చిన్న ఆఫీసు అయినా బాగా అలంకరించారు. మొత్తం తొమ్మిదిమంది స్టాఫ్. ఇప్పటిలా, అప్పుడు గంటకో బదిలీ ఉండేది కాదు. రాజారావు వాళ్ళతో కలిసి ఎనిమిది సంవత్సరాలు గా చేస్తున్నాడు. ఆ రోజు పదవి విరమణ. బ్యాంకు మేనేజర్ గా రాజరావు బాగానే సంపాదించాడు.
ఒక కూతురు, ఒక కొడుకు. కూతుర్ని పదేళ్ళ కిందట అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకు విశాఖపట్నం లో బ్యాంకు మేనేజర్. వాళ్ళ చెల్లెలి కూతుర్నే కోడలిగా చేసుకున్నాడు. రాజారావు కి సొంత ఇల్లు విశాఖపట్నం లోనే ఉంది. కొడుకు ఒక అపార్టుమెంటు కొనుక్కున్నా ఆయన ఇంట్లోనే ఉంటూ అపార్టుమెంటు అద్దెకి ఇచ్చేశాడు. మొత్తానికి అంతా ఆయనగురించి గొప్పగా చెప్పి రాజమండ్రి లో మీ పని అయిపోయింది అని చెప్పి పంపించేశారు ఆఫీసువాళ్లు. రాజమండ్రి లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది రాజారావుకి, ప్రస్తుతం అందులోనే ఉంటున్నాడు. భార్య భర్త హాయిగా ఉంటారు.
పెరట్లో ఇంటావిడ మంచి కూర మొక్కలు, పాదులు పెట్టింది. ఇంక మన రాజారావు కి వ్యాపకం లేదు, వేరే బ్యాంకు వాళ్ళు అడ్వైసర్ గా రమ్మన్నా కొంత కాలం ఇంట్లోనే వుంటాను అంటూ నిరాకరించాడు. పొద్దున్నే లేచి ఓ గంట పార్కు లో నడక, వచ్చాక స్నానం, పూజ, టిఫిన్. కొత్తగా భార్య దగ్గర కూర్చుని, కూరలు తరిగి ఇవ్వటం, స్టౌ మీద పాలు చూడటం లాంటివి నేర్చుకున్నాడు. భోజనం చేసాకా భార్య, భర్త కలిసి ఏ చాగంటి వారిదో ఒక గంట ప్రవచనం విని పడుకుంటారు. లేచి మొక్కల పని, సాయంత్రం ఓ గంట, పెన్షన్ కాయితలు వాటి కధ కమామీషు, రాత్రి ఏడున్నరకి భోజనం, ఎనిమిదిన్నర దాకా పిల్లల తో మనవలతో కబుర్లు, ఇంక నిద్ర. ఈ పద్దతి ఇద్దరికీ నచ్చింది. ఎంతో కాలానికి కాస్త విశ్రాంతి గా ఉంది.
పెన్షన్ శాంక్షన్ అయింది. ఇంకా చాలా డబ్బులే వచ్చాయి. కూతురికి ఇవ్వాలనుకున్నది భార్యకి చెప్పాడు రాజారావు. ఆవిడ కూతురితో మాట్లాడి వాళ్ళ పేరున వైజాగ్ లోనే ఒక ఫ్లాట్ తీసుకోమంది. ఇక కొడుక్కి ఇవ్వాలనుకున్నది కొడుక్కి ఇచ్చేశాడు. వాళ్ళకి మందులకి, వైద్యాలకి అంటూ కొంత ఎఫ్‌డి చేసి కొడుకుని వారసుడిగా పెట్టాడు.
రాజారావు కి ఒక చిన్న మారుతి 800 కారు వుంది. భార్య భర్త బాగానే నడుపుతారు. చాలా కాలంగా రాజారావుకి కాశీ వెళ్లాలని కోరిక. వెడదాం అనుకుని బయలుదేరారు. పెద్దగా డ్రైవ్ చేసేవారు కాదు. మహా అయితే రోజుకో ఆరు గంటలు అంతే. దారిలో కనపడిన క్షేత్రాలు అన్నీ చూసుకుంటూ మొత్తానికి ఒక నాలుగు రోజుల్లో చేరారు.
పవిత్రత, ప్రశాంతత, భక్తి మనలోనే ఉంటాయిట. మనం బైట వెతుకుతాము. ఎవరో అన్నారు 'తింటే సూరత్ లోనే తినాలి, పోతే కాశీ లోనే పోవాలి' అని. పోదామని కాదు కానీ ఒక తొమ్మిది నెలలు ఉందామని అనుకుని ఎవరో తెలుసున్న తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఒక చిన్న అపార్టుమెంటు అద్దెకి తీసుకుని దాంట్లో చేరారు. అపార్టుమెంటువాళ్లు కొంత ఫర్నిష్ చెయ్యడం తో పెద్ద పని లేక పోయింది. వెళ్లారో లేదో “అమ్మగారూ” అంటూ ఒక పది పన్నెండు యేళ్ళ తెలుగు కుర్రాడు పలకరించాడు రాజారావు భార్యని.
ఉతికిన పంచ ఒకటి గోచి పెట్టుకుని, నున్నటి గుండు, వెనుక చక్కగా ముడి వేసిన పిలక, మెడలో యజ్ఞ్యోపవీతం, భుజాన ఉత్తరియం, నుదుట, చేతులు, గుండెల మీద వీభూది తో అడ్డ నామాలు, చిన్న విష్ణు నామం తిలకం బొట్టు, చెవులకు పోగులు, కాళ్ళకి వెండి కడియాలు, మెడలో ఒక తులసి మాల, చేతికి చుట్టిన రుద్రాక్షలు చూస్తే ఆ వామనుడే దర్శనం ఇచ్చేశాడా అన్నట్టు ఉన్నాడా కుర్రాడు.
మళ్ళీ అన్నాడు, “చతుర్వేది గారు చెప్పారమ్మా, మీరు వస్తున్నారని. ఇక్కడ నేను మీకు కావలసిన సరుకులు అవి తెచ్చి పెడతాను, సాయంత్రం ఆరు గంటల నుండి, ఉదయం 8 గంటల వరకు మీకు సాయంగా మీఇంట్లోనే ఉంటాను. మిగతా సమయాల్లో స్కూలుకి వెడతాను” అన్నాడు.
అప్పుడన్నాడు రాజారావు భార్యతో “శేఖరం చెప్పాడే, మనతో తోడుగా ఉండటానికి ఒక కుర్రాడిని మాట్లాడనని వీడెనేమో. మరీ చిన్నపిల్లడిలా ఉన్నాడు.”
సావిత్రమ్మగారు (రాజారావు భార్య) అంది “మనకేమన్నా గుళ్ళు ఎత్తాలా, గోపురాలు ఏత్తాలా, వీడు చాలులెండి” అని “ఏరా నీపేరు ఏవిటి” అని అడిగింది ఆ కుర్రాడిని.
“షణ్ముఖ శర్మ అమ్మగారు. మా నాన్నగారు ఇక్కడ పితృకార్యాలు అవి చేయిస్తారు. అమ్మా, అక్క ఇంట్లోనే ఉంటారు. ఇక్కడనుండి ఒక ఐదు నిమిషాలు నడిస్తే మా ఇల్లు వచ్చేస్తుంది” అన్నాడు ఆ కుర్రాడు.
అపార్టుమెంటు అయినా కిందే అడిగారు రాజారావుగారు. సావిత్రమ్మగారికి కీళ్లనెప్పులు, ఆయాసం ఉన్నాయి. ఆవిడ గురించి ఆలోచించే ఒక గదిలో ఏసిా కూడా కావాలన్నాడు.
సావిత్రమ్మగారికి షణ్ముఖుడు చాలా నచ్చాడు. రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే ఆవిడతో పాటు వంటింట్లో చేరిపోయేవాడు. వాడికిరాని విద్య లేదు. కూరలు తరుగుతాడు, వంట చేస్తాడు, ఆవిడకి ఉత్తర భారతదేశపు వంటలు నేర్పుతాడు, మొత్తం కాశీ లో జరిగే విశేషాలన్నీ వాడిదగ్గరే ఉంటాయి. ఆవిడకి మంచి కాలక్షేపం, సాయం కూడా. రాత్రిళ్ళు, ఆవిడకి ఏవో ఆయుర్వేద మూలికల తో చేసిన నూనెలు మద్దనా చేస్తాడు. ఉదయం రాజారావు గారికి పడక కుర్చీ వేసి, కాఫీ తాగుతోవుంటే పేపరు చదివి వినిపిస్తాడు. వాడంటే ఇద్దరికీ ఒకరకమైన ప్రేమ ఏర్పడి పోయింది. రాజారావు గారి కొడుక్కి , కూతురికి పిల్లలున్నా రాకపోకలు తక్కువ. ఎంతసేపు ఆ వీడియోలలో మాట్లాడుకోవడమే. మొత్తానికి మనవడి ప్రేమ ఇలా దొరికింది వాళ్ళకి.
ఒకరోజు సాయంత్రం షణ్ముఖుడు రాలేదు. రాజారావుగారికి రాత్రిళ్ళు కొద్దిగా బైటకి వెళ్లాలంటే చూపుతో ఇబ్బంది. అయినా వాచ్ మన్ సాయం తిసుకుని, షణ్ముఖుడి ఇంటికి బయలుదేరాడు, సావిత్రమ్మగారి ఖంగారు పడలేక.
కొద్దిగా ఇబ్బంది కరమైనదారుల్లో సన్న సందుల్లో మొత్తానికి వాళ్ళ ఇల్లు చేరారు. వాచ్ మన్ పిలిచాడు “ శర్మాజీ” అంటూ. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. శర్మగారి భార్య, ఆయనని చూస్తూనే, “రండి” అని లోపలికి పిలిచింది. శర్మగారు లోపల మంచం మీద ఉన్నారు. నెమ్మదిగా చెప్పింది శర్మ గారి భార్య. గంగలో స్నానం చేస్తూ జారిపోయారట. కాలు, చెయ్య ప్లాస్టరు వేశారు. రెండు నెలలు కదలద్దని చెప్పారట. వారి కుటుంబానికి ఆయనే సంపాదన. షణ్ముఖనికి మేము పెద్ద ఇవ్వకపోయినా వాడి ఖర్చు గడిచి పోతుందని మా ఇంట్లోనే ఉంచారు. పరిస్తితి అర్ధం అయింది రాజారావుకి. షణ్ముఖుడిని తనతో రమ్మన్నాడు. వాడికి ఒక కవరు ఇచ్చి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇమ్మని చెప్పాడు. దాంట్లో వాళ్ళ కుటుంబానికి ఒక ముడునెలలకి భుక్తికి సరిపోయే డబ్బు పెట్టాడు రాజరావు.
ఆయన పెన్షన్ గురించి కొడుకు అడగడు. ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన భార్యకే చెప్పడు. ఆవిడ అడిగితే ఇస్తాడు అంతే. ఆవిడకి పుట్టింటి ఆస్తి, ఇంకా ఆయన ఆవిడ పేరున కొన్న పొలం మీద వచ్చే సొమ్ము ఆవిడది.
మొత్తానికి మర్నాడు ఉదయం షణ్ముఖుడు వచ్చేశాడు. సావిత్రమ్మ గారికి కాళ్ళు చేతులు ఆడటం మొదలయ్యాయి. రాజారావుగారు ఉదయం ఇంటి దగ్గరే ఉన్న టి దుకాణానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. కొన్ని కుటుంబాలతో స్నేహం, సలహాలు సంప్రదింపులు, మంచి మాటలతో రోజులు గడిచి పోతున్నాయి. శర్మ గారి ఆరోగ్యం కుదుటపడింది. నెమ్మదిగా వైదీకానికీ వెళ్ళటం ప్రారంభించాడు.
ఒక నెల ఉందాం అని బయలుదేరిన రాజారావుగారు, ఆర్నెల్లు ఉండేసరికి, కొడుకు రాజమండ్రి లో ఇల్లు అద్దెకి ఇచ్చేద్దాం అని వెళ్ళి, సామాను అంతా ఒక గది లో సర్ది, మిగతా పోర్షన్ అద్దెకి ఇచ్చేశాడు.
సావిత్రమ్మ గారికి కాస్త కాళ్ళ నెప్పులు తగ్గాయి, ఆయాసం కూడా చాలా నెమ్మదించినట్టే. శర్మగారి తండ్రిది ఆయుర్వేద వైద్యం . ఆయన మందులు ఆవిడకి పడ్డాయి. చూస్తూ చూస్తూ ఆరేళ్లు గడిచి పోయాయి కాశీ లో రాజారావుగారికి. నాలుగైదుసార్లు కొడుకు వచ్చి చూసి వెళ్ళాడు. వాళ్ళు అద్దెకున్న పోర్షన్ కొనేసుకున్నారు రాజారావు గారు. ఆవిధంగా కాశీ నివాసస్తులయ్యారు.
ఇంటి నుండి విశ్వేశ్వరుడి గుడికి వెళ్లాలంటే, సావిత్రమ్మగారికి, శర్మ గారి ఇల్లు ఒక మజిలీ. శర్మగారి భార్య, ఆవిడా కలసి వెళ్ళేవారు. వారం లో ఒక రెండు రోజులు గుళ్ళు గోపురాలు తిరిగేది. కాశీ నుండి మొదలు పెట్టి చుట్టుపక్కలవున్న ప్రదేశాలన్నీ రాజారావు గారితో తిరిగింది.
ఇంక ఇద్దరికీ ఓపికలు తగ్గుతున్నాయి. స్నేహితులు, రాజారావుగారి ఇంటి బైట రెండు సోఫాలేసుకుని కూర్చుని కబుర్లు చెప్పేవారు. షణ్ముఖుడు ఇంజనీరింగ్ లో చేరాడు. శర్మగారు ఆయన బార్య తమ్ముడి కూతురు సీతని, రాజారావు గారి ఇంట్లో కుదిర్చాడు. సరుకులు, కూరలు ఫోన్లో చెబితే తెస్తున్నారు. వారానికి నాలుగు రోజులు శర్మగారింటి నుండి భోజనం వస్తోంది. చనువు ఎంతగా పెరిగిందంటే, ఈరోజు భోజనం నువ్వు పంపేయి అని చెప్పవారు సావిత్రమ్మగారు ఫోన్ చేసి.
షణ్ముఖుడి చదువు సంధ్య అంతా రాజారావు గారే చూసుకునేవారు. శర్మ గారి అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. కాశీ లో కుటుంబమే. వాళ్ళు అక్కడి వాళ్ళే. మొత్తానికి రాజారావుగారి సాయం తో పెళ్లి చేసేశాడు శర్మగారు.
శర్మ గారి తండ్రి ఈమద్య కాలం చేశారు. షణ్ముఖుడి ఇంజనీరింగ్ పూర్తి అయ్యింది. సావిత్రమ్మ గారికి ఆయాసం పెరిగింది. అల్లోపతీ డాక్టరు వచ్చి చూసి పోతున్నాడు. వయసు అయిపోయింది, గుండె బలహీనం గా ఉంది. ఏదైనా పెద్ద ఆస్పత్రి లో చేర్పించమని సలహా ఇచ్చాడు. సావిత్రమ్మ గారు ససేమిరా అంది. నన్ను ప్రశాంతంగా పోనివ్వండి, ఆ సూదులు, మత్తుమందులు వద్దని గొడవ చేసింది రాజారావుగారితో. పది రోజులు కాకుండానే, రాజారావుగారిని వంటరిగా వదిలేసి ఆవిడ వెళ్లిపోయింది. చిత్రం, ఆవిడ పోయేముందు కూడా షణ్ముఖుడినే తలుచుకుంది కానీ సొంతపిల్లల గురించి అనుకోలేదు. కొడుకు, కోడలు, మనవలు వచ్చారు. కూతురు వీడియో లో చూసి శోకాలు పెట్టింది. పదోరోజులోపు వస్తున్నా అని చెప్పింది. కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కూతురు, తండ్రిని అమెరికా వచ్చెయ్యమంది. డభై ఏళ్ల వయసులో వైధవ్యం అంటే చాలా కష్టకాలం వచ్చినట్టే.
