*మడి - ఆచారాలు...*
బ్రాహ్మణ జాతిలో ఆచరించే మడి - ఆచారాలు రాను రాను జాతిలో కనుమరుగవుతున్నాయి. బయటవారిలోనే కాదు, బ్రాహ్మణ జాతి లోని యువతలోనూ అవి హాస్యాస్పదంగా, అర్థరహితంగా కనబడుతున్నవి. అందుకు కారణం ఏమిటంటే, అందులో వున్న అంతరార్ధం విడమరచి చెప్పలేక పోవడం.
ఇప్పటికే, గుడీ, దైవ సంబంధమైన సామూహిక కార్యక్రమాలలో, దైవ కార్యాలు చేసే/చేయించే బ్రాహ్మణులు కూడా మడి అంతగా పాటించడం లేదు చాలాచోట్ల. మనముందే వాళ్ళు వేసుకున్న షర్టు విప్పేసి, మెడలో ఉత్తరీయం వేసుకుని ' ఓం ! ' అని పనులు మొదలు పెట్టిస్తున్నారు.
ఏదైనా దైవకార్యం నిర్వర్తించేటప్పుడు, ముందుగా ఆ దేవతను ఆహ్వానించే పద్దతి మనకు వున్నది. ప్రాణాయామం చెయ్యమనడానికి బదులు పురోహితుడు, ' మీ ముక్కులు పట్టుకోండి. ' అంటాడు. మనం పట్టుకుంటాం. ఆచమనం, ప్రాణాయామం అంత: శుద్ధి కని ఆయన చెప్పడు, మనకూ తెలీదు. అయినప్పటికీ ఇప్పటికీ మంత్రాల ద్వారా చెబుతూనే వున్నారు, అందులో మార్పు ఏమీలేదు.
అర్ధమైన వారికి అర్ధం అవుతుంది. అర్ధం కాని వాళ్ళు పురోహితుడు, ' చేతులను మీ వైపు తిప్పుకోండి ' అని చెప్పి ఆ దేవతని ' ఆవాహయామి ' అని మన చేత చెప్పిస్తారు. అలాగే కార్యక్రమం అయిన తరువాత, ' మంత్రహీనం, క్రియాహీనము.. ' చెప్పించి, ఆ దేవతకు ఉద్యాపన చేయించి ఈశాన్యం వైపుకు జరిపిస్తారు. ఇదంతా, ' కార్యక్రమం మొదలు, తుది ' అని తెలుసు కానీ, ఆ దేవతలు మనతో అప్పటిదాకా వున్నారన్న భావం మనకు రాదు.
ఇవన్నీకూడా మనచేత చేయిస్తారు. అయినా మనకు అవేమీ పట్టవు. వచ్చిన బంధువులను చూస్తూ, 'కాఫీలు తాగారా, టిపినీలు తిన్నారా ! ' అని వాళ్ళను నవ్వుతూ పలుకరిస్తూ, వచ్చిన వాళ్ళచేతనే, ' మీరు కార్యక్రమం చేసుకోండి. మేము మాకు కావలసినవి చూసుకుంటాము, ' అని చెప్పించుకుంటాము. మీ తమ్ముళ్లతోనో, కుటుంబ సభ్యులతోనో వారు గడుపుతారు.
ఈలోపు ఇంకొక చుట్టమో, స్నేహితుడో, మన ఆఫీసరో వస్తాడు. మళ్ళీ ఇదే తతంగం. ఇంతకుముందు రోజుల్లో, పురోహితులు మధ్యలో కర్తను ఎవరైనా మాట్లాడిస్తే, అభ్యంతరం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆలా చేస్తే, ' మళ్ళీ పిలవరేమో ' అని వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్ లతో మధ్య మధ్యలో కాలక్షేపం చేస్తూ వుంటారు.
అదే విధంగా సంధ్యావందనం సమయంలో, ' ఆయాతు వరదా దేవీ... ' అని చెప్పినప్పటినుంచి, గాయత్రీ, సావిత్రి, సరస్వతి మొదలైన దేవతలను మనమీదకు ఆహ్వానించుకుంటాము. తిరిగి ' ఉత్తమే శిఖరే జాతే.. ' అనిచెబుతూ ' గచ్ఛదేవి యధా సుఖం ' అని చెప్పేదాకా అమ్మలంతా మనతోనే వున్నారన్న మాట. ఇంత విశదంగా ఏ బ్రాహ్మలూ చెప్పరు. మనమూ తెలుసుకోవాలని అనుకోము.
అలాగే, పూర్వం రోజుల్లో, ఇళ్లల్లో ఆడవారు కూడా, ఏటికివెళ్లి నీళ్లు తెచ్చుకునేటప్పుడు, జలదేవతను ఆరాధించి నీళ్లు బిందెలతో నింపుకునేవారు. ఆ దేవత వారితో వున్నదనే భావనతో ఇంటికివచ్చి, దానితో వంట కార్యక్రమాలు చేసేవారు. అలాగే అగ్ని. అగ్నిని ఆవాహన చేసి, జలంతో వంటచేస్తూ, ' అన్నం పరబ్రహ్మ స్వరూపం. ' అనే భావనతో, బియ్యాన్ని వండుతూ, శాకంబరీ దేవతగా కూరగాయలను తయారు చేసుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి యజమాని పూజకు సహాయం చేస్తూ వుండేవారు.
ఇప్పుడు చెప్పండి. అలాంటివారికి, వారిని ఎవరైనా ముట్టుకున్నా, అపరిశుభ్రమైనవి ఏమైనా కనబడినా, తగిలినా, ఏదో అపరాధనా భావము కలిగి, వాటిపై శుద్ధి నిమిత్తం నీరు చల్లడము, ' విష్ణు: ,విష్ణు: అనీ శివ: శివా ' అనీ అనడమూ తిరిగి పనిలో మునిగిపోవడం ఆనవాయితీ.
జలం మానవుడికీ, దేవతలకూ అనుసంధానమైన పంచభూతములలో ఒకటి. అందువలన నీటితో ఆ గిన్నెపైనో, బట్టపైనో శుద్ధి కార్యక్రమం చేసేవారు, వీలయితే తిరిగి స్నానం చేసేవారు. ఇక్కడ ' నీళ్లు చల్లితే మైల, మడి అయిపోతుందా? ' అని ప్రశ్నలు యువతరం వేస్తారు. ' నీళ్లు గుమ్మరించుకుంటే, శుద్ధి అయిపోతారా ? ' అని వితండవాదం చేస్తారు. ఆ జలం ద్వారా, అప్పటికే వారు దేవతను ఆహ్వానించుకుని వుండడం వలన, ఆ దేవతను సంతృప్తి పరచే కార్యం శుద్ధి చేసుకోవడం.
ఇదంతా ఎవరూ చెప్పరు. ఎంత సేపటికీ, ' పసుపు వాడితే బ్యాక్తీరియా పోతుంది. ఇంకేదో చేస్తే క్రిమి కీటకాలు పోతాయి ' అని చెబుతారు కానీ. ' మనది కర్మభూమి. దైవభూమి. మనము దేవతలను నమ్ముతాము. దేవతల ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నాము. ' అని ఢంకా బజాయించి యెవరూ చెప్పరు. ఇంకా హేళన చేస్తారేమో అని భయం. ఉన్న విషయం చెప్పడానికి మనకూ తెలియాలి కదా !
పెద్దలు, పండిత శ్రేష్ఠులు, అనేకమంది మన మిత్ర సమూహంలో వున్నారు. దీనిపై ఇంకా స్పందించి యువతలో మన మడి ఆచారాలమీద చులకన భావన పోయేటట్లు చేయగలరని మనవి. ముందు మన బ్రాహ్మణ యువతకు ఇవి అర్ధమైతే, మిగిలిన వారికీ చెప్పగల పరిస్థితిలో మనం వుంటాము.
మనకే అర్ధంగాక, దైవకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా, మడి కట్టుకున్నవాళ్లకు దూరంగా వుండమని చెప్పలేకపోవడం మన దౌర్భాగ్యం. ' ఆయన అట్లాగే అంటాడు లేవయ్యా, అరవై దాటినాయి కదా ! చాదస్తం. ' అనే స్థితి మనకు రాకుండా మనలను మనం, కాపాడుకుందాం.