాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ భ్రమలు ఐదు రకాలుగా ఉంటాయి అందుకే వీటిని పంచ భ్రమలు అని అన్నారు. ఈ భ్రమలనుంచి బయట పడితేకాని సాధకుడు నిత్యమూ శాశ్వితము అయినా బ్రహ్మ పదాన్నిచేరలేడు. 

1)  ఆత్మ దైవ భేద  భ్రమ : నేను భగవంతుడిని ఆరాధిస్తున్నాను. పూలతో దేవదేవుని అలంకరిస్తున్నాను. గంగా  జలంతో లింగాభిషేకం చేస్తున్నాను. సత్యనారాయణ స్వామిని నేను వివిధ పూలతో అలంకరిస్తున్నాను. అని అనేకమంది భక్తులు తరచూ అనటం మనం చూస్తూ వున్నాము. భక్తుడి భక్తిలో  తోలి దశలో తనకన్నా బిన్నంగా భగవంతుడు ఉంటాడని భావించి భగవంతుని పూజించటం, ఆరాధించటం, అభిషేకించడం చేస్తూ ఉంటాడు. ఇది భక్తిలో తోలి దశ. నిజానికి జీవ దైవ భేదం లేదు. జీవుడు దేవుడు ఒక్కరే ఇద్దరు కాదు బేధం లేదు. ఈ సత్యం కొంత సాధన చేసిన తరువాత భక్తుడు తెలుసుకుంటాడు. అందుకే దీనిని ఒక భ్రమగా మన మహర్షులు తెలిపారు.

2) జీవ  దైవ భేద భ్రమ: ఈ రకమైన భ్రమ ఏరకంగా ఉంటుందంటే సాధకుని ముందు కనిపించే జీవులు కనిపించని దైవము వేరు అనే భావన దీనివలన సాధకుడు దేముడిని, ఇతర జీవులను వేరుగా గుర్తించి వేరుగా భావించి వేరుగా తలుస్తాడు.

3) జీవ, జీవ భేద  భ్రమ: ఈ రకమైన భ్రమ ఏమిటంటే ఒక జీవి ఇంకొక జీవికన్నా బిన్నంగా వున్నదనే బేధ భావం. ఈ రకమైన బ్రాన్తి నేను వేరు, నీవు వేరు అనే భావం మనుషులలో ఉండటం కాక నేను వేరు ఇతర జీవులు వేరు అంటే నేను వేరు ఆ ఆవు వేరు, ఆ కుక్క వేరు ఈ పావురం వేరు అని ఇతర జంతువులను తనకన్నా వేరుగా చూడటం. ఇది ఒక భ్రమ అని సాధకుడు తెలుసుకోవలెను.  

4) జీవ జడ భేద భ్రమ: ఈ రకమైన భ్రమ సాధకునికి ఎలా ఉంటుంది అంటే జీవత్వం వున్న జీవులు వేరు జీవం లేని నిర్జీవ పదార్ధాలు అంటే జడపదార్ధాలు వేరుగా గోచరించటం  

5)  జడ దైవ భేద భ్రమ:ఈ జగత్తులో కనిపించే జడపదార్ధాలు వేరు దేముడు వేరుగా సాధకుడు గుర్తించటాన్ని ఈ రకమైన భ్రమగా పేర్కొనవచ్చును. 

ఈ రకంగా ప్రతిసాధకుడు భావిస్తూవుంటాడు. దాని వలన పరబ్రహ్మ తత్వానికి దూరంగా ఉంటాడు. నిజానికి ఈ ఐదురకాల భ్రమలను బ్రమలుగా సాధకుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ జగత్తు మొత్తం జగదీశ్వరునిదిగా గుర్తిస్తాడు. జగత్తు వేరు జగదీశ్వరుడు వేరు కాదనే సత్ భావనకు వస్తాడు. అప్పుడు సాధకునికి ఈ జగత్తు కానీ జగదీశ్వరుడు కానీ తనకన్నా బిన్నంగా లేదని తాను కూడా జగత్తులో భాగమని అంటే ఆ జగదీశ్వరునిలో తాను  కూడా అంతర్గతంగా వున్నానని తాను భగవంతుని అంశగా తెలుసుకొని " అహం బ్రహ్మస్మి" అనే భావనలోకి వచ్చి సత్య దర్శనం చేసుకొని బ్రహ్మ పదాన్ని (మోక్షాన్ని) పొందుతాడు. అనితర సాధ్యమైన ఈ జ్ఞానామ్ పొందటానికి నిరంతర సాధన ఎంతో అవసరం. దేహ వ్యామోహాన్ని వదిలి అహంకారాన్ని త్యజించి నిరంతరం ఈశ్వర ధ్యాసలో ఉండి  ఐహిక సుఖాలను తృణప్రాయంగా భావించి తన జీవిత లక్ష్యం కేవలం అంటే కేవలం  మోక్ష సాధనే అని తలిస్తే తప్పకుండ మోక్షం కరతలామలకం అవుతుంది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు మీ 

భార్గవ శర్మ 

 

పంచాంగం 09.01.2025 Thursday,

 ఈ రోజు పంచాంగం 09.01.2025 Thursday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు పుష్య మాస శుక్ల పక్ష దశమి తిథి బృహస్పతి వాసర భరణి నక్షత్రం సాధ్య యోగః: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30  వరకు.




శుభోదయ:, నమస్కార: