అతికించినప్రతి
🔵 "ఇం టి పే ర్లు" 🟢
(ఓ మిత్రుడు పంపిన పోస్ట్)
అరవై దాటేలోపు ఆరుసార్లు అమెరికాకైతే వెళ్ళగలిగాను కానీ ఫ్లైట్లో ఇచ్చిన చిన్నఫారమే సరిగ్గా నింపలేకపోయాను. ఆ ఫారమ్‌లో నేమ్ అన్న దగ్గర ఫస్ట్‌నేమ్, మిడిల్‌నేమ్, లాస్ట్‌నేమ్ అని మూడుగళ్ళున్నాయి.
మనకు తెలిసిందల్లా మనపేరు, దాని వెనకాముందు ఓ ఇంటిపేరు. ఆది మధ్యాంతరాలు ఏవో తెలియక ఎలాగోలా ఆ గళ్ళు నింపి బయటపడ్డా. ఇంటిపేర్లు తెచ్చిన తంటా ఎలాంటిదంటే ఒకసారి భయస్తుడైన ఉద్యోగి సర్ నేమ్ అన్నకాలమ్ ఎదుట స్వామిభక్తితో వాళ్ళ బాస్ పేరు రాస్తే, అతి భయస్తుడైన భర్త ఎందుకొచ్చిన గొడవని సర్‌నేమ్ అన్న కాలమే కొట్టేసి మేడమ్ నేమ్ అని రాసేసుకుని దాని ఎదురుగా వాళ్ళావిడ పేరు రాసేసి గొప్ప రిలీఫ్‌గా ఫీలయ్యాడట.
గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా మేకా రంగయ్య అప్పారావు గారి తరువాత జస్టిస్ ఆవుల సాంబశివరావు గార్ని నియమిస్తే పత్రికల వాళ్ళు మేకలు పోయి ఆవులొచ్చాయి అని చమత్కరించారు.
ఏనుగు లక్ష్మణకవి, కాశీయాత్ర రాసిన ఏనుగుల వీరాస్వామయ్య మనందరికీ పరిచయమే. గుంటూరు ప్రాంతంలో పూర్వం కొందరు ముర్రాజాతి గేదెపాలు అమ్మేవారట. ఆ గేదెకొమ్ములు జంగిలి (అడవి) దున్నల కొమ్ముల్లా ఉండటంతో వూరి వాళ్ళందరూ జంగిలి వాళ్ళింట్లో పాలు కొంటాం అనడంతో వాళ్ళ ఇంటిపేరు జంగిలి అయిపోయిందట.
మనదేశంలో ఇంటిపేర్లు అమెరికా పోయిన మన వాళ్ళకు పేర్లే కావడంతోనే ప్రమాదం. పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు మా బావ ఆనంద్ గారి ఇంట్లో ఫోన్ రింగైతే నేను ఎత్తితే అవతలి నుంచి ‘పిల్లి స్పీకింగ్’ అనగానే కంగారుపడ్డా. తరువాత మా బావ చెప్తే తెలిసింది వారు పిల్లి సురేష్ గారని. అదే ఏ పులి వెంకటరెడ్డిగారో ఎత్తితే పులి గాండ్రింగ్ అనో, పాముల నర్సయ్యగారో ఎత్తితే పాములు బుస్సింగో అంటారేమో.
మిగిలిన వాళ్ళేం తక్కువ. వాళ్ళు దూడల స్పీకింగనో, ‘కోడి’ కేరింగనో, కాకి ‘కావిం’గనో అనేస్తే, అవి విని మనం కెవ్వుకెవ్వు అనాల్సొచ్చేది. అమెరికాలో సైతం వృత్తులను ఆధారంగా చేసుకుని ఇంటిపేర్లు వస్తాయట. కమ్మరి పనిచేసేవాళ్ళు smith లు అయితే వడ్రంగి పనిచేసే కుటుంబాలు woods అవుతారు.
మనవైపు ఊళ్ళపేర్లు ఇంటిపేర్లు కావడం సర్వసాధారణం.
శ్రీరంగం, కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, వారణాసి, శంకరంబాడి, ద్రాక్షారం, ప్రయాగ, కంచి, మధురాంతకం, తిరువీధుల, రామేశ్వరం, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలతో పాటు గుడివాడ, బెజవాడ, గూడూరు, కడప, కావలి, చల్లపల్లి, కొండపల్లి, గుంటూరు, టంగుటూరు, దర్శి, తెనాలి వూళ్ళు ఇంటిపేర్లయ్యాయి.
నీళ్ళకు సంబంధించిన చెఱువు, బురదగుంట, కోనేరు, తూము, నూతి, కడలి, రేవు, కలువ కొలను, కాలువ ఇంటిపేర్లయ్యాయి.
పక్షులైన డేగలు, కోడి, పిచ్చుకలు, కాకి, పావురాల, నెమలి, కొంగర, చిలక, పిట్టల, గువ్వల ఇంటిపేర్లే. కోడి రామ్మూర్తి గారు గతంలో గొప్ప మల్లయోధులు. ఇలాంటి ఇంటిపేర్లతో ప్రమాదమేమిటంటే డేగలవారింటి అబ్బాయికి పిచ్చుకల వారింటి అమ్మాయిని ఇవ్వడానికి వెనుకాడతారేమో. అసలే మన జాతకాలు (హర్రర్‌స్కోప్) చూసేవాళ్ళు దేవగణం, రాక్షస గణం, మనిషిగణం అని లెక్కలేసి అమ్మాయి పులి అయితే అబ్బాయి పిల్లి అయ్యాడనో భయపడి పులి తినేస్తుందని (కాకపోయినా అదే జరిగేది) పెళ్ళికి వెనకాడతారు.
లోహాలైన బంగారు, కంచు, రాగిరెడ్డి, కనకమేడలు, ఆభరణాలైన ఉంగరాలు, వడ్రాణం, సవరం, మెట్ల, కట్టుపోగుల, గాజులు, కడియాలతోపాటు పగడాలు, ముత్యాలు, మాణిక్యాలు, రవ్వలు, వజ్రం కూడా ఇంటిపేర్లయ్యాయి.
పనిముట్లైన తాపీ, వడంబం, ఉలి, వానం ఇంటిపేర్లే. తాపీ ధర్మారావు గారు గొప్పరచయిత సినీదర్శకులు.
ఉత్తర భారతదేశంలో ఇంటిపేర్ల కథ వేరే విధంగా ఉంటుంది. అగ్నిహోత్రం చేసే కుటుంబాలు అగ్నిహోత్రులు. వారణాశి ప్రాంతంలో నాలుగు వేదాలు చదివిన పండిత కుటుంబీకులు చతుర్వేదులైతే, మూడువేదాలు చదివినవారు త్రివేదిలు, రెండే చదివితే ద్వివేది. సామవేదం చదివితే సామవేదం వారౌతారు.
అదే ఫ్లోలో ఏ వేదమూ చదవని కుటుంబీకుల్ని నిర్వేదులనాలేమో. బెంగాలీలో బంధోపాధ్యాయులు, చటోపాధ్యాయులు, ముకోపాధ్యాయుల్ని ఎక్కువగా చూస్తాం. నా పరిమిత జ్ఞానంతో ముకోపాధ్యాయులు అంటే ముక్కుతో చదివేవారేమో అనుకునేవాడ్ని. వాజపేయుల, సోమయాజుల ఇలాంటివే మరికొన్ని.
ఉత్తర భారతదేశంలోని పేర్లమీద మోజుతో ప్రగతిశీలులైన మన తెలుగు సోదరులు కొందరు చాలాకాలం క్రిందటే వాళ్ళ పిల్లలకు టాగూరనో, రాయ్ అనో, ఛటర్జీ అనో, బెనర్జీ అనో, గాంధీ అనో, బోస్ అనో పేర్లు పెట్టేసారు. ఇలా పేర్లు పెట్టడం బాగానే ఉంది కాని నిజానికి అవి వాళ్ళ పేర్లుకావు. హౌస్‌నేమ్స్. ఇది గుర్రాన్ని వదిలి కళ్ళాన్ని పట్టుకున్నట్లే. పేరు ఏదైనేం లెండి అటువంటి పెద్దల పట్ల మనవాళ్ళకు గల భక్తి, గౌరవాలను మనం మెచ్చుకుందాం.
సంగీత ప్రపంచానికి చెందిన సంగీతం, చిడతల, మేళం, అందెల, గజ్జెల, తప్పెట, సన్నాయిలతో పాటు రణరంగానికి చెందిన ఈటెల, బల్లెం, కత్తుల, ఉండేలు, బాణాల, కత్తి, రంపాల కూడా ఇంటిపేర్లయ్యాయి. వృక్ష సంపదనుండి అడవి, తోట, అరణ్య, టేకు, వెదురు, రావి, తుమ్మల, మర్రి, తాడి, మామిడి, నేరెళ్ళ, చింత, జామి, నిమ్మల, నిమ్మకాయల, తోటకూర, వంకాయల, ఉల్లిలతోపాటు వండుకునే పచ్చిపులుసు, తియ్యగూరలు వచ్చి చేరాయి.
సువాసనలైన గంథం, జవ్వాజి, కస్తూరిలు (‘ఇంటిపేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అనే నానుడి తెలిసిందే) ఇంటిపేర్లే! మా మేనమామ గారి ఇంటిపేరు కస్తూరేగాని వాళ్ళింట్లో గబ్బిబాలు లేవు. పూలకుటుంబం నుండి పూదోట, పుష్పాల, పువ్వుల సంపంగి, మల్లెల, మొగలి వచ్చి చేరాయి. పువ్వుల సూరిబాబు గొప్ప రంగస్థల నటులు. పాలకు పలురూపాలైన పాలపర్తి, మజ్జిగ, పెరుగు, వెన్న, నేతి, చల్లలు ఇంటిపేర్లే అల్లం, మిరియాలు, శొంఠిలతోపాటు కారం, ఉప్పు, బెల్లపు కూడా ఇంటిపేర్లే. పాయసం, పానకం, గంజి కూడా ఇంటిపేర్లే.
పెద్దరికాల్ని, పెత్తనాల్ని తెలియజేసే కమతం, సుంకం, సేనాని, మంత్రం, పట్వారి, కరణం, రాయల, అధికారి, యాజమాన్యం, పెద్దింటి, దళవాయి, తలారి, టంకశాల, నీరుకట్టి, సంధానపు, మహాపాత్ర, వాడ్రేవు, పుట్రేవు, పెద్దింటి, పెద్దిరెడ్డిలు ఇంటిపేర్లే. కరణం మల్లీశ్వరి గొప్ప క్రీడాకారిణి. తలారి అనంతబాబు గారు ప్రఖ్యాత న్యాయవాది. మనశరీరంలోని గెడ్డపు, మీసాల, గడ్డం, సవరం, కొప్పు, కొప్పుల, శ్రీపాద, బొడ్డు, బుర్రా, బొజ్ఞా, కడుపు, చెవి, మెడబలిమి, ముక్కు, తలతోటి, పచ్చిగోళ్ళు, గుంటకండ్ల, మొండెం కూడా ఇంటిపేర్లే. న్యాయవాదులుగా ఖ్యాతిపొందిన కొందరికి ప్రతివాది, మహావాదిలుగా ఇంటిపేర్లయ్యాయట.
కొంతమంది అదృష్ట దీపక్‌లను చూస్తే ఆవగింజంత విద్వత్తు, ప్రతిభలేకపోయినా (కాకా) పట్టు పరిశ్రమలో శ్రమించడం వలన రాజ్యసభసభ్యులుగా, ఛైర్మెన్‌లుగా ఎదగడం చూసిన తరువాత వారి ఇంటిపేర్లును ‘పట్టు’ గా మార్చేసి పట్టుప్రవీణ్, పట్టుప్రసాద్ అనాలపిస్తుంది. సాధారణంగా వీరికి ఏ పార్టీ సిద్ధాంతల మీద నమ్మకం ఉండదు. వీరు మేము ఎప్పటికీ రూలింగ్ పార్టీనే అని రూలింగ్ ఇచ్చుకున్నఘనులు కనుకనే ఎప్పుడూ ఏదో ఒక పదవిలో ఉండగలరు. వీరి చేత Great Art of Staying in Power అన్న పుస్తకం రాయిస్తే The Best Seller అయిపోతుంది. వీరు సిల్క్ బోర్డ్ అధ్యక్షులు కాదగినవారు. పట్టు తోబుట్టువు పుట్టు. కేవలం కొంతమందికి పుట్టినందుకు వీరు నటులైతే తెరంగేట్రం చేసేసి, నాయకులైతే యువనాయకులై పోయి మనల్ని వినోదింపజేస్తున్నామని, సేవించేస్తున్నామని భ్రమింపచేస్తారు. వెనకటికి బ్యాట్ ఎటువైపు పట్టుకోవాలో కూడా సరిగ్గా తెలియని యువకుడు ముఖ్యమంత్రి కుమారుడైనందున ఏకంగా రంజీట్రోఫీనే ఆడేశాడు. ఇలాంటి వాళ్ళ ఇంటిపేరు ‘పుట్టి’ గా మార్చేస్తే సరిపోతుంది. నాట్యంలో ముద్రలంటే పోస్టాఫీస్ ముద్రలనుకునే వాళ్ళకు పద్మశ్రీలు వచ్చాయిగా. వీళ్ళూ పట్టు పారిశ్రామికులే. వీరి పుణ్యాన పట్టు పరిశ్రమకున్న డిమాండ్ ఇంక దేనికీ లేదు.
దేవతారాధనకు సంబంధించిన దీపాల, కర్పూరం, పరమాత్ముని, దేవభక్తుని, దర్భశయనం, బృందావనం, అయాచితం, నటేశం, అగ్నిహోత్రం, అగ్రహారం, పూజారి, మహంకాళి, శ్రీరామకవచం, సంకీర్తనం, సుదర్శనం, అర్చకం, పంచాగ్నుల, పండితారాధ్యుల, శ్రీరామ్, ద్వాదశి, నమశ్శివాయ, విష్ణుమొలకల, సరస్వతుల, భాగవతుల, రామాయణం, గుడిసేవ, గుడిమెట్ల లు ఇంటిపేర్లు. పెళ్ళికి సంబంధించిన కళ్యాణం, మేళం, అగ్నిహోత్రం ఇంటిపేర్లే. కళ్యాణం రఘరామయ్యగారు మన తొలి సినిమా కృష్ణులు, ఈలపాటకు ప్రసిద్ధులు.
ఇవన్నీపోగా ఏ కోవకు చెందని ప్రత్యేకంగా అనిపించేవి కర్రతలుపులు, కిళ్ళి, అధ్వానం, చప్పిడి, కొండబోయిన, చోద్యం, జగడం, మొండి, శరణు, శకునాల, ఆకలి, తీగెల, కోడెబోయిన, (ఎన్నిసార్లు దూడల్ని పోగొట్టుకుంటే వారికీ ఇంటిపేరు దక్కిందో) దూడబోయిన, కొత్తావకాయ లాంటివి. ఇరవై ఐదేళ్ళ క్రితమే ఆప్తమిత్రుడు ప్రభాకర్ కడప బలిజ గృహనామాల మీద పరిశోధించి డాక్టరేట్ సాధించాడు. ఏది ఏమైనా ఇంటిపేర్లు వాటి పుట్టుపూర్వోత్తరాలు మంచి పరిశోధనాయోగ్యమైన విషయమే. అవి తెలుసుకునే కొద్దీ, చరిత్ర, సమాజం పరిణామాలతోపాటు వలసలు, వృత్తులు గురించి మరింత తెలుసుకోవచ్చు.
(ఆప్తమిత్రులు వీణాప్రవీణ దుడ్డు సీతారామయ్యగారికి కృతజ్ఞతలతో...)