11, మార్చి 2023, శనివారం

సనాతన ధర్మాన్ని

: ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే ప్రపంచ యథార్థ స్థితిని గ్రహించగలడు. అప్పుడే కాలాన్నీ, కోర్కెల్నీ, ఇంద్రియ వాంఛల్నీ, ప్రపంచాన్నీ, చివరకు తనను తాను జయించుకోగలడు.


మల్ల దేశ రాజధాని కుశీ నగరం సమీపంలో ఒక ఆరామం ఉంది. వినయధరుడు అనే పెద్ద భిక్షువు ఆ ఆరామంలో ఆచార్యుడు. పదిమంది చిన్న భిక్షువులు ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆయన వారికి ధర్మ విద్యలు చాలా నేర్పాడు. తనకు తెలిసిందంతా ఉపదేశించాడు. ‘మీరు ఇక నాతో సరిసమానులే!’ అని మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకోలు కొందరిలో అహాన్ని పెంచింది. ‘ఇక మనం కూడా గురువుగారితో సమానులమే!’ అని అనుకున్నారు.

.

ఒక రోజున గురువు ఒక రేగు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఈ అహంకార శిష్యులు అక్కడికి వెళ్ళి, రేగు చెట్టు కాండాన్ని గీకుతూ ‘‘ఇక ఈ చెట్టు సారం అయిపోయింది!’’ అంటూ గురువుగారిని ఉద్దేశించి హేళనగా మాట్లాడారు. ఈ విషయం గమనించిన గురువు తన శిష్యుల్ని దారికి తీసుకురావాలనుకున్నాడు.

.

వారిని దగ్గరకు పిలిచి ‘‘భిక్షువులారా! మీరు ఎంతో జ్ఞానాన్ని పొందారు. మంచిది. మీ జ్ఞానం ఏపాటిదో తెలుసుకోవాలని ఉంది. నాది ఒక ప్రశ్న. దానికి సమాధానం ఇవ్వగలరా?’’ అని అడిగాడు. ‘‘ఓ! భంతే! తప్పకుండా’’ అన్నారు వారు ధైర్యంగా, గర్వంగా. ‘‘మంచిది. సంతోషం. నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. కాలం అనేది సర్వ భూతాల్నీ తింటుంది. చివరకు తనను తాను కూడా తింటుంది. మరి, ఈ కాలాన్ని కాల్చుకు తినే నిప్పు ఒకటుంది. అది ఏది? ఆ నిప్పును కూడా దిగమింగే అగ్ని ఒకటుంది. ఆ అగ్ని ఏది?’’ అని అడిగాడు. శిష్యులు తలలు పట్టుకున్నారు. వారికి సరైన సమాధానం తోచలేదు.

.

‘‘నాయనా! తొందరలేదు. ఇప్పటికిప్పుడే చెప్పనవసరం లేదు. మీకు ఏడు రోజులు గడువు ఇస్తున్నా. వెళ్ళండి. ఆలోచించండి. వచ్చి చెప్పండి అని గురువు వారిని పంపాడు. శిష్యులు సిగ్గుతో తలవాల్చి, ఆలోచిస్తూ వెళ్ళిపోయారు. వారం రోజుల తరువాత తిరిగి వచ్చి- ‘‘భంతే! మమ్మల్ని క్షమించండి. మా అజ్ఞానాన్ని మన్నించండి’’ అని నమస్కరించి నిలబడ్డారు. ‘‘సరే! సమాధానం చెప్పడానికి ఒక దారి చూపిస్తాను. వినండి. ప్రతి ఒక్కరికీ ఒక మెడ ఉంటుంది. ఆ మెడ మీద ఒక తల ఉంటుంది. ఆ తలలో ఎన్నో అవయవాలు ఉంటాయి. తలమీద వెంట్రుకలు ఉంటాయి. కానీ తలకు విలువను తెచ్చేవి అవేవీ కావు. తలకు విలువ తెచ్చేది ఏది? అసలు తలలో ఉండాల్సింది ఏది?’’ అని అడిగాడు. శిష్యులు నిలువు కాళ్ల మీద నిలబడి, నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ ఉండిపోయారు. నోరు మెదపలేదు. తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపారు.

.

‘‘మీకు లేనిది అదే! అది ఉంటే అహం ఉండదు. అదే ప్రజ్ఞ. ప్రజ్ఞ ఉంటేనే తలకు విలువ!’’


‘‘మరి ప్రజ్ఞకూ, కాలానికీ సంబంధం?’’

.

‘‘కాలాన్ని కూడా కాల్చుకు తినే నిప్పురవ్వ మనలోని కోరిక లేదా తృష్ణ. తృష్ణను కాల్చే అగ్ని ప్రజ్ఞ మాత్రమే! ప్రజ్ఞ ఉన్నవాడికే తృష్ణాక్షయం కలుగుతుంది. ప్రజ్ఞ ఉన్నవాడు వివేచనతో కోరికల్ని జయించగలడు. అతడే జితేంద్రియుడవుతాడు. జితేంద్రియుణ్ణి ఏ కోరికా తాకలేదు. సర్వ భూతాల్నీ- అంటే సమస్త భౌతిక ప్రపంచాన్నీ భక్షించే కాలం కూడా చివరకు తనను తాను భక్షించుకుంటుంది. గతాన్ని భక్షించి వర్తమానంగా, వర్తమానాన్ని భక్షించి భవిష్యత్తుగా మారిపోతూ ఉంటుంది. ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే ప్రపంచ యథార్థ స్థితిని గ్రహించగలడు. అప్పుడే కాలాన్నీ, కోర్కెల్నీ, ఇంద్రియ వాంఛల్నీ, ప్రపంచాన్నీ, చివరకు తనను తాను జయించుకోగలడు. కాబట్టి మీరు జ్ఞానులుగా కదు, ప్రాజ్ఞులుగా మారండి. అహంకారంతో, స్వాతిశయంతో మూర్ఖులు కాకండి. శీలవంతమైన జ్ఞానమే ప్రజ్ఞ అని తెలుసుకోండి. అలా నడుచుకోండి’’ అని చెప్పాడు.


శిష్యులు వంగి, మోకాళ్ళ మీద కూర్చొని, మన్నించమని ప్రార్థించారు. అణకువగా మెలిగి, అనతికాలంలోనే ప్రాజ్ఞులు కాగలిగారు...


సనాతన ధర్మాన్ని 

నిష్ఠగా పాటించే ప్రతి మానవుడూ  

మొదట ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన 

పిదప అత్మ సాక్షాత్కారాన్ని అనుభవించి మరణ సమయానికి  గతానుగతికమైన పాపరాశి మిగిలి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి వీలైన ఉత్తమజన్మనీ పాపరాశి శూన్యస్థితికి చేరుకుంటే ఇంక జన్మ లేని మోక్షస్థితిని అందుకుంటాడు - 


అది తను యే భగవానుడి నుండి విడివడి జన్మపరంపరలోకి వచ్చాడో ఆ భగవంతుడిలో లీనమైపోవటం అవుతుంది!

మొదట తెలుసుకోగానే  అసాధ్యం అనిపించే ఇంతటి సంక్లిష్టమైన లక్ష్యాన్ని కూడా చాలా సులభంగా సాధించగలిగేటట్లు మానవాత్మలను సిద్ధపర్చటం కోసం ప్రాచీన భారతీయ ఋషులు ఎంతగానో శ్రమించి ఎన్నో మార్గాలను ఏర్పరచారు,

ఎన్నో ఉపాయాలను చూపించారు,శ్రమ తెలియకుండా ఉండేటందుకు ఎన్నో ఆనందాలను సమకూర్చారు - శ్రద్ధ ఒకటి ఉంటే చాలును ఈ ధర్మానుష్ఠానం ద్వారా సాధన పూర్తయ్యాకనే కాదు సాధన మొదలు పెట్టగానే ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అనే స్థాయిల్లో ఏదో ఒకదాన్ని పొందవచ్చును!

సనాతన ధర్మానికి ఆద్యంతాలు లేవు.సృష్టి స్థితి లయ విభూతు లన్నింటా ఇమిడిపోయి వాటిని నడిపిస్తూ ఉంటుంది.ప్రళయంలో సైతం నశించదు - బీజ రూపంలో నిద్రాణమై ఉండి సృష్టి మొదలైనప్పుడు చైతన్యవంతమై సకల భూతాళికీ రక్షణ నిచ్చే మనోగతమైన సంస్కారాల్నీ  క్రమబద్ధమైన జీవన విధానాల్నీ ప్రసాధించి శాసించేది సనాతన ధర్మమే!..


తత్వమసి'  

తత్‌+ త్వం +అసి 

తత్‌.. అంటే అది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు, 'అది నీవై ఉన్నావు'...


" ఏకం సత్, విప్ర బహుదా వదంతి "

అనగా " ఉన్నది ఒక్కటే , పలు నామములతో  పిలువబడుచున్నది 

లేదా చూడబడుచున్నది"   

అని ఋగ్వేద వాక్యం.....

.సేకరణ:

 ఉపనిషత్తులు అంటే ఏమిటి.....!!


1. జన్మరాహిత్యానికి లేక మోక్ష ప్రాప్తికి ఉపయోగించే మంత్రవాక్య సముదాయాన్ని ఉపనిషత్తులంటారు.


2. ఆత్మ జ్ఞానము అని మరొక అర్థము.


3. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువునకు సమీపముగా ఉండుట అని ఇంకొక అర్థము.


అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ‘ఉపనిషత్తులు’ అంటారు. ఈ ఉపనిషత్తులు వేదంలోని భాగంలో ఒకటిగా చెబుతారు. 


