దిగజారుతున్న మానవ విలువలు దేనికి సంకేతం...
(కొద్దిగా పెద్ద విషయమే, కానీ చాలా ఆలోచింప చేసేది . ఓపిక తో చదివితే) ..
® మొన్న ఒకరోజు ఒక మిత్రుడు క్షీణమౌతున్న కుటుంబ విలువల గూర్చి మాట్లాడుతూ... ఆసక్తికరమైన ఒక మాటన్నాడు. మహాభారతంలో కొన్ని లక్షల మంది కురుక్షేత్రంలో మరణించారు. దానికి కారణం... ఇరువురి ఆధిపత్య దాహంకాదా? నిజానికి మరణించిన వారెవరికీ ఆ యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేదు. ఎదుటివారితో వైరమూలేదు.. అయినా యుద్ధం చేసారు.. అసువులు బాసారు. ఆ యుద్ధానికి నాయకత్వం వహించిన వారు విద్యాహీనులా అంటే కాదు.. యుద్ధం యొక్క పరిణామాలు తెలియని వారా? కాదే.. అందరూ ధర్మాధర్మ విచక్షణ కలిగినవారే. అంతేకాదు, వారికి ఆనాటి ఋషులు, మునులు హితోక్తులతో ధర్మ బోధ చేసారు కూడా. సామాజిక స్పృహ కలిగిన వారెందరో వారి యుద్ధ నివారణకై ప్రయత్నించారు.. అయినా యుద్ధం జరిగింది... జన నష్టం జరిగింది... అర్థికంగా రాజ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఈనాడూ ఎన్నో కుటుంబాలలో ఇది పునరావృతం అవుతూనే ఉన్నది.. దీనిపై చిన్న వ్యాసం వ్రాస్తే బాగుంటుంది కదా... అన్నారాయన.
నిజానికి కౌరవ పాండవులు ఏ రాజ్యానికై పోరాడారో ఆ రాజ్యం వారిరువురూ సంపాదించినది కాదు. వారి పూర్వికులు సాధించినది.. భీష్ముడు పెంచినది... పాండురాజు రక్షించినది.. అయినా దుర్యోధన, ధర్మరాజ నాయకత్వంలో అనర్ధం జరిగింది. ఇక్కడ ధర్మాధర్మ చర్చకన్నా మానవత్వాన్ని చూడాలి.
అది ద్వాపారానికే పరిమితం కాలేదు, త్రేతాయుగంలో రామరావణ యుద్ధంలోనూ జరిగినదదే. లంకానగరం పూర్తిగా ధ్వంసమయింది. ఎన్నో సంవత్సరాలు ఎందరో కార్మికులు చెమటోడ్చి చేసిన శ్రమకు ప్రతిరూపం లంకానగరం. ఎంతో ధనం ఆ నగర నిర్మాణానికి వ్యయమయి ఉంటుంది. ముఖ్యులైన ఎందరో రాక్షస నాయకులు ఆ యుద్ధంలో మరణించారు. తిరిగి అంతటి నైపుణ్యం కలిగిన యోధులు తయారు కావాలంటే.. ఎంతటి శ్రమ కావాలి, ఎంతటి సంపదను వ్యయించాలి. ఇన్ని అనర్ధాలకు కారణం ఒక్క రావణుని కామేఛ్ఛయే కదా..
అదే విధానం ఈనాడూ కలియుగంలోనూ ప్రతిబింబిస్తుంది. ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లండ్ర మధ్య ఆస్తుల కోసమై తగదాలు ఆయా కుంటుంబ సభ్యుల మధ్య ఎన్ని అగాధాలను సృష్టిస్తున్నాయి... ఎందరు అమాయక బాలల మనసులలో విషం నింపుతున్నాయి.. తరతరాలుగా రక్త సంబంధీకుల మధ్య ఆత్మీయ పలకరింపులు కూడా కరువవడం... ఏ సంస్కృతికి నిదర్శనంగా చెప్పుకుంటాము.
సాంకేతిక జ్ఞానం పెరుగుతుంది. శాస్త్రీయ అవగాహన పెరుగుతున్నది. దేశాల మధ్య దూరాలు అంతరించిపోతున్నాయి. అంతే వేగంగా ఆత్మీయుల మధ్య అంతర్యం పెరుగుతున్నది. మానవత్వం, సామాజిక బంధాలు తగ్గిపోతున్నాయి.
