7, మార్చి 2021, ఆదివారం

ఆవకాయ కవిత

 *ఆవకాయ కవిత 


శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత

సుఖమది కలదే!


ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ 

పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

〰〰〰〰〰〰


*ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:*


చెక్కందురు, డిప్పందురు,

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.

డొక్కందురు,

మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

〰〰〰〰〰〰


*ఆవకాయ ఉపయోగాలు:*


ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


ఇందువలదందు బాగని

సందేహము వలదు;

ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

〰〰〰〰〰〰


*ఆవకాయ అవతరణ:*


“చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”


ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!


చారెరుగనివాడును,

గోదారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగువాడు కాడోయ్!!!


*Dedicated to All Aavakaaya Lover's

అమ్మ కోరిన కోరిక..*

 *అమ్మ కోరిన కోరిక..*


"అయ్యా..ఈ వర్షం తగ్గేతట్టు లేదు..ఇంకో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని రేడియో లో టీవీ లో చెపుతున్నారు..ఈసారి దత్తజయంతి కి ఏర్పాట్లు ఎలా చెయాలి..? అదీకాక వ్యవసాయ పనులు కూడా ముమ్మరంగా సాగుతాయి..పెద్దగా జనం రాకపోవొచ్చు..ఒకవేళ వచ్చినా ఇక్కడ నిలబడటానికి కూడా స్థలం లేదు..అంతా బురదగా ఉంది.." అని మా సిబ్బంది నాతో అన్నారు..నేను ధర్మకర్తగా బాధ్యత తీసుకున్న తొలినాళ్ళ నాటి సంఘటన ఇది.. అప్పటి పరిస్థితుల్లో మా సిబ్బంది చెప్పింది నిజమే..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో స్వామివారి సమాధి మందిరం..దానిముందు ఒక మంటపం తప్ప మరేమీ లేవు..మందిరం ప్రాంగణంలో కనీసం పందిరి కూడా లేదు..ఇక మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు చేయాలంటే..మామూలు మట్టి నేల మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి..వర్షం వస్తే..మొత్తం ప్రాంగణం బురదగా మారిపోతుంది..అప్పటికి దత్తజయంతి సరిగ్గా వారం రోజుల్లో ఉంది..


స్వామివారి ప్రాంగణం లో కనీసం నాపరాళ్లు పరిపించే ఏర్పాటు చేసి..పైన ఒక తాటాకు పందిరి వేస్తే బాగుంటుంది అని అనిపించింది..స్వామివారి సమాధి దర్శించే భక్తులకు కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది అని నా భావన..ఇందుకు ఖర్చు అవుతుంది..పైగా అప్పటికప్పుడు ఈ పనిచేసే పనివాళ్ళు కూడా కావాలి..ఎలా చేయాలో పాలుపోలేదు..ఆ విషయమే ఆలోచిస్తూ..మొగిలిచెర్ల లోని మా ఇంటికి వెళ్ళాను..మా నాన్నగారు అనారోగ్యం తో వున్నారు..మా అమ్మగారు వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారు..(పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్లు )..ఇంటి లోపలికి వెళ్లి..మంచం మీద కూర్చున్నాను.."ఏమిటి నాయనా..ఏదో ఆలోచనలో ఉన్నావు..? " అని మా అమ్మ అడిగింది.."ఏదోలే అమ్మా..చిన్న సమస్య.." అన్నాను.."గుడి దగ్గర భక్తులు ప్రదక్షిణాలు చేయడానికి చుట్టూరా నాపరాళ్ల ను పరిపించాలని..అలాగే పందిరి వేయించాలి అని అనుకున్నాము అత్తయ్యా..అందుకు ఖర్చు అవుతుంది కదా..ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు.." అని మా ఆవిడ మా అమ్మతో చెప్పింది..


"ఒరే ప్రసాదూ..నీకు ఏ సమస్య వచ్చినా..నేరుగా స్వామివారి సమాధి వద్ద చెప్పుకో అని చెప్పాను గుర్తుందా..ఇప్పుడు మీరిద్దరూ కారు లో స్వామివారి మందిరానికి బైలుదేరండి..మీతోపాటు నేనూ వస్తాను..స్వామివారికి మీరిద్దరూ సమస్యను విన్నవించండి..నేనూ చెప్పుకుంటాను..రండి గుడికి వెళదాము.." అన్నది..సరే అమ్మా..అన్నాను..మరో పదినిమిషాల్లో ముగ్గురమూ స్వామివారి మందిరానికి చేరుకున్నాము..


మా అమ్మగారు వాకర్ సహాయంతో మెల్లిగా స్వామివారి మందిరం లోకి వచ్చారు..మా దంపతులను పిలిచి.."మీరిద్దరూ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి ప్రార్ధించండి.." అన్నారు..అలాగే చేసాము..ఆ తరువాత ఆవిడ కొద్దిసేపు కళ్ళుమూసుకుని స్వామివారిని ప్రార్ధించి.."అన్నీ సవ్యంగా జరుగుతాయి..ఏమీ సంకోచం పెట్టుకోకండి.." అన్నది..అమ్మను తీసుకొని ఇంటికి వెళ్లేముందు..ముందున్న మంటపం లో ఉన్న భక్తులు..మా అమ్మగారి కి నమస్కారం చేయడానికి వచ్చారు..సుమారు ఇరువై మంది దాకా వున్నారు..ఒక్కొక్కరూ ముందుకు వస్తున్నారు..ఈలోపల మందిరం వెలుపల ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుంచి ఒక మధ్యవయస్కుడు నేరుగా లోపలికి వచ్చాడు..అతను మంటపం లోకి రాగానే..మా అమ్మను చూసి..గబ గబా ముందుకు వచ్చి.."అమ్మా బాగున్నారా..నేను గుర్తున్నానా..వడ్డే కొండయ్యను.." అన్నాడు..మా తల్లిగారు ఒక్క క్షణం అతనిని నిశితంగా చూసి.."కొండయ్యా..నువ్వా..బాగున్నావా..హైదరాబాద్ వెళ్ళావని చెప్పారే..అక్కడ స్థిరపడ్డావట కదా.." అని పలకరించారు.."ఏదోలే అమ్మా..స్వామి దయ..మీ ఆశీర్వాదం..లక్షణంగావున్నాను.." అన్నాడు.."ఒక పని చేస్తావా..ఇట్లా అడుగుతున్నానని ఏమీ అనుకోకుండా..ఈ మందిరం చుట్టూరా నాపరాళ్లు పరిపించు..స్వామిదయవల్ల బాగుపడ్డానన్నావు కదా..నలుగురికి ఉపయోగంగా ఉంటుంది.." అన్నది.."అమ్మా నువ్వు చెపితే..ఆ స్వామివారు చెప్పినట్టే..రేపే రాళ్లు తెప్పిస్తా..వర్షం తగ్గగానే దగ్గరుండి పరిపిస్తాను..స్వామిదయ తలిస్తే..పందిరి కూడా వేయిస్తా..ఏదైనా వాతావరణం అనుకూలిస్తే..మొత్తం పని మూడురోజుల్లో చేయిస్తా తల్లీ.." అన్నాడు..

ఈ ప్రహసనం మొత్తం చూస్తున్న మా దంపతులకు స్వామివారి లీల ఏమిటో కళ్ళకు కట్టినట్లు తెలిసి వచ్చింది..


మాలకొండలో మొట్టమొదటిసారి స్వామివారిని మా తల్లిదండ్రులు కలిసిన రోజు..మా అమ్మగారిని..తన తల్లితో సమానం అని స్వయంగా చెప్పారు..ఇప్పుడు ఆవిడ మందిరం వద్దకు వచ్చి స్వామివారి సమాధి వద్ద ప్రార్ధించిందో..ఆ కోరిక క్షణాల్లో నెరవేరింది..అనుభవపూర్వకంగా చూసాము..ఆరోజు సాయంత్రం నుంచే వర్షం ఆగింది..దత్తజయంతికి ఒక రోజు ముందుగానే మొత్తం పని పూర్తి అయింది..


ఇటువంటి అనుభవాలు ఎన్నో మేము స్వయంగా చూసాము..అనుభూతి చెందాము..ఇన్నాళ్లకు మీలాటి దత్తభక్తులతో పంచుకునే అవకాశాన్ని..మొగిలిచెర్ల అవధూత ఆ దత్తాత్రేయ స్వామివారు కల్పించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

దైవదర్శనం తరువాత

 దైవదర్శనం తరువాత 


మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.

అది ఏమిటంటే..!

వినా ధైన్యేన జీవనం

అనాయాసేన మరణం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పరమేశ్వరం."


"అనాయాసేన మరణం

వినా ధైన్యేన జీవనం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పరమేశ్వరం."


మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.


దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.


"అనాయాసేన మరణం"

నాకు నొప్పి లేక బాధ కానీ లేని

మరణాన్ని ప్రసాదించు.


"వినా ధైన్యేన జీవనం"

నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,

నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.


"దేహాంతే తవ సాన్నిధ్యం"

మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను

నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 


"దేహిమే పరమేశ్వరం"

ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.


1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.


2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.


3.  నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా

ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.


ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.


దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణం లో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ


" లోకా సమస్తా  సుఖినో భవంతు..!! 


By  మన ఆచారాలు మన సంస్కృతి