23, ఆగస్టు 2022, మంగళవారం

కాఫీగురించి

 *కాఫీగురించి రెండుపద్యాలు.....*  



కప్పు కాఫిని లొట్టలేయుచు కాంక్ష తోడుత త్రాగగా 

సిప్పు సిప్పున మోదమందుట చిత్రమౌట నటుంచుమా!

ఎప్పుడైన పరాయి యిండ్లకు నేగ కాఫిని పోయమిన్ 

చిప్పమోమట దిక్కుగా మన సిగ్గు పోవదె తల్చగా 


చింతజేయగ కాఫి త్రావుట చిత్రమౌ వ్యసనమ్ముగా 

వింతచేష్టలు పుట్టి వ్రేల్చును వేళలందున త్రావమిన్ 

గొంతు లెండును జీరవోవును క్రుంగిపోవును ప్రాణముల్ 

సుంతయైనను శాంతముండదు స్రుక్కి త్రెళ్ళుగ మానవుల్ 

*~శ్రీశర్మద*

నిత్య సంతోషపరుడు

 

నిత్య సంతోషపరుడు

ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని సదా కోరుకుంటాడు కానీ ఎంతమంది సంతోసహాయంగా ఉన్నారు అని విచారిస్తే ప్రతి వారు తాను సంతోషంగా లేను అనే అంటారు.  ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పరు. దీనికి కారణం ఏమిటో విచారిద్దాం. ఒక విద్యార్థి దగ్గరకు వెళ్లి అడిగితే తాను పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానో  లేదో అనే దిగులు వుంది అందుకే నేను సంతోషంగా లేను అంటారు.  ఒక గృహస్తు వద్దకు వెళ్లి అడిగితే తన సంపాదన తన అవసరాలకు సరిపోవటం లేదు అందుకే నేను సంతోషంగా లేను అని అంటాడు .  ఇలా ప్రతివానికి ఏదో ఒక దిగులు, వెలితి జీవితంలో చోటు చేసుకుంటుంది.  లేని వారికి లేదని దిగులు.  ఉన్నవానికి ఉన్న దాన్ని కాపాడుకోవడం ఎలా అనే దిగులు.  ఇలా చెప్పుకుంటూ పోతే దిగులు, విచారం, అసంతృప్తి లేని మనిషి లేనే లేడనేది సత్యం.  ఎన్ని బాధలు ఉన్నా తాను సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు.  అంతేకాక తాను సంతోషంగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు కూడా. ఒక ప్రయత్నం తరువాత ఒక ప్రయత్నం సాగిస్తూనే వుండాడు.  కానీ జీవితం విచిత్రమైనది ఒకటి సాధిస్తే మనస్సు దాని తర్వాత ఇంకొకటి కోరుతుంది.  అదే అవసరాలు, కోరికలు.  ఈ ఆధునిక యుగంలో ఎన్ని వున్నా కూడా మనిషి ఇంకా ఇంకా ఇంకొకటి కావాలని కోరుకుంటున్నారు. గతంలో నీకు లేనిది ఇప్పుడు వచ్చింది కదా మరి దానితో నీవు సుఖంగా ఉండొచ్చు కదా అంటే లేదు నీకు వెంటనే ఇంకొకటి కావాలని కోరిక కలుగుతుంది. నీకు ఫాను కావలి గాలి ఆడడం లేదు అన్నావనుకో ఫ్యాను పొందితే చల్లని గాలి కావలి ఏరుకులర్ కావలి అంటావు.  అది వచ్చిన తర్వాత ఎయిర్ కండిషనర్ కావాలి అంటావు.  అంటే మనిషి ఒకటి పొందిన తరువాత దానితో తృప్తిగా లేకుండా అంతకన్నా మెరుగైనది ఇంకొకటి కావాలనే వాంచ కలుగుతున్నది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ఏదీ కూడా నిన్ను సంతోష పెట్టటం లేదు ఇంకొకటి ఉంటే సంతోషంగా వుంటాను అనుకుంటావు కానీ అది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వటంలేదు. మరి నీవు ఎప్పుడు సంతోషంగా వున్నావు అంటే భవిష్యత్తులో ఉండొచ్చేమో అని అంటావు. "తృప్తస్య భవిష్యామి" నిజానికి బౌతికంగా వున్నది ఏదైనా కొంతకాలం మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తుంది.  అది ఒక నిమిషమో, రోజో లేక కొన్ని రోజులో ఇంకా అయితే కొన్ని సంవత్సరాల్లో.  కానీ యదార్ధం ఏమిటంటే ఏది కూడా నీకు జీవితాంతం సంతోషాన్ని ఇవ్వదు. 

ఈ సృష్టిలో ఒక నియమం వున్నది అదేమిటంటే ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది.  ఆ మార్పు అభివృద్ధి వైపు కావచ్చు లేక వినాశనం వైపు కావచ్చు. ముందుగా అభివృద్ధి వైపు అయితే అవ్వ వచ్చు కానీ కాలాంతరంలో వినాశనం వైపుకు మళ్లుతుంది. అదే విధంగా మనిషి జీవితంలో కూడా ఒక వయస్సులో సంతోషాన్ని ఇచ్చేది కాలాంతరంలో వయస్సు పెరిగినప్పుడు అదే వస్తువు సంతోషాన్ని ఇవ్వలేదు. అదే అంటే అదే కాదు అలాంటిదే ఇంకొక క్రొత్తవస్తువు కూడా.  ఉదాహరణకు నీవు చిన్నగా వున్నప్పుడు మూడు చక్రాల చిన్న సైకిలు నీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.  నీవు కొంత పెరిగి రెండు చక్రాల సైకిలు తొక్కటం అలవాటు అయినప్పుడు నీకు మూడు చక్రాల సైకిలు అస్సలు నచ్చదు.  మరి రెండు సంవత్సరాల క్రింతం వరకు అది నీకు ఇష్టమైన వస్తువు కదా మరి ఇప్పుడు ఎందుకు కాదు అంటే. ఇప్పుడు నీవు దానికన్నా సౌకర్యంగా వున్న వస్తువు నిన్ను ఆకర్షించింది.  అంతే కాదు నీవు ఇంకా కొంత పెరిగిన తరువాత మోటారు సైకిలు ఫై నీ మనస్సు ఆకర్షితం అవుతుంది.  అది లభిస్తే సైకిలు నీకు నచ్చదు.  అంటే ఎప్పుడు నీవు ఉన్నదానికన్నా మెరుదైనదే ఆనందాన్ని ఇస్తున్నది. దీనిని బట్టికూడా మనకు బాధపడేది ఏమిటంటే మన కోరికలు మారుతున్నాయి.  అంటే ఉన్నదానికన్నా మెరుగైనది మనస్సు సదా కోరుకుంటున్నది.  మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.

ఈ ప్రపంచాన్ని చుస్తే మనకు తెలిసేది ఏమిటంటే ఇక్కడ ప్రతిదీ మారుతున్నది.  మారేది ఏది నీకు శాశ్విత సుఖాన్ని ఇవ్వటంలేదు. ఇంకొక సత్యం కూడా నీకు అవగతం అవుతుంది నీకు సుఖాన్ని ఇచ్చింది కాలాంతరంలో దుఃఖదాయకంగా మారుతున్నది.  మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.

సృష్టిలో సదా మారకుండా ఉండేది ఏదైనా ఉంటే అది నీకు ఎల్లప్పుడూ సుఖాన్ని ఇవ్వవచ్చు.  మరి సృష్టి నియమమే మార్పు కదా మరటువంటప్పుడు మారకుండా ఉండేది ఏది.

ఆ శోధన ఫలితమే మనకు మన మహర్షులు ప్రబోధించిన ఉపనిషత్ జ్ఞ్యనం. అఖండ జ్ఞ్యాన సంపన్నులైన మహర్షులు వారి వారి అనుభవాలతో తెలుసుకున్న సత్యాలే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మనకు ఇచ్చిన జ్ఞ్యానమే బ్రహ్మ జ్ఞ్యానం ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం.  సాధకుడు నిత్య సాధనతో తెలుసుకోవలసిన సత్యమే బ్రహ్మ జ్ఞ్యానం. కాబట్టి ప్రతి సాధకుడు తనకు తానుగా తెలుసుకోవలసింది బ్రహ్మ జ్ఞ్యానం మాత్రమే. కాబట్టి సాధక ఇప్పుడే మేల్కొని నిత్యసాధన పరుడవు కమ్ము సదా సంతోషపరుడవు కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ

 

బాదరాయణ సంబంధాత్

 బాదరాయణ సంబంధం:: కథ చెబుతా...

 

మనకి "వేలు విడిచిన సంబంధాలు ", "బీరకాయ పీచు సంబంధాలు" లాగానే "బాదరాయణ సంబంధం" ఒకటి ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బాదరాయణ సంబంధం మీద కొన్ని కథలున్నాయి. అందులో ఒకటి ఇదిగో....

 

కోనసీమలో కేశనకుర్రు అనే గ్రామం ఒకటుంది. ఆ గ్రామం లో అమాయక బ్రాహ్మణ కుటుంబం ఒకటి. భార్య, భర్త- ఇద్దరే కుటుంబ సభ్యులు. మరీ సంపన్నులు కాక పోయినా కాస్త సంపన్నులే! దేనికీ లోటు లేదు. అతిథి మర్యాదలు సాదరంగా చేస్తారని ఆ పరిసర ప్రాంతాల వారందరికీ తెలుసు. యజమాని పేరు కామయ్య. 


 

ఓరోజు కామయ్య గారి ఇంటి ముందు ఓ గుర్రబ్బండీ ఆగింది. నిగనిగలాడుతూ జరీ పంచె, కండువాతో ఉన్న ఓ పెద్ద మనిషి దిగేడు. బండి తోలే మనిషి పెట్టె తెచ్చి హాల్లో పెట్టేడు. వెనుకనే హుందాగా నడచి వచ్చాడీ పెద్ద మనిషి. బండి తోలే మనిషి తిరిగి వచ్చి గుర్రానికి గడ్డి వేసి బండి లోనే కూర్చున్నాడు. కామయ్య ఏదో పని మీద పై ఊరుకెళ్ళేడు. పెరట్లో పని చేసుకుంటున్న భార్య సీతమ్మ ఈ పెద్దమనిషి ని చూసి హడావుడిగా హాల్లోకొచ్చింది కొంగుతో చేతులు తుడుచుకుంటూ. 


"అబ్బాయి ఇంట్లో లేడేమిటమ్మా?" అన్నాడు పెద్ద మనిషి సావకాశంగా కాళ్ళు జాపుకుని కండువా తీసి కుర్చీ మీద పెట్టి. 

"పై ఊరు పని మీద వెళ్ళారు. వచ్చేస్తారు." అని వినయంగా చెప్పి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళింది. 


ఆమె వివాహమై కొద్ది కాలం మాత్రమే అయింది. పెళ్ళి లో చూడని భర్త తరుఫు బంధువనుకుంది ఆమె. 


కాళ్ళు కడుక్కుని, ఆమె పెట్టిన పలహారం సుష్టుగా తాను సేవించడమే కాకుండా బండివాడికి కూడా పెట్టించాడు పెద్ద మనిషి. 


ఇంతలో కామయ్య తిరిగి వచ్చాడు." ఇదిగో, ఆయన వచ్చారు. " ఆమె లేచి నిలబడింది అంతవరకు పిచ్చాపాటి కబుర్లు చెప్తున్న సీతమ్మ .

"రావోయ్, అల్లుడూ. ఉదయమే ఎక్కడికో వెళ్లి పోయావ్!" అంటూ చనువుగా పలుకరించాడు. 


 

"అర్జెంటుగా పని పడింది. పక్కూరు వెళ్ళేను. కాఫీ, పలహారం సేవించారా?" అని అభిమానంగా అడిగేడు కామయ్య. 


"అన్నీ చక్కగా పెట్టింది అమ్మాయి. అమ్మాయి ఎవరనుకున్నావు? సాక్షాత్తూ అన్నపూర్ణ!" అన్నాడు సీతమ్మ ని మెచ్చుకోలుగా చూస్తూ. 


"నేను మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళవలసి ఉంది. మీరు కాస్త విశ్రమించండి. భోజనం వేళకు వచ్చేస్తాను. కలసి భోంచేద్దాం. ఏమీ అనుకోకండి. " అని నొచ్చు కుంటూ లేచాడు కామయ్య. 


"భలే వాడివే! నిరభ్యంతరంగా వెళ్ళి రా. " నీతో కలసి భోంచేసాక నేను కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను." అన్నాడు పెద్ద మనిషి పత్రిక తిరగేస్తూ. 


అతని బాధ్యత  భార్య కప్పజెప్పి వడివడిగా బయటకెళ్ళిపోయాడు కామయ్య. అతడు దినపత్రిక తిరగేస్తూ కూర్చోగా సీతమ్మ వంట పనిలో పడింది. 


ఆమె వంట పూర్తి అయ్యేసరికీ బయటకెళ్ళిన కామయ్య తిరిగి వచ్చేసాడు. 

ఇద్దరికీ వెండి కంచాలలో వడ్డన చేసింది సీతమ్మ. సుష్టుగా భోజనం చేశాడు పెద్ద మనిషి. అరుగు మీద బండీవాడు కూడా భోంచేశాడు. 


పెద్ద మనిషి గదిలో బయలుదేరడానికి సిద్ధమౌతూండగా, "మీ బంధువు మంచి భోజన ప్రియుడే సుమీ. " పెరట్లో మెల్లగా అన్నాడు భార్య తో కామయ్య. 

"మా బంధువు అంటారేమిటి? ఆయన మీ తరుఫు వారు కాదూ?" అంది సీతమ్మ విస్తుపోతూ. 

 

"అబ్బే, మావైపు వారు కాదు. " అన్నాడు కామయ్య. 


దంపతులు ఇద్దరూ హాల్లోకి వచ్చే సరికి పెద్ద మనిషి పెట్టె బండి లోనికి చేర్చడమూ, అతను బయలుదేరడానికి సిద్దంగా ఉండడమూ గమనించారు. 


"వస్తానోయ్. కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను. వస్తాను తల్లీ. మంచి భోజనం పెట్టేవు. " అని బండి వైపు నడిచాడు పెద్ద మనిషి. 


అతడి వెనుకనే నడచి వెళ్ళి, "అయ్యా, తమరు ఎవరో పోల్చుకోలేకపోయాను.  మన సంబంధం....." నసుగుతూ సందేహం వెలిబుచ్చాడు కామయ్య. 


గట్టిగా ఓ నవ్వు నవ్వి, "మనది బాదరాయణ సంబంధమోయ్. " అన్నాడు పెద్ద మనిషి. ఇతడు తెల్ల ముఖం పెట్టడం చూసి, "అర్థం కాలేదూ? బదరి అంటే రేగు. నీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు రేగు చెట్టు తో చేసినవే! అదే మన సంబంధం!" అని బండి ఎక్కేసాడు పెద్ద మనిషి. అంతే కాదు, కొసమెరుపు గా...


"శ్లో: అస్మాకం బదరీ చక్రం 

       యుష్మాకం బదరీ తరుః

       బాదరాయణ సంబంధాత్ 

       యూయం యూయం వయం వయం. " 

 

అని ఓ శ్లోకం కూడా వదిలేడు. బండి కదిలింది. బండి మలుపు తిరిగే వరకూ నిర్ఘాంతపోయి నిలిచి చూస్తూ ఉండిపోయారా అమాయక దంపతులు!

 

                    🤣🙏

ధర్మాకృతి

 ధర్మాకృతి : గిణి


సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఉద్యోగధర్మాన శ్రీస్వామినాథన్ బాల్యము విల్లుపురము, తిండివనం చిదంబరం, ఫిరంగిపేట, వికరవాండి మొదలైన గ్రామాల్లో గడిచింది. ముందు జీవితమంతా గ్రామగ్రామంగా విజయం చేయబోతున్నారనేందుకు సూచనేమో ఈ త్రిప్పట.

పెద్దకుమారుడు కలిగిన తొమ్మిదేళ్ళ తరువాత ఇక పుత్రులు కలగరేమో బెంగపడుతున్న సమయంలో పుట్టిన వారవడంతో శ్రీస్వామినాథన్ అంటే తల్లిదండ్రులకు ఎంతో ముద్దు, గారాబం. డానికి తోడు చురుకుదనం, మంచి నడవడి, చక్కదనం, మంచి మాటకారితనం, ఇవన్నీ కలసి వారిపై మరింత ఆదరాన్ని కలుగజేశాయి. ఇన్ని వన్నెలున్న తమ కుమారుని పంచవన్నెల రామచిలుకకు కన్నడ పర్యాయపదమైన ‘గిణి’ అనే పేరుతో పిలుచుకోసాగారు. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఏకాదశులు

 *ఏకాదశులు వాటి విశిష్టతలు*


ఏకాదశి అనగానే హిందువులకు గుర్తుకు వచ్చేవి తొలఏకాదశి ముక్కోటి ఏకాదశి. కొంతమంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ప్రతి నెలలోనూ రెండు సార్లు ఏకాదశులు వస్తాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే.  ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము … పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులుంటాయి.


ప్రతి నెల పౌర్ణమికి,అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆషాడ శుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశిగా పరిగణిస్తారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు 12 వస్తాయి. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు 12 వస్తాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ…. హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అవే


1. ఆషాడ శుద్ధ ఏకాదశి ( తొలి ఏకాదశి / శయనేకాదశి )

2. కార్తీక శుద్ధ ఏకాదశి

3. పుష్య శుద్ధ ఏకాదశి ( వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి )

4. మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.


చైత్రమాసం నుంచి వచ్చే ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు ఓసారి చూద్దాం

చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) – ‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది.

చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) – ‘వరూధిని’ – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

వైశాఖ శుద్ధ ఏకాదశి – ‘మోహిని’ – దరిద్రుడు ధనవంతుడు అవుతాడు.

వైశాఖ బహుళ ఏకాదశి – ‘అపరా’ – రాజ్యప్రాప్తి.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి – ‘నిర్జల” – ఆహార సమృద్ధి.

జ్యేష్ఠ బహుళ ఏకాదశి – ‘యోగిని’ – పాపములను హరిస్తుంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి – ‘దేవశయనీ’ – సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి).

ఆషాఢ బహుళ ఏకాదశి – ‘కామికా’ కోరిన కోర్కెలు ఫలిస్తాయి.

శ్రావణ శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – సత్సంతాన ప్రాప్తి.

శ్రావణ బహుళ ఏకాదశి – ‘ఆజా’ – రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ.

భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన’ (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి).

భాద్రపద బహుళ ఏకాదశి – ‘ఇందిరా’ – సంపదలు, రాజ్యము ప్రాప్తించును.

ఆశ్వయుజము శుక్ల ఏకాదశి – ‘పాపంకుశ’ – పుణ్యప్రదం.

ఆశ్వయుజము బహుళ ఏకాదశి – ‘రమా’ – స్వర్గప్రాప్తి.

కార్తీక శుద్ధ ఏకాదశి – ‘ప్రబోధిని’ – (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి.

కార్తీక బహుళ ఏకాదశి – ‘ఉత్పత్తి’ – దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు).

మార్గశిర శుద్ధ ఏకాదశి – ‘మోక్షదా’ – మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

మార్గశిర బహుళ ఏకాదశి – ‘విమలా’ -(సఫలా) – అజ్ఞాన నివృత్తి.

పుష్య శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

పుష్య బహుళ ఏకాదశి – ‘కళ్యాణీ’ (షట్ తిలా) ఈతిబాధా నివారణం.

మాఘ శుద్ధ ఏకాదశి – ‘కామదా’ (జయా) – శాపవిముక్తి.

మాఘ బహుళ ఏకాదశి – ‘విజయా’ – సకలకార్య విజయం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘ఆమలకీ’ – ఆరోగ్యప్రదం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘సౌమ్య’ – పాపవిముక్తి

(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని బేధాలున్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించట్లేదు)


24 ఏకాదశులలోనూ – సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని “వైకుంఠ ఏకాదశి”గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.  సౌరమానం ధనుర్మాసం కాగా, అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నారాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా….. కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది.


వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.


🚩 * 🚩