ఆనంద స్వరూపం
భూమిమీద వున్న ప్రతి మానవుడు నేను అది నేను ఇది అని తనగురించి చెపుతువుంటారు కానీ నిజానికి చాలామంది నీవు ఏమిటి అని అడిగితె ఇదేమి పిచ్చి ప్రశ్న నేను ఎవరు అని అడుగు అంతే కానీ నేను ఏమిటి అంటావేమిటి అని అనటం కద్దు. ఎందుకంటె తానూ ఏమిటి అనేది చాలామంది గుర్తించినా తెలియనట్లే వుంటారు. నీవు ఎవరు అనే ప్రశ్నకు నేను రాజారావుని నేను పుల్లారావుని, నేను శేఖరుని అని ఇలా తమ తమ పేర్లు చెపుతారు. లేకపోతె నేను ఆఫీసరుని, నేను రైతుని, నేను ఇంకోటి ఇంకొకటి అని వారి వృత్తిని చెపుతారు. కానీ నీవు ఏమిటి అంటే మాత్రం జావాబు లేదు.
మిత్రమా నీవు ఏమిటి అనే ప్రశ్న ఏమిటంటే నీ స్థితి ఏమిటి అని అర్ధం. నిజానికి ఈ ప్రపంచంలో వున్న ప్రతి మనిషి వున్న, ఉండాల్సిన స్థితి ఏమిటంటే "ఆనందము" అంటే ప్రతి మనిషి ఆనందస్వరూపుడే. ఇది వినటానికి వింతగా వుంది కదా. కానీ ఇది అక్షరాల నిజం. అది ఎట్లనో చూద్దాం.
మా పిల్లవాడు డిగ్రీ చదివాడు పని లేకుండా తిరుగుతున్నాడు అంటాడు ఒక తండ్రి. ఆ పిల్లవానిని పిలిచి బాబు నీవు ఏపని చేయగలవు అంటే తాను తన ప్రావీణ్యత ఎందులో ఉందొ దానిగూర్చి చెప్పుతాడు. ఉదాహరణకు నేను ఎలక్ట్రిషను అని ఒకడు అన్నాడనుకోండి నీవు యేమిటీచేస్తావు అంటే కరెంటుకు సంబందించిన పనులు అన్నీ నేను చేయగలను అంటాడు. మరి మా ఇంట్లో సీలింగ్ ఫాను బిగించాలి వచ్చి బిగిస్తావా అంటే ఆ వస్తాను. అని ఊరుకోడు ఏమిస్తారు అని ప్రశ్నిస్తాడు. అదేమిటయ్యా నీవు పనిలేదు అన్నావు కదా నేను పని చెప్పాను పని చేయక ఏమిస్తావు అంటావేమిటి అని నీవు అంటావా అనవు ఎందుకంటె అతను చేసే పని కేవలం ప్రతిఫలం కోసమే కానీ ఆ మాట అతను చెప్పడు నిజానికి అతనికి పనిచేయాలని లేదు కానీ పని చేస్తాడు ఎందుకంటె పనిచేస్తేనే వానికి ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి పనిచేయటం ఇష్టంలేక పోయినా కష్టమైన పనిచేస్తాడు. కారణం పనికారణంగా వచ్చే ఆర్జన. తెలిసిందా పని చేయటం కేవలం డబ్బులకోసం మాత్రమే. అదే నీవు పనిచేయకుండా డబ్బులు ఇస్తానంటే అతను పని చేసే పనే ఉండదు. డబ్బులు ఎందుకు అంటే డబ్బులతో ఆతను సంతోషాన్ని, సుఖాన్ని కొనుక్కుంటాడు. వాటి అంతిమ విషయమే ఆనందం.
నీవు నీ దగ్గర వున్న ద్రవ్యంతో తినుబండారాలు కోన్నావనుకో అవి దేనికోసం అంటే తినటానికి అని అంటాం కానీ నిజానికి వాటి లక్ష్యం తినటం వలన కలిగే ఆనందం మాత్రమే. ఒక భర్త ఆఫీసులో అలసి ఇంటికి వచ్చి భార్యతో అన్నం పెట్టు బాగా ఆకలిగా వుంది అంటే కేవలం ఒక చింతకాయ తొక్కు లేక గోంగూర పచ్చడో వేసి అన్నం పెట్టిందనుకోండి అది అతనికి రుచికరంగా ఉండేదే అయినా పూర్తీ అన్నం ఒక్క పచ్చడితో తినలేడుగా అందుకే ఏడుస్తూ తింటాడు అంతేకాదు కడుపునిండా తినడు. రోజు వండే అంత పరిమాణంలోనే అన్నం వండినా ఆ రోజు సగానికన్నా ఎక్కువ అన్నం మిగులుతుంది. ఏమండీ ఈ రోజు మీరు సరిగా తినలేదు చూడండి వండినది వండినట్లుగానే మిగిలింది అని ఆమె అంటే, ఒక్క పచ్చడితో ఎవరైనా కడుపునిండా తింటారా నా కడుపు ఇంకా ఆకలితోనే వుంది ఏమిచేయమంటావు అని నీళ్లు తాగి గొణుక్కుంటూ పడుకుంటాడు.
మరుసటి రోజు అదే భార్య చక్కగా రెండు పచ్చళ్ళు, కూరలు, పప్పు పులుసు చేసి వడ్డించిందనుకోండి. ఆ భర్త తన భార్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తి కడుపునిండా భోజనం చేయటమే కాదు ఆమె వాటా అన్నం కూడా తినేస్తాడు. ఏమండీ మొత్తం మీరే తింటే నేనేమి తినాలి అని ఆమె అంటే ఎందుకోయి నీవు బాధపడతావు నీవు అన్నానికి కూర్చొని తింటూవుండు నేను అన్నం వండుతాను అని వండి చక్కగా భార్యకు వడ్డిస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నిన్న భార్యను విసుక్కున్న భర్త ఈ రోజు ఆమెను మెచ్చుకోవటమే కాకుండా చక్కగా అన్నం వండి వడ్ఢిచ్చి మరీ సంతోషపడ్డాడు ఎందుకు అంటే ఈ రోజు ఆమె చేసిన వంటకాలతో తృప్తిగా భోజనం చేసాడు. అంటే తానూ భుజించటం వలన ఆనంద పడ్డాడు. అదే ఆనంద స్వరూపం.
ప్రతి మనిషి కోరుకునేది ఆనందమే కానీ మరొకటి కాదు. ఎందుకంటె మనిషి యదార్ధ స్థితి ఏమిటంటే అది ఆనంద స్వరూపం. తన యదార్ధ స్థితిని పొందటానికి ప్రతి మనిషి కోరుకుంటాడు.
ఆనంద స్వరూపం అంటే ఏమిటి : ఆనందం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కక్క విధంగా ఉంటుంది. ఒకనికి ఇంట్లో వంట నచ్చదు బైట హోటల్లో బాగా ఖర్చుచేసి వివిధ వంటలను భుజించి ఆనంద పడతాడు. ఇక ఒకనికి సిగరెట్ త్రాగటం ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొంకనికి మద్యం సేవించటం ఆనందాన్ని ఇస్తుంది. ఒకడికి ఇంకొకడిని మోసం చేసి డబ్బు సంపాయించటం ఆనందాన్ని ఇస్తుంది. ఒకనికి ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవటం ఆనందం ఇస్తుంది. ఇలా చేప్పుకుంటూ పొతే అనేకమైన విధాలుగా ఒక్కొక్కరికి ఆనందం చేకూరుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం. నిజం ఎవ్వరికీ ఏది ఆనందాన్ని ఇచ్చినా కూడా అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఉదాహరణకు చక్కటి విందు ఆరగించటం వలన ఆనందం కలిగే వానికి తాను విందు భోజనము చేసే అంతవరకే ఆ ఆనందం ఉంటుంది. కానీ తరువాత కాదు అదే విధంగా పైన పేర్కొన్న అన్ని విషయాలకు వర్తిస్తుంది. కానీ ఎవ్వరు అది గమనించక మరల మరల తాను ఆ పనులు చేస్తూ ఆనందాన్ని వెతుకుంటూ ఉంటారు.
నీకు నీ మిత్రుడో లేక బంధువో కనపడితే నీవు అడిగే మొదటి ప్రశ్న" నీవు బాగున్నావా" అంటావు లేకపోతె "నీవు క్షేమంగా వున్నావా" అని అడుగుతావు. పూర్వకాలంలో లేఖలు వ్రాసుకునేవారు ముందుగా "ఉభయ కుశలోపరి" అని వ్రాసేవారు అనగా ముందుగా ఉభయుల కుశలం తెలుపుతూ తరువాత ఇతర విషయాలు ప్రస్తావించేవారు. నీవు బాగున్నావా అంటే నీవు బాగుండాలని నీ మిత్రుడు కోరుకుంటున్నాడు అని అర్ధం అంటే నీవు ఆనందంగా వున్నావా అని అర్ధం. ఎవ్వరు కూడా నీవు భాదపడుతున్నావా, నీవు ఏడుస్తున్నావా, నీవు దుఃక్కిస్తున్నవా అని అడగరు. అంటే అవి ఏవి నీ స్వరూపం కాదు అని అర్ధం. బాధలో వున్నవాడు కూడా ఆనందంకోసం వెతుకుతూవుంటాడు అంతే కానీ ఆనందంలో వున్నవాడు యెవ్వడు దుఃక్కించాలని కోరుకోడు అవునా కాదా
కాబట్టి
భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి నిజ స్వరూపం ఆనందం మాత్రమే కానీ
అందుకు వేరుకాదు. ప్రతి వారు తమ జీవితం ఆనంద మయం కావాలని ప్రయత్నించే
వారే. తన వద్ద వున్న డబ్బులు తాను పొందాలనుకునే ఆనందానికి సరిపోవు అని
అనుకున్నప్పుడు ఇంకా ఇంకా డబ్బులు సంపాయించటానికి మనిషి ప్రయత్నిస్తాడు.
యెంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత ఎక్కువ సుఖాలను, భోగాలను అనుభవించవచ్చు అంటే
అంత ఎక్కువ ఆనందం కలుగుతుంది అని అనుకుంటాడు. కానీ తానూ అనుభవించే ఆనందం
పూర్తిగా క్షణికమని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మొదలవుతుంది
శాశ్వితమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందా అనే వెతుకులాట. అదే మనిషిని భగవంతుని
వైపు మళ్లించే భావన. అప్పటినుండి మనిషి తాను శాశ్విత ఆనందం పొందాలని
ప్రయత్నిస్తాడు. . అందుకే మన మహర్షులు " ఆనందో బ్రహ్మ" అని అన్నారు.
భగవంతుడు ఆనంద స్వరుపుతూ. మనం ఒక వెంకటేశ్వర స్వామికో లేక సత్యనారాయణ
స్వామికో లేక మారె ఇతర దేవి దేవతలకైనా వివిధ పుష్పాలతో వస్త్రాలతో
అలంకరించటం చేస్తాము. దానికి కారణం ఎప్పుడైతే భక్తుడు ఆ దేవతా విగ్రహాన్ని
కళ్ళతో చూస్తాడో అతని మనసులో ఆనందం కలుగుతుంది. ఆనందం కలగాలి అని ఆలా
అలంకారం చేస్తారు. అంతిమ లక్ష్యం ఆనందమే కానీ వేరొకటి కాదు. భక్తి భావం
అంటే దాని ఫలితం ఆనందం మాత్రమే.
వైదిక శాస్త్రాలు అనేక పర్యాయములు భగవంతుడిని అనంతమైన దివ్య ఆనంద సాగరంగా అభివర్ణించాయి.
ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ (తైత్తిరీయ ఉపనిషత్తు 3.6)
"భగవంతుడంటే ఆనందమే అని తెలుసుకో."
కేవలానుభవానంద స్వరూపః పరమేశ్వరః (భాగవతం 7.6.23)
"భగవంతుని స్వరూపము స్వచ్చమైన ఆనందము చే తయారుచేయబడినది."
ఆనంద మాత్ర కర పాద ముఖోదరాది (పద్మ పురాణం)
"దేవుని చేతులు, పాదాలు, ముఖము, ఉదరము మొదలగునవన్నీ ఆనందము చే తయారు చేయబడినవి"
జో ఆనంద్ సింధు సుఖరాసి (రామాయణం)
"భగవంతుడు సంతోష-ఆనందముల మహాసాగరము"
ఈ శాస్త్రాల్లో ఉన్న మంత్రములు మరియు శ్లోకములు అన్నీ, దివ్య ఆనందమే భగవంతుని వ్యక్తిత్వ స్వభావమని వక్కాణిస్తున్నాయి. తన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి భగవంతుని యందే నిమగ్నం చేసినవారు, తమలోనే ఉన్న భగవంతుని యొక్క దివ్య ఆనందాన్ని అనుభవించటం ప్రారంభిస్తారు.
కాబట్టి భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే మనిషి నిజ స్వరూపం ఆనందం మాత్రమే కానీ అందుకు వేరుకాదు. కాబట్టి నిత్యమైనది, శాశ్వితమైనది అయిన ఆనందమే మోక్షము. కాబట్టి మిత్రమా ఇప్పుడే శాశ్వితము, నిత్యమూ అయిన ఆనంద స్వరూపుడైన భగవంతుని తెలుసుకో మోక్షార్థివి కమ్ము.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