🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
నాకు నచ్చిన శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ.
*పిల్ల!* (మనసుకు దగ్గరగా ఇష్టంగా రాసుకున్న 2019 కథ)
🌷🌷🌷
"బాలల హక్కులు పరిరక్షించడం అందరి బాధ్యత! ప్రస్థుత సమాజంలో పెచ్చుమీరుతున్న బాలల భౌతిక, లైంగికహింస, బాలకార్మికుల వ్యథలపై న్యాయవ్యవస్థ ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఎంతయినా ఉంది. బాలల రక్షణ, విద్య, అభివృద్ధి కేవలం ప్రభుత్వానిదే కాదు పౌరులందరిదీ కూడా! ప్రభుత్వయంత్రాంగంలో భాగస్వామినయితేనే బాలల సమగ్రాభివృద్ధికి , రక్షణకై నేను కన్న కలలు నెరవేర్చగలనని భావించడం వలననే నేను ఇండియన్ సివిల్ సర్వీసెస్ ను ఎంచుకున్నాను. నా ఈ విజయం నా తల్లితండ్రులకు అంకితం! కేవలం నా విజయానికే కాదు నాకు దొరికిన అమూల్యమయిన జీవితాన్ని తమ రెండు చేతులతో కాపుకాసి, ప్రేమతో ఆలంబనిచ్చి, అందంగా మలిచిన వారిద్దరికీ నేను ఆజన్మాంతం ఋుణగ్రస్థురాలినే! "..............
ఆమె స్వరం గంగాప్రవాహం వలే సాగిపోతోంది ఆహూతుల కరతాళధ్వనుల మధ్య!
శేఫాలికాపుష్పం లాగా సున్నితంగా, హిమశైలలా ధీరగంభీరగా, రెక్కలు పూర్తిగా విప్పార్చి స్వేచ్ఛగా ఆకాశమే హద్దులుగా ఎగురుతున్న శ్వేతవిహంగంలా............ ఆ తెల్లని "పిల్ల" మెరుస్తున్న బాదంకాయలంటి నల్లనికళ్ల పిల్ల .... పోతపోసిన బంగారు బొమ్మలా నిలబడి మాట్లాడుతుంటే రెండుకళ్లూ చాలడం లేదు సుధీరకూ, శేఖర్ కూ , ఆమె కవల అన్నగార్లకూ. మనసు గర్వంతో ఉత్తేజితమవుతూ ఒకసారి, కళ్లు సజలాలవుతూ మరోసారి..... మొత్తానికి తమ" పిల్ల" విజయానికి హర్షపులకితులవుతూ మరోసారి.
ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో ఓపెన్ మెరిట్ లో జాతీయస్థాయిలో మూడవర్యాంక్ సాధించిన తమకూతురు " అనిల వల్లూరి"కి
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెయిన్ ఆడిటోరియంలో ఆచార్యులు, విద్యార్ధులు, తల్లితండ్రులు, ప్రభుత్వ, రాజకీయ ప్రముఖుల మధ్య జరిగుతున్న ఘనసన్మానం!
" మా నాన్న.......", ఉద్యోగవిజయంలో తన తండ్రి తనకిచ్చిన ధైర్యము, దన్నూ గురించి చెప్తోంది అనిల!
అనిలమాటలు వింటూనే సుధీర మస్థిష్కం ఇరవైయేళ్ల క్రితం గతంలోకి పరుగులు తీసింది
* * * *
" నానా! లే నానా! నానా లే! ఆకలేత్తాంది! లే! ఇంటికెల్దాం! తీసుకెల్లు! లే! ".........
" అబ్బా"..... చెవుల మీదకు దిండు లాక్కుంది సుధీర. పేలవంగా దుఃఖం, భయం కలగలిసిన ఆస్వరం ఎంత ప్రయత్నించినా చెవుల్లో పడుతూనే ఉంది. ఇంక నిద్రాదేవి కరుణించదని తెలుసుకుని దిగ్గున మంచంమీంచి లేచి, తలుపు తెరుచుకుని బెడ్ రూమ్ బాల్కనీలోకి వచ్చినిలబడింది.
మధ్యాహ్నం మూడున్నర! ఆలస్యమయిన ఋుతుపవనాలు నగరాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని గత మూడురోజులుగా కురుస్తూ, మురిపిస్తున్న వైనం! వీధంతా కడిగి , ఒత్తుగా ఎర్రని గుల్ మొహర్ చెట్లపూలు పరుపులు పరిచినట్లు ఎంతో అందంగా ఉంది.
సుధీర దృష్టి ఇప్పుడు వానరాకతో పులకించిపోతున్న ప్రకృతిమీద లేదు. తమింటికి వందడుగుల దూరంలో ఉన్న ఆ తండ్రీకూతురు మీదే ఉంది.
"ఎవరు వీళ్లు? ప్రొద్దున్న ఎనిమిదింటికి సండే మార్కెట్ కు వెళ్లడానికి కారు తీస్తుంటే, తమ యింటికెదురుగా ఉన్న మూసేసిన చిన్న డిపార్ట్ మెంటల్ స్టోర్స్ పోర్టికోలో చూసింది. చిన్నపిల్ల. నాలుగైదేళ్లు ఉంటాయేమో! తెల్లగా, నల్లని పొడుగ్గా విరబోసిన జుట్టుతో కూర్చుని ఏడుస్తోంది. పక్కన పళ్లు అమ్మే చెక్కపెట్టి మీద స్పృహలేకుండా పడున్న మగమనిషి. నల్లకట్టెలా ఉన్నాడు. తైలసంస్కారం లేని జుట్టూ, చిరిగిపోయిన చొక్కా, తోలులాంటి పంట్లాంతో అడ్డదిడ్డంగా పడున్నాడు. ఆ చిన్నపిల్ల తండ్రిని కుదుపుతూ ఏడుస్తోంది. "అతడు చచ్చిపోయాడో లేక తాగిపడున్నాడో తెలియడం లేదు ఆమెకు. ఇంతలో " వస్తున్నావా?" అని స్నేహితురాలు ఫోన్ చెయ్యడంతో , ఆ దృశ్యం నుంచి తలతిప్పుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది!
, రిటర్న్ లో కారాపి విషయం కనుక్కుందామంటూ చూసిన సుధీరకు ఖాళీ జాగా కనిపించింది. భారంగా నిశ్వసించి లోపలకు వెళ్లిపోయింది.
ఇంకో గంటకు మళ్లీ ప్రత్యక్షం. వాడు సారా పేకట్లతో, పాప బిస్కట్ పాకెట్టు, నీళ్లసీసాతో!
" ఎవరీ చిన్నపిల్ల. అతను తండ్రా? నక్కకీ నాగలోకానికీ లా ఉన్నారు. ఎత్తుకొచ్చాడా? ..... గుండె జల్లుమంది సుధీరకు. ఇంకో గంటకే బాంధవ్యం అర్ధమయింది. శవంలా పడున్న వాడిని లేపుతూ పిల్ల .... " నానా! నానా! " అంటూ లేపుతూ!
ఒంటిగంటకు బాల్కనీలో కెళ్లి చూసింది. వాన తగ్గి
జ్యేష్టమాసపుటెండ చిరచిరలాడిస్తోంది. గుల్ మొహర్ చెట్టుకింద చేరిన నీళ్లలో ఆడుతోంది పిల్ల.
" పాపా! " గట్టిగా పిలిచింది సుధీర. తలెత్తి వింతగా చూసిన పిల్లతో , " అన్నం తింటావా? "అడిగింది. కళ్లల్లోకి దూసుకొచ్చిన ఆకలిని కన్నీళ్లతో కప్పేసి, తండ్రి పడున్న చెక్కబల్ల వెనక్కి పోయి నక్కింది పిల్ల. రెండుసార్లు పిలిచి, విసుగొచ్చి లోపలికి పోయింది సుధీర
భోజనం సహించడం లేదు. భర్త శేఖర్, పదమూడేళ్ల కవలకొడుకులూ హాయిగా భోంచేసి క్రికెట్ చూసుకుంటున్నారు.
" దేవుడా! నాకేంటి ఈగోల? ప్రపంచంలో ఏవయితే నాకేం? అందరిలా నాకెందుకులే! అనుకోలేకపోతున్నా. ఎవరెలా పోతే నాకేంటి? నేనెందుకింత సున్నితం? వీధికుక్కలేడ్చినా బాధే! పిల్లలు కష్టపడుతున్నా బాధే! వృద్ధులబాధలు చూస్తే తట్టుకోలేకపోతున్నా! మనశ్సాంతియ్యి . మరుపు ఇయ్యి"...... కోపంగా తనను తను శపించుకుంటోంది సుధీర.
తనకు తెలుసు తనేం చెయ్యలేనని, తన స్వేచ్ఛాపరిధి చాలా ఇరుకని, ఆర్ధికంగా సాధికారత సాధించుకున్నా, సాధించే భర్తా, అత్తగార్ల పంజావిసుర్లు తట్టుకోలేని దుర్బలనని!
పిల్ల ఏడుస్తూనే ఉంది. తను పిలిచినప్పుడల్లా దాక్కుంటూనే ఉంది.ఈ దాగుడుమూతలు విసుగ్గా ఉంది సుధీరకు. లోపలికెళ్లి టీ పెట్టి అత్తగారి గదిలోకెళ్లి ఇచ్చి, తనదీ, భర్తదీ తీసుకుని మీడియా రూంలో కూర్చుంది. నెమ్మదిగా క్రికెట్ ఆమె ధ్యాసను క్రిష్ణబిలంలోకి లాక్కున్నట్టు లాక్కుంది.
రాత్రి ఎనిమిదింటికి పిజ్జా ఆర్డర్ చేస్తుంటే పిల్ల కళ్లముందు మెదిలింది. మరో మీడియం పిజ్జా ఆర్డర్ ఇచ్చి, డెలివరీ బాయ్ కు చెట్టుకింద పిల్లకు అందచెయ్యమని నీళ్లసీసాతో పాటూ అందించి, కాస్త ఊపిరిపీల్చుకుంది రిలీఫ్ తో!
రాత్రి పన్నెండింటికి మళ్లీ వానధారల శబ్దానికి ఆదరాబాదరా లేచి బాల్కనీలోకి పరిగెట్టింది సుధీర. ఎక్కడా వాళ్లిద్దరి జాడా లేదు. ఎందుకో వెర్రి దిగులు మనసంతా! " పోనీలే! ఇంటికి పోయుంటారు!", పిల్లనే తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది ఆ వెర్రితల్లి.
వారాంతపు సుఖానికి అలవాటు పడ్డ ప్రాణాలకు సోమవారం మహా భారం. యాంత్రికంగా లేచి, పిల్లలిద్దరినీ తయారవ్వమని చెప్పి, బ్రేక్ ఫాస్ట్ చేస్తోంది. సెల్ ఫోన్లో వాట్సప్ నోటిఫికేషన్ ఠింగ్ మని ప్రత్యక్షమయ్యింది. సారాంశం..... తొమ్మిదో తరగతి అమ్మాయెవరో ల్యుకీమియాతో శనివారం చనిపోయినందున స్కూల్ శెలవు ప్రకటిస్తున్నామని...... పిల్లల స్కూల్ మేనేజ్ మెంట్ నుండి.
విషయం తెలిసి, " హేయ్! థేంక్స్ టు దట్ గాల్" అనుకుంటూ బేగ్లు పడేసి గెంతుతున్న కొడుకుల కేసి కంపరంగా చూసింది సుధీర. ఎక్కడిదీ వికృతప్రవృత్తి! ఎందుకీ పిల్లలు మానవసహజ మానసిక సౌకుమార్యత కోల్పోతున్నారు? కనీససంతాప ఛాయలు కూడా లేవు ఆ అమ్మాయి చావు పట్ల. ఒక సెలవు వారికి ఒక ప్రాణం కన్నా విలువయినదా? ఎన్ని బుద్ధులు నేర్పించిందో, ఎన్ని సుద్దులు మప్పిందో! వింటారు కానీ ఆచరణలో శూన్యం. భర్తకు వాళ్ల మెరిట్ మార్కులు చాలు! వాళ్లు నీలా కాకుండా నాలా ప్రాక్టికల్ గా పెరుగుతున్నారు! సంతోషం" అంటూ తీసి పడేస్తాడు.
పిల్లలను ఒక్క కసురు కసిరి నోరు మూయించి, డైనింగ్ టేబుల్ దగ్గరే లాప్ టాప్ తెరిచి పనిలో పడింది క్లయింట్ కు ఇన్ వాయిస్ పంపుతూ!
హఠాత్తుగా చేతిలోని పుస్తకాలు పక్కన పడేసి మెట్లకేసి పరిగెడుతున్నారు పిల్లలు. కిందనుండి అరుపులు. హెల్పర్ లక్ష్మివి! గబగబా పంపిస్తున్న ఈమెయిల్ కు సెండ్ కొట్టీ తనూ పరిగెట్టింది సుధీర క్రిందకు.
" పిల్ల"..... ఒణికిపోతూ, ఏడుస్తూ, బిత్తరిచూపులు చూస్తూ ....... " నాన!!మా నాన!" అంటూ నత్తుతోంది.
" చూడండమ్మా! మన వరండాలో సోఫాలో పడుకునుంది నేను వచ్చేసరికి. ఫో అంటే పోదు. " చేతిలో చీపురు వూపుతూ పెద్ద ఘనకార్యం చేసినట్టే చెప్తోంది లక్ష్మి.
సుధీరను చూస్తూనే పిల్ల నల్లని కళ్లు నీలాలే అయ్యాయి. కళ్లలో చిన్న ధైర్యం. మెల్లగా అడుగులేస్తూ సుధీర వెనుక నక్కింది.
" ఛీ! దయిద్రపుదానా! బయటకు రా! అమ్మగారి చీర పాడయిపోద్ది"....... అమ్మగారు కట్టుకున్న మెత్తని ప్యూర్ క్రేప్ చీరను భక్తిగా చూస్తూ!
సుధీర అసంకల్పితంగా పిల్లను ముందుకు లాక్కుంది. అది మరింత చీరకుచ్చిళ్లలోకి ఒదిగిపోతూ..... కళ్లెత్తి సుధీర మొహం లోకి చూస్తూ..... " నాన లేడు. రాలేదు. ఎలిపోయాడు".... అంటూ వెక్కు మొదలుపెట్టింది!
"మమ్మీ ! హూ ఈజ్ దిస్ డర్టీ పిగ్ లెట్?"....... ప్రశ్న పూర్తవలేదు...... కొడుకు చెంప పేలిపోయింది. హఠాత్పరిణామానికి అవాక్కయిన లక్ష్మిని......" నడు, పాపని క్లీన్ చేద్దాం" ...... పిల్లను ఎత్తిపట్టుకుని భుజాన్నేసుకుని మెట్టెక్కుతున్న అమ్మగారి వెనుక వింతగా చూస్తూ పరిగెట్టింది లక్ష్మి.
డ్రాయింగ్ రూమ్ లో షూలేస్ కట్టుకుంటున్న శేఖర్, దేవుడి గదిలోంచి బయటకొచ్చిన అత్తగారూ కళ్లు పెద్దవిచేస్తూ ప్రశ్నావళి సంధిస్తున్నా విననట్టే పిల్లను తన బాత్ రూంలోకి తీసుకుపోయింది.
తెల్ల చవకరకపు నైలాను గౌను ఎర్రమట్టిరంగులోకి మారిపోయింది. వుచ్చకంపు కొడుతున్న లాగు తియ్యనని పిల్ల చేతులడ్డు పెడుతుంటే.....ప్రకృతి పుట్టుకతోనే ఆడపిల్లకు నేర్పించే డిఫెన్సివ్ మెకానిజమ్ గుర్తొచ్చింది.
లక్ష్మి ఒళ్లు రుద్దుతుంటే పిల్ల ఎందుకో నొప్పితో " అమ్మా" అని అరుస్తోంది. బాత్ రూంలో లైట్లన్నీ వేసి పరిశీలనగా చూసింది సుధీర. తెల్లని గులాబీ బాలలా ఉంది పిల్ల. కానీ బుగ్గల మీద,మెడలపక్క, భుజాలమీద, వీపు మీద , తొడలమీద గాయాలు. కొన్ని పచ్చిగా, కొన్ని మానుతూ. " ఏంటివి? పంటిగాట్లు... భగవంతుడా! "...... మ్రాన్పడి నిలబడిపోయిన మేడమ్ నూ.. పిల్లను మార్చిమార్చి చూస్తూ " ఎవరమ్మా ఈ పాప?" అయోమయంగా అడుగుతోంది లక్ష్మి.
" అనిల...... నా పేరు అనిల"....... జవాబు పిల్లనోటి నుండి.
" మీ అమ్మా నాన్నా ఎవరమ్మా? ఎక్కడుంటారు మీరు? " మళ్లీ లక్ష్మే పిల్లకు ఒళ్లంతా మెత్తని తువ్వాలుతో తుడిచి, సుధీర అందించిన సెటోఫిల్ గాయాలకు సున్నితంగా రాస్తూ అడుగుతోంది.
" ఆంటీ! నా యాపీ బడ్డే కదా. మా యమ్మ కేక్ కొంది కదా! అంకుల్లందరూ ఒచ్చేరు కదా. మాయమ్మ చికెనూ, బిరియానీ చేసింది కదా. మా నాన తాగొచ్చాడు. మా యమ్మతో గొడవ పెట్టుకుని నన్నట్టుకుని రైలెక్కామా! మల్లీ ఇక్కడ తాగీసి, నన్ను తీసుకెల్లకుండా పోయాడు...... " పిల్ల ఇవన్నీ మామూలే అన్నట్టు నిర్వేదంగా చెప్తోంది. నాన నాన అని తండ్రిని తలుస్తోంది తప్పా వాళ్లమ్మ పేరు తలవడం లేదు.
లక్ష్మికి రోజూ రాత్రిపూట పూటుగా తాగొచ్చి, కూతుళ్లను ఆబగా తాకే తన మొగుడు, వాడినుండి రక్షించుకోడానికి ఎవరెవరి ఇళ్లలోనో రాత్రి తలదాచుకునే తన కూతుళ్లు గుర్తుకొచ్చి, పేగు మెలిపెట్టింది.
అనిలకు టవల్ చుట్టి, గదిలో కూర్చో పెట్టి, మూడ్రోజుల నాగా తరవాత వచ్చిన వంటామెకి వేడి పాలు తెమ్మని పురమాయించి, డ్రైవర్ కు మంచి షాపికెళ్లి తన కూతురు సైజ్ బట్టలు ఓ పదిజతలు తెమ్మనమని డబ్బులిచ్చి మళ్లీ గదిలోకొచ్చి తలుపేసింది.
" మీ వూరేంటి అనిలా?
" అల్లక్కడ సీ ఉంటదా, అక్కడ నేవోళ్లు గోడకడుతున్నారా! అక్కడ! "
"సీ, నేవీ వాళ్లు అంటే విశాఖపట్నమా? "
" కాదు వొయిజాగు"
" అంత దూరం నుండి తీసుకొచ్చేసాడా! మీ అమ్మ ఏం చేస్తుంది?"
" మా యమ్మ మంచిది కాదు. అంకుల్స్ తో తిరుగుతాది. మా నాన ఎల్డర్. తాగి అమ్మను కొడతాడు కానీ నన్ను కొట్టడు. మా అమ్మ రుసికొండ దగ్గర అయ్యగారి గెస్టోస్ లో పనికెల్తది. కానీ పనిసెయదు. అయగారు మాకు రోజూ బిర్యానీ, థంప్సప్ పంపుతారు. అక్కడికి కాలేజీ అక్కలు కార్ లో వత్తారు కదా! ఆ అయ్గారు...." కళ్లు తిప్పుతూ ఆరిందాలా చేతులూపుతూ చెప్తున్న పిల్లను చూస్తుంటే సుధీరకి మొత్తం దృశ్యం అర్ధమయింది.
" ఎవరమ్మా ఇలా కొరికారు? "..... అడగలేక అడగలేక.... ఏం వినాలా అని భయపడుతూ అడిగింది, ఇడ్లీ తుంచి నోట్లో పెడుతూ.
" నేవీ గోడ కట్టే రామంకులూ, బీహారీ అంకులూ , మా పయివేటు అంకులూ ఆళ్లు.. మా యమ్మ అక్కడ పొద్దున్నే నన్నొదిలేసి ఎలిపోతుందిగా! ఆళ్లే! సెత్తగాళ్లు"
నీ కెన్నేళ్లు అనిలా? నువ్వు ట్యూషన్ కెళ్లడమేంటి?"
మెల్లగా ఒక్కో వేలు విప్పి నాలుగు చూపించింది.
" గాడ్! నాలుగేళ్లా? ఇంత ముదురగా మాటలెలా వచ్చాయి? పెరిగిన వాతావరణమా? "..... పిల్ల పెరుగుతున్న పరిసరాల ప్రభావాన్ని, పిల్ల భవిష్యత్తు తలుచుకుంటే వెన్నులో చలిపుడుతోంది సుధీరకు.
అప్రయత్నంగా తన ఎడమభుజం కింద తడుముకుంది అభద్రతతో! చిన్నతాతగారు మనసుకూ, నమ్మకానికీ చేసిన గాటు!
ఈ లోపున డ్రైవర్ బట్టలు తెచ్చాడు. పేకట్ అందుకుంటూ, "ఇంత ఆలస్యం చేసారేంటి రసూల్ ".... అంటుంటే, అమ్మా అక్కడ కల్లుపాకల దగ్గర పిల్లల బట్టల కొట్టు దగ్గర జనం, పోలీసులూ ! రాత్రి దొమ్మీలో ఎవడో తాగుబోతోడిని కొట్టి చంపేసారట. పోలీసులకు అతని ఆధారాలేం దొరకలేదట. పోస్టుమార్టమ్ కు తీసుకుపోతున్నారు గాంధీకి!" ........ సుధీరకు చిక్కుముడి విడిపోయింది అనిల తండ్రి ఎందుకు అదృశ్యమయ్యాడో!
పిల్లకు బట్టలు వేయడంతోనే, కూరుకుపోతున్న కళ్లతో నిద్రలోకి జారిపోయింది. పిల్లలో ఏ కోశానా తనవారి కోసం బెంగలేదు , తనేమయిపోతానా అన్న భయం లేదు! తిండి దొరికింది, పడుకోడానికి జాగా దొరికింది. విసికించే అంకుల్స్ లేరు, ముడుకుల మీద కొట్టి మూతిమీద ముద్దుపెట్టే ట్యూషనంకుల్ లేడు. అంతే ! ఆ క్షణాలే ఆమెకు ముఖ్యం. తరవాత ఏమవుతుందో తెలీదు. అంతలా ఆ చిన్ని దేహం, బుర్రా ట్యూన్ అయిపోయాయి!
" ఏం చెయ్యాలీ పిల్లను? ఎవరికివ్వాలి? ఎక్కడకు పంపాలి? తల్లి దగ్గరకు మాత్రం పంపకూడదు. అసలు నిజమైన తల్లో కాదో కూడా! వ్యభిచారం కోసం ఎత్తుకొచ్చిన పిల్లేమో!ఆ గతం తాలూకు ప్రభావం నుండీ, అబ్యూస్ నుండి బయట పడేయాలి. సభ్యసమాజంలో నిలతొక్కుకునేలా గ్రూం చెయ్యాలి! "...... బుర్ర చిట్లిపోతుంటే బయటకు వచ్చింది.
ఆమెను నేరస్థురాలిలా చూస్తూ అక్కడ నలుగురు.
" మీరు ఆఫీస్ కు వెళ్లలేదా??....... గొంతుకు పెగల్చుకుని అడిగింది శేఖర్ ను.
జవాబు అత్తగారినుండి వచ్చింది. " వెళ్లడు. వెళ్లద్దని నేనే చెప్పా! అమ్మాయ్ ! నీ సంపాదన అంటూ ఎవరికి ధారపోసినా మేం మాట్లాడలేదు. ఇప్పుడిలా అలగాజనాలని ఇళ్లలోకి తెస్తే నేను ఊరుకోను. మన హోదా, ఇంటిపేరు చెడగొడితే ఊరుకునేది లేదు! చెప్పు శేఖర్.......!" అంటూ కొట్టినట్టు చెప్పి కొడుక్కేసి చూసింది.
శేఖర్ మొహం గంటు పెట్టుక్కూర్చున్నాడు. పిల్లల ముందు వాదించుకోకూడదని ఒప్పందం ఇద్దరికీ.
అమ్మకొట్టిన దెబ్బ మనసునూ , చెంపనూ మండిస్తుంటే కొడుకు అందుకున్నాడు. " నాన్నా! మమ్మీ ఇలాంటి స్ట్రే చిల్డ్రన్ నీ , ఆర్ఫన్స్ నీ ఇంట్లో వుంచితే మేము హాస్టల్ కు వెళిపోతాము. ఆ పిల్ల గురించి ఎంత గట్టిగా కొట్టిందో....... తల్లి కేసి కక్షగా చూస్తూ!
"ఫాట్"...... సుధీరచేతిలో కాఫీకప్పు ఎగిరి గోడకు బలంగా తగిలి చెల్లాచెదురైంది. ఫిట్ వచ్చినదానిలా ఊగిపోతోందామె కోపంతో! ఉద్రేకంలో కన్నీరుమున్నీరవుతోంది. పెద్దగా ఏడుస్తూ......
" ఎవ్వరూ పోనక్కరలేదు. నేనే పోతాను బయటకు. ఒక చిన్నపిల్ల! అనాధ! దిక్కూమొక్కూ లేకుండా ఉంది. తల్లి వ్యభిచారి. తండ్రి తాగుడుకోసం పిల్లని అమ్మబోయి, మైకంలో వేరేచోటకు పోయి పిల్ల కనిపించకపోడంతో వాళ్ల చేతిలో చచ్చేడు. వెనక్కి పంపితే, రాబందుల్లా కాటేసే మగాళ్లు చుట్టూ! ఎంత కావాలి ఆ పసిప్రాణానికి. ఇంత తిండి పెట్టి, చదువు చెప్పిస్తే చాలు కదా! దానికి ఇన్ని ఆరాలూ, ఇన్ని ఆంక్షలూనా. నిజానికి అనిల కోలుకున్నాకా మంచి ఆశ్రమానికి పంపిద్దామవుకున్నా! కానీ ఇప్పుడు చెప్తున్నా! నా పరపతినంతా వాడుకుని పిల్లను నేను దత్తత చేసుకుంటా. ఏం ఏడుస్తారో ఏడవండి
ఏరా వెధవల్లారా! సాటి స్టూడెంట్ పోతే పండగచేసుకునే బ్రూట్స్ ఇద్దరూ! బాలవికాస్ కెళ్లి శ్లోకాలు నేర్చుకుంటే చాలదురా, ఫెలో హ్యూమన్ బీయింగ్ ని ఏక్సెప్ట్ చెయ్యగలగాలి. ఇంటర్నేషనల్ స్కూళ్లకెళ్లి నాలుగు ఇంగ్లీషు బూతులు మాట్లాడుతూ హీరోలనుకుంటున్నారా? బీ రియల్ హ్యూమన్స్! మగపిల్లలుగా మీరు ఆడపిల్లల పట్ల ఎన్నో విలువలు పాటించాలి. లేకపోతే ఇలాంటి చిన్నిపాపల జీవితాలు చిదిమిపోతాయి".....అంటూనే
గబగబా పిల్లగదిలోకి వెళ్లి, భుజం మీదేసుకుని హాల్లోకొచ్చింది సుధీర. శేఖర్ ఏదో ఫోన్ కాల్ అటెండ్ అవుతున్నాడు.
అత్తగారికి కంగారుగా ఉంది. నిష్పూచీగా రాణీయోగం అనుభవిస్తూ, కూర్చోకుండా అనవసర విషయాలు కెలికి కొరివితో తలగోక్కుంటున్నానేమో అని అంతర్మధనం. లీలగా తను విధవతల్లితో పాటూ మేనమావల యింట పడ్డ వేదనలు గుండెను చెమ్మరిస్తున్నాయి.
" సుధీరా! విషయం సీరియస్ చెయ్యకు. పనివాళ్లు చూస్తున్నారు! ఆలోచిద్దాం పాప గురించి. మోస్ట్లీ నువ్వు కోరినట్టే జరుగుతుంది. ఐ ప్రామిస్! "...... శేఖర్ భార్యచేతిని పట్టుకుని ఆపాడు.
పిల్లలు మొహం గంటు పెట్టుకుని లోపలికి పోయారు.
భర్త నుండి ఆశించని ఈ ప్రతిక్రియకు ఆశ్చర్యపోతూ, అపనమ్మకంగా చూస్తూ గదిలోకెళ్లింది సుధీర అనిలతో.
" అమ్మా! పిల్ల అడుగుపెట్టిన వేళావిశేషం. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అవకాశం చేతికొచ్చింది. అతిపెద్ద బిజినెస్ హౌస్ ఆడిటర్స్ గా నా కంపెనీని నియమించబోతోంది! " చేతులూపేస్తూ ఆనందంగా చెప్తున్న కొడుకు కేసి సాలోచనగా , నిర్వేదంగా చూసింది తల్లి.
" హు! తన స్వార్ధప్రయోజనం నెరవేరితేనే మగాడికి తన తల్లయినా ,భార్యయినా, పిల్లలయినా, ఈ పిల్లయినా! "
గొణుక్కుంటూ పిల్లను చూడడానికి వెళ్లిందామె!!
* * * * *
సుధీర భయాలన్ని వమ్ముచేస్తూ ఆరునెలల్లో పిల్ల కాస్తా ఆ యింటి గారాలకల్పవల్లి అయింది. అఖండమయిన తెలివి, పసితనానే అలవడిన ఆత్మనిర్భరత, తెలుసుకున్న జీవితావసరాలు.... ఆ పిల్లను దొరికిన ఆసరాను కాపాడుకునే దిశానిర్దేశం చేసాయేమో మరి...... ఆ ఇంటి అబ్బాయిల ఛీత్కారాలను సహనంతో , సహజసిద్ధంగా అబ్బిన ముగ్దత్వంతో మార్చుకుని మచ్చిక చేసుకుంది.....చెల్లిపాప అని పిలిపించుకునేంతగా!
భాషమార్చుకుంది. సభ్యత నేర్చుకుంది. తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే చేసుకోవలసిన మంచిమార్పులన్నీ చేసుకుంది.
అదృష్టం తెచ్చిందిలే అని ఆ యింట ప్రవేశానికి ఒప్పుకున్న శేఖర్ ప్రాక్టికాలిటీకి ముకుతాడు వేసింది పిల్ల. లేస్తూ పిల్ల మొహం చూస్తేనే కానీ దినచర్య మొదలుపెట్టనంత బలహీనుడిని చేసింది. దత్తత పత్రాల్లో సుధీరకన్నా ముందు దుమికి తండ్రిస్థానంలో సంతకం చేసేసేంత!
ఆ ఇంట అయినింటి ఆడపిల్లకు జరిగే అన్ని అచ్చటముచ్చటలూ జరిపించుకుంది పిల్ల.
నిజానికి దొరికిన అండను కుటుంబంగా మార్చుకున్న ఆ పిల్లది పోరాటమంటే! చేయూతను నిచ్చెనగా మార్చుకున్న పోరాటం! జాలిని ప్రేమగా మార్చుకున్న పోరాటం. జన్మను ధన్యతగా మార్చుకున్న పోరాటం!
* * * *
హోరెత్తిపోతున్న చప్పట్లశబ్దానికి ఒక్కసారి వాస్తవానికి వచ్చింది సుధీర. ముఖ్యమంత్రిగారి చేత సత్కారం అందుకుంటున్న కూతుర్ని , అనిలను, తన పిల్లను చూస్తూ........ అనిలా వల్లూరి , ఐ. పీ. ఎస్ .... అంటూ గర్వంగా గుండె నిండా గాలిపీల్చుకుంది. అవును అనిల జీవితాశయం చట్టాన్ని సంరక్షించే ఐ. పీ.యెస్ ఆఫీసర్ అవ్వడం!
శశికళ ఓలేటి
7-12-2019