*యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-101
ఆలోక్యతే చేతనయాఽ నువిద్దా
పయోలఽ నుబద్ధోఽ స్తనయో నభఃస్థాః,
పృథగ్విభాగేన పదార్థలక్ష్మ్యా
ఏతజ్జగన్నేతరదస్తి కించిత్.
పంచమహాభూతములగు పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము లైదును పరస్పరము కలసి గోవు, ఘటము ఇత్యాది నానా పదార్థ జాతము ఏర్పడుచున్నది. కాని అవివేకులిట్టి జడ పదార్థరూపమగు జగత్తును చేతనముగ తలంచుచున్నారు. వివేక దృష్టిచే ఆయా పదార్థములను వేఱు వేఱుగ విభజించి చూచినచో ఈ జగత్తు పంచభూతములకంటె వేఱుగ ఒకింతైనను లేదని తెలియబడగలదు.
1-102
అద్యాపి యాతేఽ పి చ కల్పనాయా
ఆకాశవల్లీ ఫలవన్మహత్త్వే
ఉదేతి నో లోభలవా హతానా
ముదార వృత్తాంతముయీ కథైవ.
యౌవనావస్థయందు ఆశాలతా ఫలమువలె మిథ్యారూపములగు భోగములందు మహత్త్వము (ఉత్తమ పదార్థము) ను గూర్చిన కల్పన సంభవించుచుండ విషయభోగ, ధనాదిలోభలేశముచే నశించు మనుజుల చిత్తమున
సర్వోత్కృష్టుడు అగు పరమాత్మ యొక్క వృత్తాంతమయమగు కథకూడ ఉదయించుట (రుచించుట) లేదు. ఇక నిరంతర పరమాత్మ విచారణనుగూర్చి వేఱుగా చెప్పవలయునా?
1-103
ఆదాతుమిచ్ఛన్పదముత్తమానాం
స్వచేతపైవాపహతోఽ ద్య లోకః
పతత్యశఙ్కం పశురద్రికూటా
దానీలవల్లీ ఫలవాంఛయైవ.
ఉత్తమ భోగములను, రాజ్యధనాదులను సంపాదింప దలంచి వానికొరకై ప్రయత్నించుచు జనులు రాగలోభాది దూషితమగు తమ చిత్తము చేతనే కొట్టబడినవారై (భిన్నులై) పచ్చని తీగయొక్క ఫలమును గూర్చిన కోర్కెచే పర్వతశిఖరమందలి విషమస్థానము నుండి పశువు క్రిందికి పడిపోవునట్లు నిస్సందేహముగ పతనము నొందుచున్నారు.
1-104
యచ్చేదం దృశ్యతే కించిజ్జగత్థ్సావరజంగమమ్
తత్పర్వ మస్థిరం బ్రహ్మన్స్వప్న సంగమసంవిభమ్.
మహాత్మా! ఈ కానివించు స్థావర, జంగమాత్మకమగు (చరాచర) ప్రపంచమంతయు స్వప్నమందలి జనుల కలయికవలె అస్థిరమైనది.
1-105
యదఙ్గమద్య సంవీతం కౌశేయస్రగ్విగ్విలేపనైః
దిగంబరం తదేవ శ్వో దూరే విశరతాఽ వటే.
ఏ శరీరము నేడు పట్టువస్త్రముల చేతను, పుష్పముల చేతను, అనేక సుగంధద్రవ్య లేపనములచేతను జుట్టబడియున్నదో, ఆ శరీరమే రేపు దిగంబరముగ నున్నదై, దూరముగ నున్న ఒకానొక గోతియందు క్రుళ్ళి నశించుచున్నది.
1-106
యత్రాద్య నగరం దృష్టం విచిత్రాచారచంచలమ్
తత్రైవోదేతి దివసైః సంశూన్యారణ్యధర్మతా.
ఎచట నేడు అనేక విచిత్రములగు ఆచారములచేతను, క్రియల చేతను చంచల
మైనట్టి నగరము గాంచబడినదో, అచటనే కాలక్రమమున శూన్యమగు అరణ్యము ఉదయించుచున్నది. *యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-107
యం పుమానద్య తేజస్వీ మండలాన్యధితిష్ఠతి
స భస్మకూటతాం రాజన్దివసై రధిగచ్చతి.
ఎవడు నేడు గొప్ప తేజస్వియై చక్రవర్తియై రాజ్యమేలు చున్నాడో, ఆతడే కొలది దినములకు బూడిదకుప్ప అగుచున్నాడు.
1-108
అరణ్యానీ మహాభీమా యా నభోమండలోపమా పతాకాచ్ఛాదితాకాశా సైవ సంపద్యతే పురీ.
ఎచట ఆకాశసదృశమగు విశాలమైన, మహా భయంకరమైన అరణ్యము నేడు వర్తించుచున్నదో, అచటనే కొలది కాలములో అనేక పతాకములచే ఆకసమును గప్పునట్టి నగరము ఉద్భవించుచున్నది.
1-109
సలిలం స్థలతాం యాతి స్థలీభవతి వారిభూః విపర్యస్యతి పర్వం హి సకాష్ఠాంబుతృణం జగత్.
జలమయస్థానము స్థలమయ మగుచున్నది. స్థలమయముగ నున్నది జలమయ మగుచున్నది. ఈ ప్రకారముగ కాష్ఠ, జల, తృణసహితమగు ఈ జగత్తంతయు విపరీతభావమును బొందుచున్నది.
1-110
అనిత్యం యౌవనం బాల్యం శరీరం ద్రవ్యసంచయాః భావాద్భావాన్తరం యాన్తి తరఙ్గవదనారతమ్.
బాల్యము అనిత్యము, యౌవనము అనిత్యము, శరీరము అనిత్యము, పదార్థములన్నియు అనిత్యములే. ఏలయనిన, సమస్త పదార్థములును, తరంగములవలె నిరంతరము తమ పూర్వ స్వభావమును, రూపమును వదలి మఱియొక స్వభావమును బొందుచున్నవి.
1-111
వాతాన్తర్దీపక శిఖాలోలం జగతి జీవితమ్ తడిత్స్ఫురణసంకాశా పదార్థ శ్రీర్జగత్త్రయే.
ఈ ప్రపంచమున జీవితము గాలి మధ్యనుంచబడిన చిన్నదీపము యొక్క కొనవలె చంచలమైనది, ముల్లోకములందలి పదార్థములు మెఱుపుయొక్క వెలుగువలె క్షణభంగురమైనవి.
1-112
దివసాస్తే మహాన్తస్తే సంపదస్తాః క్రియాశ్చ తాః
సర్వం స్మృతిపథం యాతం యామో వయమపి క్షణాత్.
ఆ వైభవముతో గూడిన దినములు, ఆ సంపదలు, ఆ క్రియలు అన్నియు గడచిపోయి ఇపుడు స్మరణమాత్రము లాయెను. ఇక మనము గూడ క్షణములో వెడలుచున్నాము.
*యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-119
ఘటస్య పటతా దృష్టా పటస్యాసి ఘటస్థితిః
న తదస్తి న యద్దృష్టం విపర్యస్యతి సంసృతౌ.
కుండ పగిలి మట్టి కాగా, అది ప్రత్తిచేనులో వేయబడి క్రమముగ ప్రత్తిగాను, దారముగాను, వస్త్రముగాను పరిణతి జెందుట గాంచబడుచున్నది. ఈ ప్రకారముగ కుండ వస్త్ర మగుచున్నది. అట్లే వస్త్ర మున్ను కుండగా మారుచున్నది; వెయ్యేల ఈ ప్రపంచమున పరిణామము నొందని వస్తువే లేదు.
1-120
తనోత్యుత్పాదయత్యత్తి నిహంత్యాసృజతి క్రమాత్
సతతం రాత్ర్యహనీవ నివర్తన్తే నరం ప్రతి.
వృద్ధి, విపరిణామ అపక్షయ, వినాశ, పునర్జన్మములను ఈ ఐదు వికారములున్ను క్రమముగ రాత్రింబగళ్ళవలె మనుజుని వద్దకు నిరంతరము వచ్చుచు పోవుచున్నవి.
1-121
బాల్యమల్పదినైరేవ యౌవనశ్రీస్తతో జరా
దేహేఽప పి నైకరూపత్వం కాస్థా బాహ్యేషు వస్తుషు.
కొలది దినములలో బాల్యము గడచిపోవుచున్నది; ఆ పిదప యౌవనము, ఆ పిమ్మట వార్ధక్యము ఏతెంచి గడచిపోవుచున్నవి. ఈ ప్రకారముగ దేహమందే ఏకరూపత్వము లేకయుండ, ఇక బాహ్య వస్తువులందు ఏకరూపత్వ, స్థిరత్వములగూర్చి విశ్వాసమేమి?!
1-122
సమవిషమవిపాకతో విభిన్నా
స్త్రిభువనభూతపరంపరాఫలౌఘాః
సమయపవనపాతితాః పతన్తి
ప్రతిదినమాతతసంసృతిద్రుమేభ్యః
కర్మలయొక్క సమ, విషమ పరిపాకముచే విభిన్నరూపులగు ముల్లోకము లందలి ప్రాణికోట్ల యొక్క శరీరములను ఫలసమూహములు, సంసారమను విశాలవృక్షముల నుండి కాలమను వాయువుచే పడగొట్టబడి ప్రతిదినము క్రిందకు పడిపోవుచున్నవి.(కావున నిట్టి సంసారమందు విశ్వాసము గలిగియుండరాదని భావము.)
1-123
ఇతి మే దోషదావాగ్నిదగ్ధే మహతి చేతసి
ప్రస్ఫురన్తి న భోగాశా మృగతృష్ణాః సరఃస్వివ.
ఈ ప్రకారముగ విషయములందలి దోషదర్శనమను దావాగ్నిచే సంసారము నెడల విశ్వాసమగు బీజము దగ్ధము కాగా వివేక యుక్తమగు నా చిత్తమున సరోవరములందు మృగతృష్ణ స్ఫురింపనట్టు భోగాశ స్ఫురింపకున్నది.
1-124
రాజ్యేభ్యో భోగపూగేభ్యశ్చిన్తావద్భ్యో మునీశ్వర నిరస్తచిన్తాకలితా వరమేకాన్తశీలతా.
ఓ మునీశ్వరా! చింతాగ్రస్తములగు రాజ్యములకంటెను, భోగసమూహముల కంటెను, చింతారహితమగు ఏకాంతవాసమే ఉత్తమము.
[10/06, 9:36 pm] K Sudhakar Adv Br: *యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-113
తిర్యక్త్వం పురుషా యాన్తి తిర్యఞ్చో నరతామపి
దేవాశ్చాదేవతాం యాన్తి కీమివేహ విభో స్థిరమ్.
మహాత్మా! మనుజులు పశుపక్ష్యాది జన్మల నొందుచున్నారు; పశుపక్ష్యాదులు మనుష్యజన్మ నొందుచున్నవి; దేవతలు దేవతా జన్మను వీడి మఱియొక్క జన్మను బొందుచున్నారు; ఇక ఈ ప్రపంచమున స్థిరమైన వస్తువేది?
1-114
ద్యౌః క్షమావాయురాకాశం పర్వతాః సరితో దిశః
వినాశవాడవస్యైతత్సర్వం సంశుష్కమింధనమ్,
స్వర్గాది లోకములు, భూమి, వాయువు, ఆకాశము, పర్వతములు, నదులు, దిక్కులు - ఇవి యన్నియు వినాశమను అగ్నికి బాగుగ ఎండినట్టి కట్టెలై పరగుచున్నవి.
1-115
ధనాని బాన్ధవా భృత్యా మిత్రాణి విభవాశ్చ యే
వినాశభయభీతస్య సర్వం నీరసతాం గతమ్.
అనేక విధములగు ధనములు, బంధువులు, సేవకులు, మిత్రులు వైభవములు - ఇవి యన్నియు వినాశచింతచే భయభీతుడగు మనుజునకు నీరసములుగా తోచును.
1-116
స్వదన్తే తావదేవైతే భావా జగతి ధీమతే యానత్స్మృతిపథం యాతి న వినాశకురాక్షసః.
వినాశమను దుష్టరాక్షసుడు జ్ఞాపకము రానంతవఱకే బుద్ధిమంతునకు ప్రపంచమున ఈ ధనాది పదార్థము లన్నియును రుచించును.
1-117
ఆపదః క్షణమాయాన్తి క్షణమాయాన్తి సంపదః
క్షణం జన్మ క్షణం మృత్యుర్మునే కిమివ న క్షణమ్.
మునీశ్వరా! క్షణములో ఆపదలు అరుదెంచును, మఱల క్షణములో సంపదలు వచ్చును. క్షణములో జన్మ, క్షణములో మృత్యువు, ఇక క్షణికము కానిదెయ్యది?
1-118
ప్రాగాసీదన్య ఏవేహ జాత స్త్వన్యో నరో దినైః
సదైకరూపం భగవన్కించిదస్తి న సుస్థిరమ్.
మహాత్మా! పూర్వమున్న మనుజుడే కొలది దినములలో ఇపుడు మఱి యొకడైనాడు. (అన్యరూపమును బొందినాడు)! ఈ ప్రపంచమున సదా ఏకరూపము గల్గినట్టియు, సుస్థిర మైనట్టియు పదార్థ మేదియును లేదు.