🌹🌹🌹🌷🌷🌹🌹🌹(నాకు నచ్చిన శశికళ ఓలేటి గారి కథ)
🌷 *ఉగాదికథ* 🌷 ( *ఉమ్మడికుటుంబంలో ఉగాది*)
🌷🌷🌷
మాఘమాసంలో మంచి ముహుర్తాన మాధవ్ ని పెళ్ళిచేసుకుని ఉమ్మడి కుటుంబంలోకి కాపురాని కొచ్చింది అనూ! ఉమ్మడికుటుంబంలోకి పిల్లనివ్వడానికి ససేమిరా అంది అనూ వాళ్ళమ్మ! అయితే మంచి ఐశ్వర్యవంతుల సంబంధం, అల్లుడిది పెద్ద చదువు, స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగం, లాంఛనాలు కూడా అక్కరలేదని ఖచ్చితంగా చెప్పేసిన వియ్యంకుడు... ఇంకేం కావాలి పిల్లపెళ్ళికి... అని భార్యను ఒక్క కసురు కసిరి...అనూని మాధవ్ కిచ్చి ఘనంగా పెళ్ళిచేసి పంపేసాడు అనూ నాన్నగారు!
“అరచేతిలో పెట్టుకుని పెంచానే నిన్ను. ఏవిటో హైదరాబాదు వట్టిపోయినట్టు ఎక్కడో తూర్పు సంబంధం తెచ్చారు మీనాన్న, పైగా ఐదుగురు అన్నలు, ముగ్గరు అప్పగార్లు! ఏవిటో ఆరోజుల్లో అలా కనేసేవారు!" అంటూ ఆందోళన వ్యక్తం చేసింది వాళ్ళమ్మ!
“ అమ్మా! అది ఉమ్మడి కుటుంబం అయినా, అందరూ ఎవరిళ్ళలో వారు ఉంటారట. చక్కగా అన్ని సౌకర్యాలతో కట్టారట అందరి ఇళ్ళు. నేను చదువుకోడానికి యూనివర్సిటీ ఉంది. నేను చిన్నప్పటినుండీ కలలుగన్న సాగరతీరం ఉంది. మాధవ్ నా కొంగుచివర ఉన్నాడు! హాయిగానే ఉంటానులేమ్మా!” అంది అనూ!
“ అనూ! ఓ అందరితో పులుమేసుకోకు! చాకిరీ అంత నీ మీద పడిపోతుంది. ఆ పిల్లమూకను ఇళ్ళల్లోకి రానీకు. జళ్లు వెయ్యమని, ముస్తాబులు చెయ్యమని తయారవుతారు! నీ వాటాలో... అంటీ ముట్టనట్టు ఉంటేనే బెటర్. ఎలాగూ కొన్నాళ్ళలో మాధవ్ క్వార్టర్స్ కు మారిపోతాడు! అప్పుడప్పుడు కిందకు దిగి మీ అత్తమామలకు కనిపించు చాలు” అంటూ అమ్మప్రేమలో... కాస్త గోరోజనం కలిపి నూరిపోసింది కూతురికి... ఆ తరవాత కూతుర్ని కాపురానికి పంపి... అలా కోడలి పురిటికి అమెరికా విమానం ఎక్కేసింది అనూ అమ్మ!
హనీమూన్, యూనివర్సిటీ అడ్మిషన్లు, కొత్తగా చేతులు కాల్చుకునే క్రమంలో అనూ... మాధవ్ కుటుంబసభ్యులను ఎవర్నీ ఎక్కువ కలవలేదు. అప్పుడప్పుడు లిఫ్ట్ లో కనిపించే తనీడు అమ్మాయిలు “హాయ్ పిన్నీ”, హాయ్ అత్తా!” అని పలకరిస్తే... మొహమాటంగా నవ్వేది తప్పా.. స్నేహహస్తం చాపలేదు! ఎనిమిదేళ్ళ లోపు పిల్లలు కొందరు వీళ్ళ వాటా ముందు నిలబడి... లోపలికి ఆసక్తిగా తొంగిచూస్తూ... ఈ కొత్తపిన్ని సామ్రాజ్యాన్ని పరికాయించాలని ప్రయత్నించేవారు...కానీ ఈ పిన్ని నుండి స్వాగతవచనాలు దొరకక.. మొహం చిన్నబుచ్చుకుని పారిపోయేవారు! పాపం అనూ మంచిపిల్లే. కానీ వాళ్ళమ్మ ఇచ్చిన ఓవర్ డోస్ వలన, అత్తిపత్తిలా ముడుచుకుపోతోంది. భారతీయ కుటుంబాలలో మనుషుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేవి పండుగలే కదా! సంవత్సరంలో మొదటి పండుగ రానే వచ్చింది!
కొత్త అమావాస్యనాడు...అత్తగారు కోడళ్ళందరినీ కిందకు పిలిచి... కొత్తపట్టుచీరల నిచ్చారు. అప్పుడు చూసింది తోడికోడళ్ళను అనూ దగ్గరగా. ఒక్కక్కరూ...దబ్బపండు రంగులో... చక్కని రంగుల్లో ఉప్పాడపట్టుచీరలు కట్టుకుని... చేతులనిండా బంగారుగాజులు, మట్టిగాజులు వేసుకుని... మెడల్లో అందమైన సున్నితమైన నగలు పెట్టుకుని... ఎంతో సాంప్రదాయంగా, సంస్కారవంతంగా కనిపించారు. ఒక్కక్కరూ వచ్చి..తమ పేర్లు చెప్పుకుని పలకరించారు! వాళ్ళు మాట్లాడుతుంటే... అనూలో పేరుకుపోయిన ఒంటరితనం , బిడియం...దూరమవుతోంది!
గారెలూ, బూరెలూ చేయించారు అత్తగారు. ఇంటి చాకలమ్మ పోలమ్మ వచ్చింది. కొత్తకోడలి చేత... చాకలమ్మ కాళ్లకు పసుపురాయించి.. బొట్టూ, గంధాలనిచ్చి... చాకలమ్మకు కొత్తచీర, పైన బుట్టలో ఇరవై ఒకటి చొప్పున గారెలు, బూరెలూ , అరటిపళ్ళు పెట్టి వాయనం ఇప్పించారు. కడుపుచలవ కోసం కోడళ్ళంతా చాకలమ్మకు మొక్కి, అక్షంతలు వేయించుకున్నారు! ఆమెకిచ్చిన చాకలి కట్నం, బియ్యం, పప్పులు, పలారాలు, కూరగాయలు తీసుకుని పోలమ్మ వెళ్ళిపోయింది!
విశాలమైన దేవుడిగదిలో, అత్తగారూ, కోడళ్ళు... లలితాసహస్రనామాలు చదువుతూ...శ్రీచక్రార్చన, అమ్మవారికి కుంకుమపూజ చేసారు! అనకాపల్లి గ్రామదేవత నూకాంబికకు ముడుపులు పంపించారు! రెండుకార్లలో బయలుదేరి శ్రీకనక మహాలక్ష్మి దర్శనం చేసుకుని తిరిగివచ్చారు. ఆరోజు మధ్యాహ్నం .... అత్తగారింట్లో.... కుటుంబసభ్యులంతా ... చక్కగా కింద వరుసలుగా కూర్చుని, అరటాకులలో షడ్రసాపేతంగా పంక్తిభోజనాలు చేసారు!
పుట్టింట్లో తనూ, అన్నగారూ తప్ప మరెవరూ లేక ఒంటెద్దుగా పెరిగిన అనూకు ఈ సందదంతా గమ్మత్తుగా అనిపించింది. అందరూ ఎలాంటి అరమరికలూ లేకుండా, ఒక్కటిగా, ఒక్కొక్క అధరువు రుచులు చర్చించుకుంటూ...హాస్య
సంభాషణలతో...భోజనం చెయ్యడం... ఎంతో నచ్చింది! మొట్టమొదటిసారిగా, ఆ ఇంట్లో పిల్లలందరినీ పరికించి చూసింది. వాళ్ళందరూ చాలా చనువుగా... ఎప్పటినుండో ఎరిగిన వారిలా, పిన్నీ పిన్నీ అంటూ తన చుట్టూ తిరుగుతుంటే, భలే సరదా వేసింది! వారందరితో మెల్లగా మాటలు కలపడమేంటి అల్లుకుపోయారు అందరూ! మాధవ్, అతని అన్నగార్లూ... పిల్లందరితో పాటూ అనూకి కూడా డబ్బులిచ్చి కావలసినది కొనుక్కోమన్నారు!
సాయంత్రం పిల్లలూ, మగవారితో పాటూ అనూ కూడా ఇల్లంతా మామిడి తోరణాలూ, మల్లెపూల దండలతో అలంకరించారు! పనివారికి సెలవు ఆరోజు. అందరూ అనకాపల్లి నూకాలమ్మ సంబరాలకు వెళ్ళిపోతారు. వేటలేసుకుని, అక్కడే వంటలొండుకుని, అమ్మవారికి మొక్కులు తీర్చుకుని ఏ పొద్దుపోయాకో ఊళ్ళకు మళ్ళుతారువీరంతా!
అనూ వయసున్న హిమ, సుమ.. ఇద్దరూ ఇంజినీరింగ్ పూర్తిచేసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు! సాయంత్రం వారిద్దరూ అనూని లాక్కుపోయి, విశాలమైన వీధివాకిట్లో కల్లాపుచల్లి, రంగురంగుల రంగవల్లులు తీర్చారు. హైదరాబాద్ లో తన తల్లికి అలెర్జీలు ఉండడం వలన ఈ రంగులూ, ముగ్గులూ పడేవికాదు. అయితే అనూ... సరదాతో... పక్కనే ఉన్న మార్వాడీల దగ్గర రంగోలీలు, మెహెందీ డిజైన్స్ బాగా నేర్చుకుంది. చిన్నపిల్లలంతా... నాకంటే నాకంటూ... చేతులు చాచి... అనూతో మెహందీలు పెట్టించుకున్నారు! ఇన్నాళ్ళూ అంటీముట్టనట్టున్న తన భార్య మెల్లగా అందరితో కలవడం చూసి... మాధవ్ వూపిరి పీల్చుకున్నాడు.
ఆ రాత్రి తోడికోడళ్ళంతా, అత్తగారితో చర్చించి, ఉగాదికి ఒక్కక్కరూ ఏఏ పిండివంటలు చెయ్యాలో నిర్ణయించుకున్నారు. పులిహార, పెరుగువడలు, చక్రపొంగలి, వామాకుబజ్జీలు, గులాబ్ జామ్, వంకాయ కారం పెట్టిన కూర, పనసపొట్టుకూర, చామదుంపల వేపుడు, ముద్దపప్పు, ముక్కల పులుసు, గోంగూరపచ్చడి, కొత్తావకాయ, కొబ్బరిమామిడి పచ్చడి, అంటూ ఐదుగురూ పంచేసుకున్నారు. అనూకి గాభరాగా ఉంది. అతికష్టం మీద తమిద్దరికీ వంటచేస్తోంది, అదీ మాధవ్ సాయంతో! ఇప్పుడు ఇంత మందికి తనేం చెయ్యాలా, అని మధనపడుతోంది. అత్తగారు అనూకి అభయహస్తం ఇచ్చేసారు... ఏమీ చెయ్యక్కరలేదు. మర్నాడు తనతో కూర్చుని ఉగాదిపచ్చడి, బొబ్బట్లు చేద్దువుగాని అని!
ఉగాది! తెలుగువారి ప్రత్యేక దినమది! నిశీధి నచ్చని కోయిలలు...అరుణోదయానే..నిషాదంలో... వసంతఘోష మొదలుపెట్టాయి! అనూ మనసు నిండా నూతనోత్సాహం! ఆ నిషాంత ఉషస్సులలో, తేలివస్తున్న భక్తిస్తోత్రాలు...శ్రోత్రానందంగా మనసుకు శాంతి కూరుస్తున్నాయి! శ్వేతపుష్పరంజిత, నింబవృక్షాల వగరుగాలులు, పూతలపిందెల మావిడి సువాసనలను కలుపుకుని... ఊర్పులకు జీవాన్ని తోడిపోస్తున్నాయి! ఎటుచూసినా ఉత్సవమే! కుసుమాకరమే!
దూరాన గిరులన్నీ దిరిశెన, పున్నాగ, పొగడ, మామిడి, మంకెన, మోదుగ, తంగేడుల పూలశాలువాలు కప్పుకుని కొత్తసంవత్సర భాగ్యఫలాలు చెప్తున్న పండితోత్తములలా ఉన్నాయి.
నిసర్గసుందరి తన మేనిని పూలతో సింగారించుకొని నిత్యసంతోషిణిలా వెలుగులీనుతోంది!
తోటంతా విరబూసిన పుష్పసౌరభాలతో... గాలి గంధవాహనమౌతోంది!విరితేనెల వేటలో మధుపాలు సుమబాలలతో సాగిస్తున్న మురిపాలు, ఆ మధుమాసవేళ తన మాధవుని సమక్షంలో ఆ కొత్తపెళ్ళి కూతురి మనసు నవనవోన్మేష మయింది! ఒక్కసారి జీవితంలో నాగరికత తెచ్చిన బద్దకం, స్థబ్దతంతా పటాపంచలయిపోయింది! తలారా అభ్యంగన స్నానం చేసి...కొత్తచీర , నగలతో సింగారించుకుని...దీపారాధన చేసి... క్రిందకు దిగింది అనూ!
అత్తగారి సాయంతో పెద్ద వెండిగిన్నె నిండుగా, షడ్రుచులతో...ఉగాదిపచ్చడి చేసింది. పూజలో కూర్చున్న మామగారికి అందించింది... దైవానికి నివేదన చెయ్యడానికి.
అప్పటికే అత్తగారు స్టవ్ క్రిందకు చేర్చి బొబ్బట్లు మొదలుపెట్టారు! అనూ మొదటిసారి చూస్తోంది బొబ్బట్టు తయారీ! అనూని, హిమనూ పెద్ద నిమ్మకాయలంత పూర్ణపు ఉండలు చెయ్యమన్నారు. తోటలోంచి కోయించిన అరిటాకులపై, రాత్రే నూనెలో తడిపిపెట్టుకున్న మైదాపిండి లోంచి చిన్న ముద్దను తీసి, ఆకు మీద పరిచి.... లోపల శెనగపప్పు, ఏలకులూ, బెల్లంతో చేసిన పూర్ణం పెట్టి... మూసి.... ఆకు మీద వేళ్ళను నేర్పుగా కదుపుతూ... తడుతూ... పాముతూ... నిమిషంలో పల్చని బొబ్టట్టు దుక్కలాంటి పెనం మీదకు చేర్చారు! సన్నని మంట మీద కాలుస్తూ, రెండుగంటల్లో వంద బొబ్బట్లు
పూర్తయ్యాయి. ఘుమఘుమలాడుతూ. కాగితం పొరల్లా... పల్చగా... నేతితో కాల్చిన బొబ్బట్లను చూసి అనూకి నోరూరిపోతోంది! నైవేధ్యం అవ్వడమేంటి .... వేడిబొబ్బట్ల మీద నెయ్యేసి, అనూతోపాటూ అప్పటికే కాచిపెట్టుకున్న పిల్లలందరికీ ఆకుల్లో బొబ్బట్లు, అరటిదొప్ప గిన్నెల్లో ఉగాదిపచ్చడీ ఆరగింపుకు పెట్టేసారు.
ఇంటిల్లిపాదీ... క్రిందకు దిగి... ఇంటి పెద్దలకు పాదనమస్కారం చేసుకున్నారు! ఇంతలో ఇంటి ఆడపడుచులు ముగ్గురూ ముగురమ్మల్లా కుటుంబాలతో కార్లలోండి దిగారు... కన్నతల్లి కడుపునింపేస్తూ! అక్కచెల్లెళ్ళను పలకరిస్తూ, బావగార్లతో మేలమాడుతూ, హాస్యోక్తులతో, ఛలోక్తులతో వాతావరణమంతా విద్యున్మయం అయిపోయింది.
మామగారు ఇంటి ఆడువారికందరికీ....కొత్తబట్టలతో పాటూ రెండేసి తులాల బంగారం ఇచ్చి అక్షింతలేసి దీవించారు. అందరూ పులిహారా, బొబ్బట్లు ఫలహారం చేసి... కబుర్లలో పడ్డారు. అత్తగారు, పెద్దాడపడుచూ మరో వంద బొబ్బట్లు చెయ్యడానికి కూర్చున్నారు!
పిల్లలూ, అనూ ఇరుగుపొరుగులకు మిఠాయిలు, కొత్త గంటలపంచాగం, సింహాద్రి అప్పన్న పటాలూ పంచారు. ప్రతీయింట్లో ఫలానావారి కొత్తకోడలంటూ... అనూని తెగ ముద్దుచేసారు అందరూ! తిరిగి ఇంటికొచ్చేసరికి బ్రాహ్మణులకు నూతనవస్త్రాలు, స్వయంపాకం, వెయ్యినూటపదహార్ల దక్షిణ పెట్టి ఇచ్చి.... ఇంటిల్లిపాదికీ ఆశీర్వచనం చెప్పించారు మావగారు! ఆ రోజు ఇంటికి భిక్షానికొచ్చిన ఎవరికీ లేదనకుండా దానాలు చేసారు!
ఇళ్ళు విశాలమైనా, ఇరుకు మనసులతో... తనూ..తన కుటుంబం తప్పా మారు బంధువును తమ ఇంటి గడప ఎక్కనివ్వని తన కుటుంబ నేపధ్యం ఎంత లేదనుకున్నా తలపులోకి వచ్చింది. ప్రతి పండుగను ఖర్చుల్లో లెక్కేసి దండగని తీసిపారేసి.. ఒక పసుపన్నం, ఒక తెల్లన్నం చేసే తల్లి గుర్తుకొచ్చింది. తన కుటుంబాన్ని పూర్తిగా మరిపించిన ఈ ఉమ్మడి కుటుంబం ఆమె మనసుకు కొత్త అనుబంధాలనూ, ఆత్మీయతను, అస్థిత్వాన్నీ పరిచయం చేస్తోంది.
మధ్యాహ్నభోజనాలు అదొక వేడుక! అంత రుచికరమైన తెలుగుభోజనం ఆ అమ్మాయి ఎప్పుడూ తినలేదు. అందరికీ ఆరారా వడ్డిస్తూ, ఆప్యాయంగా తిరుగుతున్న ఆ ఇంటి స్త్రీలు తన తల్లి చెప్పిన పాఠాల్లో ఛాదస్తులూ, నెత్తిమీద ఎక్కేవారిలా లేరు. అందరూ మంచి విద్యావంతులు, సంస్కారయుత కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన వారే! ఆ మధ్యాహ్నం పిల్లలతో హౌసీ, అంత్యాక్షరి ఆడింది. చక్కని వరుసలు కలుపుతూ పిల్లలంతా, అనూయే లోకంలా తిరుగుతుంటే, కొత్త బాల్యంలా ఉంది ఆమెకు!
అసురసంధ్య వేళ దీపాలు పెట్టుకునే లోపునే...అందరూ పంచాంగ శ్రవణంలో కూర్చున్నారు. బ్రహ్మతేజస్సు వుట్టిపడుతున్న ఇంటి పూజారిగారే సతీసమేతంగా సంవత్సరఫలాలు చెప్పడానికి విచ్చేసారు. మరికొందరు బంధువులు కూడా వచ్చి చేరారు పంచాంగశ్రవణానికి!
“ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ
గురుశుక్ర శనిభ్యశ్య రాహవే కేతవే నమః”
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధ్యుతిమ్
తమో రిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!.....
అంటూ నవగ్రహప్రార్ధనతో, గణేశ ప్రార్ధనతో మొదలు పెట్టి... ప్రపంచ, దేశ, రాష్ట్ర జ్యోతిష్యఫలితాలను చెప్పాకా... ఇంటి యజమాని రాశిఫలాలు, ఆదాయవ్యయాలు, అవమాన రాజపూజ్యాలు, ఆరోగ్యం, శుభకార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి ఫలాలను చెప్పాకా... అందరి రాశిఫలాలనూ పూర్తిచేసారు.
అందరూ శ్రద్ధగా చిన్న పుస్తకంలో రాసుకోవడం అనూకు అబ్బురంగా అనిపించింది! జీవితంలో తనకు తెలియని ఎన్నో విషయాలకు ఒకటొకటిగా తలుపులు తెరుచుకుంటున్నట్టుగా అనిపించింది.
అసలైన వసంతరాత్రి ఆ తరువాత మొదలయింది. టెర్రేస్ మీద తెల్లనిపరుపులు, ఆనుకునే బాలీసులూ వేసారు పనివారు. మల్లెలు, సంపెంగలూ, వెదురుసజ్జల నిండా పోసి ఉంచారు. చందనపు అగరుబత్తులు, ఉడికోలన్ వేసిన పన్నీరు బుడ్లు పెట్టారు! పైనంతా వెన్నెలను మరిపించే తెల్లని విద్యుద్దీపాలు పెట్టారు.
ఏడు గంటల కల్లా సర్వులూ ... ఆ వసంత వేదికపైకి చేరారు. పైకి పాకించిన తీగమల్లి, జాజి, మధుమాలతులుడ మరులు కొల్పుతున్నాయి! అప్పుడు మొదలు పెట్టారు అందరూ ఉగాది కవితాగానాన్ని! చిన్న పిల్లలు స్వచ్ఛమైన అచ్చ తెలుగులో పద్యాలు చదువుతుంటే, ఆశ్చర్యపోవడం అనూ వంతయ్యింది. తరువాత పెద్దల వంతు!
“ఏ దరి గాంచ, నుత్సవమదే, విరబూయగ చైత్ర సోయగం.
ఏ దివి సుందరాప్సరస లీ విధి మామిడి, మల్లె సౌరభం
ప్రోది, మనోజ్ఞ సంచలిత పూతల నద్దగ, కూజితోద్భవా
నాద వసంత లాస్యమదె, నర్తన మాడెను నాల్గు దిక్కులన్...”
అంటూ ఉత్పలమాలలో పద్యాన్ని అందుకున్నారు పెద్దాయన!
మధురంపు చెఱుకు, బెల్లము
మృదువౌ కదళీ ఫలమదె మేలగు రుచికిన్
నదురుగ పచ్చడి నందున
పెదవులు మండించు మిరప ప్రీతిగ కలపన్.(4)
వేప విరుల చేదు విరుచుచు ధురితంబు
నిడుము లన్నిమనకు నెంచి జూపు.
సంద్రపు లవణంబు స్వాధిష్టముం జేసి
స్వేదమందు విలువ జెప్పు మనకు.
పచ్చి మావి వగరు – పచ్చి మిర్చి పొగరు
నాకళింపగ జేయు నాటు పాట్లు.
వేచి జూడు ముదమే వేదనాంత మనుచు
మధుర రుచుల తీపి మనకు దెలుపు.
చప్ప దనము గూర్చు పప్పు , కొబ్బరి ముక్క
చింత దీరునంటు చింత పండు
పరమ యర్ధ మదియె పచ్చడరయు టందు
షడ్రుచు లవి గూర్చు సమ్మతంబు.
.... అంటూ నేనేం తక్కువ తిన్నానని అత్తగారు పద్యగానం చెయ్యడం చూసి అనూమనసు ఆమె పట్ల ఆరాధనా భావంతో నిండిపోయింది!
వాసంత స్వాగత వైభవం బొప్పగన్
క్రొంగొత్త యాశలు కోర్కె లవియె.
లేలేత చిగురేసి, లేవంపు తరువులు
మత్తు నెత్తావుల కొత్త పూలు
వసుధపై పరచిన వర్ణ సౌందర్యంబు
వర్ణింప తరమౌన? వన్య శోభ!!
ఉత్తేజ పడు నదె నున్మత్త మధుపంబు
మత్త కోకిల గూడి మదము నొందె.
నవ జిగీష స్ఫూర్తి నరనరమున ప్రాకు
నలువు కుంచె జేయు నాట్య మదియె.
కొత్త వత్సరంబు కొంగు ముడులు వేయ
కలసి సాగుదమ్ము కలలు పండ.
అంటూ పెద్దబావగారు....!
ఆ ఫాల్గుణానుజ ..ఆమని రాత్రంతా ... భారతభారతీ విభావరిన..... తెలుగుకవితా... వైభవ మొప్పుతూ... విద్యాధరి ప్రాసాదంగా సాగింది.
చివరిలో అనూ పాడక తప్పలేదు! తెలుగుభాష మీద అంతగా పట్టులేని ఆమె...
“ ఈ వసంత పరిమళము అలనిల తెమ్మెరలో
ఝుమ్మని తీయని తలపుల తుమ్మెదలెద వ్రాలినవో...”....అంటూ పరవశంగా భర్తను చూస్తూ లలితంగా, శ్రావ్యంగా పాడింది.
అందరి మనసులూ ఆ కొత్తకోడలి సౌకుమార్యానికీ, సున్నితంగా బంధాలు పెనవేసుకుంటూ... కుటుంబంలో మమేకమౌతున్న తీరుకూ సంతోషంతో నిండిపోయాయి!
🌷🌷🌷
ఆ రాత్రి తల్లితో చరవాణిలో తను పొందిన మధురానుభూతులన్నీ పంచుకుంది. ఆమెకూ కొత్తే ఈ అనుభవాలన్నీ! కూతురి ఆనందాన్ని పక్కన పెట్టి... కోడలి మీద పితూరీలు చెప్పబోయింది. ఒకప్పుడు ఆసక్తిగా వినే అనూకు అవన్నీ కర్ణకఠోరంగా అనిపించాయి.
“ఆపమ్మా ఇంక! ఇంకా ఎన్నాళ్ళు? జీవితంలో ఎన్నో ఆనందాలు, అనుబంధాలూ, స్నేహాలూ ఉండగా... అన్నిటినీ విస్మరించి అహంకారంతో, బంధాలు చెందనాడుకుంటున్నాం మనం. వీలుబడి కొన్నాళ్ళు మా ఇంటికి రా! మా అత్తగారూ, మా ఉమ్మడి కుటుంబం నీలో తప్పకుండా మార్పుతెస్తుంది. కొత్తగా మనింట్లోకి రాబోయే వంశాంకురాన్ని మోస్తున్న వదినకు కాస్త ప్రేమ, ప్రశాంతత పంచు... కొత్త సంవత్సరం పూట... మత్సరం కాస్త పక్కన పెట్టి”.... అంటూ గడ్డి పెట్టి ఫోన్ పెట్టేసింది అనుపమ... ఫలానా వారింటి కొత్తకోడలు!
ధన్యవాదాలతో
శశికళా ఓలేటి
ప్రియతమ స్నేహబృందానికి ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలతో...