10, జూన్ 2023, శనివారం

స్వామివారు స్పెయిన్ వచ్చారా?

 స్వామివారు స్పెయిన్ వచ్చారా?


“వారు భగవంతుని యొక్క కలియుగ అవతారం” స్పెయిన్ సందర్శకుడు.


స్పెయిన్ దేశపు రాజకుటుంబానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆయన స్పానిష్ ప్రసంగాన్ని ఒకతను స్వామివారికి తర్జుమా చేస్తున్నారు.


స్పెయిన్ రాష్ట్రపతి గురించో అక్కడి వాతావరణం గురించో స్వామివారు అడిగి ఉండవచ్చు. లేదా అక్కడి ప్రజల అలవాట్లు, పద్ధతుల గురించో అడగొచ్చు. ఎన్నో పత్రికలు, మాధ్యమాల వల్ల ఇప్పటికే అందరికీ అటువంటి విషయాలు తెలిసివుంటాయి.


కానీ స్వామివారు ఆ స్పానిష్ రాజప్రతినిధిని ఇవేవీ అడగలేదు. స్వామివారు ఏమి అడిగారో చూద్దాం.


“మీ రాజప్రాసాదంలో పాత ప్రాసాదము, కొత్త ప్రాసాదము అని రెండు ప్రాసాదాలు ఉన్నాయా?”


“అవును”


“ఇప్పుడు మీరు ఏ ప్రాసాదంలో ఉంటున్నారు?”


“కొత్త ప్రాసాదం” అని బదులిచ్చారు ఆ సందర్శకుడు.


“అక్కడ మీకు నీరు మొదలైన ఇతర సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయా?”


“అవును, కొత్త ప్రాసాదం చాలా సౌకర్యవంతంగా ఉండడం వల్ల అక్కడే ఉంటున్నాము”


తరువాత స్వామివారు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు.


అయితే, మీరు నిరుపయోగంగా ఉన్న ఆ పాత రాజప్రాసాదాన్ని ఒక తోటగా మార్చేయండి. మహాస్వామివారి మాటలను విన్న ఆ స్పానిష్ దౌత్యవేత్తకి మనస్సులో పెద్ద అనుమానం వచ్చింది.


తనదేశంలో ఉన్న ఒక చోటు గురించి, దానికి చెయ్యాల్సిన మార్పుల గురించి ఎలా ఈ మహాత్ములకు తెలిసింది అని ఆలోచిస్తున్నారు? “స్వామివారు స్పెయిన్ దేశానికి ఎప్పుడు వచ్చారు?” అని ద్విభాశిని అడిగారు.


ఆ ద్విభాషి ఆ విషయాన్ని స్వామివారికి చెప్పేలోపలే మహాస్వామివారు ఆ స్పానిష్ దౌత్యవేత్తకి కేవలం సంజ్ఞ ద్వారా సమాధానం తెలిపారు. స్వామివారు తమ అమృత హస్తాలతో గాలిలో గుండ్రంగా వేలితో చూపించి, కారుణాపూరితమైన మందహాసం చేసి ఆ స్పానిష్ వ్యక్తివైపు చూశారు.


“మహాస్వామి వారు భగవంతుని యొక్క కలియుగ అవతారం” అని స్పెయిన్ సందర్శకుడు తెలుసుకున్న తరువాత స్వామివారి దివ్యా చరణాలకు సాష్టాంగ వందనం చేసి ఆశీస్సులను అందుకున్నాడు.


--- రా. వేంకటస్వామి. “కంచి మహనిన్ కరునై ఉళ్ళమ్” పుస్తకం నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: