25, నవంబర్ 2024, సోమవారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

* 206వ రోజు*

ఇంద్రుడు పదవీచ్యుతుడై తిరిగి పట్టాభిషిక్తుడగుట 

శల్యుని మాటలు విన్న ధర్మరాజు " మహానుభావా! ఇంద్రుడు, శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారు. కొంచం వివరించండి " అన్నాడు. శల్యుడు ఇలా చెప్ప సాగాడు. దేవతలలో త్వష్ట అనే వాడు ఉన్నాడు. అతడు ఉత్తముడు. అతడు తన తపోశక్తితో మూడతలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవి కోరి ఘోరతస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లొంగక పోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విషయం ఒక సంవత్సరం రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆవిషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు, అతడు బ్రహ్మహత్యా పాతకం చేసాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచి పెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేసాడు.

వృత్తాసుర వధ[మార్చు]

ఇది తెలిసిన త్వష్ట కోపించి నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపుని చంపినందుకు ఇంద్రుని చంపడానికి ఒక శక్తిని సృష్టించి అతడికి వృత్తుడు అని నామకరణం చేసాడు. అధిక బల సంపన్నుడైన వృత్తుడు ఇంద్రుని జయించి అతనిని మింగి కడుపు బరువెక్కడంతో నిద్రకుపక్రమించి గట్టిగా ఆవలించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి బయటకు వచ్చాడు. ఇంద్రుడు తిరిగి వృత్తాసురునితో యుద్ధానికి దిగాడు. వృత్తుని ధాటికి తట్టుకోలేక దేవతలు మంధర పర్వత శిఖరానికి చేరి వృత్తుని చంపే ఉపాయంకోసం ఆలోచించారు. అందరూ మహా విష్ణువు వద్దకు వెళ్ళి వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్ధించారు. మీరు వెళ్ళి ఇంద్రునికి వృత్తునికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంత మయ్యేలా చేస్తాను " అన్నాడు. ఋషులంతా వృత్తుని వద్దకు వెళ్ళి " ఇంద్రుడు అజేయుడు నీవా అధిక బలశాలివి మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు. కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో " అని నచ్చచెప్పారు. వృత్తుడు అందుకు అంగీకరిస్తూ " బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి. నేను తడిసిన దానితో కాని ఎండిన దానితో కాని రాత్రి కాని పగలు కాని సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే ఇంద్రునితో సంధి చేసుకుంటాను " అన్నాడు. వృత్తుడు మైత్రి చేసుకున్నా ఇంద్రుడు మాత్రం వృత్తుని సంహరించే మార్గం అన్వేషిస్తూ ఉన్నాడు. ఒక రోజు అసుర సంధ్యలో సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తుని చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్ధించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సాయంతో వృత్తుని సంహరించాడు.

నహుషుడు.

ఈ విషయం తెలిసిన భూతాలు బ్రహ్మ హత్య చేసినందుకు నిందించాయి. బ్రహ్మహత్యా పాతకం వెంట తరమగా ఇంద్రుడు పదవీచ్యుతుడై నిషధాచలంలో తలదాచుకున్నాడు. దేవతలంతా ఇంద్రపదవి కోసం తగిన వాడి కోసం అన్వేషిస్తూ భూలోకంలో నూరు అశ్వమేధయాగాలు చేసిన నహుషుడు అనే మహారాజుని ఆ పదవిలో కుర్చోమని అర్ధించారు. నహుషుడు మాత్రం అందుకు అంగీకరించ లేదు ఇంద్ర పదవి అధిష్టించేంత సామర్ధ్యం తనకు లేదన్నాడు. యముడు, అగ్ని, వరూణాది దేవతలు తమ శక్తిని అతనికి పంచారు. నహుషుడు దానితో అధిక బల సంపన్నుడైనాడు. నహుషుడు ఇంద్రపదిని అధిష్టించి ధర్మ పరుడై సమస్త లోకాలను పాలిస్తున్నాడు. కిన్నెరలూ, కింపురుషులు, యక్షులు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, గరుడులూ సమస్త దేవతల నుండి తేజో భాగములు స్వీకరించి అత్యంత తేజోమయుడయ్యాడు. మునులంతా నహుషుని సేవిస్తున్నారు, తుంబురు నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు, రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి మొదలైన అప్సరసలు నాట్యంతో వినోదం కలిగిస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్క సారిగా సంక్రమించగానే నహుషునిలో గర్వం తొంగిచూసింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: