25, నవంబర్ 2024, సోమవారం

10-16,17-గీతా మకరందము

 10-16,17-గీతా మకరందము

          విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


వక్తు మర్హస్యశేషేణ 

దివ్యాహ్యాత్మ విభూతయః | 

యాభిర్విభూతిభిర్లోకాన్

ఇమాం స్త్వం వ్యాప్య తిష్ఠసి || 


తా:- కావున ఏ విభూతులచే (మాహాత్మ్య విస్తారములచే) మీరీ లోకములన్నిటిని వ్యాపించియున్నారో అట్టి దివ్యములగు మీ విభూతులను సంపూర్ణముగ చెప్పుటకు మీరే తగుదురు.

---------

10-17

కథం విద్యామహం యోగిం

స్త్వాం సదా పరిచిన్తయన్ | 

కేషుకేషు చ భావేషు 

చిన్త్యోఽసి భగవన్మయా || 


తా:- యోగేశ్వరా! నేనెల్లప్పుడును ఏ ప్రకారముగ ధ్యానించుచు మిమ్ము తెలిసికొనగలను? భగవంతుడా! ఏ యే  వస్తువులందు మిమ్ము నేను ధ్యానింపవలెను? 


వ్యాఖ్య:- అతిసూక్ష్మమగు దైవతత్త్వము సామాన్యముగ జనులకు వెంటనే అనుభూతము కాదు, గనుక సాధకుడు ప్రారంభస్థితియందు తన మనస్సును ఒకానొక భగవత్సంబంధమైన పవిత్రవస్తువునందు, లేక మూర్తియందు కేంద్రీకరించి కొంతకాలము ధ్యానము నభ్యసింపవలయును. క్రమముగ చిత్తైకాగ్రతను సంపాదించిన మీదట నిరాకార, నిర్గుణతత్త్వమునుగూర్చి విచారింపవచ్చును. కనుకనే అర్జునుడు ధ్యానించుటకు కొన్ని సాకారవిభూతులను, దివ్యపదార్థములను తెలుపవలసినదిగా భగవానుని వేడుకొనుచున్నాడు. సమస్తజగత్తున్ను భగవంతునిస్వరూపమే అయియున్నను, ధ్యానానుకూలత కొఱకై ఏ యే రూపములు తగియున్నవో, అట్టి ప్రధానములైన కొన్నిటిని సెలవివ్వవలసినదిగా అర్జునుడు ప్రార్థించుచున్నాడు.

శ్రీ ఇడగుంజి గణపతి క్షేత్రం

 🕉 మన గుడి : నెం 940


⚜  ఉత్తర కర్ణాటక : ఇడగుంజి 


⚜ శ్రీ ఇడగుంజి గణపతి క్షేత్రం



💠 ఇడగుంజి గణపతి క్షేత్రం

అష్టవినాయక క్షేత్రాలలో ఒకటి.

ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు,

ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర సమీపంలోని

ఇడగుంజిలోని వినాయకుడు అత్యంత

శక్తివంతమైన దేవుడిగా భక్తుల భావిస్తారు.


💠 స్కందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో ఈ క్షేత్ర ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది.  'ఎడ' అంటే 'ఎడమవైపు' మరియు 'కుంజ్' అంటే తోట. శరావతి నది ఎడమ ఒడ్డున ఉన్నందున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. 

ఈ గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది. శరావతి నది అరేబియా సముద్రంలో కలిసేచోట ఈ ఆలయం ఉంది.


💠 ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి.

 ఏ పెళ్లిని తలపెట్టినా  అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే.  అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.


💠 కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు,

పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు

ఈ ఆలయానికి చేరుకుంటారు.

అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత  రెండు చీటీలను ఉంచుతారు.

కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే

దానిని శుభసూచకంగా భావించి_ వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. 

అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు


💠 ఇడగుంజి ఆలయంలో మూలవిరాట్టైన

వినాయకుడు చూడముచ్చటగా కనిపిస్తాడు. 

సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. 

ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.


💠 ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోని గణపతికి ఇక్కడ రెండు దంతాలు ఉంటాయి.

అంతే కాదు అన్ని చోట్ల గణపతి కడుపుకు నాగుపాము చుట్టుకుని ఉంటుంది.

కానీ, ఇక్కడ ఉండదు. 

అలాగే నాగ యజ్ఞోపవీతం ధరించి ఉండటం

పలు విగ్రహాలకు గమనించి ఉంటాము. 

అలాగే ఇచట గణపతి ద్విభజాలతో ఉంటారు.

రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనబడుతాడు.

ప్రపంచంలోనే ద్విభుజ గణపతి దేవుడు ఇక్కడే.


💠 పురాణ కథనం ప్రకారం మహాభారత రచనకు గణపతి ఆగని గంటం కోసం తన దంతాన్నే ఉపయోగించారని ప్రతీతి. 

అంటే.. ఇక్కడి గణపతి అంతకు పూర్వమే ఉన్నారన్నమాట.


💠 భక్తుల నమ్మకం మేరకు భగవంతుడు ఆ ప్రాంతాన్ని కుంజారణ్యగా పిలువబడినపుడు అక్కడ ఉండేవాడని చెపుతారు. 

ప్రాచీన కాలంలో ఋషులు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకొనేవారు.


🔆 స్థలపురాణం 🔆


💠 ద్వాపర యుగం ముగిసే సమయానికి కృష్ణుడు భూమిని విడిచిపెట్టబోతున్నాడు కాబట్టి అందరూ కలియుగ ఆగమనాన్ని భయపడ్డారు . 

కలియుగం యొక్క అన్ని అడ్డంకులను అధిగమించడానికి కృష్ణుడి సహాయం కోరుతూ ఋషులు తపస్సులు మరియు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. 


💠 వాలఖిల్య నేతృత్వంలోని ఋషులు కర్నాటకలోని శరావతి నది ఒడ్డున అరేబియా సముద్రంలో కలుస్తున్న అటవీ ప్రాంతమైన కుంజవనంలో క్రతువులు ప్రారంభించారు. 

ఈ సమయంలో, అతను యాగం చేయడంలో చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాడు.

అందువల్ల, అతను సమస్యను పరిష్కరించడానికి తగిన మార్గాలను అన్వేషిస్తూ నారదుని సలహా కోరాడు .


💠 నారదుడు వాలఖిల్యకు తన యాగాన్ని పునఃప్రారంభించే ముందు అడ్డంకులను తొలగించే గణేశుని ఆశీర్వాదం పొందమని సలహా ఇచ్చాడు. 

ఋషుల అభ్యర్థన మేరకు, నారదుడు వినాయకుని జోక్యాన్ని కోరుతూ కుంజవన వద్ద శరావతి నది ఒడ్డున వ్రతం కోసం ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు. 

భూమిని నాశనం చేయడంలో పాల్గొన్న రాక్షసులను అంతం చేయడానికి  త్రిమూర్తులు ( బ్రహ్మ , విష్ణు, శివుడు ) కూడా ఈ స్థలాన్ని గతంలో సందర్శించారు. 


💠 దేవతలు ఆ సమయంలో చక్రతీర్థం మరియు బ్రహ్మతీర్థం అనే పవిత్ర సరస్సులను కూడా సృష్టించారు. 

నారదుడు మరియు ఇతర ఋషులు దేవతీర్థం అనే కొత్త పవిత్ర చెరువును సృష్టించారు. నారదుడు దేవతలను ఆహ్వానించి వినాయకుని తల్లి పార్వతిని గణేశుడిని పంపమని వేడుకున్నాడు. పూజలు నిర్వహించి గణేశుడిని కీర్తిస్తూ కీర్తనలు పఠించారు. 

వారి భక్తికి సంతోషించిన గణేశుడు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆచారాలను నిర్వహించడంలో సహాయపడటానికి స్థలంలో ఉండటానికి అంగీకరించాడు. 


💠 ఈ సందర్భంగా, ఆలయానికి నీటిని తీసుకురావడానికి మరో సరస్సు కూడా సృష్టించబడింది మరియు దానికి గణేశ-తీర్థం అని పేరు పెట్టారు. అదే ప్రదేశాన్ని ఇప్పుడు ఇడగుంజి అని పిలుస్తారు.


💠 మురుడేశ్వర (19km), గోకర్ణ (68km),


రచన

©️ Santosh Kumar

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

* 206వ రోజు*

ఇంద్రుడు పదవీచ్యుతుడై తిరిగి పట్టాభిషిక్తుడగుట 

శల్యుని మాటలు విన్న ధర్మరాజు " మహానుభావా! ఇంద్రుడు, శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారు. కొంచం వివరించండి " అన్నాడు. శల్యుడు ఇలా చెప్ప సాగాడు. దేవతలలో త్వష్ట అనే వాడు ఉన్నాడు. అతడు ఉత్తముడు. అతడు తన తపోశక్తితో మూడతలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవి కోరి ఘోరతస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లొంగక పోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విషయం ఒక సంవత్సరం రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆవిషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు, అతడు బ్రహ్మహత్యా పాతకం చేసాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచి పెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేసాడు.

వృత్తాసుర వధ[మార్చు]

ఇది తెలిసిన త్వష్ట కోపించి నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపుని చంపినందుకు ఇంద్రుని చంపడానికి ఒక శక్తిని సృష్టించి అతడికి వృత్తుడు అని నామకరణం చేసాడు. అధిక బల సంపన్నుడైన వృత్తుడు ఇంద్రుని జయించి అతనిని మింగి కడుపు బరువెక్కడంతో నిద్రకుపక్రమించి గట్టిగా ఆవలించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి బయటకు వచ్చాడు. ఇంద్రుడు తిరిగి వృత్తాసురునితో యుద్ధానికి దిగాడు. వృత్తుని ధాటికి తట్టుకోలేక దేవతలు మంధర పర్వత శిఖరానికి చేరి వృత్తుని చంపే ఉపాయంకోసం ఆలోచించారు. అందరూ మహా విష్ణువు వద్దకు వెళ్ళి వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్ధించారు. మీరు వెళ్ళి ఇంద్రునికి వృత్తునికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంత మయ్యేలా చేస్తాను " అన్నాడు. ఋషులంతా వృత్తుని వద్దకు వెళ్ళి " ఇంద్రుడు అజేయుడు నీవా అధిక బలశాలివి మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు. కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో " అని నచ్చచెప్పారు. వృత్తుడు అందుకు అంగీకరిస్తూ " బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి. నేను తడిసిన దానితో కాని ఎండిన దానితో కాని రాత్రి కాని పగలు కాని సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే ఇంద్రునితో సంధి చేసుకుంటాను " అన్నాడు. వృత్తుడు మైత్రి చేసుకున్నా ఇంద్రుడు మాత్రం వృత్తుని సంహరించే మార్గం అన్వేషిస్తూ ఉన్నాడు. ఒక రోజు అసుర సంధ్యలో సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తుని చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్ధించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సాయంతో వృత్తుని సంహరించాడు.

నహుషుడు.

ఈ విషయం తెలిసిన భూతాలు బ్రహ్మ హత్య చేసినందుకు నిందించాయి. బ్రహ్మహత్యా పాతకం వెంట తరమగా ఇంద్రుడు పదవీచ్యుతుడై నిషధాచలంలో తలదాచుకున్నాడు. దేవతలంతా ఇంద్రపదవి కోసం తగిన వాడి కోసం అన్వేషిస్తూ భూలోకంలో నూరు అశ్వమేధయాగాలు చేసిన నహుషుడు అనే మహారాజుని ఆ పదవిలో కుర్చోమని అర్ధించారు. నహుషుడు మాత్రం అందుకు అంగీకరించ లేదు ఇంద్ర పదవి అధిష్టించేంత సామర్ధ్యం తనకు లేదన్నాడు. యముడు, అగ్ని, వరూణాది దేవతలు తమ శక్తిని అతనికి పంచారు. నహుషుడు దానితో అధిక బల సంపన్నుడైనాడు. నహుషుడు ఇంద్రపదిని అధిష్టించి ధర్మ పరుడై సమస్త లోకాలను పాలిస్తున్నాడు. కిన్నెరలూ, కింపురుషులు, యక్షులు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, గరుడులూ సమస్త దేవతల నుండి తేజో భాగములు స్వీకరించి అత్యంత తేజోమయుడయ్యాడు. మునులంతా నహుషుని సేవిస్తున్నారు, తుంబురు నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు, రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి మొదలైన అప్సరసలు నాట్యంతో వినోదం కలిగిస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్క సారిగా సంక్రమించగానే నహుషునిలో గర్వం తొంగిచూసింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శివ నిర్మాల్యం తొక్కిన పాపం తీసివేసే కాశీలోని పుష్పదంతేశ్వరుడు"*

 *"శివ నిర్మాల్యం తొక్కిన పాపం తీసివేసే కాశీలోని పుష్పదంతేశ్వరుడు"* 

 

     "త్రిదళం త్రిగుణాకారం, 

     త్రినేత్రంచ త్రిఆయుధం, 

     త్రిజన్మ పాప సంహారం, 

     ఏకబిల్వం శివార్పణం" 

 

🔼 బ్రహ్మ విష్ణు శివాత్మకంగా, మూడుదళాలతో, లక్ష్మీదేవి నెలకొని ఉన్న మారేడుదళం శివుని పూజలో తప్పనిసరి. తులసి లేకుండా విష్ణు పూజ, మారేడు లేకుండా శివపూజ, 

గరిక లేకుండా గణపతి పూజ చేయగూడదంటుంది శాస్త్రం.  

 

అయితే శివాలయాలలో ఏదో సందర్భంలో బిల్వపత్రం పొరపాటున ఏమరుపాటున మన కాలికి తగిలితే మహాపాపం. శివపూజా ద్రవ్యాన్ని కానీ, నిర్మాల్యం (తీసివేసిన పూలు, బిల్వదళాలు) కానీ కాలితో తొక్కటం మహాపరాధం. మరి ఈ పాప నివృత్తికి ఋషులు చెప్పిన సనాతనసూత్రం "కాశీఖండం"లో సూచించబడిన పుష్పదంతేశ్వరుడే ఈ పాపాన్ని తొలగించగలడు. 

 

వారణాశిలోని మానససరోవర్ ఘాట్ వద్ద ఉన్న ఆంధ్రాశ్రమం నుండి ఇరుకుసందులగుండా విశ్వనాధ దేవాలయానికి వెళ్ళేదారిలో (ఎడమచేతివైపు పోస్టాఫీసువద్ద) ఈ పుష్పదంతేశ్వర స్వామి ఆలయం వుంది. (చౌశక్తిమాతా అలయాలు కుడివైపు సందులో వుంటే, ఈ ఆలయానికి ఎడమవైపు వెళ్ళాలి). ఆ స్వామి వారికి అపరాధం చెప్పుకొని ఒక బిల్వపత్ర్రాన్ని ఆయన శిరస్సుపై వుంచితే, శివద్రవ్యాన్ని లేదా శివనిర్మాల్యాన్ని తొక్కిన దోషం పోయి ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. 

 

పుష్పదంతేశ్వర స్వామివారి ఆశ్సీసులు మనందరికీ కలగాలని ప్రార్ధిస్తూ... ఈసారి మీరు కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామి వారిని దర్శించండి. 


 *నోట్:- శివనిర్మాల్యం ఈ కాలంలో తొక్కని భక్తులు ఉండరు ఇది జంగన్వాడి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ (JK,,)పక్క సందులో నుంచి 300 మీటర్లు కూడా ఉండదు ప్రతి ఒక్కరూ దర్శించుకుని శివనిర్మాల్యం తొక్కిన పాపం నిర్మూలించ కొనవచ్చు.*

మయుఖాదిత్యుడు

 మయుఖాదిత్యుడు: సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద  వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట. 


సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.

కేశవ ఆదిత్య కాశి

 కేశవ ఆదిత్య కాశి

కేశవాదిత్యుడు: ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర ---> రాజ్ ఘాట్ వేరు... రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి.🙏

ఉత్తరార్క ఆతిథుడు

 ఉత్తరార్క ఆతిథుడు


ఉత్తరార్క ఆదిత్యుడు: జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసం ప్రసాదించాడు. మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. స్థానికంగా 'బకరీ కుండ్' అని పిలిచే కోనేరులో స్నానమాచరించి, ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయట. వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంటుందీ మందిరం.

సాంబా ఆతిథ్య కాశి

 సాంబా ఆతిథ్య కాశి


సాంబాదిత్యుడు: నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠురోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి, విశ్వేశ్వరునితో పాటు, సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు. ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోతుంది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారట.

సంగ్రహం ద్వాదశ ఆతిథ్యుల కథ

 సంగ్రహం ద్వాదశ ఆతిథ్యుల కథ


కాశీ ఖండంలో చెప్పబడిన  ప్రకారం, పద్మ కల్పం సమయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు, అన్ని జీవులు దాని వల్ల తీవ్రంగా బాధించబడ్డాయి. కాబట్టి, బ్రహ్మ దేవుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, తన సృష్టి అంతమపటం ఇష్టంలేని బ్రహ్మదేవుడుతపస్సులో నిమగ్నమై ఉన్న రాజు రిపుంజయుడిని చూశాడు. అతనితో సంతోషించిన బ్రహ్మ దేవుడు అతనికి దివోదాస్ రాజు గా పేరు మార్చాడు మరియు ప్రపంచాన్ని తన సింహాసనం కిందకు తీసుకొని మానవాళిని రక్షించమని అభ్యర్థించాడు. రాజు దీనికి అంగీకరించాడు,

కానీ దేవదాస్ దానికి కొన్ని షరతులను విధించారు దేవతలందరూ భూమిని వీడి స్వర్గానికి వెళ్ళిపోవాలని తన పరిపాలనలో ఎవరి జోక్యం ఉండకూడదు అని, దానికి బ్రహ్మ అంగీకరించారు ఏదైనా పాలనలో లోపం ఉంటే ఆ రాజును తొలగించే విధంగా పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నారు. 

ఈ అంగీకారం ప్రకారం మొత్తం దేవతలందరూ దేవలోకం చేరారు కానీ బ్రహ్మ యొక్క ప్రత్యేక అభ్యర్థనపై శివుడు కూడా కాశి వదిలి వెళ్లారు. 


ఇలా కొన్నాళ్ల గడిచాక శివుడు తిరిగి కాశి వచ్చివేయాలని నిశ్చయించుకున్నారు అందుకు దివోదాస్ పరిపాలనలో లోపాలను కనుగొనమని యోగినీలను మొదట పంపారు కానీ వారు కాశీలో స్థిరపడిపోయారు తరువాత సూర్యుని పిలిచి డివోదాస్ పాలనలో లోపాలను కనుగొనమని చెప్పారు సూర్యుడు కూడా కాశీ వచ్చి అక్కడి వాతావరణం రాజ్యపాలన చూసి లోపాలను కనుగొనలేక అతను కూడా 12 రూపాయలలో కాశీలో స్థిరపడిపోయారు ఆ 12 కాశీలో ద్వాదశ ఆతిథ్యులు గా పిలవబడుతున్నారు

మొగిలిచెర్ల అవధూత

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్తోపదేశాలు - పద్దెనిమదవ భాగం - జ్ఞాన ప్రసాదాలు 


మానవ చరిత్ర మొదటి నుంచి కూడా దూరాక్రమణలు జరుగుతూనే ఉండేవి. ఒకరికి సంబంధించిన దేశాన్నో, లేక రాజ్యన్నో లేక స్థలాన్నో బలవంతంగా కానీ యుద్ధం చేసి కానీ హస్తగతం చేసుకోవడం అన్నది కొన్ని వందల ఏళ్ళుగా విచ్చలవిడిగా జరిగింది. దీనికి ఏ ఒక్క దేశం మినహాయింపు కాదు. అందుకనే అన్ని దేశాలలో ఎక్కువగానో లేక తక్కువగానో  అన్ని జాతులకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలానే మన దేశంలో కూడా అనేక దురాక్రమణలు జరిగాయి, అయినా కానీ మన సంస్కృతిని అన్నిటినుంచి తప్పించి మనం నిలబెట్టుకోగలిగాము అంటే దానికి ముఖ్య కారణం గురు పరంపర. మన దేశములో దైవ ప్రజ్ఞ ఉన్న ప్రతీ గురువు, వారిలోని జ్ఞానాన్ని తరువాత తరానికి ఖచ్చితంగా అందేలా పాటుపడ్డారు. అందుకనే మన దేవాలయాలు కూలగొట్టినా, మన సంపదలు కొట్టేసినా కానీ, మన సంస్కృతి మాత్రం నిలబడింది. ఒక కోటను కూలగొట్టినప్పుడు పరదేశీయుడు బంగారం, వజ్రాలు, నాణేలు మాత్రమే నిజమైన ఆస్తిగా భావించి వాటిన ఎత్తుకు పోయారు కానీ, ఆకుల మీద వ్రాసిన గీతలే మన నిజమైన సంపద అని తెలుసుకోలేక ఏంతో విలువైన గ్రంధాలను ఇక్కడ వదిలేశారు. అవే మన సంస్కృతిని నిలబెట్టాయి. 


ఎందరో మహానుభావులు వారి గురువులు చెప్పిన అమృతతుల్యమైన వాక్కులను వల్లె వేసి, గ్రంధస్థం చేసి తరువాతి తరాలకు అందించారు కాబట్టే ఇప్పటికి ఈ నేల పై సంప్రదాయం, సంస్కృతి నిలబడ్డాయి. మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవనాన్ని బాహ్యంగా చుస్తే అసలు వారికి శిష్యులు లేరు కదా, కాబట్టి సంప్రదాయబద్ధంగా గురోపదేశం చెయ్యలేదు కాబట్టి, వారి జ్ఞానాన్ని వారితోటే తీసుకొని వెళ్లిపోయారు అని అనుకోవచ్చు. కానీ అది పొరపాటు. 




ఒక్కసారి ఆ మహానుభావుడి చర్యలను దగ్గరగా గమనిస్తే, శ్రీ స్వామి వారు అలా వారి జీవితములో నడుస్తూనే ఎంతో మంది నడవడికను మార్చేసారు. అసలు మన శ్రీ స్వామి వారిది ఎంతటి ప్రజ్ఞ అంటే, మనకి విద్యను వ్యక్తితత్త్వం చేసుకోవడంలో ఉన్న వ్యధను గమనించి, మనకి అస్సలు ఎటువంటి బాధ లేకుండానే ఎన్నో కఠిన బోధలను మనకు నేర్పించారు. 



శ్రీ స్వామి వారు, చెక్కా కేశవులు గారు అమ్మవారి సాక్షాత్కారం అడిగితే, అది ఎంతటి కఠినమో ఒకసారి రుచి చూపించే, స్వర్గము అనేది ఎగిరితే దొరికే పండు కాదని బోధ చేశారు. 


ప్రభావతి గారి తొలి పరిచయములోనే ఆదిత్య హృదయం చెప్పమని అడిగి, వారు చెప్పలేక పోయినప్పుడు అహంకారం, మనకు ఆ పరమాత్మకు మధ్య దూరం ఎంత పెంచుతుందో బోధ చేశారు. 


అదే ఆదిత్య హృదయం ప్రభావతి గారు గబగబ చదవగా, సక్రమమైన మంత్రోచ్ఛారణ ఎంతటి ముఖ్యమో బోధ చేశారు. 


రామ నామం వల్ల కష్టాలు వస్తాయి కదా అని సందేహం అడిగితే, భాగవన్నామం అనేది అగ్నిహోత్రము వంటిది అని, అది మన పాపల్ని బూడిద చేసే ప్రక్రియే మనకి ఆ సమయములో ఎదురయ్యే కష్టాలు అని బోధ చేశారు. 


అహంకారంతో శ్రీ స్వామి వారి జ్ఞానాన్నే బేరీజు వేద్దామని వచ్చిన పండితునికి, అసలు శ్రీ స్వామి వారి జ్ఞానాన్ని అంచనా వేయడానికి ఆ పండితునికి ఉన్నది ఏపాటి జ్ఞానం అని ప్రశ్నించి బోధన చేశారు.  


ప్రభావతి గారు బలవంతంగా పులి చర్మాన్ని తీసుకొని వస్తే అది తగదు అని దానికి గల కారణాన్ని చెప్పి బోధ చేశారు.


అదే ప్రభావతి గారు స్వామి వారి జటాఝాటంను కోరుకోగా ఆర్తి చెందిన వారికి గురుకృప అండగా ఉంటే, వారు కోరుకున్నది నిస్సందేహంగా అంది తీరుతుంది అని బోధ చేశారు. 


అంతేకాదు, ఇప్పటికి కూడా జ్ఞానం పంచడానికి గురువు శరీరంతో ఉండవలసిన అవసరం లేదని వారి బృందావనం ముందు మోకరిల్లిన ప్రతి భక్తునికి బోధ చేస్తూనే ఉన్నారు. 


అందుకనే శ్రీ స్వామి వారి చరిత్రను ఆమూలాగ్రంగా అర్థం చేసుకొని, ఇటువంటి జ్ఞాన ప్రసాదాలను మనం తరువాత తరాలకు అందించడమే మనం చేసే గురు సేవ, అలానే మన సంస్కృతిని నిలబెట్టేందుకు మనం చేసే నిర్విరామ ప్రయత్నం.


సర్వం,

శ్రీ దత్త కృప

ధన్యోస్మి

పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు : 

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699

----

ఇంతటి మహానుభావుని దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ

-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632


---

పొరుగువానికి ఉపకారం చేయండి.*

 *పొరుగువానికి ఉపకారం చేయండి.*

మనుష్యులు రెండు విధాలుగా ఉంటారు. కొంతమంది చాల సుఖంగా

ఉంటారు, ఇంకొంతమంది పుట్టినప్పటినుంచీ కష్టపడుతూ ఉంటారు. రెండు విధాల మనుష్యులను చూస్తున్నప్పుడు మనకు ఎటువంటి భావన ఉండాలో తెలుసుకోవాలి. మన తత్త్వం ఎలా ఉంటుందంటే సుఖంగా ఉన్నవాణ్ణి చూసి అసూయపడడం జరుగుతూ ఉంటుంది.

 *परोत्कर्ष असहिष्णुता असूया* 

 అని ఈ అసూయకు నిర్వచనం చెప్పారు. ఇంకొకడు పైకి రావడాన్ని చూసి ఓర్వలేకపోవడం, వాడు తన స్వంత కృషితో బుద్ధితో మంచితనంతో పైకివస్తే అటువంటి వాణ్ణి చూసి ఓర్వలేకపోవడం మనుష్యులకు స్వభావమైపోయింది. కాని ఇలా ఎన్నడూ ఉండకూడదు. అయితే ఎలా ఉండాలి ? అంటే ఆ వ్యక్తితో చాల స్నేహంగా ఉండాలి. సౌజన్యంతో, సౌహార్దంతో వ్యవహరించాలి. దీన్ని ఎప్పుడూ మనసులో ఊహించుకోవాలి.

అలాగే కష్టంలో ఉన్నవాని విషయంలో కరుణ చూపాలి. కరుణ అంటే 

 *परदुःख प्रहाणेच्चा.* 

జన్మాంతరంలో చేసిన పాపం వల్ల ఇవాళ వాడు కష్టంలో ఉన్నాడు. అయితే భగవంతుడు మనకు కొద్దోగొప్పో శక్తినిచ్చాడు పొరుగువానికి ఉపకారం చెయ్యడానికి. ఈ శక్తి మనకు ఉన్నందుకు మనం ఉపకారం ఎందుకు చేయకూడదు? అలా కష్టం ఉన్నవారికి యథాశక్తి తోచిన సహాయం చేయ్యాలి. వాడు కష్టపడితేనే అని ఉపేక్ష చేయకూడదు. మనం వాడికి సహాయం చేస్తే మనకేమిటి లాభం అంటూ ఆలోచించకుండా ఉపకారం చేస్తూ ఉండాలి.అప్పుడే భగవంతుడు తృప్తి చెందేది.

--- *జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు* 


 *ॐ नमः पार्वती पतये हरहरमहदेव*

కార్తిక పురాణము - ఇరవై ఐదవ అధ్యాయము

 *కార్తిక పురాణము - ఇరవై ఐదవ అధ్యాయము*

*బ్రాహ్మణ తిరస్కారం-ఫలితము*


బ్రాహ్మణులు, అంబరీష మహారాజా! నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది.ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది.ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము గాము. పారణను ఆపితే హరిభక్తికి లోపము కలుగును.పారణ చేయించిన దూర్వాసుడు శాపమిచ్చును.కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు. అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుమని బ్రాహ్మణులు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను.

ఓ బ్రాహ్మణులారా! హరిభక్తిని విడుచుటకంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేనిపుడు కొంచెము జలము చేత పారణ చేసెదను.ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు.ఇచ్చట సృత్యర్థబోధక ప్రమాణము *"కర్తుంసాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్! కృతాపః ప్రాశనా త్పశ్చాద్భుంజీత్యేత్యపరేజగురితి!!"* కాబట్టి జల పారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు.బ్రాహ్మణ తిరస్కారమున్నూ ఉండదు.ఇట్లు చేసిన యెడల దుర్వాసుడు శపించడు.నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను.

అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించు వాని వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యము గాని కఠినమైన వాక్యములను ఈవిధముగా పల్కెను.

ఓ రాజా! అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారిణియైన దుర్భుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించిన వాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు అందరికంటే అధముడు.వాడు ఆశుద్ధములో ఉండు పురుగు వలె మలాశియగును. ఆత్మార్థము వంట చేసికొన్న వాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరను భుజించుచున్న వాడగును.అగ్ని పక్వమైనది గాని, పక్వము గానిది గాని, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడనయిన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి.బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా! ఎప్పుడైననూ బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా?నీకు హరి దేవుడెట్లగును? అతనియందు నీ భక్తి ఎట్టిది?బ్రాహ్మణ విషయమందును, హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడనైన నన్ను వదిలి భుజించితివి గాని బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారము తోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని గూడ తిరస్కరించినవాడవైతివి.

రాజా! ఇప్పడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరీ! నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గమునను నశింపచేయుచున్నావు.

ఓరీ పాపాత్మా! ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించ వత్తురు. నీవు దుర్మార్గుడవు.గనుక వారిని బాధించెదవు.నీవు ధర్మ కంటకుడగుదవు.

దూర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించెను.

అయ్యా! నేను పాపుడను.పాపకర్ముడను.పాప మానసుడను.నిన్ను శరణు వేడెదను.నన్ను రక్షించుమని కోరెను.నేను ధర్మ మార్గమును తెలియక పాపమను బురదయందు పడి దుఃఖించుచున్నాను.నిన్ను శరణు వేడుచున్నాను.నన్ను రక్షించుము.నేను క్షత్రియుడను.పాపములను చేసితిని.నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు.కనుక నన్ను తప్పక రక్షించుము.బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీవంటి మహా బుద్ధిమంతులు దయావంతులై మావంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయును,అని పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి,

రాజా! నేను దయ గలవాడను గాను.నాకు శాంతి లేదు.ఓర్పు లేనివారికి ఆలయమైతిని.గనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలిసికొనుము.ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన యెడల శాంతులగుదురు.గానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించు వాడను గాను.ఇట్లని పలికి అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చెను. 1. మత్స్యము 2. కూర్మము 3. వరాహము 4. వామనుడు 5. వికృత ముఖుడు 6. బ్రాహ్మణుడై క్రూరుడు 7. క్షత్రియుడై జ్ఞాన శూన్యుడు 8. క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు 9. దురాచారుడు - పాషండ మార్గవేడియు, 10. బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు.నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటె ముందు చేస్తినను గర్వముతో నున్న నీకు ఈ పదిజన్మలూ వచ్చును.అనగా పదింటియందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు.కనుక గర్వించిన వానికి గర్వ భంగకరములైన జన్మలను ఇచ్చితిని ఆనెను. ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమాన పరచిన వానికి ఇంకా శాపమివ్వలయునని తలంచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మ వేద్యుడును, భక్తి ప్రియుడును, శరణాగత వత్సలుడునగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను, బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలంచి తన చక్రమును పంపెను.

తరువాత ఆ చక్రము కోటి సూర్య కాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరుగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో మునివెంట బడెను. ముని ఆత్మ రక్షణమునకై భూమినంతయు తిరిగెను.దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింప బడెను గానీ చక్ర భయము చేత మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులును, వసిష్ఠాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు, దుర్వాసుని రక్షింపలేరైరి.ఇట్లు తపస్సు చేసుకొను మునీశ్వరుని అతి కోపముచేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట వలన దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను.


*ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే పంచవింశాధ్యాయ సమాప్తః!!*

చతురత జూప నొప్పును

 చ.చతురత జూప నొప్పును విచక్షణతో హితమొందు చొప్పు స

న్మతులు చరించు మార్గమె సమంచిత రీతిని మేలు చేయు దు

ర్గతుల చరింప నయ్యది సుఖమ్ముల గూర్చునొ? కొందరేల? దు

ర్మతి చరియింప నెంచెద రమానుష దుర్గతు లిఛ్ఛగించుచున్ ౹౹ 39


చ.ప్రతి నిమిషమ్ము జీవన మవారిత రీతిని సార్థకమ్మగున్

హితమతి ధర్మ మార్గము వహించెడు సజ్జన సాహచర్య వి

స్తృత మహనీయ యోచనల తీరు గ్రహింప, ముదమ్మొసంగు సం

గతుల విలోకనామృత సకార విశేష వివేక మబ్బినన్౹౹ 40

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - దశమి - ఉత్తరాఫల్గణి -‌‌ ఇందు వాసరే* (25.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Panchang