1, నవంబర్ 2022, మంగళవారం

Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 59 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివలన వారికి కీడు ప్రారంభం అయింది. లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి అనుగ్రహమును పొంది ఇంద్రుడు తరించాడు. ఇంద్రునికి రాజ్యం రాబోతోంది. రాక్షసులకు రాజ్యం చేజారి పోబోతోంది. ఐశ్వర్యం పోయేముందు దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ పరమప్రసన్నంగా మాట్లాడుకోవాలి. తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రము మళ్ళీ చిలకడం ప్రారంభించారు. వారికి అమృతం లభించాలి. అమృతం లభించే వరకు క్షీరసాగర మథనం నడుస్తూ ఉండాలి. చాలాసేపు చిలికిన తరవాత అందులోంచి శ్రీమహావిష్ణువు అంశ కలిగిన వాడు, పచ్చని పట్టు వస్త్రమును ధరించిన వాడు, కంబుకంఠుడు, శంఖ చక్ర గదా పద్మములను ధరించిన మహాపురుషుడు క్షీరసాగర మథనం జరుగుతుండగా ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించాడు. ఆయనను ధన్వంతరి అని పిలుస్తారు. ఆయన వైద్యశాస్త్రమున కంతటికీ అధిదేవత. ధన్వంతరి అనుగ్రహం కలగడం చేత శరీరములో ఉండే రోగమును గుర్తించి ఆ రోగము నివారణ కావడానికి కావలసిన మందును వైద్యులు నిర్ణయించి ఔషధమును ఇస్తారు. ఆ ఔషధము నందు ధన్వంతరి అనుగ్రహము ప్రకాశించడం చేత మనకు లోపల ఉన్న శారీరకమయిన రోగం నశిస్తుంది. ఆయన యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు. ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది. ధన్వంతరి స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపమే.

ఇప్పటివరకూ దేవతలు రాక్షసులు క్రమశిక్షణతో చిలుకుతున్నారు. వాళ్ళు దేనికోసం అయితే చిలుకుతున్నారో అటువంటి అమృతపాత్ర వారి ఎదురుగుండా కనపడింది. దేవతలతో కలిసి క్షీరసాగరమును మధించారు కాబట్టి అందులో దేవతలకు కూడా భాగం ఇవ్వవలసి ఉంటుందనే విషయమును రాక్షసులు మరచిపోయారు. ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కుని ఎవరి మటుకు వారు ముందుగా అమృతం తాగేద్దామని ఆ పాత్ర పట్టుకుని సముద్రము ఒడ్డున పరుగులు తీస్తున్నారు. వారిలో వారు బలము కలిగిన వారు ఆ పాత్ర పట్టుకుని పరుగెడుతుండగా వారియందు అమంగళకరమైన కలహం అతిశయించింది. ఐశ్వర్య భ్రష్టత్వమునకు ప్రధాన కారణం కలహం ఏర్పడడం. రాక్షసులు అమృతపాత్రను పట్టుకు పారిపోతుంటే దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. పరమాత్మ మోహినీ రూపమును స్వీకరించాడు. మోహినిని చూసేసరికి రాక్షసులకు స్పృహ తప్పిపోయింది. అమృతపాత్రమీద కోరిక తగ్గింది. తుచ్ఛ కామమునకు జారిపోయారు. వారి కోరిక ఒకటే ‘మనం ఎవరు ఈమెతో బాగా మాట్లాడి ఈమెను వశం చేసుకోగలం’. శ్రీమహావిష్ణువు కేవల శరీరరూపం చేత రాక్షసులను మోహ పెట్టాడు. వాక్కు చేత సత్యమును చెప్తున్నాడు. ‘మీరు ఏదో పాత్ర పట్టుకు వచ్చి అందులో ఉన్నదానిని పంచమని నన్ను అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఒకమాట చెప్పాలని అనిపిస్తోంది. మీకు అర్థం అయితే బాగుపడతారు. చెప్తున్నాను వినండి’ అన్నాడు.

‘తన ధర్మపత్ని యందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు. కానీ కనపడిన ప్రతి స్త్రీయందు అర్థములేని ఒక భావన పెంచుకోవడం చాలా ప్రమాదకరం. మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా మీతో మాట్లాడాలని తలంపు కానీ కలిగిందంటే అది మిమ్మల్ని కాల్చే కార్చిచ్చు అవవచ్చు. గుర్తుపెట్టుకోండి. నా తప్పేమీ లేదు’ అని అన్నది. మోహిని మాటలు వాళ్ళ తలకెక్కవు. ఎందుకు అంటే వాళ్ళు కామమునకు వశులై బలహీనమయిన మనస్సు కలవారై మోసపోవడానికి సిద్ధపడ్డారు. ‘మీరు నన్ను పెద్ద చేసి నా చేతిలో అమృతపాత్ర పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావని కూడా నన్ను అడగలేదు. ఇపుడు నేను ఈ పాత్రనుపట్టుకుని అంతర్ధానం అయిపోతే మీ బ్రతుకులు ఏమయిపోతాయి? మీరు ఎంతో కష్టపడ్డారు’ అన్నది.

రాక్షసులు నిజంగా ఈమె మాటలలోని యధార్థమును గ్రహించిన వారయితే ‘తల్లీ! మేము ఈ పని చేసి ఉండకుండా ఉండవలసింది’ అని కాళ్ళమీద పడి వెంటనే వాళ్ళ మనసు మార్చుకున్నట్లయితే క్షీరసాగరమథన కథ వేరొకలా ఉంటుంది. చాలామంది క్షీరసాగర మథనంలో శ్రీమన్నారాయణుడు మోసం చేసి రాక్షసులకు అమృతమును పంచి ఇవ్వలేదు అంటారు. అది నిజం కాదు. మోహిని మాటలు విన్న తరువాత కూడా రాక్షసులు ‘అమృతమును నీవే మాకు పంచాలి’ అన్నారు. వారి మాటలు విని మోహిని వారినుంచి అమృత పాత్రను తీసుకుంది. ‘చక్కగా స్నానం చేసి ఆచమనం చేసి రండి. రాక్షసులంతా ఒకవైపు దేవతలంతా ఒకవైపు కూర్చోండి. అమృతమును పోస్తాను’ అన్నది. అలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే ఆమె శరీర పృష్ఠ భాగం రాక్షసులకు కనపడుతుంది. వాళ్ళు దానికి తృప్తి పడిపోయేవారు. వీళ్ళల్లో ఎవరికీ అమృతం మీద దృష్టిలేదు. ఆవిడ అంగాంగములమీదే దృష్టి ఉంది. అదే వారి పతనమునకు కారణం. వాళ్ళు అమృతమును పోగొట్టుకుంటున్నారు. తమ మరణమును వారే కొని తెచ్చుకుంటున్నారు. రాక్షసులకు ఉన్న కామ బలహీనత చేత మొత్తము జాతిని గెలిచింది. అప్పటికీ ఇప్పటికీ అంతే. కామమునకు లొంగిపోయే బలహీనతను పెంచుకుంటున్నది కనుక లోకమంతా కామమునకు నశించిపోతోంది. మోహిని దేవతలవైపు పవిత్రంగా కనపడుతుంది. రాక్షసుల వైపు మోహజనకంగా కనపడుతోంది. దీనిని రాహువనే రాక్షసుడు మోహిని తమను మోసం చేస్తున్నదని గ్రహించాడు. ఆయన వెళ్ళి దేవతలవైపు కూర్చున్నాడు. కానీ ప్రవృత్తి చేత రాక్షసుడు. ఆవిడ రాహువు దగ్గరకు వచ్చింది. రాహువు సూర్యచంద్రుల ప్రక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు రాహువును సూచిస్తూ ‘ వాడు రాక్షసుడు. వాడికి అమృతం పోయవద్దు’ అని సైగచేశారు. శ్రీమన్నారాయణుడు దీనిని కనిపెట్టాడు. రాహువు రాక్షసుడయినా మోహినీ రూపంలోని శ్రీమహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తినుంచి లేవమని అనలేదు. ఇపుడు రాహువు అమృతము త్రాగాడు. అతడు త్రాగిన అమృతము క్రిందికి దిగిందంటే రాక్షసశరీరము అమృతత్వమును పొందుతుంది. అతనికి రాక్షస ప్రవృత్తి. వెంటనే సుదర్శనమును ప్రయోగించి కుత్తుక కోసేశాడు. పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. అమృతంతో కూడినందు వల్ల తల నిర్జీవం కాలేదు. మొండెం మాత్రం క్రిందపడిపోయింది. పంక్తియందు కూర్చున్న వాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం. శిరస్సు అమృతం త్రాగిందని బ్రహ్మగారు నవగ్రహములలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య చంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు.

తదనంతరము మోహిని వరుసగా దేవతలకు అమృతం పోసి రాక్షసుల వైపు తిరిగి అమృతం అయిపోయినట్లుగా కుండ తిప్పి చూపించింది. అపుడు రాక్షసులు దేవతలతో యుద్ధం మొదలు పెట్టారు. మోహినీ స్వరూపం అంతర్ధానం అయిపోయింది. ఈవిధంగా దేవతలు అమృతం పొందారు. చాలారోజులు యుద్ధం జరిగింది. అందులో ‘నముచి’ అని ఒకడు బయల్దేరాడు. వాడు దేవేంద్రునితో బ్రహ్మాండమయిన యుద్ధం చేశాడు. దేవేంద్రుడు వాని పరాక్రమం చూసి ఆశ్చర్యపోయి ‘వీడు ఎలా చనిపోతాడు?’ అని అడిగాడు. ‘వాడు తడిలేని పొడిలేని వస్తువుతో మాత్రమే తాను చనిపోయేలా వరం అడిగాడు. అందుకని వారిని తడి పొడి లేని వస్తువుతో కొట్టు’ అన్నారు. ఇంద్రుడు తన వజ్రాయుధమును సముద్రపు నురుగులోకి తీసుకు వెళ్ళి అటూ ఇటూ తిప్పాడు. నురుగు తడి పదార్ధం కాదు పొడి పదార్ధం కాదు. అలా ప్రయోగించేసరికి నముచి చచ్చిపోయాడు. దీనిని ఒక కథగా కాకుండా అంతకు మించి ఇందులో తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కష్టం వచ్చినపుడు దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుని ప్రార్థన చేయడం అనేది ఈ జాతి సొత్తు. క్షీరసాగరము అనేది ఒక పాలకుండ. అది మన హృదయమందే ఉన్నది. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. పాలకుండను విడిచిపెట్టి లోకము చుట్టూ తిరుగడము చేత అశాంతి ఉన్నది. ఏది శాంతిని ఇస్తుందో దానిని పట్టుకుంటే శాంతిని ఇస్తుంది. మనస్సు శాంతిగా ఉండాలంటే శాంతికరమైన పదార్ధమును పట్టుకోవాలి. మనలో ఉన్నది పట్టుకోవడం బయట తిరగడం వలన సాధ్యం కాదు. బయటకు వెళ్ళడం కాదు. లోపలికి వెళ్ళాలి. మనకెప్పుడూ బయటకు వెళ్ళడమే తెలుసు కానీ లోపలికి వెళ్ళడం తెలియదు. లోపలికి వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేయలేదు. అలా ప్రయత్నం చేయడమే క్షీరసాగర మథనం. పాలసముద్రంలో మంధర పర్వతమును దింపడం అంటే ధ్యానంలో మన మనస్సును తీసుకు వెళ్ళి స్వామి దగ్గర పెట్టడం అన్నమాట. ధ్యానమునందు నిష్ఠ కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి. లేకపోతే మనస్సు మంధర పర్వతం ఊగినట్లే ఊగుతుంది. కంగారుపడిపోకూడదు. మళ్ళీ దానిని వెనకకి తీసుకురావాలి. స్వామీ! నా ధ్యానము బాగా కుదిరేటట్లు చూడని ప్రార్థన చేయాలి. తొట్రుపడితే భగవంతుడినే ప్రార్థించారు. ఆయన ఆదికూర్మమయ్యాడు. ఆయనే ఆధారం అయాడు. అలాగే ధ్యానంలో చెదిరిన నీ మనస్సును కుదర్చడానికి స్వామి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. ఇదే మంధర పర్వతమును దింపి క్షీర సాగరమథనం చేయడము. అలా ధ్యానం చేయగా చేయగా ముందు ప్రశాంతత కలుగుతుంది.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది

 శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖరదర్శనం చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి. అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు. 


కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరటానికి కారడవిలో, కాలి నడకన ప్రయాణించవలసి వచ్చేది. కొంతదూరం నడిచాక అప్పటికే అలసి సోలసిన కొందరు భక్తులు ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయలేని స్థితిలో ఏదోవిధంగా ఈ కొండ శిఖరం (శిఖరేశ్వరం) కనబడేవరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణమయ్యేవారు. ఎంత దూరం నుంచి అయినా యీ శిఖరాన్ని చూస్తే గత జన్మల సంచిత పాపం సర్వమూ నశించి జనన మరణరూప సంసారచక్రం నుండి ముక్తి లభిస్తుందని పురాణాలు ఏకకంఠంతో చెబుతున్నాయి. కాలక్రమంలో ఈ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని, అలా ఆలయ శిఖరం కనబడితే 6 నెలలలో మరణిస్తారని ఒక నానుడి ప్రజలలో నాటుకుపోయింది. ఈ విషయంలో సాహిత్యపరమైన ఆధారాలు ఏవీ లేకున్నా, ఆలయ శిఖరం స్పష్టంగా కనబడింది అని చెప్పిన వ్యక్తులు 6 నెలలలోపే దివంగతులవటం ఈ భావనకు బలాన్ని చేకూరుస్తుంది. కాగా, 6 నెలలలోపు ప్రాణాలను కోల్పోయే వారి కంటిచూపు అంత దూరంలో గలదాన్ని స్పష్టంగా కనబరుస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. 


శ్రీశైల ప్రధానాలయమైన శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న యీ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. ఈ శిఖరేశ్వరంలో కొలువు తీరిన 'వీరశంకరుడు' కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ వీరశంకరుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డాడో, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇతమిత్థంగా చెప్పే ఆధారాలు నేటి వరకూ లభ్యం కాలేదు. కాని ఆలయం ఎదురుగా ఉన్న సా.శ. 1398  (శా.శ 1320) పార్థివ నామ సంవత్సర చైత్ర బహుళ దశమి బుధవారం నాటి ఈ దిగువ శాసనాన్ని బట్టి అప్పటికే యీ శిఖర పైభాగానికి భక్తులు తండోపతండాలుగా వెళ్ళే ఆచారం ఉన్నట్లు దృఢంగా తెలుస్తోంది.


సోపాన నిర్మాణం..


ప్రోలయవేమారెడ్డి రాజ్యానికి శ్రీశైలం పడమరసరిహద్దుగా ఉన్నపుడు ఈ ప్రాంతం మీద అధిపత్యానికి రెడ్లకు, విజయనగర రాజులకు, రాచకొంద వెలమ దొరలకు తరచుగా యుద్ధాలు జరుగుతుండేవి. యుద్ధాలు జరుగునపుడు సైనికులు లేదా శ్రీశైలము చేరాలనుకొనే భక్తులకు గాని సరియన ప్రయాణ మార్గము లేదని ప్రోలయ మార్గ నిర్మాణానికి కొంతవరకూ కృషి చేసాడు. అదే పనిగా శిఖర దర్శనానికి ఇబ్బంది పడుతున్న భక్తులను చూసి దానికి సోపానాలు నిర్మించాలని మంత్రి రామయదేవునికి ఆదేశాలిచ్చాడు.


సోపాన నిర్మాణ ఇదేకాలంలో జరిగినది అని చెప్పే శాసనము ఏదీ లభ్యం కాకున్నా కొంత సమాచారం మాత్రం ప్రాచీన శాసనమైన చీమకుర్తి (క్రీ, శ,1335) సాసనంలో లభిస్తుంది.


అలా చెప్పబడిన విషయాన్ని బట్టి ఇవి క్రీ, శ, 1326-1335 మధ్య నిర్మించబడినాయని చెపుతారు. చీమకుర్తి శాసనం తెలుగు భాగంలో


 క్రీ.శ. 1343 నాటి మరొక శాసనం అయిన ముట్లూరి శాసనంలో ఇలా చెప్పబడింది.

రుద్రపశుపతి నాయనారు

 Sri Siva Maha Puranam -- 5 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


రుద్రపశుపతి నాయనారు


అరువదిమంది నాయనార్లలో రుద్రపశుపతి నాయనారు ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణ చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్రపశుపతి నాయనారుకి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజూ కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో

‘యుధాయ చ సుధన్వనే చ నమ స్రుత్యాయ చ పథ్యా య చ నమః కాట్యాయ చ నీ ప్యాయ చ నమ స్సూద్యాయ చ సరస్యాయ చ నమో నా ద్యాయ చ వై శన్తాయ చ || నమః కూప్యాయ చావ ట్యాయ చ నమో వష్యా౯ య చావష్యా౯ య చ నమోమే ఘ్యాయ చ విద్యు త్యాయ చ నమ ఈద్ద్రియాయ చాతప్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ || ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా నీరు, నీటిమీద నురుగు, చెట్టు, చెట్టు మీద పిట్ట చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నాయనారు తిరుమలయార్ ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని వీటన్నింటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను’ అన్నాడు.

ఒకరోజున తెల్లవారుఝామున ఎవ్వరికీ చెప్పకుండా ఊరిబయటకు వెళ్ళి అక్కడ గల కొండమీద నుంచి ఒక సెలయేరు జాలువారుతున్న సెలయేట్లో నడుంలోతు నీళ్ళలో నిలబడ్డాడు. చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగలించుకున్న అనుభూతిని పొందారు. ఇవన్నీ ఈశ్వరుడు కదా! నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని నమః ఫేన్యాయచ నమస్సికత్యాయ చ ప్రవా హ్యాయ చ’ అని పారాయణ చేసి బయటకి రాలేక రాలేక వచ్చేవాడు. ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరల మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్ళలో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతివస్తువులో శివరూపమును చూసేవాడు. సాయంత్రం కూడా అదేనీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రానురాను ఆయనకు ఎవరు కనపడినా ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి దొంగ కనపడితే ‘నమః చోరాయచ’ అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. శంకరుడు ఇక నేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోకే తీసుకోవాలి అని నాయనారుని తనలోకి తీసుకున్నాడు. నాయనారు శివునిలో ఏకమయి పోయి తాను శివుడు అయిపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాయనారు భావనచేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాము.

శం – భావయతి – మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖ స్వరూపమయిన శివునియందు కలిసి శివుడు అవుతారు. అటువంటి స్థితి కలగడం కోసమే మహానుభావుడయిన పరమాత్మ ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం కటాక్షిస్తుంది. ‘శంభుః’ అన్న నామం, పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు ఉద్ధరణ కలుగుతుంది.

‘జ్ఞానదాతా మహేశ్వరః’ ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభునామమును గట్టిగా పట్టుకుని ఆ నామముతో పిలిస్తే, ఆయన భావములను మార్చి మనసుని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. సత్ప్రవర్తన కల్పిస్తాడు. చక్కని వ్యక్తిగా రూపు దిద్దుతాడు. ప్రతిరోజూ శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహమును పొందాలి. ‘శం’ – ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని అనుకుంటున్నారో అన్ని సుఖములను ఇవ్వడమును కామకోటని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి, పుణ్యమును ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తి ఇచ్చి, మరల తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ అమ్మవారి చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టుమీద నిలబడతారో దానికి తగినట్లుగా నిలబెట్టడానికి ఈ నామములు, ఈశ్వరానుగ్రహము రక్షిస్తాయి. రుద్రపశుపతి నాయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 58 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


మళ్ళీ పాలసముద్రమును చిలకడం మొదలుపెట్టారు. అందులోంచి ఒక తెల్లటి గుఱ్ఱము ఒకటి బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అంటారు. ఈ గుఱ్ఱమును చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకిమ్మనమని అడిగాడు. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. పాల సముద్రంలోంచి బ్రహ్మాండమయిన కల్పవృక్షం వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి అయిదవతనం తరగదు. దానిమీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేసిన వారికి ఫలముల రూపంలో కోర్కెలు తీరుస్తుంది. ఈ కల్పవృక్షమును ముందు ఇంద్రునికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై, దేవ నర్తకీమణులై ఉండిపోయారు. పాల సముద్రమును ఇంకా చిలకడం మొదలు పెట్టారు. లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగబోతోంది. ఆమె శుక్రవారం పంచమినాడు పుట్టింది.

పచ్చటికాంతితో, తెల్లటి వస్త్రములు కట్టుకుని ‘పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే’ అని నల్లనికన్నులతో, సొగసయిన చూపులతో, మాతృ వాత్సల్యంతో అందరివంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకూ దరిద్రములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావఘట్టం వింటున్న వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశిస్తుంది. ఇది పరమయధార్థం. పుడుతూనే ఆ తల్లి యౌవనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాసభాగవతంలో లేదు. కానీ దేవీ భాగవతంలో ఉన్నది. దానికి పెద్దలు ఒకమాట చెపుతారు. ఈ స్తోత్రమును చెయ్యడానికి కొన్నిరోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసికానీ, తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలమును శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లనిచీర కట్టుకుంది. పచ్చటిముఖంతో, బంగారురంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లనిజుట్టు కలిగి ఉంది. కబరీబంధం చుట్టూ చక్కటి మల్లెపువ్వులు, సంపంగి పువ్వులు, జాజిపువ్వులు, అలంకరించుకుని ఉన్నది. మెడనిండా హారములు వేసుకుని ఉన్నది. వరదముద్రపట్టి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తున్నది. రెండు పాదములను కలిపి పద్మాసనం వేసుకుని ఉన్నది.

నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః |

కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః ||

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః |

పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః ||

సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః |

హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాతత్యై చ నమోనమః ||

కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః |

చ౦ద్రశోభా స్వరూపాయై రత్న పద్మే చ శోభనే ||

స౦పత్త్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమోనమః |

నమో వృద్ధి స్వరూపాయై వృద్ధిదాయ్యై నమోనమః ||

యథా మాతా స్తనాధానా౦ శిశూనా౦ శైశవే సదా |

తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః ||

(శ్రీదేవీ భాగవతం – 9వ స్కంధము)

పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా విన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈలోకము నందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కులేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా! ఆనాడు బిడ్డడయినందుకు అమ్మ పాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకములకు తల్లివయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును ఇచ్చి కాపాడు’ అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది.

అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు. ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు అనుభవైకవేద్యము. పరమాత్మ శక్తితో కూడినవాడై అనుగ్రహిస్తాడు. ప్రక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు ? ఎక్కడ పుట్టిందో అక్కడివాడు తండ్రి అవుతాడు. ఇపుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజూ ‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం’ అని పిలుస్తూ ఉన్న అమ్మవారికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళస్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. దేవేంద్రుడు ఒక మణిమయ పీఠమును తెచ్చి అక్కడ పెట్టాడు. ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళస్నానం చేయడానికి దానిమీద కూర్చుంది. అమ్మవారు స్నానం చేయడానికి నీళ్ళు తీసుకు రావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలాకాలంనుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి, దానిలోకి పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి. పల్లవములను భూదేవి తెచ్చి ఇచ్చింది. గోవులు పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నానక్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రములు చెప్తూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. మహర్షులు వేద మంత్రములను చదువుతున్నారు. మంగళధ్వనులు జరగాలి. లక్ష్మీ దేవి మంగళస్నానానికి మేఘములు మంగళ ధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమసంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళస్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు.

అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆ రోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో బాటు ఒక రవికల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలి లేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితుడయిన స్నేహితుడు ఉంటాడు. ఆయనను ‘సుహృత్’ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. సముద్రుడు తండ్రి అయితే సముద్రములో ఉన్న వరుణుడే సుహృత్. సుహృత్ అమ్మవారు వేసుకుందుకు వైజయంతీ మాలను ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు హారములు నగలు వీటినన్నిటిని ఒక దంతపుపెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీ దేవి ఒక మంచి తారహారమును ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామరపువ్వును ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీఃపూర్వకమయిన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయము చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ ‘అమ్మా! లక్ష్మీ నీవు ఎల్ల లోకములకు ఏలిక రాణివై పరిపాలించెదవు గాక! అని ఆశీర్వచనం చేశారు. ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. దండ పట్టుకుని ఎవరి మెడలో వేయాలి అని బయలుదేరుతున్నది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్నెపిల్లలకు మంచి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తునకంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటివాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామరపువ్వుల వంటి కన్నులున్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే వారు దరిద్రులయిపోయారు. వాళ్లకి అమృతం పోయింది. సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతాడు. మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకి ఎంత అమూల్యమయిన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇపుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో ఉన్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సమనే పుట్టుమచ్చ మెరుస్తున్నది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ -

 శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ -

🙏


 చెన్నై - కంచి


ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..


నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంభకోణం నుండి చెన్నైకు తిరుగుప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కొసం అక్కడికి వెళ్ళాము. మా బంధువుల ఇళ్ళకు వెళ్ళాము మరియు కుంభకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో భాగమే. 


మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేది ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరముగా పేరుగాంచిన కుంభకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ.


మేము కుంభేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు శ్రీఒప్పిలిఅప్పన్ ఆలయాలు దర్శించాము. ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించటం మా ప్రణాళిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకొన్నాను. తిరుగుప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను. 


ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో,  "నా వద్దకు రండి" అని చెప్పారు. నేను మధ్యలోనే నిద్రలేచి సమయము చుస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు స్వామి వారు నిద్రలో చెప్పిన దానిగురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను భార్యను నిద్ర లేపి, సామాను సర్దుకొని తయారు అవ్వమన్నాను. ఎనిమిది గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి. అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికి విడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము. 


కారులో కూర్చున్న తరువాత నా భార్యతో, చెన్నైకి వెళ్ళేముందు కంచి వెళ్ళి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరునిమిషములో మా ప్రణాళికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతములో టికెట్ కౌంటరుకి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడుగగా, 8:30కి ఉంది అని చెప్పారు. 


మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠంను సందర్శించాము. అక్కడకు వెళ్లగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింతకలిగింది. అక్కడ చాల ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. ఒక గంటసేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము. 


మేము ఇంటికి వెళ్ళాక T.V చూస్తే ఒక వార్తవిని చాలా ఆర్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి, దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన. 


కానీ నాకు ఇప్పటికి అర్థం కాని విషయం “హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నాము?” అని. ఆనాటినుండి నేను మహాస్వామి వారికి లొంగిపొయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చెసాను. ఈరోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాద పద్మములు చూసి నమస్కరించడం. 


--- మూలం : స్వస్తిక్ టివి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

🙏

సత్యంతోనే

 శ్లోకం:☝️

*సత్యమేవేశ్వరో లోకే*

  *సత్యం పద్మాశ్రితా సదా l*

*సత్యమూలాని సర్వాణి*

  *సత్యాన్నాస్తి పరం పదం ll*

  - వాల్మీకి రామాయణం 


భావం: సత్యంతోనే భగవంతుడు పొందబడతాడు. సత్యం వలన అన్ని సంపదలు లభిస్తాయి. సత్యం అన్ని సుఖాలకు మూలం. సత్యం కంటే పొందవలసినది మరేమీ లేదు.

_అసత్యం వాస్తవికతని మారుస్తుంది లేక వక్రీకరిస్తుంది._ _False distorts the reality._

భద్రాద్రిరామ రక్ష - వేదవ్యాస మహర్షి*

 *ॐ  భద్రాద్రిరామ రక్ష - వేదవ్యాస మహర్షి* 


*రామస్తామరసేక్షణోజలధరశ్యామః* 

                       *కుమార్యా భువ* 

*స్సంయుక్తః, పరమానురక్త మనసా*  

              *సౌమిత్రిణా సంయుతః I* 

*అక్షాది ప్రతిపక్ష వృక్ష విచరాధ్యక్షే* 

                              *సమీక్షారతః*

*శంఖారీషు శరాసనో2వతునో*

                  *భద్రాద్రి మూర్థ్నిస్థితః ॥* 

*భావం:--*

*1.తామర రేకులవంటి బహు సుందరములైన నేత్రములు గలవాడు,* 

*2.వర్షాకాలపునీలమేఘఛాయ వంటి శరీర సౌభాగ్యం కలవాడు,* 

*3. 'భూపుత్రియగు సీతాదేవి'తో కూడియున్నవాడు,* 

*4. 'సుమిత్ర తనయుడూ'--పరమ ప్రేమానూరాగములు తొణికిసలాడు  'లక్ష్మణుని'తో సేవలందుకొనువాడు,* 

*5.అక్షకుమారాది ప్రతిపక్ష వీరప్రాణహరణ దక్షుడు--అంజనాగర్భ శుక్తిముక్తాఫలమగు ఆంజనేయునిపై నిరంతరమూ అవ్యాజానుగ్రహము చూపువాడు,* 

*6.శంఖ చక్ర ధనుర్బాణాలతో విరాజిల్లుతూ,* 

*7.భద్రాద్రి శిఖరంపై ఆసీనుడైయున్న 'శ్రీరాముడు' మనలను రక్షించుచుండుగాక!*