వేధంలోని ఈ ఉపనిషత్తులు తత్త్వ జ్ఞానం గురించి, దానికి సంబంధించి మహర్షులు అనుభవాల గురించి క్షుణ్ణంగా మనకు విశదపరుస్తాయి. 


వేదసారం-ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటిలో పది మాత్రమే ప్రధానమైనవి. 


అవి : 1.ఈశోపనిషత్తు 2. కఠోపనిషత్తు 3. ముండకోపనిషత్తు 4. కేనోపనిషత్తు.5 ప్రశ్నోపనిశషత్తు 6.మాండూక్యోపనిషత్తు 7.తైత్తరీయోపనిషత్తు 8. ఐతరీయోపనిషత్తు 9. బృహదారణ్యకోపనిషత్తు. 10. చాందోగ్యోపనిషత్తు. 


ఉపనిషత్తులకు ఉన్న ఇంకొక పేరేమిటి?


సామాన్యంగా ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలలో ఉంటాయి. అందుచేత ఉపనిషత్తులకు వేదాంతములు అని ఇంకొక పేరు ఉంది.


ఉపనిషత్తులను 'రహస్యం' అని ఎందుకు పిలుస్తారు?


'ఉపనిషత్' శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి 'రహస్యము' అను అర్థం. రహస్యము అనగా తెలియడం కష్టమైనా ప్రయత్న పూర్వకంగా తెలిసికొన దగినది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే. కాని దాని 'రహస్యం' అని అనం. ఏది మనకు దగ్గరనే ఉంటూ మనకు తెలియదో అది పరమ రహస్యం. ఇలాంటి పరమ రహస్యం ఆత్మతత్వం. 


ఆత్మా అనేది 'నేను, నేను' అను అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం, యథార్థ స్వరూపం ఏమో ఎవరికీ తెలియదు. అందుచేతనే ఇది పరమ రహస్యం, ఉపనిషత్తు. ఈ పరమ రహస్యానికే కాకుండా, దీనిని బోధించే గ్రంధానికి కూడా ఉపనిషత్తు అని పేరు.


ఉపనిషత్తు అనే పదానికి ఉన్న మరి కొన్ని అర్థాలను వ్రాయండి?


1. జీవులలో ఉండే అవిద్య అను సంసార భీజమును నాశనము చేయునది అని ఒక అర్థం.


2. మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు జేర్చెది అని ఒక అర్ధం.


3. జన్మ, వార్ధక్యము మొదలైన ఉపద్రవాలను శిథిలము చేయునది అని ఒక అర్థం.


4. అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే "గ్రంథం" అని ఒక అర్థం, ఆ గ్రంథం ద్వారా అందించ బడిన "విద్య" అని ఇంకొక అర్థం - ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి.


"ఓం శాంతిః శాంతిః శాంతిః" అనే శాంతి పాఠానికి అర్థం ఏమిటి?


ప్రతి మనిషిని మూడు రకాల దుఃఖాలు బాధించడానికి అవకాశం ఉంది. వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేక తాపాలు అంటారు.


శరీరంలో ఉద్రేకాల వలన కలిగే రోగాలు, సోమరితనం, కపటం మొదలైన దుర్గుణాల వలన కలిగే ఉపద్రవాలను ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు.


పంచమహా భూతాల నుండి (ఆకాశం, వాయువు, అగ్ని, జాలం, పృథ్వి), శత్రు, చోర, మృగ, కీటకాదుల వలన కలిగే ఉపద్రవాలను ఆదిభౌతిక దుఃఖాలు అంటారు.


అతివృష్టి, అనావృష్టి, పిడుగు పాటు, గ్రహ బాధలు మొదలగు వాటి మూలంగా కలిగే ఉపద్రవాలను ఆది దైవిక దుఃఖాలు అంటారు.


పరమాత్మ చింతనము ఈ పై మూడు రకాల దుఃఖములను శాంతింప జేయు గాక అని ఈ శాంతి పాఠము బోధిస్తోంది.


పది ఉపనిషత్తులను గుర్తించే శ్లోకం ఏది?

శ్లో॥

*ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరాః౹*

*ఛాందోగ్యమైతరేయం చ బృహదారణ్యకం తథా॥*


శంకర భగవత్పాదులు ఎక్కువ పర్యాయములు ఉదాహరించిన ఇంకొక ఉపనిషత్తు ఏది?


శ్వేతాశ్వతరోపనిషత్తు


నాలుగు వేదాలకు చెందిన మహా వాక్యాలేమిటి? అవి ఏ ఉపనిషత్తులలో ఉన్నాయి?


ఋగ్వేదం - ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయోపనిషత్తు

యజుర్వేదం - అహంబ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు

సామవేదం - తత్వమసి - చాందోగ్యోపనిషత్తు

అథర్వణవేదం - అయమాత్మాబ్రహ్మ - మాండూక్యోపనిషత్తు.........