ఈశా వాస్యమిదxసర్వం యత్కించ జగత్యాం జగత్,
తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్ ధనమ్.
ఇది ఈశావాస్యోపనిషత్తు లోని మొదటి మంత్రము. ఈ మంత్రము పూర్తి జగత్తు అంతా ఈశ్వరుని చేతనే వ్యాపించబడి వున్నదని పేర్కొంటున్నది.
జగత్యామ్ = అఖిల బ్రహ్మాండము నందు; యత్ కించ ఏదైతే; జగత్ =జడ, చేతన స్వరూపమైన జగత్తుగలదో; ఇదమ్ = ఈ; సర్వమ్ = సమస్తమును; ఈ = ఈశ్వ రునిచే; వాస్యమ్ =వ్యాపించియున్నది; తేన=అందుచే; త్యక్తేన త్యాగపూర్వకముగ (ఈశ్వరుని వెంట నిడుకొని); భుంజీథా= (దీనిని) అనుభవింపుము; మాగృధః= ( దీనియందు) ఆసక్తుడవు గాకుండుము; (ఏలయన) ధనమ్ = ధనము-సంపద భోగ్య పదార్థములు; కస్యస్విత్ = ఎవరిది? అనగా ఎవరిదీకాదు.
తాత్పర్యము ఈశ్వరుని చేత : అఖిల బ్రహ్మాండము నందుగల చేతనా చేతన జగత్తంతయు వ్యాపించియున్నది. అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యము ననుభవించుచు, సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకముగ, ప్రాప్తించిన దానిని అనుభవింపుము. కాని దాని యందు ఆసక్తుడవు గాకుండుము. ఈ సంపద, ధనము, భోగ్యసామగ్రి ఎవరిది? అనగా ఎవరికీ చెందినదికాదు.
వ్యాఖ్య: అఖిల విశ్వబ్రహ్మాండము నందుగల చరాచరాత్మకమైన జగత్తు నీ చూపుద్వారా, వినికిడి ద్వారా తెలియవచ్చు చున్నదంతయునూ సర్వాధారుడు, సర్వనియంత, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సకల కళ్యాణగుణ స్వరూపుడునగు పరమేశ్వరుని చేత వ్యాపింపబడి యున్నది; సదా, సర్వత్ర అతనిచేత పరపూర్ణమై యున్నది. (గీత.9-4) ఇందలి ఏ అంశము కూడా అతనితో రహితమై లేదు. (గీత.10-39, 42) ఈ విధంగా తెలిసి ఆ పరమేశ్వరుని నిరంతరము సన్నిహితంగా భావిస్తూ - సదా, సర్వదా అతనిని స్మరించుచునే నీవు ఈ జగత్తునందు త్యాగభావం కలిగి కేవలం కర్తవ్య నిర్వహణకై మాత్రమే విషయములను యధోచితముగా ననుభవింపుము. అనగా - విశ్వరూపుడగు -
ఈశ్వరుని అర్చించుట కొరకే కర్మలను ఆచరించుము. విషయములందు మనస్సును చిక్కుకొననివ్వకుము. ఇందులోనే నీకు నిశ్చితమైన మేలు గలదు. (గీత.2-64; 3-9; 18–46) నిజమునకు ఈ భోగ్యపదార్ధములు ఎవరివీ కావు. మనుజుడు పొరపాటుగా వీనియందు మమతా, ఆసక్తిని (ముడి వేసుకొని కూర్చుంటాడు) ఇవన్నియును పరమేశ్వరునివే, ఆతని కొరకే వీటినుపయోగించ వలయును. (త్వదీయం వస్తు గోవింద తుల్యమేవ సమర్పయే) అని మనుజుల పట్ల వేదభగవానుడిచ్చిన పవిత్రమైన ఆదేశము నెరుగుము.
వివరణ: ఈ ప్రపంచం మొత్తం కూడా ఈశ్వరుని శక్తితోటె వ్యాపించి యున్నది. అంటే ఈ జగత్తులో ఏది కూడా ఈశ్వరునికన్నా బిన్నంగా లేదు. అంటే నీవు నీ ఇంద్రియ జ్ఞ్యానంతో ఏదయితో తెలుసుకుంటున్నావో అది మాత్రమే కాదు తెలుసుకుంటున్నాను అని అనుకునే నీవు కూడా ఆ ఈశ్వరుని స్వరూపమే కాక్ మరొక్కటి కాదు. కానీ మనుసులమైన మనం నేను, నాది, నావాళ్లు అనే భ్రాంతిలో ఉండి ఆ పరమేశ్వరుని కన్నా భిన్నంగా ఉన్నట్లు భవిస్తూ ఐహిక వాంఛల వెంట పరుగులిడుతూ ఆ భగవంతుని మరచి కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాన్ని పొందుతున్నాము. మనలో యెంత స్వార్ధం పెరుగుతుందో అంతగా పాప కర్మలు చేస్తూ ఉంటాము. మీరు గమనించండి. నాకు వున్నదానితో నేను తృప్తి పడటం లేదు. కాబట్టి నాకు ఇంకా ఇంకా సంపద కావలి అంటే నేను నా తహతకు మించిన సంపదను కోరుకుంటున్నాను అని అర్ధం. ఆ కోరికలు తీరటానికి నేను అన్యాయ పద్ధతులు వెతికి వాటి వల్ల సంపదను పోగు చేసుకుంటాను. మరి ఆ సంపద నాకు మనశాంతిని ఇస్తుందా అంటే ససేమిరా ఇవ్వదు. ఎప్పుడు ఏదో ఒక అపరాధ భావం వెంటాడుతుంది. ఖరీదైన మంచం, పరుపు అన్యాయ అర్జితంతో కొనగలను కానీ నిద్ర మాత్రం రాదు. ఎందుకంటె నేను చేసిన పాపపు పనులు నా మదిని తొలచి నాకు నిద్ర రాకుండా చేస్తున్నాయి. ఈ విషయం నేను ఇంకొకరికి చివరికి నా వాళ్ళు అనుకునే భార్యాపిల్లలకు కూడా చెప్పలేను. అనవసరపు ఆలోచనలతో గుండె జబ్బులు, చెక్కర వ్యాధులు వెన్నాడుతాయి. ఇప్పుడు పశ్చాత్తాప పడి ప్రయోజనమేముంది. కాబట్టి చేసిన ప్రతి కర్మకు ఫలితంగా కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. దానిని ఎవ్వరు ఆ ఆపలేరు.