4, జూన్ 2021, శుక్రవారం

ఆవు-- పులి కథ

 *ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.*


*ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.*


*దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.*


*అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.*


*ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.*


*కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,*

*"నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,*


*నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా.. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది.*


*అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??  అంది.*


*అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,*


*"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?? అంది.*


*ఇలా అన్న కొద్దిసేపటికి  ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.*


ఈ కథలో...


 *ఆవు* -  సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.


 *పులి* -  అహంకారం నిండిఉన్న మనస్సు.


 *యజమాని* - సద్గురువు/పరమాత్మ.


 *బురదగుంట* - ఈ సంసారం/ప్రపంచం


మరియు,


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.


 *నీతి :* 


*ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,*


*"నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.*


 దీనినే ' *అహంకారము* ' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.


ఈ జగత్తులో *'సద్గురువు'*(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?? ఉండరు.


*ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.*


*పరమాత్మా నీవే ఉన్నావు...!*

*అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!*🙏

మమ్మల్నీ బ్రతకనివ్వండి..!*

 💦 *నీతి కథలు - 350*


*మమ్మల్నీ బ్రతకనివ్వండి..!*


దైవభక్తుడైన సింహాచలం ఊరూరా తిరుగుతూ.. దేవుడి గురించి ప్రచారం చేస్తూ వెళ్తుంటాడు. అలా ఒకరోజు గరుడాద్రి అనే ఊర్లో దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి ప్రజలకు తెలియజెప్పి, పూజలు జరిపించి మరో ఊరికి బయలుదేరాడు.


మార్గమధ్యంలో ఓ అడవి గుండా వెళ్ళాల్సి వస్తుంది. అడవిలో ప్రయాణం చేస్తున్న సింహాచలంకు బాగా అలసటగా ఉండటంతో గుబురుగా ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్ళి, దాని నీడలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపక్రమించాడు. నడచి నడచి అలసిపోవడంతో అలాగే కళ్లుమూసుకుని పడుకున్నాడు.


ఇంతలో ఒక మూల నుంచి ఏదో జంతువు కదిలిన శబ్దం రావడంతో అటువైపు చూశాడు సింహాచలం. అంతే ఎదురుగా ఉన్న జంతువును చూసి భయంతో బిక్కచచ్చిపోయాడు. దేవుడా ఈ పులి బారినుంచి నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదేనంటూ భారం దేవుడిమీద వేశాడు సింహాచలం.


"ఈ క్రూర జంతువు ఎలాగైనా సరే నన్ను తినేస్తుంది. నీ మహిమవల్లనే నేను బ్రతకగలను. నీ భక్తుడినైన నన్ను కాపాడు స్వామీ..!" అంటూ భయంతో కళ్లుమూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగాడు సింహాచలం. అలా ఎంతసేపటికీ పులి దగ్గరకు రాలేదు. మెల్లిగా భయం భయంగా కళ్లు తెరిచి చూశాడు.


అంతే.. మరోసారి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టక తప్పలేదు సింహాచలానికి. ఎందుకంటే... ఎదురుగా పులి కూడా రెండు కాళ్లూ పైకెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది...! ఇదంతా ఆ భగవంతుడి మహిమేనేమో అనుకున్న సింహాచలం కాస్తంత ధైర్యం తెచ్చుకుని పులి దగ్గరకు వెళ్లాడు.



"ఓ పులిరాజా...! ప్రాణభయంతో ఉన్న నేను.. నువ్వు నన్ను చంపకుండా ఉండాలని, నీ నుండి నన్ను రక్షించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. దాంట్లో ఓ అర్థం ఉంది. మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు...?" అని ప్రశ్నించాడు సింహాచలం.


"ఓ మానవుడా...! నేను కూడా నీ నుంచి నన్ను రక్షించమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను" అని చెప్పింది పులి.


"ఎందుకు..?" తిరిగీ ప్రశ్నించాడు సింహాచలం.


"ఎందుకంటే.. ఇప్పుడు మీ మానవులు మా వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా చంపేస్తున్నారు కదా...! దీంతో మా జాతులన్నీ అంతరించుకు పోతున్నాయి. మాకు స్వేచ్చగా బ్రతికే అవకాశమే లేకుండా పోతోంది. అలా జరక్కుండా చూడాలనే నేనూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని చెప్పింది పులి.


నిజమే కదా పిల్లలూ..! ఈ రోజుల్లో వన్య మృగాలను వేటాడి చంపడంలో మన మానవులు ముందే ఉన్నారు. మనుషులు ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో, వన్య ప్రాణులను కూడా అంతే స్వేచ్ఛగా బ్రతకనీయాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. కాబట్టి... వన్యప్రాణులను వేటాడి, చంపేసే వారిని తీవ్రంగా వ్యతిరేకిద్దాం...!

          💦🐬🐥🐋💦

జీవిత సత్యం

 జీవిత సత్యం

 చిరిగి పోయిన సంచిలో బంగారం పెడితే ఆ సంచి చిరిగి వున్నా, సంచి కి విలువ ఉంటుంది.


సంచి నుండి బంగారాన్ని వేరు చేస్తే,


ఆ సంచికి విలువ లేదు.


దాని వలె, మన శరీరమనే నవరంధ్రాల చిరిగిన సంచిలో, ఆత్మ అనే భగవంతుడు ఉన్న వరకే  ఈ శరీరానికి విలువ.


శరీరంలోని ఆత్మ బైటికి వెళ్ళాక, ఈ శరీరాన్ని ముట్టటానికి కూడా అయినవాళ్ళు ఆలోచిస్తారు.


అంటే  బంగారానికి విలువ ఉంది కానీ, సంచికి కాదు.


అలాగే చైతన్య స్వరూపుడైన భగవంతుడికి/ ఆత్మ విలువ వుంది కానీ, మన శరీరానికి కాదు.


శరీరంలో జీవం ఉంటే శివం


శరీరం నుండి జీవి వెళ్లిపోతే శవం.


ఈ శరీరంలో జీవం వున్నప్పుడే, నలుగురికి ఉపయోగపడాలి.


నిరంతరం ధ్యాన సాధన చేయాలి...

పరోపకారం చేయకపోయినా అపకారం మాత్రం కచ్చితంగా చేయకూడదు. ఇదే ఆద్యాత్మిక మార్గానికి తొలి అడుగు....

Bhandarkar Oriental Research Institute

 https://borilib.com/repository/search/searchHome



Bhandarkar Oriental Research Institute, Pune, launches an e-library consisting of a huge collection of rare books/manuscripts on topics such as Ancient Indian Philosophies, Ayurveda, Sanskrit and other subjects. This is a treasure trove.

Access it here 👆

శక్తికి రూపం. అనంతమైన విజ్ఞానము

 అణుమాణః చతుష్టయం.అని వేదం అరుణ ప్రశ్న వివరించుచున్నది. శక్తి నాలుగు రకములుగా మార్పు చెంది యున్నది. అది సూర్యశక్తియని. బాల్య యౌవన కౌమార వార్థక్యపు లక్షణ రూపమని. వీటిలో యౌవన దశ ముఖ్యమైనది జీవ సృష్టికి మూలం. మిగిలిన అవస్థలలో దీని వృధ్ది లక్షణము ఫలవంతము లేనిది. అందుకే దైవ శక్తి నిత్య యౌవనమని సృష్టి నిరంతరం సలక్షణమైనదిగా యుండుటయే ప్రధానము. ఫలవంతము కూడా. ప్రకృతి కూడా ఫలవంతము రెండవదశలోనే దానిలక్షణము. కాని అది తెలియవలెనన్న రసస్ఫూర్తి కలిగికలిగుటయను యౌవనమని రెండవదశ. దాని లక్షణము తెలియవలెనన్న ఫలముకూడా  రెండవ దశలోనే. పండిన తరువాత కొంత శక్తి తగ్గును. అణువు వ్యాప్తమైనగానిఅనగా  రెండవదశ  లక్షణము తెలియును. నాలుగు దశల్లో వున్ననూ రెండవ దశలోనే దాని విషయం అవగాహన. మెుదటి దశ అనగా ఏకం యని వకటిగా వున్న తత్వం ఏమీ తెలియదు. అంతా వకటే యంటే దాని ఫలం ఎలా తెలియాలి. తెలియకపోతే లక్షణం అనుభవంలోకి రాదు. అదియే రెండవ ద్వీ అనే దశ .  అగ్ని హోమంలో,అలాగేమానవ నిజ జీవితంలో కూడా  వకే సూత్రము.యిది మానవునికే తెలియును. అటుపై మూడు, నాలుగు దశలు దాని లక్షణము మారిపోవుచున్నది. నిష్ఫలం అగు చున్నది. ఫలం లేనిది.ఏకమేవాద్వితీయం బ్రహ్మ. రెండుగా మారిన ఆపై అది ఎన్నైనా కావచ్చు. అనంతమగుటకు వ్యాప్తిని ఆ అనగా వ్యాప్తిని అణువు వ్యాప్తిని తెలుపు చున్నది. రెండవ దశ. ప్రారంభమైన రెండవ లక్షణము దెలియును. అక్కడితో స్వరూపం తెలియును. ప్రారంభము లేనిది వ్యాప్తి తెలియదు. యిది అన్నింటికి వకే సూత్రం. తెలిసి ప్రారంభం చేయవలెను. యిదియే భగవతత్వం. అది తెలియుటయే ఙ్ఞానం. ఙ్ఞానం వలననే ఆచరణ. అనగా రెండవ తత్వం. అణుం ఆణః చత్వారిః ఉష్ఠ యం. యత్ పూర్ణం ఉష్ఠ చతుర్దశి యని.యేదైతే  పూర్ణమైన శక్తి చైతన్యమైనదో దాని దశలు నాలుగు యని అక్కడ నుండి అనంతమని జీవ పరిణామ లక్షణము. పూర్ణము మెదటి దశ అణవుయని దాని విభజనరూపంలోఅనగా చైతన్యమైనదే రెండవది. దానిని సూత్ర పరంగా విభజన చేయుటయే ఙ్ఞానం. మూడవదశ నాల్గవ దశలక్షణములు  తెలుస్తూనే వున్నవి ప్రాకృతికంగా ప్రత్యక్షంగా. కాని అవి స్థిరంగా వుండవు. దాని శక్తి లక్షణము మారిపోవుచున్నది.అనగా విలువ లేనిదై యున్నది. మార్పు కల ప్రతీదీ భ్రాంతి. శక్తి రూప పదార్ధము కూడా భ్రాంతియే. పదార్ధమనగా దేహమునకు శక్తియున్నది అది మార్పు చెందినది. లేనియెడల పదార్ధ లక్షణము  తెలియదు.ఓం నమః ప్రణవంతో కూడినది. ప్రణవం పదార్ధ లక్షణము నమః. నమః పూర్వ లక్షణము ప్రణవం ఓంకారమని శివ సంకల్పం తెలుపు చున్నది. ఓం అనే శక్తి మెుదటిదైతే రెండవది నమః యని. అటుపిమ్మట శివ తత్వం. శరీర తత్వం శివ. మ పదార్ధ రూపం శరీరం. శరీరమే న ఎన్ యని యత్ అణః న అనే శక్తికి రూపం. అనంతమైన విజ్ఞానము తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం. .

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పులిచర్మం..ప్రలోభం... మొదటి భాగం.*


*(నలభై ఎనిమిదవ రోజు)*


శ్రీ స్వామివారి సాధన నిరంతరంగా నిరాఘాటంగ సాగిపోతోంది..మోక్షసాధనే ధ్యేయంగా చేస్తున్న కఠోర తపస్సు క్రమంగా ముగింపుకు వస్తోందని  స్వామివారికి అనుభవపూర్వకంగా అర్ధమవుతోంది.. శ్రీ స్వామివారు తీసుకుంటున్న మిత ఆహారం కూడా ఇంకా తగ్గించుకొని..మరీ అల్పపరిమాణంలో స్వీకరించసాగారు..దేహం కూడ శుష్కించిపోతున్నది.


ఒకరోజు శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్లారు..శ్రీ స్వామివారు వారితో తన తపస్సు గురించి కొన్ని విషయాలు మాట్లాడి.."పులిచర్మం మీద కూర్చుని తపస్సు లోని చివరి సాధన  చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది..అది ముక్తికి చివరి మెట్టు!..వ్యాఘ్ర చర్మం ధరించే పరమశివుడు నిరంతర విరాగి గా ఉండటం లోని పరమ రహస్యం అదే!.." అన్నారు..


ప్రభావతి గారి మనస్సులో ఈ మాటలు బాగా నాటుకొని పోయాయి..ఎలాగైనా పులిచర్మం సంపాదించి..శ్రీ స్వామివారికి అందచేయాలి..శ్రీ స్వామివారి తపస్సుకు తన వంతు సహాయం చేశానన్న తృప్తి ఉండాలని ఆవిడ బలంగా కోరుకున్నారు..


ఆ ప్రక్కరోజే..కందుకూరు మహిళామండలి అధ్యక్షురాలు..(ఆవిడ ప్రభావతి గారికి బాబాయి గారి కూతురు) తమ మహిళామండలి లో సాహిత్యోపన్యాసం చేయమని ప్రభావతి గారిని కోరారు..ప్రభావతి గారూ ఒప్పుకొని..శ్రీధరరావు గారితో సహా కందుకూరు చేరారు..బంధువులే కనుక, నేరుగా వాళ్ళింటికి తీసుకెళ్లారు..ప్రభావతి గారు వారింట్లో అడుగుపెట్టేసరికి.. ఆ ఇంటి హాలులో గోడకు ఒక పులిచర్మం తగిలించి ఉంది..బాబాయి గారి పెద్ద కుమారుడు ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు..అతను కూడా వచ్చి ఉన్నాడారోజు..


అందరూ భోజనానికి కూర్చున్నారు..ప్రభావతి గారి మనసంతా ఎదురుగ్గా గోడకు తగిలించి ఉన్న పులిచర్మం మీదే ఉంది..తాను నోరు తెరచి అడిగితే..వీళ్ళు కాదని అనలేరు..కాబట్టి అడిగి ఆ పులిచర్మం తీసుకొని..శ్రీ స్వామివారి కి అందచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు..


ప్రభావతి గారి మనసులోని ఆలోచనను శ్రీధరరావు గారు పసిగట్టేశారు..ప్రభావతి గారి మనసులోని భావాలను ఆయన చదవగలరు..లో గొంతుకతో.."ప్రభావతీ..నువ్వు ఆ పులిచర్మాన్ని ఇమ్మని అడగకు..పద్ధతి కాదు..వాళ్ళు ముచ్చటబడి దానిని అలా ఉంచుకున్నారు..నువ్వు ప్రలోభపడకు.." అన్నారు..ప్రభావతి గారు చివ్వున చూస్తూ.."ఇదేమన్నా నా కోసమా?..శ్రీ స్వామివారి తపస్సు కోసం కదా!..వాళ్లకు కూడా పుణ్యం వస్తుంది..మీరూరుకోండి..అన్నిటికీ అడ్డం పడకండి!.." అన్నారు.."ఒద్దు ప్రభావతీ..నామాట విను..ఇలా అడగటం తప్పని నీకూ తెలుసు!.." అన్నారు శ్రీధరరావు గారు..


ఆ క్షణంలో సరే అన్నట్లు తలూపిన ప్రభావతి గారు..మరి కొద్దిసేపటికే భోజనాలు తినడం పూర్తి అయిన మరుక్షణం..."బాబాయ్..పిన్నమ్మా..తమ్ముడూ.. చెల్లాయ్.." అంటూ పేరు పేరు నా అందరినీ పిలిచారు..అందరూ ప్రభావతి గారి దగ్గరకు వచ్చారు..శ్రీధరరావు గారు వారిస్తున్నా వినకుండా..

"నాకు ఆ పులిచర్మం కావాలి.." అన్నారు..

వింటున్న వాళ్ళు ఒక్కక్షణం నిర్ఘాంతపోయారు..


"అక్కయ్యా..అది నాకు బహుమానంగా ఒక ఆప్తుడు ఇచ్చాడు..వాళ్ళ జ్ఞాపకార్ధం ఇక్కడ ఉంచుకున్నాను..పైగా నాకు అదంటే ఇష్టం కూడానూ.." అన్నాడు నెమ్మదిగా..


"ఏం ఫర్లేదు తమ్ముడూ..ఒక మహానుభావుడి తపస్సుకు మీరు సహకరిస్తున్నారని తెలుసుకోండి..ఎంత పుణ్యమో మీకు తెలీక ఇలా అంటున్నారు.." అంటూ.."నేను మామూలుగా ఇటువంటి సాహిత్య సభలకు రాను..అదే గొప్ప గొప్ప రచయిత్రులు..కవులు..వస్తే..వారికి సన్మాన సత్కారాలు చేయాలి..నేను అలాకాదే!..నాకు భగవంతుడు వాక్కు ఇస్తేనే మాట్లాడతాను సభల్లో..నేను షరతులేవీ పెట్టను.. అటువంటిది ఈరోజు నేను అడుగుతున్నానని మీరు భావించినా పర్లేదు..నాకు ఆ పులిచర్మం కావాలి..అంతే!." అని గబ గబా అక్కడున్న కుర్చీ లాక్కొని..దానిమీదకు ఎక్కి..గోడకు తగిలించి ఉన్న పులిచర్మాన్ని మెల్లిగా మేకులనుంచి ఊడతీయడం మొదలెట్టారు..


