*01.08.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఐదవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు వసుదేవునకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుట - శ్రీకృష్ణుడు దేవకీదేవి యొక్క ఆరుగురు మృతపుత్రులను సజీవులనుగా తీసికొనివచ్చుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీబాదరాయణిరువాచ*
*85.1 (ప్రథమ శ్లోకము)*
*అథైకదాఽఽత్మజౌ ప్రాప్తౌ కృతపాదాభివందనౌ|*
*వసుదేవోఽభినంద్యాహ ప్రీత్యా సంకర్షణాచ్యుతౌ॥11843॥*
*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! ఒకనాడు ప్రాతఃకాలమున బలరామకృష్ణులు తమ తల్లిదండ్రులైన దేవకీవసుదేవులకు పాదాభివందసమొనర్చుటకై వారి కడకు వచ్చిరి. అంతట వసుదేవుడు ప్రేమతో వారిని అభినందించెను.
*85.2 (రెండవ శ్లోకము)*
*మునీనాం స వచః శ్రుత్వా పుత్రయోర్ధామసూచకమ్|*
*తద్వీర్యైర్జాతవిశ్రంభః పరిభాష్యాభ్యభాషత॥11844॥*
వసుదేవుడు కురుక్షేత్రమున తమ తనయులైన బలరామకృష్ణుల ప్రభావమును గూర్చి మునులద్వారా వినియుండెను. వారి మహత్త్వమును స్వయముగా చూచియుండెను. అందువలన ఆయనకు వారి జగదీశ్వరత్వమును గూర్చి పూర్తి విశ్వాసము కుదురుకొనెను. పిమ్మట అతడు వారిని సంబోధించుచు ఇట్లు నుడివెను.
*85.3 (ముడవ శ్లోకము)*
*కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన|*
*జానే వామస్య యత్సాక్షాత్ప్రధానపురుషౌ పరౌ॥11845॥*
"సచ్చిదానంద స్వరూపుడవైన శ్రీకృష్ణా! మహాయోగీశ్వరుడవైన బలరామా! 'మీరు ఇరువురును సనాతనులు. మీరు ఈ సమస్త జగత్తునందలి ప్రకృతి - పురుషులకు నియామకులు. సాక్షాత్తు పరమేశ్వరులు మీరే' అని నేను మీ కృపతో ఎరుగుదును.
*85.4 (నాలుగవ శ్లోకము)*
*యత్ర యేన యతో యస్య యస్మై యద్యద్యథా యదా|*
*స్యాదిదం భగవాన్ సాక్షాత్ప్రధానపురుషేశ్వరః॥11846॥*
కృష్ణా! మీరు ఈ జగత్తునకు ఆధారభూతులు. నిర్మాతలూ, నిర్మాణసామాగ్రియు మీరే. సమస్త జగత్తునకును మీరే ప్రభువులు. ఈ సమస్త జగత్తూ మీకు క్రీడాపరికరము. ఏది ఏ సమయమున ఏ రూపములో ఉండునో, ఎట్లు పరివర్తనము చెందునో, వాటికి అన్నింటికిని మీరే కారణము. ఈ జగత్తునందు ప్రకృతి రూపములో భోగ్యవస్తువులుగను, పురుషరూపములో భోక్తలుగను విలసిల్లుచుండువారు మీరే. అంతేగాదు మీరు వాటికి (భోగ్యములకు - భోక్తలకు) అతీతీలూ, నియామకులూ ఐన పరమాత్మ స్వరూపులు.
*85.5 (ఐదవ శ్లోకము)*
*ఏతన్నానావిధం విశ్వమాత్మసృష్టమధోక్షజ|*
*ఆత్మనానుప్రవిశ్యాత్మన్ ప్రాణో జీవో బిభర్ష్యజ॥11847॥*
*85.6 (ఆరవ శ్లోకము)*
*ప్రాణాదీనాం విశ్వసృజాం శక్తయో యాః పరస్య తాః|*
*పారతంత్ర్యాద్వైసాదృశ్యాద్ద్వయోశ్చేష్టైవ చేష్టతామ్॥11848॥*
ప్రభూ! నీవు ఇంద్రియాతీతుడవు. జన్మ-అస్తిత్వాది భావవికార రహితుడవైన పరమాత్మవు. చిత్రవిచిత్రమైన ఈ జగత్తు నీ నుండియే వ్యక్తమగుచున్నది. దాని స్రష్టవు నీవే. దేవ-నర-పశు-వృక్షాది నానారూపమలలో జీవాత్మ రూపమున అందు ప్రవేశించి, వాటిని రక్షించుచుందువు. వాటి ప్రాణ (క్రియా-శక్తి), జీవ (జ్ఞానశక్తి) రూపములలో వాటిని పోషించుచుందువు. క్రియాశక్తి ప్రధాన ప్రాణాదులైన జగద్వస్తువులలోని సృష్టి సామర్థ్యము వాటిది గాదు. అది నీదే. ఏలయన అవి నీ వలె చేతనములు గావు. అచేతనములు (జడములు) స్వతంత్రములు గావు. పరతంత్రములు. చేష్టాశీలములైన ప్రాణాదులయందుగల శక్తివి నీవే.
*85.7 (ఏడవ శ్లోకము)*
*కాంతిస్తేజః ప్రభా సత్తా చంద్రాగ్న్యర్కర్క్షవిద్యుతామ్|*
*యత్స్థైర్యం భూభృతాం భూమేర్వృత్తిర్గంధోఽర్థతో భవాన్॥11849॥*
మహాత్మా! చంద్రునికాంతి, అగ్నియొక్క తేజస్సు, సూర్యుని ప్రభ, నక్షత్రములయొక్క, విద్యుత్తుయొక్క వెలుగులు, పరత్వములయొక్క స్థిరత్వము, భూమియొక్క ఆధార శక్తిరూపమైన వృత్తి, దాని గుణమైన గంధము ఇవి యన్నియును వాస్తవముగా నీవే.
*85.8 (ఎనిమిదవ శ్లోకము)*
*తర్పణం ప్రాణనమపాం దేవత్వం తాశ్చతద్రసః|*
*ఓజః సహో బలం చేష్టా గతిర్వాయోస్తవేశ్వర॥11850॥*
సర్వేశ్వరా! ప్రాణుల దాహము తీర్చి తృప్తిపఱచుట, ప్రాణములను నిలబెట్టుట, శుభ్రపఱచుట అను జలముల శక్తులన్నియును నీ స్వరూపమే. అంతేగాక! ఆ జలములలోని రసము (రుచి) నీవే. ఇంద్రియశక్తి, అంతఃకరణశక్తి, శరీరశక్తి, వేగము, కదలుట, కదిలించుట, వీచుట, చరించుట అను వాయువుయొక్క శక్తులు అన్నియును నీవే.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235