29, డిసెంబర్ 2024, ఆదివారం

Panchang


 

అనారోగ్యం..అసహనం..*

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర..*


*అనారోగ్యం..అసహనం..*


*(యాభై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు అడిగినట్లుగా జీవసమాధి చేయడం తమవల్ల కాదని ఖరాఖండిగా తేల్చేసిన శ్రీధరరావు దంపతులు తిరిగి తమ ఇంటికొచ్చేసరికి.. సత్యనారాయణమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు..ఆయాసం ఎక్కువగా ఉండి.. ఊపిరి తీసుకోవడమే కష్టంగా వుందావిడగారికి..


సత్యనారాయణమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పిన బంధువులావిడ..ఈ దంపతులను చూడగానే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి..

"మీరసలు మనుషులేనా?..పెద్దావిడ కు ఆరోగ్యం బాగాలేదని తెలిసికూడా స్వాములు..పూజలు అంటూ తిరుగుతారా?..మీరు ఈవిడను నిర్లక్ష్యం చేయబట్టే..ఈరోజు ఈ ఉపద్రవం వచ్చిపడింది..ఇక ఒక్కనిమిషం కూడా ఈవిడను ఈ ఊళ్ళో ఉంచొద్దు..కనిగిరి కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించండి.." అంటూ చిందులు తొక్కసాగారు..


"అది కాదమ్మా..మేము వెళ్లేముందు మిమ్మల్ని అడిగే కదా మేము స్వామివారి దగ్గరకు వెళ్ళింది..మీరు కూడా సమ్మతించారు..ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు..ఇంతకాలం మేము జాగ్రత్తగానే వున్నాము.." అంటూ సర్దిచెప్పబోయారు శ్రీధరరావు గారు..కానీ ఆ వచ్చిన బంధువులావిడ వింటేనా?..తన ధోరణిలో ఈ దంపతులిద్దరికీ శాపనార్ధాలు పెట్టి..సత్యనారాయణమ్మ గారిని కూడా కనిగిరి వెళ్ళడానికి సమాయత్తం చేయసాగారు..


ప్రభావతి గారికి దుఃఖం ముంచుకొచ్చింది..దాదాపు పాతికేళ్ల పాటు అత్తగారు తానూ కలిసి వున్నారు..సంసారమన్నాక చిన్న చిన్న కోపాలు మాటలు సహజం..అవి ఎప్పుడన్నా తలెత్తినా ఎవరో ఒకళ్ళు సర్దుకుని పోయేవాళ్ళు....ఇద్దరూ కలిసి మెలిసే వున్నారు..ఈరోజు ఎందుకిలా జరిగిందో అర్ధం కాక బాగా బాధపడ్డారు..పైగా అంత బాధలోనూ సత్యనారాయణమ్మ గారు కూడా తాను కనిగిరి కి వెళ్లి అక్కడ ఉంటానని చెప్పడం ఇంకా హృదయాన్ని కలచివేసింది..ఆ వచ్చిన బంధువు తానెంత గొప్పగా అత్తగారికి సేవ చేసిందీ చెపుతూ..స్వాములను నమ్ముకుంటే చివరకు దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడటం మొదలుపెట్టింది..శ్రీధరరావు ప్రభావతి గార్లు తిరిగి ఒక్క ముక్క అనలేదు..


"అమ్మా..ఇంతకాలం మాతోనే ఉన్నావు..నీకంతగా కష్టంగా వుంటే..ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది..స్వామివారి వద్దకు నేనొక్కడినే వెళ్ళొస్తాను.." అని శ్రీధరరావు గారు ఎంతో దూరం నచ్చచెప్పబోయారు..సత్యనారాయణమ్మ గారు అంతా విని .."శ్రీధరా రేపుదయం కారు తెప్పించు..నేను కనిగిరి వెళ్లి అక్కడ వుంటాను.." అన్నారు..


"మీరు చప్పున ఇంటికి వెళ్ళండి" అని స్వామివారు ఎందుకు చెప్పారో అప్పుడు బోధపడిందా దంపతులకు..ఇక చేసేదేమీలేక ప్రక్కరోజు ఉదయాన్నే కందుకూరు నుంచి కారు తెప్పించి..శ్రీధరరావు గారే దగ్గరుండి తన తల్లిగారిని కనిగిరి లో వదిలిపెట్టి బరువెక్కిన గుండెతో తిరిగి రాత్రికి మొగలిచెర్ల చేరారు..అప్పటి దాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురుచూస్తున్నారు..ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసు మార్చుకొని తిరిగి వస్తారని ఒక ఆశ!..కానీ అలా జరగలేదు..ఆరాత్రి ఆ దంపతులిద్దరూ నిద్రపోలేదు..ఏదో బలమైన దుష్టశక్తి ఆ బంధువు రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసు మార్చి..తమకు ఆమెను దూరం చేసిందని అనుకున్నారు..


తెల్లవారగానే..శ్రీ స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకొని వెళ్లారు..చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమం బైట నిలబడి వున్నారు..వీళ్ళను చూడగానే..పెద్దగా నవ్వుతూ.."రండి!..రండి!..మీ కోసమే ఇక్కడ వున్నాను..మీరొస్తారని ముందే తెలుసు!.." అన్నారు..ఆశ్చర్యపోవడం ఈ దంపతుల వంతు అయింది..


ప్రభావతి గారు పూసగుచ్చినట్టు అంతా వివరంగా చెప్పి.."నాయనా!..మనసంతా బాధగా ఉంది..మా బంధువులావిడ రాకున్నా బాగుండు..అత్తగారు మా దగ్గరే వుండేవారు.." అన్నారు ముగింపుగా..


శ్రీ స్వామివారు మళ్లీ పెద్దగా నవ్వి.."అమ్మా..మీకొక విషయం చెప్పాలి..రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాము.." అంటూ ఆశ్రమం లోపలికి దారి తీసారు..


శ్రీ స్వామివారి బోధ..ఊరట చెందటం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699.)

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*జీవ సమాధి..ఒక వివరణ.*


*(యాభై మూడవ రోజు)*


శ్రీ స్వామివారి నిర్ణయంలో ఎటువంటి మార్పూ రాలేదు..ప్రాణత్యాగం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు..ఎప్పుడు?..ఎలా?..అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నట్లుగా నిశ్చింతగా వున్నారు..


శ్రీధరరావు దంపతులకు ఈలోపల మరో సమస్య వచ్చిపడింది..శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది..ఆవిడ మునుపటి లాగా తిరుగలేకపోతున్నారు..తన పనులు కూడా మెల్లిగా చేసుకుంటున్నారు..దంపతులిద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు..ఆ సమయంలోనే వీలు చూసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి వస్తున్నారు..తాము శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్లేవారు..ఓ వారం గడిచిపోయింది..దూరపు బంధువు ఒకావిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగలిచెర్ల కు వచ్చింది..ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటూ వున్నారు..ఈలోపల శ్రీ స్వామివారి నుంచి శ్రీధరరావు దంపతులను ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు వచ్చింది..ఎలాగూ ఈవిడగారు వున్నారు కదా..అనుకొని..


"పిన్ని గారూ..మీరు అత్తయ్య గారివద్ద వుండి చూసుకుంటారా?..మేమిద్దరం శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి ఓ మూడు గంటల లోపు వచేస్తాము.." అన్నారు ప్రభావతి గారు..


"అదేం మాటమ్మా..లక్షణంగా చూసుకోనూ..మీరిద్దరూ వెళ్ళిరండి..మేము మాట్లాడుకుంటూ ఉంటాము.." అని భరోసా ఇచ్చారావిడ..శ్రీధరరావు ప్రభావతి గార్లు సరే అని చెప్పి..గూడు బండి సిద్ధం చేయించుకొని శ్రీ స్వామివారిని కలవడానికి ఫకీరు మాన్యం లోని ఆశ్రమానికి వెళ్లారు..


శ్రీ స్వామివారు వీరికోసమే ఎదురుచూస్తున్నట్లు గా వున్నారు..వీళ్ళను చూడగానే ..నవ్వుతూ.."నా సజీవ సమాధి విషయం ఆలోచించారా?..ఏమనుకుంటున్నారు?.." అన్నారు..


"నాయనా..మిమ్మల్ని మా చేతులతో సమాధి లో పెట్టి పైన మూత వేయడం మా వల్ల కానీ పని..అది హత్య అవుతుంది..మిమ్మల్ని మా బిడ్డగా చూసుకున్నాము..బ్రతికిఉన్న బిడ్డని సమాధి చేయడం ఏ తల్లిదండ్రులూ చేయరు..చేయలేరు..మీరు పదే పదే ఆ  విషయం మా వద్ద ప్రస్తావన చేయొద్దు..ఇది చాలా మనస్తాపం కలిగిస్తోంది మా ఇద్దరికీ.." అన్నారు ప్రభావతి గారు కటువుగా..


శ్రీధరరావు గారైతే వాదనకే దిగారు.." ఇంత తపస్సు చేసి..ఇంత పాండిత్యమూ..వేదాంతమూ బాగా తెలుసుకొని..లోకానికి ఎటువంటి సందేశమూ ఇవ్వకుండా..మీరిలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే..అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో గానీ..ప్రపంచానికి ఎటువంటి ఉపయోగమూ ఉండదు..కొంతకాలం బోధ చేయండి.." అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధరరావు గారిని చేయెత్తి వారించారు శ్రీ స్వామివారు..


ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు..ప్రశాంతంగా వున్నారు..పైపెచ్చు నవ్వుతూ..

"శరీరం తోనే సందేశాలు ఇవ్వాలని నియమమేమీ లేదు..అలా అనుకొని వుంటే..వ్యాసాశ్రమం లోనే పీఠాధిపత్యం తీసుకొని..ముందుగా ఆశ్రమ వాసులకు..ఆపై ప్రజలకు బోధ చేసేవాడిని..నా పంథా వేరు..అది మీకు ఇప్పుడు అర్ధం కాదు..ఒక్క విషయం చెప్పండి.. శిరిడీ సాయిబాబా ఇప్పుడున్నాడా?..ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు అరవై సంవత్సరాలు కావొస్తోంది..ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయటం లేదా?..(శ్రీ శిరిడీ సాయినాథుడు అవధూత అని శ్రీ స్వామివారు గట్టిగా చెప్పేవారు..) సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కరలేదు..నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది..మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి..అందుకు సమయం పడుతుంది..నాకూ కొద్దినెలల ఆయుష్షు ఉంది..ఈలోపల మీరు సిద్ధపడితే సరే..లేదా నా మార్గం లో నేను ప్రాణత్యాగం చేస్తాను..ఎంత తపస్సు చేసినా..శరీరాన్ని విడిచి వెళ్లే సమయాన్ని పొడిగించలేము..అది భగవత్ నిర్ణయం..జీవ సమాధి చెందడమనేది సాధకుల మోక్ష పధానికి ఒక ఆలంబన వంటిది..ఎలా జరగాలని వ్రాసి వుంటే అలా జరుగుతుంది.." అంటూ ఒక్కనిముషం ఆగి.." మీరిద్దరూ చప్పున బైలుదేరండి.." అన్నారు..


సాయంత్రం చీకటి పడే వేళయిందని కాబోలు శ్రీ స్వామివారు బైలుదేరమన్నారని భావించి..శ్రీధరరావు దంపతులు ఆశ్రమం నుండి మొగలిచెర్ల లోని తమ ఇంటికి చేరారు..అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు..


అనారోగ్యం.అసహనం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మయూరధ్వజుడు

 *ॐ శ్రీ మహాభారతంలో కథలు – మయూరధ్వజుడు*


ధర్మరాజు అశ్వమేధయాగం చేసి హయాన్ని వదిలాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు యజ్ఞం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే! పాండవులు వదిలిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు అతని నగరం చేరుకున్నారు. మయూరధ్వజుడు కృష్ణభక్తుడనీ, అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. సరేనన్నాడు పాండవమధ్యముడు. మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు. సవ్యసాచి అతన్ని సంబాళించలేక పోయాడు. విధి లేక శౌరి సాయం ఆర్థించాడు. పార్థసారథి కూడా యుద్ధంలోకి దిగాడు. మయూరధ్వజునికి తన ఆరాధ్యదైవంతో పోరాడటం ఇష్టం లేదు. కాని రణరంగంలో వెనుదీయడం క్షత్రియధర్మం కాదని తలచి "కృష్ణా! కృష్ణా!" అని నామస్మరణం చేస్తూ బాణాలు గుప్పించడం మొదలు పెట్టాడు. ఆ శరాల ధాటికి ఆ మహాయోగి కూడా చలించాడు. "బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రంతో మయూరధ్వజుని చంపలేవా?" అన్నాడు అర్జునుడు. 


పద్మనాభుడు మందహాసంతో "పార్థా! నీ గాండీవం గాని, నా సుదర్శనం గాని ఆ మహాభక్తుని మీద పనిచేయవు" అన్నాడు. 'మయూరధ్వజుడు అంతటి భక్తుడా!' అని గాండీవి విస్తుపోయాడు. మాధవభక్తులలో తనను మించిన వారు లేరని కృష్ణసఖునికి కించిత్తు గర్వముంది. అది మునుపే ఎరిగిన కృష్ణుడు మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు. ఇద్దరూ అనాటికి యుద్ధం చాలించారు. మరునాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులుగా వెళ్ళారు. విప్రుల రాక గమనించి ఆ రాజు వారికి ఎదురేగి గౌరవ పురస్కారంగా మర్యాద చేశాడు. "అయ్యా! మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థించాడు. "రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకొక పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరితేగాని మేము మరొక విషయం ఆలోచించలేము" అన్నాడు మాయారూపంలో ఉన్న కృష్ణుడు. "స్వామీ! మీకు కలిగిన విపత్తేమిటో చెప్పండి. నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను" అన్నాడు మయూరధ్వజుడు. 


రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది. అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత "మయూరధ్వజ మహారాజు శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు" అని అశరీరవాణి పలికింది. అందుకని నాకు పుత్ర భిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను" అన్నాడు విప్రుని వేషంలో ఉన్న కృష్ణుడు. "ఆహా! నా జన్మ తరించింది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే ఏం కావాలి. అయ్యా! సందేహించకండి. వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళి పులికి ఆహారంగా ఇవ్వండి" అని వారిని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే భార్యాబిడ్డల్ని పిలిచి తన శరీరాన్ని రెండు భాగాలుగా కోయమన్నాడు. మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని వినియోగించబోతున్నాడని వారికి అర్థమైంది. మారుమాట్లాడక రాజుగారి శరీరాన్ని చేదించడం ప్రారంభించారు. కృష్ణార్జునులు అనిమిషులై ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తుండగా వారికొక వింత కనిపించింది. 


మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీటి చుక్కలు రాలసాగాయి. అప్పుడు కృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కఠిన్యంతో "రాజా! బాధపడుతూ నువ్వేమీ నీ శరీరాన్ని నాకివ్వనవసరం లేదు. మనస్ఫూర్తిగా, సంతోషంగా చేస్తేనే ఏదైనా త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలో దివ్యత్వముంటుంది. మనల్ని చూసి మనం దుఃఖించడం నైచ్యమౌతుంది. మనమీద వున్న మమకారాన్ని మనం చంపుకోలేక పోవడం దీనికి కారణం. నీ కిష్టం లేని పనిని నీవు చెయ్యవద్దులే" అని వెనుదిరిగాడు. మయూరధ్వజుడు కృష్ణుని చేతులు పట్టుకుని, "అయ్యా! నా శరీరం అర్పిస్తున్నానని నాకు బాధలేదు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ వుంటే రెండు కళ్ళూ కూడా నీరు కార్చాలి కదా! ఒక కంటి నుండి మాత్రమే నీరు వస్తోంది. ఎందుకో ఆలోచించారా? నా శరీరంలో కుడిభాగం ఆర్తరక్షణకు అర్పితమవుతున్నదనీ, వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమకన్ను దుఃఖిస్తోంది. ఒంటరిగా మిగిలిపోయిన తాను ఏ పరమార్థాన్నీ సాధించకుండానే, ఎవరికీ ఎట్టి ప్రయోజనాన్నీ కలిగించకుండానే ఖిలమైపోవాలి కదా అని చింతిస్తోంది" అన్నాడు. ఈ మాటలు విని కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి అచ్యుతుడు ఆడిన నాటకమని గ్రహించి సిగ్గుపడ్డాడు. పునీతుడైన ప్రియబాంధవునితో సహా కృష్ణుడు తమ నిజరూపాలు తెలియజెప్పి మయూరధ్వజుని దీవించాడు. ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితిని కలుగచేశాడు. మయూరధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునునికి అప్పగించి మాధవుడికి పాదాభివందనం చేశాడు.

సశేషం..

ఆచార్య సద్బోధన

 *ఆచార్య సద్బోధన:*

                

*దైవాన్ని సర్వభూతాంత రాత్మ అనీ ఎలా తెలుసుకోవాలి?*


అర్జునికి శ్రీ కృష్ణ పరమాత్ముడు తనయందే సర్వ చరాచర ప్రపంచాన్ని చూపించాడు, విశ్వమంతా సూక్ష్మ రూపమున ఉన్న మర్మము అర్జునునకు దర్శించిన తరువాతనే తెలిసింది.

కాని దానికి ముందు కృష్ణుడు సర్వాంతర్యామి అని అర్జునుడు తెలిసికొనలేదు.


భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకోవడం కష్టం..!


కానీ ... 

జీవులందరియందూ, అదే విధముగా, ప్రకృతి అంతయూ పరమాత్మ స్వరూపమే!

అందరియందు ప్రేమ పలు విధాలుగా ప్రకాశించుచునే యుండును, ఇది శాశ్వతము మారేది కాదు. 

కానీ, వినియోగ విధానమును బట్టి వివిధ నామములు అనగా వాత్సల్యమనియు, అనురాగ మనియు, భక్తి అనియు, ఇష్టమని, అనేక పేర్లతో కన్పించుచుండును. కానీ ప్రేమ స్వరూపము మారదు. 

అందరిలోనూ దైవం చూసి ప్రేమ భావమును పెంచుకుంటే, భగవంతుడు సర్వభూతాంత రాత్మ అను యదార్ధము మనకు స్పష్టమగును...✍️

_డబ్బు వస్తే

 *_డబ్బు వస్తే మన చుట్టూ చేరేవాళ్లు చాలామంది ఉంటారు... కానీ జబ్బు వస్తే చూసేవాళ్ళు చాలా తక్కువ..._* 


*_ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేము, అలానే వదులుకున్నంత సులువుగా ఆత్మీయులను సంపాదించలేము..._* 


*_సంపాదన ఉన్నప్పుడే డబ్బులు జాగర్త చేసుకోవాలి. అలానే ఆత్మీయులను కూడ నలుగురిని సంపా దించుకోవాలి._*


*_అందుబాటలో ఉన్నపుడు అశ్రద్ధ చేసి, కరిగిపోయిన తర్వాత కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ_*


*_తెగిపోయిన తర్వాత బంధం విలువ, పొగుట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెల్సుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు._*


*_కథ కన్నా జీవితంలోనే ఎక్కువ నాటకం ఉంటుంది. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది.☝️_*


     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*

🪷🪷🪷 🌹🙇‍♂️🌹 🪷🪷🪷

భీష్మనిర్యాణం

 #భీష్మనిర్యాణం.


ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది. 


      ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. 

      దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. 

      కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.


      భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు. 

     58 రోజులు బాణశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరు ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది.


      భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

    ‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళ ముద్రవేసి వారిని పట్టించుకోవడంలేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము. 

      ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా "తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది" అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధరంగాలకు కావలసిన అనుభవజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.


      18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు. 

      ఈ సమయంలో వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ధర్మరాజుకు ఇస్తారు. అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురువృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని వ్యాసుడు, కృష్ణుడు సలహా ఇస్తారు. 


      వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. 

      అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు. విష్ణుసహస్ర నామం కూడా అందులోదే. 

      కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఎం ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది‘‘ అని అన్నారు. 

      

      ఆంధ్రవ్యాసుల వారి మార్గదర్శకత్వంలో మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 


1) భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు (నర్సుల) వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారు.


2) భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. 


తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః।

శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥

  - భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలు వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. 


      రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషంటు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది. అదే ఆరోజున భీష్ముడికి చేశారు. 

     అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. 

      ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు. 


ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అన్నందువల్ల. 

      అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది. 


3) దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది. 

* భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీదే కాక ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు వచ్చారు. వారిలో నారదాది సంగీతవిద్వాంసులు ఉన్నారు. 

* శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే వ్యాస మహర్షితో కూడిన సమస్త ఋషి గణాలూ ఋగ్, యజుస్, సామగానాలు చేశారు. 

* అన్ని ఋతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో కురిశాయి. 

* దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. 

* పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. 

* ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. 

* భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు. 


      ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది. 

దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి. 


తతస్తే వ్యాససహితాః సర్వ ఏవ మహర్షయః।

ఋగ్యజుఃసామసహితైర్వచోభిః కృష్ణమార్చయన్॥ 

తతః సర్వార్తవం దివ్యం పుష్పవర్షం న భస్తలాత్।

పపాత యత్ర వార్ష్ణేయః సగాంగేయః సపాండవః॥ 

వాదిత్రాణి చ సర్వాణి జగుశ్చాప్సరసాం గణాః।

న చాహితమనిష్టం చ కించిత్తత్ర వ్యదృశ్యత॥ 


      అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.


4) ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. 

     పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు. 


తతో రథైః కాంచనచిత్రకూబరై

ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః। 

హయైః సుపర్ణైరివ చాశుగామిభిః

పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః॥ 


యయౌ రథానాం పురతో హి సా చమూ

స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ। 

పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ

తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥


      ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు. 


5) మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు. 

     "అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడ జమకూడడం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు. 


న సైనికైశ్చ యాతవ్యం యాస్యామో వయమేవ హి।

న చ పీడయితవ్యో మే భీష్మో ధర్మభృతాం వరః


      ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆరిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింపచేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోషు చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి--- ఇదంతా చూస్తే ఎంత నీచంగా ఉంటుందో ఒకసారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది. 


      శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. ఆ పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. 

      నేడు ఆసుపత్రుల దగ్గరకు వాహానాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిది. 

    "ఆసుపత్రి ఏరియా - దయచేసి హారన్ మ్రోగించవద్దు" - అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. 

      లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధపెడతాయని ఎప్పటికి బుద్ధి వస్తుందో నేటి వాహన చోదకులకు?


ఆగచ్ఛత్స్వథ కృష్ణోఽపి పాండవేషు మహాత్మసు।

శైనేయసహితో ధీమాన్రథమేవాన్వపద్యత॥ 

రథస్థాః సంవిదం కృత్వా సుఖాం పృష్ట్వా చ శర్వరీం।

మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః॥ 

బలాహకం మేఘపుష్పం శైబ్యం సుగ్రీవమేవచ।

దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః॥ 

తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।

గాం ఖురాగ్రైస్తథా రాజఁల్లిఖంతః ప్రయయుస్తదా॥ 

తే గ్రసంత ఇవాకాశం వేగవంతో మహాబలాః।

క్షేత్రం ధర్మస్య కృత్స్నస్య కురుక్షేత్రమవాతరన్॥ 


      మహాభారతం నేడు కూడా ఎందుకు? - అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు, ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి. 


      వేల సంవత్సరాల క్రితం మరణశయ్యమీద వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. 

      లక్షాపదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పశుప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. 

     నేడు దౌర్భాగ్య ప్రభుత్వాల కారణంగా సంస్కృతం అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక బ్రతుకుతున్నాము. 

      ఏ అమెరికా, ఇంగ్లండు వారో "హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి" అంటే నిజమే కాబోలు అనుకునే జాతి తయారైంది...


      శ్రీరామ జయ రామ జయ జయ రామ...

ఉబ్బసం నివారణా యోగాలు -

 ఉబ్బసం నివారణా యోగాలు  -


 *  ఉబ్బసం ఉధృతంగా ఉండి శ్వాస ఆడనప్పుడు వాము గింజలను వేడిచేసి గుడ్డలో కట్టి ఛాతిపైన , గొంతుకకు కాపడం పెడితే నొప్పి శ్వాస సులువుగా ఆడుతుంది.


 * వస కొమ్ము చూర్ణం ఉబ్బసం ఎక్కువుగా ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకి ఒకసారి ఉసిరిగింజంత నీటిలో కలిపి తాగాలి.ఇలా రెండు లేక మూడు మోతాదులలో తేలిక అగును.


 *  మారేడు ఆకుల రసం అరచెంచా , తేనె అరచెంచా కలిపి ఉదయం , సాయంత్రం రెండుపూటలా తీసుకోవాలి . 40 రోజులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. తగ్గకుంటే మరొక్క 40 రోజులు వాడండి. తప్పక తగ్గును.


 *  పూటకొక యాలుక్కాయ తినినచో ఉబ్బసం తగ్గును.


 *  ఎండు జిల్లేడు ఆకుల పొగని తరుచూ పీల్చుచుండిన ఉబ్బస రోగం నివారణ అగును.


 *  ప్రతినిత్యం ఒక పచ్చి కాకరకాయని తింటున్న పోతుంది. రోజురోజుకు మార్పు కనిపించును. తగ్గేంత వరకు వాడవలెను.


 *  ప్రతి నిత్యం ఉదయం , సాయంత్రం కప్పు పాలలో నాలుగు వెల్లుల్లి రేకలు చితగ్గొట్టి వేసి పొయ్యి పైన మరిగించి ఆ పాలను తాగుచున్న ఉబ్బసం హరించును .


 *  ఉబ్బసం ఎక్కువుగా ఉండి కఫం పట్టేసి ఉన్నచో కుప్పింటాకు రసాన్ని మూడు చెంచాలు లొపలికి తీసుకొనుచున్న కఫం కరిగి బయటకి వచ్చును.


 *  అల్లం రసం , తేనె సమభాగాలుగా కలిపి మూడు గంటలకి ఒకసారి చెంచా చొప్పున తీసుకొనుచున్న ఉబ్బస ఉధృతి తగ్గును.


 *  ఉత్తరేణి చెట్టుకు సమూలంగా తీసుకుని నీడన ఎండించి భస్మం చేయవలెను . ఆ భస్మమును మూడు పూటలా కందిగింజ అంత తేనెతో కలిపి లోపలికి తీసుకొనిన ఉబ్బసం తగ్గును . ఇది తిరుగులేని యోగం . 


శరీరంపైన లేచే వ్రణాలను హరించు యోగాలు -


   శరీరంలోని కొన్ని భాగాలలో ఎత్తుగా , గట్టిగా గడ్డలు ఏర్పడును . ఈ గడ్డల వలన పోటు , విపరీతమైన నొప్పి ఉండును. కొన్ని మెత్తగా ఉండి పోటు , సలుపు కలిగి ఉండును. వ్రణాలు లొపల చీము మరియు నెత్తురుతో కూడుకుని ఉండును. పక్వానికి వచ్చి పగిలిన తరువాత లొపల ఉన్న చెడు బయటకి వెళ్లడం వలన నొప్పి మరియు పోటు ఉపశమించును.


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(నాల్గవ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

   నారదుని జన్మ వృత్తాంతం 

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*నడచి నడచి ఆఖరికి ఓ నది ఒడ్డుకు చేరుకున్నాడు నారదుడు. ఇక నడవలేననుకున్నాడు. నదిలో స్నానం చేశాడు. భగవంతునికి అర్ఘ్యం ఇచ్చి, కడుపునిండా నీరు తాగాడు. దాహాన్ని తీర్చుకున్నాడు. తీరానికి చేరి, రావిచెట్టు కింద కూర్చున్నాడు. మనసులో మహావిష్ణువును తలచుకుంటూ హరినామస్మరణ చేయసాగాడు. ధ్యానించసాగాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే మరుక్షణంలోనే అదృశ్యమయ్యాడు. ఏకకాలంలో సంతోషం, దు:ఖం రెండూ కలిగాయి నారదునికి. అయినా హరినామస్మరణ మానలేదు.*


*అప్పుడు భగవంతుని గొంతు వినవచ్చిందిలా.‘‘బాలకా! నువ్వు నన్ను ఈ జన్మలో తనివితీరా చూడలేవు. నీ భక్తికి మెచ్చి ఒక్క క్షణం మాత్రమే నా దివ్య మంగళ రూపాన్ని చూపించాను. త్వరలోనే నువ్వు నీ దాసీపుత్ర దేహాన్ని త్యజిస్తావు. అప్పుడు నా చెంతనే ఉంటావు. నా పట్ల నీ భక్తి ఎప్పుడూ స్థిరంగా ఉండేట్లుగా వరమిస్తున్నాను, స్వీకరించు. అలాగే ప్రళయకాలంలో కూడా నీ స్మృతి పోదు’’. శ్రీహరి కరుణకు పొంగిపోయాడు నారదుడు.*


*కొంత కాలానికి దేహాన్ని విడిచాడు. కల్పాంతాన లోకాలన్నీ జలమయమయిపోయాయి. నీరంతా ఒకే సముద్రంగా ఉంది. ఆ సముద్రంలో శ్రీహరి శయనించి ఉన్నాడు. అప్పుడు శ్రీహరి గర్భంలోకి బ్రహ్మదేవుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తూ నిశ్వసించాడతను. అలా ఊపిరి వదిలే వేళ బ్రహ్మదేవుని గర్భంలో జారుకున్నాడు నారదుడు. అనేక యుగాలు గడిచిపోయాయి. బ్రహ్మ మళ్ళీ సృష్టి ప్రారంభించాడు. బ్రహ్మదేవుని నుండి మరీచి మొదలయిన ప్రజాపతులు జన్మించారు. వారితో పాటు నారదుడు కూడా జన్మించాడు.*


*శ్రీహరి అనుగ్రహంతో నారదునికి దివ్యదేహం ప్రాప్తించింది. దేవదత్తం, మహతి అనే వీణ కూడా లభించాయతనికి. సర్వజ్ఞత్వం, చిరంజీవత్వం సంప్రాప్తించాయి. దాంతో నిరంతరం హరినామస్మరణ చేస్తూ ముల్లోకాలూ సంచరించసాగాడు నారదుడు.*


*అశ్వత్థామ :~*


పరీక్షిన్మహారాజు ఎందుకు ప్రాయోపవేశం చేయాల్సి వచ్చింది? శుకుడు అతనికి భాగవతం ఎందుకు వినిపించాల్సి వచ్చిందంటూ శౌనకాది మునులు సూతుణ్ణి ప్రశ్నించారు.


సమాధానంగా పరీక్షిన్మహారాజు జన్మ వృత్తాంతం తెలియ జేయడానికి ముందు సూతుడు మహాభారతంలోని చివరి ఘట్టాన్ని వారికి వివరించాడు. శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థానం మొదలయిన సంగతులు కొన్ని తప్పనిసరై చెప్పాల్సి వచ్చిందతనికి.  


పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్రంలో కౌరవులకూ పాండవులకూ యుద్ధం జరిగింది. ఇరు పక్షాన మహావీరులు అనేకులు మరణించారు. గదా యుద్ధంలో భీముడు, తొడలు విరగగొట్టడంతో దుర్యోధనుడు నేల కూలాడు. 


ఆనాటికి కురురాజు పక్షాన మిగిలిన ఒకే ఒక్క వీరుడు అశ్వత్థామ. నూరుగురు కొడుకుల్నీ, బంధుబలగాన్నీ, చతురంగ బలాల్నీ కోల్పోయి జీవచ్ఛవంలా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ మహారాజుకి సంతోషాన్ని కలిగించేందుకు అశ్వత్థామ ఘోరకృత్యానికి పూనుకున్నాడు. 


అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న ద్రౌపది కుమారులయిన ఉపపాండవుల తలలను నరికి వచ్చాడతను. తలలు తెగి, రక్తం మడుగులో ఉన్న కుమారులను చూసి కన్నీరు మున్నీరయింది ద్రౌపది. కంటికీ మంటికీ ఏకధారగా రోదించింది. ఎంత ఓదార్చజూసినా ద్రౌపది శాంతించలేదు. అప్పుడు అశ్వత్థామ తల నరికి తెస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞకు ద్రౌపది శాంతించింది. 


అక్షయతూణీరాన్ని, గాండీవాన్నీ అందుకుని రథాన్ని అధిరోహించాడు అర్జునుడు. 

శ్రీకృష్ణుడు సారథి అయ్యాడు. రథం పరుగందుకుంది. ‘‘అడుగో అశ్వత్థామ! నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో’’

అశ్వత్థామను చూపించి, రథాన్ని మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు కృష్ణుడు. 


తనని వెంట తరముతున్న కృష్ణార్జునులను చూసి, వారి చేతికి చిక్కరాదనుకుని, రథాన్ని అధిరోహించి పరుగందుకున్నాడు అశ్వత్థామ. ముందు అశ్వత్థామ రథం, ఆ వెనుక కృష్ణార్జునుల రథం. పరిగెత్తి పరిగెత్తి అశ్వత్థామ గుర్రాలు అలసిపోయాయి. ఆగిపోయాయి ఒకచోట. కృష్ణార్జునులు చేరుకున్నారక్కడకి. ఒక్కుదుటన కిందకు దిగుతున్న అర్జునుని చూశాడు అశ్వత్థామ. తన ప్రాణాలు పోతాయి. అందులో అనుమానం లేదు. అర్జునుడు తనని చంపేస్తాడనుకున్నాడు అశ్వత్థామ. 


అదే క్షణంలో పాండవుల అంతు చూడాలనుకున్నాడు కూడా. ఆలోచించాడు. బ్రహ్మశిరోనామ కాస్త్రం ప్రయోగించాలనుకున్నాడు. పర్యవసానాల్ని పట్టించుకోలేదు. ఆచమనం చేసి, శుచి అయ్యాడు అశ్వత్థామ. 

 

‘‘అపాండవమగుగాక’’ అన్నాడు. అనుకున్నట్టుగానే బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించాడు. ఉగ్రతేజస్సుతో ఆ మహాస్త్రం దశదిశలా వ్యాపించింది. సకల ప్రాణికోటి అంతం చూసే ఆ తేజస్సు చూసి అర్జునుడు కలవరం చెందాడు. ఏం చెయ్యాలో తోచలేదతనికి. చేతులు జోడించి కృష్ణునికి నమస్కరించాడు. కర్తవ్యాన్ని బోధించమని ప్రార్థించాడు. సాలోచనగా చూసి ఇలా అన్నాడు కృష్ణుడు. 


‘‘అర్జునా! అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిని ప్రతిఘటించగలిగేది ఒక్కటే! బ్రహ్మశిరోనామకాస్త్రమే! దాన్నే నువ్వూ ప్రయోగించు.’’


‘‘మరో మార్గం లేదా?’’ అడిగాడు అర్జునుడు. 


‘‘లేదు.’’


కృష్ణునికి మళ్ళీ నమస్కరించి, ఆ పరమాత్మ చెప్పినట్టుగానే అర్జునుడు తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రాలు రెండూ ఒకదాన్ని ఒకటి డీకొన్నాయి. ప్రళయాగ్ని జ్వాలలు చెలరేగాయి. సమస్త లోకాల్నీ ఆ జ్వాలలు దహించసాగాయి. ప్రాణికోటి సర్వం తల్లడిల్లింది. ప్రళయకాలం సమీపించి నట్టనిపించింది. ఆలోచించాడు కృష్ణుడు. ఆ అస్త్రాలు రెంటినీ ఉపసంహరించాల్సిందిగా అర్జునుని ఆజ్ఞాపించాడు. 


బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ద్రోణునికి అగస్త్యుడు ప్రసాదించాడు. ద్రోణుడు ఆ అస్త్రాన్ని అర్జునునికి బోధించాడు. తండ్రి ద్రోణున్ని ప్రార్థించి అశ్వత్థామ కూడా ఆ అస్త్రాన్ని అందుకున్నాడు. తనయుడికి అస్త్రాన్ని ప్రసాదించి, ఎంతటి ప్రాణభయం ఉన్నా ఎన్నడూ ఈ అస్త్రాన్ని ప్రయోగించ రాదన్నాడు ద్రోణుడు. అస్త్రాన్ని ప్రయోగించడమే తెలియజేశాడతడు. ఉపసంహరణ తెలియ జేయలేదు. ఆ కారణంగా అశ్వత్థామకు అస్త్ర ఉపసంహరణ తెలీదు. తెలియకపోయినా ఆ మహాస్త్రాన్ని ప్రయోగించి పొరపాటు చేశాడు అశ్వత్థామ. 

 

కృష్ణుని ఆజ్ఞానుసారం అర్జునుడు తను ప్రయోగించిన అస్త్రాన్నీ, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్నీ రెంటినీ ఉపసంహరించాడు. 


తర్వాత అణచుకోలేని కోపంతో అశ్వత్థామ మీద దాడి చేశాడు. పట్టుకున్నాడతన్ని. పట్టుకుని రథ చక్రానికి కట్టాడు. ద్రౌపది దగ్గరకు తీసుకుని వెళ్ళేందుకు రథాన్ని అధిరోహిస్తుంటే వారించాడతన్ని కృష్ణుడు. ‘‘చక్రానికి కట్టి అశ్వత్థామని ప్రాణాలతో ఉంచడం పద్ధతి కాదు, ఇలాంటి దుర్మార్గుణ్ణి వెంటనే చంపేయాలి. చంపేయ్‌’’ అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ఆలోచిస్తూ తలొంచుకుని నిల్చున్నాడు. ‘‘అర్జునా! ఆలోచించకు. ఈ అశ్వత్థామ అతి దారుణానికి ఒడిగట్టాడు. నిరపరాధుల్ని, ఉపపాండవుల్ని చంపాడు. నిద్రించేవాణ్ణి, బాలుణ్ణి, విరథుణ్ణి, శరణాగతుణ్ణి, జడుణ్ణి, ఉన్మత్తుణ్ణి, భయపడినవాణ్ణి చంపకూడదంటుంది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకుని కూడా ఈ అశ్వత్థామ చేయరాని పని చేశాడు. ఇలాంటి వాణ్ణి క్షమించకూడదు. నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకో! చంపేయ్‌.’’ రెచ్చగొట్టాడు కృష్ణుడు. అయినా అర్జునుడు అందుకు సిద్ధపడలేదు.


అంతుచిక్కక చూస్తున్న కృష్ణునితో అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. ‘‘కృష్ణా! ఎంత చెడ్డా ఈ అశ్వత్థామ నా గురుపుత్రుడు. గురుపుత్రుడు గురువుతో సమానం అంటారు. అందుకని చంపలేకపోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో.’’ 


విననన్నట్టుగా ఉన్న కృష్ణుణ్ణి ప్రార్థించి ఆఖరికి రథానికి కట్టిన అశ్వత్థామతో పాటుగా ద్రౌపదిని చేరుకున్నాడు అర్జునుడు. శవాన్ని కట్టినట్టుగా రథ చక్రానికి కట్టి ఉన్న అశ్వత్థామను చూసింది ద్రౌపది. 


జాలి చెందింది. తన కుమారులను చంపాడు. కడుపుశోకాన్ని రగిల్చాడు. అయినా అశ్వత్థామ పట్ల ఆ క్షణం ద్రౌపదికి చెప్పలేనంత దయ కలిగింది. నమస్కరించిందతనికి. అర్జునునితో ఇలా అంది. 

‘‘దయచేసి గురుపుత్రుణ్ణి వదలిపెట్టండి.’’ ద్రౌపది మాటకి అక్కడ ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజాదులంతా ఆశ్చర్యపోయారు.

 

‘‘అశ్వత్థామ బ్రాహ్మణుడు. పైగా ధనుర్వేదాన్ని పాండవులకు సంపూర్ణంగా నేర్పిన మహాత్ముడు ద్రోణాచార్యుని కొడుకు. అతన్ని చూస్తూంటే ద్రోణాచార్యుణ్ణి చూస్తున్నట్టుగానే ఉంది. అతన్ని సంహరించడం గురువుని సంహరించడం లాంటిది. వద్దు, అతన్ని విడిచి పెట్టండి’’ అంది ద్రౌపది. 


వినలేదెవరూ. అర్జునుడు కూడా ముఖాన్ని పక్కకి తిప్పుకుని నిల్చున్నాడు. ‘‘స్వామీ’’ అర్జునుని పిలిచింది ద్రౌపది. ‘‘నా మాట విను. అశ్వత్థామను విడిచిపెట్టు. నువ్వు అతన్ని సంహరిస్తే పుత్రశోకంతో అతని తల్లి “కృపి”మరణిస్తుంది. ఆ పాపం మనకి వద్దు. బ్రాహ్మణ శోకం ఎవరికీ మంచిది కాదు’’ అంది ద్రౌపది. 


అయినా అర్జునుడు అందుకు అంగీకరించలేదనిపించడంతో కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది. 

‘‘అన్నా! నువ్వయినా చెప్పు, బ్రాహ్మణవధ కూడదు కదా’’ అంది. అవునన్నట్టుగా తలూపాడు కృష్ణుడు. అర్జునుని సమీపించాడు. 


‘‘అశ్వత్థామ తలలో విలువ కట్టలేని మణి ఒకటి ఉంది. అది కేశాలతో పాటు పుట్టిన శిరోమణి. గొప్ప మహిమ కలది. శిరోజాలు కోసి, ఆ మణి తీసుకో.’’ చెప్పాడు కృష్ణుడు. అర్థం కానట్టుగా చూశాడు అర్జునుడు. 


‘‘తలగొరిగి అవమానించడం, అతని సర్వస్వాన్నీ హరించడం, అతన్ని దేశం నుండి వెళ్ళగొట్టడం... బ్రాహ్మణుల దండనలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆలోచించకు. చెప్పిన పని చెయ్యి’’ అన్నాడు కృష్ణుడు. 


అర్జునుడు అందుకు సిద్ధమయ్యాడు. కృపాణంతో అశ్వత్థామ శిరోజాలు కోశాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న అతని తలలోని దివ్యమణిని చేజిక్కించుకున్నాడు. తృప్తి చెందాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. అశ్వత్థామ కట్లు విప్పి, విడిచి పెట్టాడతన్ని. శిరోమణిని పోగొట్టుకుని, తీవ్ర అవమాన భారంతో క్షీణతేజుడై అశ్వత్థామ అక్కణ్ణుంచి దీనంగా వెళ్ళిపోయాడు. 


ఎంత ఉపసంహరించినా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం మాత్రం పోలేదు. 

‘అపాండవమగుగాక’ అన్నాడు అశ్వత్థామ. అంటే పాండవుల వంశం నశించాలని అతను ఆశించాడు. బ్రహ్మశిరోనామకాస్త్రం అందుకే ప్రయోగించాడు. అయితే ఆనాటికి యుద్ధంలో పోయినవారు పోగా మిగిలింది ధర్మజ భీమార్జున నకుల సహదేవులు అయిదుగురే! పంచపాండవులే మిగిలారు. ఆ అయిదుగురూ దేవతల వరప్రభావంతో వర్థిల్లుతున్నారు. అందువల్ల వారిని ఆ అస్త్రం ఏమీ చేయలేకపోయింది. 


అయితే ఆ సమయానికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉన్నది. ఆమెకు పుట్టబోయే బిడ్డే పాండవ వంశాంకురం. ఆ కారణంగా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భంలోని పిండాన్ని శత విధాల వేధించసాగింది. ఆ బాధను తట్టుకోలేకపోయింది ఉత్తర. గగ్గోలుగా ఏడుస్తూ శ్రీకృష్ణుని ఆశ్రయించింది. అతని పాదాల మీద పడింది. అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం నుండి తన గర్భస్థ శిశువుని కాపాడమని పలువిధాల వేడుకుంది. అభయాన్ని అందించాడు కృష్ణుడు. యోగమాయను ఉత్తర గర్భంలో ప్రవేశపెట్టాడు. ఆమె గర్భస్థ శిశువుని కాపాడాడు. తన చక్రాయుధంతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తుత్తునియలు చేశాడు. అప్పుడు పుట్టిన బాలుడే పరీక్షిత్తు. 


కురువంశాంకురంగా నిలిచి అతను అనేక కార్యాలు చేశాడు. ప్రసిద్ధుడయినాడు. 

తన వంశాన్ని కాపాడినందుకు కుంతి, శ్రీకృష్ణుణ్ణి వేయి విధాల స్తోత్రం చేసింది. అనంతరం ద్రౌపదీసమేతులై పాండవులు శ్రీకృష్ణుణ్ణి వెంటబెట్టుకుని గంగాతీరానికి చేరుకున్నారు. అశౌచస్నానాలు ఆచరించారు. యుద్ధంలో మరణించిన జ్ఞాతులకూ, బంధువులకూ, అంద రికీ ఉత్తర క్రియలు నిర్వహించారు. తిలతర్పణాలూ, జలతర్పణాలూ, పిండప్రదానాలన్నీ నిర్వర్తించి పరిశుద్ధులయినారు.


*(తిరిగి రేపు చదువుదాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం

 🙏అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం 🙏

                  మొదటి భాగం 



.అభిజ్ఞానశాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. వసంత ఋతు వర్ణన చేయబడింది.శాకుంతలము ఒక గొప్ప శృంగార రస భరిత నాటకము

అభిజ్ఞానశాకుంతలమ్ అనేది సంస్కృతం పేరు. తెలుగులో అభిజ్ఞానశాకుంతలము అవుతుంది. దీనిని ఒక్క పదంగానే వ్రాయాలి. విడదీసి రెండు పదాలుగా (అభిజ్ఞాన శాకుంతలము అని వ్రాయకూడదు).

కవికుల గురువు కాళిదాసు తన నాటకానికి శాకుంతలం అని పేరు పెట్టవచ్చు కదా అభిజ్ఞానశాకుంతలమ్ అని ఎందుకు పేరు పెట్టినారు 

అభి అంటే మొగ్గు చూపడం అని అర్థం 

అభిమానం అంటే మానం మీద మొగ్గు చూపడం

అభిజ్ఞానం అంటే జ్ఞానం మీద మొగ్గు చూపడం


శకుంతలకు సంబంధించిన ఈ నాటకానికి కీలకమైన అంశం అంగుళీయము (అంగులీయకము / అంగుళీయకము) రూపంలో ఉన్న గుర్తింపు ముద్ర ద్వారా మరచిపోయినది గుర్తుకురావడం.


దుష్యంతమహారాజు దుర్వాసుని శాపంతో మరచిపోయిన శకుంతలను అంగుళీయము ద్వారా గుర్తుతెచ్చుకుంటాడు. అంగుళీయము ద్వారా గుర్తింపబడి స్వీకరింపబడిన శకుంతలకు సంబంధించిన (శంకుంతల వృత్తాంతాన్ని వర్ణించే) నాటకం కాబట్టి అభిజ్ఞానశాకుంతలమ్ అని పేరు పెట్టబడినది.

శాకుంతలం అంటే శకుంతలకు సంబంధించినది.

ఇది పాణిని రచించిన అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణంలో "తస్యేదమ్"’ అనే సూత్రం ద్వారా ‘సంబంధించిన’ అనే అర్థాన్ని సూచించడానికి శ-మీద ఉన్న హ్రస్వ అకారమునకు దీర్ఘం వచ్చి శా .అయింది ఎలాగంటే, గంగ యొక్క పుత్రుడు గాంగేయుడు అయినట్లుగా.


‘జ్ఞాపకం’ అనే అర్థాన్నిసూచించే ‘జ్ఞా’ అనే ధాతువుకు ‘చెయ్యడం’ అనే అర్థంలో ‘అభి’ అనే ప్రత్యయం చేరి ‘అభిజ్ఞానం’ అనే పదం ఏర్పడింది. అభిజ్ఞాన ప్రధానమైన శకుంతల విషయకమైనది కథ కాబట్టి ‘అభిజ్ఞానశాకుంతలమ్’ అని పేరు పెట్టడం జరిగింది.

దేవలోకములో నర్తకి అయిన మేనక, విశ్వామిత్రుడు చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు దేవేంద్రునిచే పంపబడి, ఆ కార్యము సాధించు క్రమములో విశ్వామిత్రుని వలన ఒక బాలికకు జన్మనిచ్చి, ఆ బాలికను అడవిలో వదలి దేవలోకమునకు వెడలిపోవును. ఆ బాలిక అడవిలోని ఆకులపై పడిన నీటి బిందువులను ఆహారముగా ఒక హంస ద్వారా గ్రహించి ప్రాణము నిలుపుకొనును. అటుపై, ఆ బాలికను మహర్షి కణ్వుడు మార్గమధ్యమున చూసి జాలితో పెంచుకొనుటకు తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, ఆమెకు శకుంతల అని నామకరణము చేయును. శాకుంతలములచే కాపాడబడి, పెంచబడినది కావున శకుంతల అయినది

.

భరతుడి జననానికి సంబంధించిన కథ అత్యంత ప్రాచుర్యం పొందింది.నాటక లక్షణాలలో ఇతివృత్తం ప్రసిద్ధమైయుండాలి. మహాభారతంలోని కథ. ఈ ఇతివృత్తం వ్యాసుడు మహాభారతంలో వ్రాయగా, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలములో మరింత విపులీకరించి దృశ్య కావ్యంగా రచించారు.

దుర్వాస శాప వృత్తాంతం ఎందుకు కల్పించాడో అనకూడదు. ఆయన ఋషి కనుక.ఎందుకు ప్రవేశ పెట్టేడో అనాలి. దానికి కారణం తెలుసుకునే ముందు 

మహాభారతంలోని కథను పరిశీలించాలి. కథ పరిశీలిద్దాం. చూడండి 


 విశ్వామిత్రుడు మేనక వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారాలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుని రాజ్యానికి పంపుతాడు. మొదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

మహాభారతంలోని ఆది పర్వము-చతుర్థాశ్వాసము

ఒక్కసారి పరిశీలిద్దాము.

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట 

అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ

ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్. 


యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశోద్దరకుడు అగునని, నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?

చ.

నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.


తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణన చేసి చెబుతుంది 

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.


అనిన శకుంతలపలుకులు అంగీకరించక దుష్యంతుం డిట్లనియెను 

ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్

మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే. 


నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?

క.

వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,

దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ --(పాఠాంతరము)


ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా?


పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా?


ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత దుఃఖితయై

తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ

బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ

నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి

కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. 


పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.

ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.

వ.

ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. 

చ.

గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే

కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స

ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా

వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును పలుకుతుంది. ఇది భారతములోని కథ. దీనిని యథాతథముగా నాటకంగా వ్రాస్తే నాటక లక్షణాలకు విరుద్ధం.నాయకుడు అసత్యవాది అవుతాడు. సత్యమునే నాయకుడు పలకాలి.

                        సశేషం

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఆనందం,సంతోషం కోసం

 అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ... 

ఇప్పటికీ అర్ధం కాదు...

#పనిచేయటానికి #బ్రతుకుతున్నానా?

లేక #బ్రతకటానికి #పని #చేస్తున్నానా అని !?

జవాబు మాత్రం బ్రతకటానికి అనే మాట నిజమే కదా.


బాల్యంలో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...

పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?

ఆ సమాధానం ఇప్పుడు దొరికింది!

మళ్ళీ బాల్యం కావాలని!

మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని

మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది

వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని


ఔను...

లోకం లాజిక్కుని చూపింది వాళ్ళే మరి!

 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...

జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే!

డబ్బు సంపాదించేటపుడు తెలిసింది.....


నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని


 నవ్వాలని అనిపించినా ...

నవ్వలేని పరిస్థితి...

ఎలా ఉన్నావని ఎవరైనా అడిగినప్పుడు ---

ఓహ్ !

నాకేం బ్రహ్మాండంగా వున్నా!!

అని అనక తప్పనప్పుడు.

ఏడవాలన్నా ఏడవలేని పరిస్థితి!

వాడికేందిరా....

దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు

ఇది జీవిత నాటకం...

ఇక్కడ అందరూ నటులే...

నటించక తప్పదు....

అవార్డుల కోసం కాదు...

బ్రతకటం కోసం !!

కాదు.. కాదు....

బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.


రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....

ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ... 

ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...


సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట.... 

బాహ్య లోకంలో జీవం ఉందా లేదా అని....


మరి మానవ జీవితంలో ఆనందం, తృప్తి, సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!


ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం 

పెరుగుతుందని ఆందోళన ...

ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...


పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు కర్కశత్వం కూడా !


మట్టిలో మొక్కలు నాటాలి...

మనసులో మానవత్వం నాటాలి

ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి....


మళ్ళీ ఒక్క క్షణం...

నాకెందుకులే అని !

సమస్య నా ఒక్కడిదే కాదుగా అని!


నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి

పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు!

నా పని...

నా ఇల్లు...

నా పిల్లలు...

నా...నా.. నా... 

నాతోనే నలిగిపోతున్నా...!

ప్రక్కవాణ్ణి నిందిస్తూ రోజు గడిపేస్తున్నా!


జీవితమన్నది 

తనంత తానుగా...

నడచి పోతుంది…

గడచి పోతుంది.... 

మనకళ్ళముందే.....

మనకు తెలియకుండానే ముగిసిపోతుంది.


చేయడానికి చాలా టైం వుందని

చావు దగ్గర కొచ్చేదాకా చోద్యం చూస్తున్నా!

చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో నడిచిపోతున్నా కనుమరుగౌతున్నా...


ఎవరినో అడిగాను ...

అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?

ఎవరో మహానుభావుడు ఎంతో అందంగా సెలవిచ్చాడు !!!

నిద్ర, సగం మృత్యువట! 

మరి మృత్యువు,ఆఖరి నిద్రట!!


ఆనందం లేని అందం...

తృప్తి లేని జీవితం.... 

ప్లాస్టిక్ పరిమళం..

సెల్ ఫోను సోయగం...

వెరసి ఇదీ నా నాగరిక జీవనం!

 తెల్లారి పోతున్నది...

 రోజుమారుతున్నది..

మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....


ఏంటో జీవితం....

రైలు బండి లా తయారయింది!

ప్రయాణమైతే ప్రతి దినం చెయ్యాలి

చేరే గమ్యం మాత్రం ఎండమావి లా అనిపిస్తుంది!


ఒకడు శాసించి ఆనందిస్తాడు

మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు.


ఒక రూపాయి విలువ తక్కువే కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....

అది లక్ష ఎప్పటికీ కాదు... 

ఆ లక్ష సంపూర్ణం కాదు...


అందుకే...

*మనిషి* లో *మనీ* కోసం కాకుండా,తృప్తి, ఆనందం,సంతోషం కోసం బతకటానికి ప్రయత్నిస్తే !


అదే నిజమైన జీవితమౌతుంది!

From the wall of other person.

శివుడు మన ఇంటికి వస్తాడా

 🪔🙏🪔🙏🪔🙏🪔🙏


శివుడు మన ఇంటికి వస్తాడా??? అంటే 'అవును, వస్తాడు' అనే చెప్పాలి.


ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు, ఇలా జీవిస్తేనే, శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగితే, "వృషభవాహనుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ తల్లీదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే, అమ్మ పార్వతిని వెంట తీసుకొని "జగత్పితయై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ గురువులను గౌరవిస్తూ మసలుకుంటే, బ్రహ్మజ్ఞాన ప్రదాతయైన "శ్రీ దక్షిణామూర్తిగా" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ విడదీయలేని అన్యోన్యతతో భార్యభర్తలు కాపురం చేస్తే, శివుఁడు "అర్ధనారీశ్వరుడై" మన ఇంటికి వస్తాడు.


☞ మనసులో ఉన్న విషపూరిత భావనలను విసర్జిస్తూ నడుస్తుంటే, "నాగాభరణభూషితుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ పిల్లలకు మానవత్వ విలువలను నేర్పుతూ జీవిస్తే, జగజ్జననిని వెంటపెట్టుకొని "గౌరీశంకరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ ఆకలైనవారికి పట్టెడు మెతుకులను వడ్డిస్తూ ముందుకి సాగితే "శ్రీ అన్నపూర్ణాసమేతుడై"శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ దాహమైన వారికి దప్పికను తీరుస్తూ ప్రయాణిస్తే "గంగాధరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ బాహ్య సౌందర్యం మీద ధ్యాస తగ్గించి మనో సౌందర్యాన్ని ఉపాసిస్తూ జీవిస్తే "శ్రీమీనాక్షి అమ్మను వెంటపెట్టుకొని సుందరేశ్వరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనాన్ని కాపాడుతూ జీవిస్తే "శ్రీకామక్షి అమ్మను వెంటపెట్టుకొని ఏకామ్రేశ్వరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ పరమాత్ముడిచ్చిన కన్నులను పెద్దవిగా చేసుకుని ప్రపంచంలో ఉన్న మంచిని చూస్తూ జీవిస్తే "శ్రీవిశాలక్షి అమ్మను వెంటపెట్టుకొని విశ్వనాథుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ అసూయా ద్వేషాలను వదిలి జీవిస్తే భళా అంటూ మెచ్చుకుని "భోళాశంకరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ తోటివారిపైన చల్లటి చూపులను వెదజల్లుతూ జీవిస్తే "కైలాస వాసుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ కాలం కలిసిరాకున్నా ఖచ్చితమైన ఆత్మ విశ్వాసంతో జీవీస్తే "కాలభారవుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ ప్రపంచం మనల్ని చిరిగిన చీటీగా వల్లకాడులో వదిలివెళ్ళిన నాడు "రుద్రుఁడై" శివుఁడు తనలో కలుపుకుంటాడు.


🔱 అనంతాన్ని ఆవరించిన శివుఁడు అందరి మొరను వినగలడు.


🔱 శివుడంటే నాగరికత, శివుడంటే జీవన విధానం, శివుడంటే సర్వం, శివుడంటేనే పర్వం.


🔱 సముద్రాన్ని ఆయనపై ఒలకబోయలేకున్నా, ఆయనపై సముద్రమంత నమ్మకాని పెట్టుకుని నాలుగు గంగనీటి తుంపరలు చల్లినా సరే సంతసిస్తాడు.


🔱 శివుడు కేవలం విగ్రహంలో మాత్రమే కాదు , మన మనో నిగ్రహంలో ఉంటాడు.


🔱 తాను సృష్టించిన వస్తువులను తనకివ్వడంతో శివారాధన పూర్తికాదు, మనది అనుకున్న తనదాన్ని(నేను అనే అహాన్ని) తనకివ్వడంతోనే శివారాధన పరిపూర్ణం.


🕉 ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు , ఇలా జీవిస్తేనే శివుఁడు మన ఇంటికి వస్తాడు.

ఇంటికి రావడమేంటి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాడు.


🙏 అప్పుడు జన్మకో శివరాత్రి కాదు, జన్మమే శివరాత్రి. ప్రతి రోజూ శివరాత్రి 🙏


🪔🪔🪷🪷🪷🪔🪔🪔

పితాధర్మః

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


  శ్లో|| *పితాధర్మః పితాస్వర్గః*

        *పితా హి పరమంతపః*

        *పితా ప్రీతి హి మాపన్నే* 

       *సర్వాః ప్రీయన్తి దేవతాః*


*తా|| తండ్రిని సేవించడమే ధర్మము. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం. ధర్మవర్తనుడైన తండ్రిని అనుసరించడమే తపస్సు. తండ్రిని ప్రసన్నముగా ఉంచితే సమస్తదేవతలు మనకు ప్రసన్నులు అవుతారు*.


✍️🌹🌺🌷🙏

నేటి తిరుప్పావై ప్రవచనం‎ - 14 వ రోజు*_

 _*నేటి తిరుప్పావై ప్రవచనం‎ - 14 వ రోజు*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*వేదమే ప్రమాణం*



☘☘☘☘☘☘☘☘☘




*14. వ పాశురము*




*ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్*

*శెంగరునీర్ వాయ్ నెగిర్* *అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్*

*శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్*

*తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్*

*ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్*

*నంగాయ్ ! ఎరుందిరాయ్ నాణాదాయ్ ! నావుడైయాయ్*

*శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం*

*పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్*



మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది.  ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం , అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం , ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మర్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట , చేత , మన ఆచారం , మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం , మహా భారతం , పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపల గోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా , అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది. 


*"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్"* ఎర్ర కలవలు వికసిస్తున్నాయి *"ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్"* నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి , రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు , నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు.  లేదమ్మా అయితే , *"ఉంగళ్ పురైక్కడై"* నీ ఇంటి పెరటి *"త్తోట్టత్తు వావియుళ్"* తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావల్సిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ *"నీ"* అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది , నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి , పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు , ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని , శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు , గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు.  పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక. 


*"శెంగల్పొడి క్కూరై"* కాషాయాంభరధారులు *"వెణ్బల్ తవత్తవర్"* తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు *"తంగళ్ తిరుక్కోయిల్ "* ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి *"శంగిడువాన్"* తాళాలు తెరువడానికి *"పోగిన్ఱార్"* వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు.  తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది , అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి , లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి , తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది. 


అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం , అంటూ   *"ఎంగళై"* మమ్మల్నందరిని *"మున్నం ఎరుప్పువాన్"*  ముందే లేపుతాను అని *"వాయ్ పేశుమ్"* వాగ్దానం చేసావు. *"నంగాయ్!"* పెద్ద పరిపూర్ణురాలివే !  *"ఎరుందిరాయ్"* లేవమ్మా *"నాణాదాయ్!"* నీకు సిగ్గు అనిపించటంలేదా *"నావుడైయాయ్"* పెద్ద మాటకారిదానివి. 


జ్ఞానులు తమ హృదయంలో  భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో.  లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో *" శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ"* 

ఆమె హృదయం , దానిలో దహరాకాశం , అందులో స్వామి , ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం , నీవు ఆ యోగ్యత కల్గిన దానివి , నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

శ్రీ గజేంద్ర వరధ పెరుమాళ్ ఆలయం- (కపిస్థలం)

 🕉 108  శ్రీ వైష్ణవ దివ్య దేశాలు : 

      28వ దివ్యదేశం.


🛎గజేంద్ర మోక్షణ ఘట్టo ప్రదేశం :


శ్రీ గజేంద్ర వరధ పెరుమాళ్ ఆలయం- (కపిస్థలం)

కుంభకోణం 🙏


@ ప్రధాన దైవం : గజేంద్ర వరదన్ (విష్ణుమూర్తి)

@ ప్రధాన దేవత : రమామణి వల్లి (లక్ష్మీదేవి)

@ పుష్కరిణి : గజేంద్ర పుష్కరిణి

@ విమానం : గగనాకార విమానము


👉 శ్రీ రామావతారమున ఆంజనేయునకు చిరంజీవి పదమును అనుగ్రహించిన పరమాత్మ స్థలమును మరొక్కసారి ఆంజనేయులు ప్రార్థనకు, భక్తికి, ప్రేమకి, సేవకి,.. ప్రసన్నత చెంది భుజంగశయన మూర్తిగా దర్శన మిచ్చెను . 


👉కప్పి (ఆంజనేయుడు ) ని అనుగ్రహించిన కారణమున ఈ స్థలమునకు కపిస్తలం   అని పేరు వచ్చినది. 


   🛎స్థల పురాణం : 🛎


👉 పురాణాల ప్రకారం, విష్ణువు ఆరాధనలో మునిగిపోయిన ఇంద్రద్యుమ్నుడు, ఒక రోజు ఆరాధన చేస్తున్నప్పుడు, ఇంద్రద్యుమ్నుడును చూసేందుకు వచ్చిన దుర్వాస మహర్షిని గమనించలేదు. 

మహర్షి కి  చిరాకు వచ్చి రాజు తన తదుపరి జన్మలో ఏనుగుగా పుట్టమని శపించాడు. క్షమాపణ చెప్పిన తరువాత, దుర్వాసుడు  ఇంద్రద్యుమ్నుడు మీద జాలిపడి, తాను ఏనుగులాగా విష్ణు భక్తుడిగా కొనసాగుతాడని , విష్ణు అతన్ని శాపం నుండి ఉపశమనం  మరియు మోక్షాన్ని కలగాచేస్తాడని ఇంద్రద్యుమ్నుడుని ఆశీర్వదించాడు.


👉 ఒక రోజున కొలను లోనికి కమలములకై దిగగా ఒక మొసలి ఆ గజేంద్రుడు కాల్ నోటితో పట్టుకొనేను.

 మొసలి పట్టు నుండి తన కాలును విడిపించుకొనుటకై తన సర్వ శక్తి యుక్తులు నిష్ఫలము కాగా సంపూర్ణ శరణాగతితో హృదయమున శ్రీహరిని కించిత్తు వెలితి కూడ లేక నిండుగా స్థిరీకరించుకుని తలను పైకెత్తి శ్రీహరిని పిలుచుచూ తన బాధను విన్నవించుకొని రక్షణకై ప్రార్థించగా.... శ్రీ మహావిష్ణువు గజేంద్రుని కాలును మొసలి నోటి నుండి సుదర్శన చక్రాయుదము తో ఉద్ధరించి కరుణించి రక్షించెను .

 ఆ గజేంద్రునకు భుజంగశయనునిగా దర్శనముచ్చి అనుగ్రహించి మోక్షమును ప్రసాదించెను .

 

👉ఈ సందర్భమున ఒక విషయమును ప్రస్తావించుకొన వలయును . ఈ గజేంద్ర మోక్షపురాణమును మనము మరి కొన్ని ప్రదేశములలో కూడ గమనించగలము.


👉 ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తిరుపతి సమీపవర్తి ( 25 కి.మీ. ) కార్వేటి నగరం శ్రీవేణుగోపాలస్వామి ఆలయమునకు చేరువలో ఉన్న స్కంధ పుష్కరిణి కూడా  గజేంద్రోద్ధరణ పుష్కరిణి అని , మకరవేటి నగరము కార్వేటి నగరములు అని అందురు . 

 

👉బీహారు రాష్ట్రమున గండకినది గంగా నదిలో సంగమించిన ప్రదేశము ఉన్న సోన్ పూర్ కూడ గజేంద్రోద్ధార క్షేత్రముగా ప్రసిద్ధి పొందియుని విన


👉 ప్రస్తుతము నేపాలు దేశములో ఉన్న - పోఖరా , నారాయణ మాల్ లు మీదుగా పోయిన త్రివేణి ఘాట్  వచ్చును . ఆ త్రివేణి ఘాట్ లో శ్రీమహావిష్ణువు గజేంద్రమోక్షం  కావించిన ప్రదేశము అని కూడా ఒక నమ్మకం.


🙏జై శ్రీమన్నారాయణ🙏

ఏకాకి అయిపోతున్నాడు

 ఏకాకి అయిపోతున్నాడు

మనిషి

తల్లడిల్లిపోనున్నాడు

ఏదో ఒక రోజున...


ఉదయమే

మేల్కొల్పడానికి

అమ్మ అక్కర్లేదు

-Alaram app ఉంది!


నడక వ్యాయామానికి

మిత్రుడి తోడక్కర్లేదు

-Step counter ఉంది!


వండి పెట్టడానికి

అమ్మ అక్కర్లేదు

- Zomoto, Swiggy app ఉన్నాయి!


ప్రయాణం చేయడానికి

బస్సు అక్కర్లేదు

-Uber, ola app ఉన్నాయి!


అడ్రెస్ కనుక్కోవడానికి

టీ కొట్టోడో

ఆటో డ్రైవరో అక్కర్లేదు

 - Google map ఉంది!


పచారీ సామాన్లు 

కొనడానికి

ఇంతకాలమూ అందుబాటులో

ఉన్న కిరాణా దుకాణంతో

పని లేదు 

- big basket ఉంది!


బట్టలు కొనుక్కోవడానికి

దుకాణానికి వెళ్ళక్కర్లేదు

-Amazon, flipkart app ఉన్నాయి!


వెళ్ళి ప్రత్యక్షంగా కలిసి

నవ్వుకుంటూ మాట్లాడుకోవడానికి

మిత్రుడక్కర్లేదు

-Whatsapp, facebook వంటివి ఉండనే ఉన్నాయి!


అప్పిమ్మని అడగడానికి

సన్నిహితుడో దగ్గరి బంధువో

ఉండక్కర్లేదు

-Paytm app ఉంది!


మరిన్ని విషయాలు

తెలుసుకోవడానికి

-Google ఉండనే ఉంది!


ఇలా

ఏకాకిగా బతకడానికి

అన్ని రకాల వసతులూ

ఉన్నాయి

app అనే భూతం రూపంలో.


చిక్కుకుపోతున్నాం

app వలలో

ఇవతలకు రాలేనంతగా


అప్పుడప్పుడైనా

సన్నిహితులను 

కలవడానికీ

కబుర్లాడడానికీ

మనసారా నవ్వుకోవడానికీ

వీధులోకొద్దాం...


app రాకాసి గుప్పెట్లో నుంచి

ఇవతలకొచ్చి కాస్సేపైనా 

నలుగురి మధ్యా

సరదా సరదాగా

గడుపుదాం


ఎప్పటికీ

ప్రేమతో