ఈ పరిణామానికి బిత్తరపోయిన ఆ తమ్ముడు కాస్తా..తానే పులిచర్మాన్ని ఊడదీసి..ప్రభావతి గారికి ఇచ్చేసాడు..వాళ్ళ కళ్ళల్లో కనబడ్డ నిరాశ ప్రభావతి గారు, చూసికూడా  చూడనట్లే నటించి..ఆ పులిచర్మాన్ని చుట్ట చుట్టుకొని పట్టుకున్నారు..శ్రీధరరావు గారి వైపు చూసే సాహసం ఆవిడ చెయ్యలేదు..ఆయన చూపుల్లోని కోపాగ్నికి భస్మం అవుతానని భయం!..ఆ ఇంట్లో ఎవరూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బైటకు వచ్చేసి రిక్షా ఎక్కి బస్టాండ్ కు వచ్చేసారు..దారిపొడుగునా శ్రీధరరావు గారు చీవాట్లు పెడుతున్నా లెక్కచేయలేదు ఆవిడ!..


ఆ పులిచర్మం తీసుకొని మొగలిచెర్ల కు చేరారా దంపతులు..


పులిచర్మం..శ్రీ స్వామివారి లీల..రెండవభాగం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*

 (తీరిక చేసుకొని చదవండి)


**పిత్రార్జితం** 

   

*‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*


వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. అయితే తన ప్రార్థన ఫలించలేదు. భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.


‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్‌.


విజయ్‌ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది. ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.


విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్‌ తీశాడు. తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.


భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. ‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా... ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.


తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.

‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్‌ తల్లితో.


‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.


‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా? 


మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్‌.


‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.


‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్‌ విసుగ్గా.


‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్‌ అడిగాడు.


‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.


‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.


‘‘మీ చదువుల కోసం’’.


‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్‌ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.


‘‘కావచ్చు. ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు? మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. కానీ మీకా ఆలోచన లేకపోయింది. మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు. 


ఆ అప్పు అలాగే నిలిచిపోయింది. 


అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.


‘‘ఇంకా ఎంత కట్టాలట?’’ 


విజయ్‌ అడిగాడు.


‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్‌.


‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్‌.


పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.


‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.


‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్‌’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్‌. సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.


ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది. ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.


*   *   *


ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. ఏడు గంటలు చూపిస్తూంది. ‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.


‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.


తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్‌ అవసరంలేదనీ పాలవాడితో విజయ్‌ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది. ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.


షాపు నుంచి పాలప్యాకెట్‌ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది. ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. ఆమెకు ప్రాణం లేచివచ్చింది.


‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది. కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది. తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.


అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.


సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.


‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్‌. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్‌ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్‌ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్‌ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్‌. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్‌ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.


‘‘అమ్మా, మీ పెన్షన్‌ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.


రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?


ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు. ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. అవన్నీ పిల్లలు గమనించారు కూడా. మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.


వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు. 


‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు. దుబారా ఖర్చులు చేసేవారు కారు. రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. వీటిలో చాలా వస్తువులు స్టేటస్‌ సింబల్‌గా మారిపొయ్యాయి. అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు. పైగా ఫ్లాట్ల రేట్లు  పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్‌ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.


*     *     *


వారంరోజులు గడచిపోయాయి. సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. ఫోన్‌ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది. 


ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.


‘‘నా పేరు శ్రావణ్‌. బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.


‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.


‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.


‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్‌ మొన్న శాంక్షన్‌ అయింది. ఈనెల పెన్షన్‌ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.


‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్‌ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్‌ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.


సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.


*   *   *


సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది. కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది. త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.


సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.


‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.


‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.


సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది. ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.


‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.


*   *   *


ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.


ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్‌.


అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.


తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు. 

ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.


ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్‌ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు. కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.


ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. మా నాన్న గెజిటెడ్‌ ఆఫీసరు. లంచాలు బాగా తినేవాడు. ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. మాకు చదువు తలకెక్కేది కాదు. ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి.  నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి పెద్ద వాడిగా అన్ని బాధ్యతలు  తీసుకోమంటారు బంధువులు. అలా తీసుకోవడం నాకు సంతోషమే కానీ 

ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు అవుతా ఉన్నాయి.


మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. అందుకే మీ ఇల్లు కొని మా తమ్ముల్లను, మా అమ్మ ను ఇందులో చేర్చితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ. చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్‌ హౌస్‌’. ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. ఆస్తులకంటేరక్తసంబందాలు,ఆప్యాయత లు, మమకారాలే ముఖ్యమని నమ్మేవ్యక్తి ని నేను.   మా నాన్నగారి రుణం కొంత లో కొంత అయినా నెరవేర్చానన్న తృప్తి నాకు మిగులుతుంది " అన్నాడు రామారావు. 


*    *   *


రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది.


రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.


వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్‌ ‘గుడ్‌నెస్‌ ఈజ్‌ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ విచ్‌ నెవర్‌ ఫెయిల్స్‌ టు ఎర్న్‌ డివిడెండ్స్‌’ గుర్తొచ్చింది.


‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.


విజయ్‌ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్‌. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.


‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్‌. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.


సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు. ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సం తోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.

     * *మిత్రులారా సమాజంలో ఇలాంటి యధార్థ సంఘటనలు కోకొల్లలు. ఈ రోజు మీరు మంచి హోదా లో ఉండవచ్చు గాక . మీరు ఈ భూమి మీద కు రావటానికి జన్మను ఇచ్చింది ఎవరు? మీరు అనుభవిస్తున్న   ప్రస్తుత   హోదా మీకు రావటానికి కారణం ఎవరు? కేవలం ఆస్తులు మాత్రమే పంచుకుంటాం. వారి బాగోగులు మాకెందుకు అంటూ  జన్మనిచ్చి,కష్టపడి  పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన కనపడే ఆ దేవుళ్ళ ను మరిస్తే ఎలా?*  

     *ఈరోజు మీ తల్లిదండ్రుల ను ఎలా చూస్తున్నారో రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కధ చదివిన తర్వాత అయినా సరే కొంతమంది కొడుకుల మనఃస్తత్వం అయినా మారుతుంది అని ఆశిస్తున్నాను*. 

*తమ స్వంతం   గురించి పట్టించుకోకుండా పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్తు గా భావించి వారిని మంచి ప్రయోజకులు గా చేసిన ప్రతి ఒక్క  తల్లితండ్రి కి ఈ కధ అంకితం* 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

Stockdale Paradox

 *Stockdale Paradox అనే పదం ఎప్పుడైనా విన్నారా?*


James Stockdale అనే అమెరికన్ సైనికుడు  –  వియత్నాం యుద్ధం లో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్  సైనికులతో సహా దొరికిపోయాడు.. వీరిని జైలులో పెట్టడం జరిగింది... ఇతనితోపాటు ఆ జైలులో ఉన్న సైనికులు, తాము  క్రిస్టమస్ కు బయటకొచ్చేస్తామని ఆశించారు. కాని కుదరలేదు. మళ్ళీ న్యూఇయర్ కు వదిలేస్తారను కున్నారు. వదల్లేదు. ఈస్టర్ కు వదులుతారనుకుంటే, అప్పుడూవదల్లేదు. ఇలా ప్రతీ సంవత్సరం వదిలేస్తారనుకుంటే వదలడం లేదు. 

ఇలా ప్రతీ సంవత్సరం పెట్టుకున్న HOPE  నెరవేరకపోవడంతో రెండు మూడేళ్ళల్లో ఒక్కొక్కరు చచ్చిపోవడం జరిగింది. ఇలా తోటివారందరూ చనిపోతున్నా , Stockdale మాత్రం బ్రతికే వున్నాడు....!



*కారణం....?

 Extreme or too much hope చాలా ప్రమాదకరం.

 మనం అనుకున్నది జరగకపోతే Disappoint అవుతాం.

 అలాకాకుండా Stockdale లాగా Final గా శుభమే ఉంటుందని నమ్మడం కొన్నిసార్లు మంచే చేస్తుంది.


Stockdale మాత్రం ప్రతీ సంవత్సరం, ప్రతీసారి తాను బయటకు వచ్చేస్తానని మాత్రం ఆశించలేదు. ఎప్పటికైనా తాను విడుదల అవుతానని మాత్రం అనుకున్నాడు. ఖచ్చితంగా తాను బయటకువెళ్ళి  తనవాళ్ళను తప్పకుండా కలవగలననే నమ్మకం పెట్టుకున్నాడు.

అంతేగాని... మిగిలినవాళ్ళలాగా point of time గురించి గానీ,  period of time గురించి గాని ఆలోచించలేదూ. మిగిలిన వారిలాగా Extreme Hope పెట్టుకోలేదు.

 కాని తనకథకు మాత్రం Happy Ending ఉంటుందని మాత్రం నమ్మకం పెట్టుకున్నాడు.

ఆఖరికి ఏడున్నర సంవత్సరాల తరువాత అతను జైలునుండి రిలీజయ్యాడు. కాని తన తోటివారు మాత్రం అప్పటికే చనిపోయారు.


 ఇలా ఇతను బ్రతకడానికి తోడ్పడిన ఈ ఆలోచనా విధానాన్నే Stockdale Paradox అంటారు.



*ఇప్పుడు ఈ thought process కరోనా విషయంలోనూ అవసరమే. ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుందనే short term  Extreme Hopes పెట్టుకునేకన్నా. ఖచ్చితంగా మనం ఈ pandemicను దాటుకుని గతంలో లాగానే చక్కగా, సంతోషంగా తిరగగలుగుతామనే నమ్మకాన్ని ఉంచుకుని , ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికగా ఎదురు చూడండి.

 కరోనాకే బోర్ కొట్టి - అది మనల్ని వదలి వెళ్ళే రోజు  ఎంతో దూరం ఉండబోదని నా ఉద్ధేశం.

Happy Ending కు ఎదురుచూద్ధాం.


ఆతరువాత Stockdale అమెరికన్ సైన్యంలో admiral గా పనిచేసాడు. ఆతరువాత ఆయన రాసిన పుస్తకం A Vietnam Experience.

 ఆతరువాత Jim Collins అనే ఆయన Good to great అనే Book లో ఈ Stockdale Paradox గురించి వ్రాయడం జరిగింది.

*ఈ Stockdale Paradox Theory ని ఈ మధ్యనే Harvard university , తమ Business School meeting లో,

 కరోనా విషయంలో ఈ papers ని release చేసింది.......

వీలుకుదిరితే ఆ పుస్తకాలు చదవండి. Stockdale Paradox Theory ని మర్చిపోకండి.



100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మన ఓపికను పరిష్కరించుకోగలిగే అవకాశం వస్తుంది. మనకి అద్భుతమైన ఓపిక ఉందనే విషయం మనకి ఇప్పటికే అర్థమైపోయింది.

ఇంకెంత కొంతకాలమే ఈ పరీక్ష! చివరిదాకా ఓపికతో ఉన్నవాడే ,  యుద్ధాన్ని గెలవగలడు.

ఇంకో విషయం -

ఇంత భయంకరమైన కరోనానే ఓపిక తో జయించగలిగినపుడు – భవిష్యత్ లో మీ జీవితంలో కి అడుగు బెట్టేవి చాలా చిన్నసమస్యలైపోతాయి.

 అన్నింటికన్నా పెద్దసమస్య - మరణం.

దానినే మీరు ఎదుర్కోని బయటకు రాగలిగినపుడు. ఇక మిగిలిన సమస్యలన్నీ చాలా చిన్నవి. తేలికగా పరిష్కరించగలరు.


This is nothing but Survival Psychology , in Crisis Management . All the best...!!!Prof.Dr Alapati Srinagesh, Consultant Psychologist,APOLLO HOSPITALS, 8790713552

నేనే ఆనంద్

 రాత్రి చీకటి పడుతోంది.  తాళం వేసిఉన్న ఇనుప ద్వారం  బయట నుండి ఒక పిలుపు.  ఎవరా అని వచ్చి చూశాను.  గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు.  చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన  బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి  ఉన్నారు.  అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, ఇంటి నెంబర్ 8,  ఇదే కదూ!" అని అడిగారు.  "అవును నేనే ఆనంద్.    మీరూ ..." అని నసిగాను.  అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో  తడుపుకుంటూ "బాబూ!  నేను మీ నాన్నగారి మిత్రుడిని.  మీ ఊరినుండే వస్తున్నాను.  నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.  


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను.  అందులో "ప్రియమైన ఆనంద్!  నీకు నా ఆశీర్వాదములు.  ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు.  పేరు రామయ్య.  చాలా కష్టజీవి.  కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్  లో చనిపోయాడు.  నష్టపరిహారం  కోసం తిరుగుతున్నాడు.  అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది.  ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి  నీకు పంపాను.  డబ్బులు Head Office  లో తీసుకోమన్నారు.  ఆయనకు హైదరాబాద్  కొత్త.  ఏమి తెలియదు.  నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను.  ఆరోగ్యం జాగ్రత్త.  కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది.  


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు.  ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను.  మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను.  "లేదు బాబూ.  ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని  చెప్పారు.


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.  "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను.  నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు.  నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు.  అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది.  కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.  సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది.  నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు.  అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు.  ఇతడు మాత్రమే మాకు మిగిలాడు.  పేరు మహేష్.  కష్టపడి చదివించాను.  బాగా చదువుకుని  ఉద్యోగం సంపాదించుకున్నాడు.  మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు.  ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది.  అక్కడికక్కడే చనిపోయాడు.  నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము.  కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది.  నా భార్య ఆరోగ్యం బాగా  లేదు.  మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను.  నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.  


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు  ...


ఆయన మాసిన బట్టలు చిరిగిన చెప్పులు చూసి అర్థం అయ్యింది అతని ప్రస్తుత పరిస్థితి  తెల్లవారే దగ్గరలో ఉన్న ఓ షాప్ కు వెళ్లి అతనికి సరిపడే బట్టలు చెప్పులు కొని తీసుకొచ్చి అతనికిచ్చాను ... 

అవి తీసుకునేందుకు ఒప్పుకోలేదు ...మా నాన్నగారే ఇమ్మన్నారు అని చెప్పి ఒప్పించి ఇచ్చాను...


స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము.  దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము.  "ఆనంద్!  ఇక నేను చూసుకుంటాను.  నువ్వు ఆఫీస్ కు వెళ్ళు బాబు" అన్నారాయన.  "పర్లేదండి.  నేను లీవ్ పెట్టాను" అన్నాను.  దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను.  చాలా థాంక్స్ బాబూ!  నేను ఊరికి బయల్దేరుతాను.  మా ఆవిడ ఒక్కతే  ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.  "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య గారి చేతిలో పెట్టాను.  


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ!  నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు.  ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి.  కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు....


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.  నా పేరు కూడా ఆనంద్ నే  మీరు చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు.  ఆ ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట మరో 2 km ప్రయాణం చేయాలి.  మీరేమో  అలసిపోయి ఉన్నారు.  అందుకే నేను నిజం చెప్పలేదు.  మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను.  ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట.  ఆయన భార్య చెప్పారు.  మీ మిత్రుడికి విషయం చెప్పాను.  అయన చాల బాధ పడ్డారు.  నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు.  మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది.   కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది.  నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను.  బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు.  ఆ మాటే చాలనుకున్నాను నేను.  పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు.  ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.


ఆ వయసులో కష్టాలలో కనపడే ప్రతి పెద్దలకు ముస్లివాళ్లకు తల్లి/తండ్రికిచ్చే గౌరవమే ఇచ్చి కుదిరితే సహాయం చెయ్యాలి


ఆకాశంలోకి చూశాను.  అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న.  "నాన్నా!  నా అభివృద్ధి  చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు!  ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా?  మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా!  మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను. 

మరి ప్రకృతికి ఏమి అర్థమయ్యిందో లేక పైనున్న మా నాన్న కూడా నాలాగే ఆనందబాష్పాలు రాల్చడా తెలియదు కాని చిరు చినుకుల జల్లులు రాలి నన్ను ఆశీర్వదించాయి ఆ క్షణాన ...


"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు.  మిగిలినవన్నీ

దానికి తోడుగా నిలబడతాయి"

ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి.


ఈ కథ మీకు కూడా నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి, 

 అవసరం లో ఉన్నవారికి సాయపడదాం.......