సోదరుల మధ్య కనీసం ఫోనులలో పలకరించుకోవడం కూడా తగ్గిపోయింది. కుటుంబ కార్యక్రమాలలో తప్పనిసరిగా కలవాల్సిన సమయంలో కూడా యాంత్రికంగా కలుస్తున్నారే కాని ఆత్మీయ పలకరింపులు లేవు.. ఇరువురు కలిస్తే మూడవ వారిపై వ్యంగాస్త్రాలు సంధించడమే కాని మంచి చెడ్డలు విచారించడం కాని సహాయ సహకారాలు అందించడం కాని జరగడం లేదు. కార్యక్రమం అలా అయిపోగానే బంధువులు వెళ్ళక ముందే ఇంటివారు వెళ్ళడం జరుగుతున్నది. కుటుంబ జీవన విధానం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి.
అన్నదమ్ముల, అక్కాచెల్లండ్ర పిల్లలు కూడా ఒకరికి ఒకరు తెలియని పరిస్థితి చాలా కుటుంబాలలో కనిపిస్తున్నది. అవసరాలకు మొక్కుబడిగా పలకరింపులు తప్ప మనస్పూర్తిగా ఆహ్వానించడం ఆత్మీయుల మధ్యనే తగ్గిపోతున్నది. ఇది ఆదరణీయమా? విజ్ఞానం అభ్యుదయ మార్గంలో పయనిస్తున్న వేళ ఆత్మీయతలు, అనుబంధాలు, మానవత్వం పాతాళ మార్గాన్ని అన్వేషిస్తున్నది.
చిన్న చిన్న మాట పట్టింపులు, సహనం లేక పోవడం, ఆర్థిక అసమానతలు, సంపద ప్రోగు చేసుకోవడంలో అత్యాశ, పోటీ తత్వం, ఎదుటి వారు రక్త సంబంధీకులైనా, వారి ఉన్నతిని జీర్ణించుకోలేకపోవడం.. ఇలా కారణాలు తరచి చూస్తే అనేకం కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లు ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం సాధారణమై పోయింది. నిన్నటి మీద ఈనాడు తాను వ్యక్తిత్వపరంగా ఎంత ఎదిగాడనేది అభ్యుదయానికి ప్రాతిపదిక కావాలి కాని నిన్నటి మీద ఈనాడు పరులపై ఎంత ఆధిక్యత సాధించామన్నదే ఉన్నతికి ప్రాతిపదికగా మారింది.
ఆర్థిక అభ్యుదయం అంటే.. నిజానికి "మన అవసరాల కన్నా మన వద్ద ఎక్కువ సంపద ఉన్నది అనే భావనయే" కాని మరొకటి కాదు. అయితే ఆ ఎక్కువ అనే పదంయొక్క నిర్వచనం పూర్తిగా మారిపోయింది. వేల కోట్లు సంపాదించినా సంతృప్తి దక్కడం లేదు. ఒకప్పుడు మిత్ర బృందంలో ఎవరికైనా ఆపద వస్తే అందరూ సహకరించే వారు. రాత్రికి రాత్రి ఎంత సొమ్మైనా వారి వద్ద ఉన్నా లేకపోయినా అప్పు చేసయినా సర్దుబాటు చేసేవారు.. కాని ఇప్పుడు డబ్బు ఉన్నా ఆత్మీయులనయినా ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇది తిరోగమన సంస్కృతి అనుకుంటాను. ఇక్కడ డబ్బు అనేది ఒక ఉదాహరణ మాత్రమే.
మానవత్వం ప్రాతిపదికగా ఆధ్యాత్మికత వెలుగు చూడాలి. కాని సంస్కార హీనమైన వేషభాషలు, పూజాదికాల రూపంలో శ్రద్ధ లేని ఆడంబరాలు, అవగాహన లేని ఆచారాలు, శాస్త్రీయత లేని సంప్రదాయాలు, ఆత్మ వికాసం లేని బోధలు, తమకే విశ్వాసం లేని ఆచార్యకత్వాలు, అనుభూతి లేని ఆచరణలు, వ్యామోహం చావని వైరాగ్యాలు.. అసంగత భావనా ప్రచేతస్కులైన వారి మార్గ దర్శన... పరిణతి లేని పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం... వెరసి ఎటు పోతున్నామో తెలియని మార్గంలో.. ఎందుకు వెళుతున్నామో తెలియని ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణం ఎటు వైపు తీసుకు వెళుతున్నది. ఇది యువతకే పరిమితం కావడం లేదు.. పెద్దలు కూడా ఈ కుసంస్కారంలో భాగస్వాములు అవుతున్నారు.
100 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న చాలామంది జీవించి లేరు.. మరో 100 సంవత్సరాల తరువాత ఇప్పుడున్న ఎవరూ ఉండే అవకాశమూ లేదు. కొన్ని లక్షల సంవత్సరాల సృష్టి కాలంలో 100 సంవత్సరాలు చాలా చిన్న కాలం. ఈ కాలంలో ద్వేషాలు, కోపాలు, పగలు ప్రతీకారాలు, అధికార దాహం అవసరమా? అది ఆధిపత్యాన్ని సాధించాలనుకునే వారిలో ఉంటే ఉండవచ్చునేమో కాని సామాన్య జనాలలో కూడా కనిపించడం దేనికి సంకేతం.
ఒక కుటుంబంలో నెలకు 2 నుండి మూడు లక్షలు సంపాదించే వ్యక్తి ఉండవచ్చు... అలాగే 10 నుండి 15 వేలు మాత్రమే సంపాదించే వ్యక్తి ఉండవచ్చు. వారి వారి జీవన స్థితిగతులు వేరుగా ఉండవచ్చు కాని ఆత్మీయతలను పంచుకోవడంలో ఆ ఆర్థిక అసమానతలు అవరోధాలు కావడం సామాజిక బంధాలను సడలించవా? తలిదండ్రుల లేదా పూర్వికుల ఆస్తిపాస్తులు పంచుకోవడంలో ఒకరినొకరు మోసం చేసుకోవడం... ఆర్థికంగా అత్యున్నత తరగతిలో ఉన్న వ్యక్తులు కూడా కొద్దిపాటి ఆస్తికై ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. అసహ్యం వేస్తుంది. ఇది ఆదరణీయం కాదని భావిస్తున్నాను.
ఒక సమాజం తన మూలాలను మరిచిపోతే ఆ సమాజం యొక్క స్థితిగతులను మరొక సమాజం ప్రభావితం చేస్తుంది. ఇదే సూత్రం కుటుంబాలకు వర్తిస్తుంది. సమాజంలో జీవించడానికి డబ్బు అవసరం ఎంతైనా ఉన్నది. అది కాదనలేని సత్యం. మనకు సరిపోయాకనే ఇతరులకు దానం చేయడం కూడా సమర్ధనీయమే. కాని స్వంత కుటుంబంలోని వారలను మోసం చేస్తూ ఇతరులది దోచుకోవాలనుకోవడం, దాచుకోవాలనుకోవడం ఏనాటికీ సమర్ధనీయం కాదు.
నిజానికి ఇతరులు మన తప్పులు ఎత్తి చూపినపుడు లేదా మనలను విమర్శించినప్పుడు ఆవేశానికి లోను గాకుండా వారి మాటలను వినడం వల్ల మన వ్యక్తిత్వ పరిణతి వికసిస్తుంది.. అదే మన వివేకానికి, పాండిత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నిజానికి ఇతరుల పట్ల ఈర్ష్యాసూయలు ప్రదర్శిస్తున్నాము అంటే మనపై మనకు ఆత్మ విశ్వాసం సన్నగిల్లినట్లుగా భావించాలి. మానసికంగా మనం బలహీనులమయినట్లుగా భావించాలి. ఇతరుల పట్ల మన అనుభూతులు మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. యాంత్రికంగా నటనగా చూపే భావాలు బంధాలను నిలుపలేవు.. హృదయపూర్వకంగా అందించే భావనా స్పందనలు తిరిగి వాటినే మనకు చేరుస్తాయి. ఎదుటి వారి భావనలు మనం ఉపేక్షిస్తే అవి అక్కడే నిర్జీవమౌతాయి. వాటిని గౌరవిస్తేనే ఆ గౌరవాన్ని మనకు అందిస్తాయి. సమాజం వ్యష్టిగా నిలవలేదు.. వ్యష్టి సమష్టిగా పరివర్తన చెందాలి. నిండు మనస్సుతో మనకు చాతనైనంత మేరకు ఇతరులకు మంచిని చేయడము మరియు చేసిన దానికి ప్రతిగా ఎదుటివారి నుండి ఏమీ కోరక పోవడమే వ్యష్టి సమష్టిగా పరివర్తన చెందేందుకు మార్గం చూపుతుంది.
పుట్టిన ప్రతి జీవికి వయసుపెరగడం, శరీరం క్షీణించడం, నశించిపోవడం సహజమైనది. అయితే పుట్టిన నాటి నుండి మరణించేవరకు మన జీవితం రెండు విధాలుగా ఉంటుంది.. అవి బ్రతకడం లేదా జీవించడం. వయసును పెంచుకుంటూ మరణం వరకు ప్రయోజనరహితంగా ఉండడం బ్రతుకు... లేదా ప్రతిక్షణం ఆనందంగా రసాత్మకంగా, ప్రయోజనభరితంగా గడపడం జీవించడం.. జీవించడంలో వ్యక్తి పరిణతి చెందుతాడు. "నేనే" అనే భావన ఎల్లప్పుడూ ప్రత్యేకతను కోరుకుంటుంది. కుటుంబంలో ఎవరైనా ఆ భావనను ప్రదర్శిస్తే ఆ కుటుంబంలో చీకాకులు ఏర్పడతాయి. "నేనూ" అంటూ ముందు నడిచే వ్యక్తి వల్ల ఆ కుటుంబం ప్రశాంతతను పొందుతుంది. ఆస్తిపాస్తులు సంపాదించడం, వాటిని అనుభవించడం ఆదరణీయమే కాని అవి కుటుంబ సభ్యుల మధ్య ఆడంబర ప్రదర్శనకు కారణం కావద్దు. భౌతిక సంపదలు ఎల్లకాలం నిలుస్తాయని చెప్పలేము కాని ప్రేమలు ఆప్యాయతలు ఎల్లకాలం నిలుస్తాయని చెప్పవచ్చు. మనందరి జీవితకాలం చాలా చిన్నది... కక్షలు కార్పణ్యాలతో, అహంభావ ప్రదర్శనలతో దానిని మరింత చిన్నదిగా చేసుకోవడం సమంజసం కాదనేది నా నమ్మకం. సంపదలు ఒక పరిమితి వరకే అవసరం.. ఆ పరిమితులు అధిగమించిన తదుపరి ఆ సంపదల అవసరాలు ఆడంబరానికేననే సత్యం గుర్తించాలి. 3 రూపాయల కలమైనా 30000 రూపాయల కలమైనా దాని ప్రయోజనం వ్రాయడానికే.. అది వ్రాయని నాడు.. వ్యర్ధమే...
ఇప్పటికే ఎక్కువగా వ్రాసాను. మనసులోని ఆవేదన మిత్రుని ఆత్మీయ స్పర్శతో బహిర్గతమై.. అక్షర రూపాన్ని దాల్చింది. మిత్రుడు తన పేరును బహిర్గతం చేయవద్దనడం కారణంగా ఈ వ్రాతలకు కారణమైన మిత్రుని పేరును ప్రస్తావించకుండా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ...మహాభారతంతో ఆరంభమయిన వ్యాసం మహాభారతంతోనే అంతంచేయడం సమంజసం...
కురుక్షేత్ర యుద్ధం పిమ్మట... యుద్ధంలో గెలిచిన ధర్మరాజు ఏ నాడు సంతోషంగా లేడు.. జీవితకాలం అంతా పశ్చాత్తాపంలో మ్రగ్గిపోయాడు.. అంతేకాదు...
అహంకారాన్ని ప్రదర్శించిన దుర్యోధనుడు సపరివారంగా నశించి పోయాడు.
"నేను నాది" అనే భావనలో పుత్ర వాత్సల్యంతో, రాజ్య కాంక్షతో కొట్టుమిట్టాడిన ధృతరాష్ట్రుడు 100 మంది కుమారులను కన్నా... తలకొరివి పెట్టేందుకు దిక్కులేక పాండవుల పంచన వారి దయా ధర్మంపై బ్రతికాడు.
అవకాశం ఉండి కూడా యుద్ధాన్ని ఆపలేని భీష్ముడు... అంపశయ్యపై జీవితాన్ని ముగించాడు..
దేని కోసం దేనిని విడిచి పెట్టాలో తెలియడమే విజ్ఞత. అదే మన జీవితాన్ని... రసమయం చేస్తుంది లేదా నీరసమయం చేస్తుంది.
ఆలోచించండి... మన చిన్నప్పుడు మన తాతలు అందరూ కలసి సమష్టి కుటుంబంగా ఆనందంగా ఉన్న సంఘటనలు అపారంగా విన్నాము.
ఆ ఆనందాన్ని తిరిగి మన తరం భావితరాలకు అందించాలి అంటే ఎలాంటి సూచనలు అవసరమో మీ అభిప్రాయాలను పంచుకుంటే ఈ వ్యాసం సమగ్రతను సంతరించుకుంటుందని భావిస్తూ...
(ఒక పెద్దాయన షేర్ చేసింది) (🙏)