కొడుకు రాజారావుగారికి నచ్చచెప్పి, విశాఖపట్నం తీసుకుపోయాడు. ఆయన కారు షణ్ముగాన్ని వాడుకోమని ఉంచేశారు. ఆయన వేడుతోంటే కనీసం ఒక వందమంది వచ్చారు, వీడ్కోలు చెప్పడానికి. అందరూ ఒకటే మాట త్వరగా వచ్చ్హెయ్యండి అని.
కొడుకు ఇల్లు చాలా పెద్దది, ఐదు బెడ్ రూములు ఉన్నాయి. ఒక అవుట్ హావుసు కూడా ఉంది. ఈ పదిఏళ్లల్లో ఒక మంచి ఇండిపెండెంట్ హోవుసు కట్టాడు రాజారావుగారి కొడుకు. ఆయనని అడిగితే అవుట్ హావుస్ లో ఉంటానన్నాడు.
తెల్లారింది. నెమ్మదిగా లేచి గడియారం చూశాడు రాజారావుగారు. అప్పుడే పది అయ్యింది. కడుపంతా ఖాళీగా వుంది. నెమ్మదిగా లేచి మొహం కడుక్కుని, ఇంట్లోకి వెళ్ళాడు. మావయ్య లేచావా అంటూ కోడలు కాఫి తీసుకొచ్చింది. డీకాషన్ ఎక్కువ తాగుతారు అనుకుంటా వీళ్ళు. నెమ్మదిగా విషం మింగినట్టు మింగి బయలు దేరాడు తన గదికి. స్నానం చేసి వచ్చి, కాశీ నుండి తెచ్చుకున్న భార్య దేముడి సామాను నెమ్మదిగా ఒక ములా పేర్చి, ఒక నమస్కారం చేశాడు. వీళ్ళ టైమింగులు ఏమిటో తెలీదు, ఆకలి దంచేస్తోంది అనుకుంటూ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి, సోఫాలో పేపరు తిరగెస్తు కూర్చున్నాడు. నెమ్మదిగా ఉప్మా తీసుకు వచ్చింది కోడలు. అసలు పెళ్ళైన తరువాత ఒక్కసారి చేసింది సావిత్రమ్మ గారు ఉప్మా, ఆయన చూసిన చూపుకు, మళ్ళీ ఉప్మా చెయ్యలే. ఒకవేళ చేసినా ఆయనకి వేరే టిఫిన్ చేసేది. రాజారావుగారు మాట్లాడలేదు, నెమ్మదిగా అది దిగమింగి తన గదికి వేడిపోయాడు.
సహజంగా మనుషులు రెండు రకాలు. ఒకళ్ళు, ఎదుటి వాళ్ళు మనలా మారిపోవాలి అని కోరుకునేవాళ్లు. రెండు ఎదుటి వారిలా మనం మారిపోదాం అనుకూనే వాళ్ళు. సావిత్రమ్మ గారు రెండో రకం అయితే, కోడలు మొదటి రకం. రాజారావు గారికి వచ్చిన వారనికే పులి తెనుపులు, కడుపులో మంట మొదలయ్యాయి. కొడుకింట్లో రాత్రి ఒంటి గంటకి పడుకుంటారు, ఉదయం ఎనిమిది దాకా లేవరు. టిఫిన్ పది గంటలకి, భోజనం మద్యాహ్నం రెండు గంటలకి , రాత్రి పదింటికి మొదలుపెట్టి ఎవరికి కావలసినది వాళ్ళే ప్లేటులో పెట్టుకు పదకొండు దాకా తింటారు. ఎవరి బట్టలు వాళ్లే మిషన్ లో వేసుకుని ఆరేసుకుంటారు. ఆయనకి ఈ అలవాట్లు లేవు. కాశీ లో సీత ఉండేది, అన్నీ అదే చేసేది, ఐరన్ కూడా. రాజారావుగారి కి ఏదో వంకన భార్య మళ్ళీ కిందకి వచ్చేస్తే బావుంటుందనిపించింది.
ఒక నెలలో రాజారావు గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక ఆదివారం, ఆరు గంటలకి లేచి కొడుకు ఇంట్లోకి వెడదామని చూస్తే ఎవరూ లేవలేదు. అప్పుడు గుర్తొచ్చింది. ఆదివారం, పదకొండు అయితే గాని లేవరని. నెమ్మదిగా చిల్లర జేబులో వేసుకుని, వీధి చివర టీ కొట్టు కి బయలుదేరి ఒక టీ తాగి మళ్ళీ తన గదికి చేరుకున్నారు. ఒకసారి సద్దిన సామానులు, టికెట్ చూసుకున్నారు. సంతృప్తిగా నవ్వుకున్నారు.
మొత్తానికి ఒంటి గంటకి మనవడొచ్చి పిలిచాడు, తాతగారు టిఫిన్ అంటూ. రాజారావుగారు సోఫాలో కూర్చుని కొడుకుని, కొడలిని పిలిచాడు. నెమ్మదిగా అన్నాడు, “శేఖరం, మీ అమ్మ బాగా గుర్తొస్తోందిరా. కొన్నాళ్లు కాశీ వెళ్ళి ఉండాలని ఉంది. మళ్ళీ వస్తాలే ఒక నెలా రెండు నెలల్లో” అని. ఆయనకి తెలుసు ఇంక రాడని. “సరే నాన్న టికెట్ బుక్ చేస్తాలే, మరి అక్కడ భోజనం అది ఎలా” అన్నాడు కొడుకు. ఆయన నవ్వి, “షణ్ముగం ఉన్నాడుకదరా వాడే చూస్తాడులే ఏదో ఒకటి. టికెట్ షణ్ముగం బుక్ చేశాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లయిట్. వాడు అక్కడ నన్ను తీసుకెడటానికి వస్తాడు” అన్నాడు రాజారావు గారు. కొడుక్కి అనిపించింది, నాన్న వెళ్ళట్లేదేమో, పారిపోతున్నాడేమో అని. నిజమే ఆయన పారిపోతున్నాడు.
మొత్తానికి షణ్ముగం వచ్చి తీసుకెళ్ళాడు, ఆయన కారులోనే. ఇంట్లోకి వెళ్ళగానే కళ్ల నీళ్ళు తిరిగాయి సావిత్రి గుర్తుకి వచ్చి ఆయనకి. అంతలోనే ఏడు అయ్యిందో లేదో వేడి వేడి పూరీలు, కూర, ఒక గ్లాసు మజ్జిగ తో వచ్చింది సీతా, తాతగారు భోజనం అంటూ.
కాశీ గాలికేమో, ఆరింటికే మెళుకువ వచ్చేసింది రాజారావుగారికి. అలా లేచాడో లేదో, కాఫీ తాతగారు అంటూ వచ్చింది సీత. రాజారావుగారు, రాజుమాదిరిగానే, విశాన్ని మింగుదామని నోట్లో పెట్టుకున్నాడు. సన్నగా నవ్వొచ్చింది. మాటలా మరి సీతకి ట్రైనింగ్ ఇచ్చినదేవరు, సావిత్రమ్మగారు.
ఏంటో జీవితం అంటే భయం పోయినట్టనిపించింది రాజారావుగారికి. అప్పుడన్నాడు సీతతో, “సీతా నాకు కూడా వంట నేర్పరా” అని. “అదేంటి తాతా నేవున్నాగా చేసిపెడతా” అంది. “లేదులే, నేర్చుకొనీ, నీ పెళ్లయ్యాకా కూడా నే బతికే ఉంటే” అని పెద్దగా నవ్వాడు రాజారావు. అప్పుడే వచ్చిన షణ్ముగం అన్నాడు “అదెక్కడికి పోతుందిలే, పెళ్లైనా తాత దగ్గరే ఉంటుందిలే, నాతోపాటు” అని మరదలిని చూసి నవ్వుతూ.
ఒక వయసు దాటాక మన సమస్యలు, అలవాట్లు తెలుసున్నవాళ్ళు వెళ్ళిపోతే ఆ నరకం ఏమిటో ఒంటరి మగాడికి తెలిసినంతగా ఒంటరి ఆడవాళ్ళకి తెలియదు. భార్య కంటే భర్త ముందుపోవడం లో ఉన్న సుఖం ఒంటరి మగవాడికే అర్ధం అవుతుంది.