2, ఫిబ్రవరి 2026, సోమవారం

పంచాంగం

 


మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*సోమవారం 2 ఫిబ్రవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!   

                     1️⃣2️⃣3️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*        

    

                    *123 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


*దేవేంద్రుడు యుద్ధముకు వచ్చుట*```


దేవతలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి..

“దేవేంద్రా! అగ్ని కుమారుడు తేజోవంతుడు, గర్వం కలవాడు. అతని వలన నీ పదవికి ముప్పు రాగలదు. నీ పదవి దక్కాలంటే వెంటనే అతనిని సంహరించడం మంచిది” అన్నారు. 


దేవేంద్రుడు సప్త మాతృకలను పిలిచి “మీరు అగ్ని కుమారుని సంహరించండి” అని ఆజ్ఞాపించాడు. 


అందుకు అంగీకరించి వెళ్ళిన సప్త మాతృకలు బాలుని తేజస్సు చూసి భయపడి అతనిని శరణు వేడారు. 


కుమార స్వామి వారిని మన్నించాడు. 


సప్త మాతృకలు బాలుని సంరక్షణ కొరకు లోహితాస్య అనే దాదిని సృష్టించారు. అగ్నిదేవుడు కుమారుని సంరక్షణా భారం స్వీకరించాడు. 


ఇది తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహించి తన సేనలతో కుమారస్వామి మీదకు దండెత్తి వచ్చాడు. 


కుమారస్వామి ముఖము నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు భయపడిన దేవతలు అతనిని శరణుజొచ్చారు. 


దేవేంద్రుడు కుమారస్వామి మీదకు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. 


అది కుమారస్వామి కుడి భాగాన్ని తాకగా అందు నుండి బంగారు చాయతో, మేషముఖంతో శక్తి ఆయుధంతో ఒక పురుషుడు జన్మించాడు. అతని పేరు విశాఖుడు. అతనితో పాటు అనేక మంది బాల బాలికలు పుట్టారు. ఇది చూసిన దేవేంద్రుడు భయపడి కుమారస్వామిని శరణు వేడాడు.```


*కుమారస్వామి దేవతల మన్ననలను అందుకొనుట*```


దేవతలు సింహనాదాలు చేస్తూ కుమారస్వామి చెంత చేరారు. దేదీప్యమానంగా వెలుగుతున్న అగ్ని పుత్రుని చూసి లక్ష్మీ దేవి సాకారమై అతని చెంతన నిలిచింది. ఆరవదినం ఋషులు కుమారస్వామిని భక్తితో నమస్కరించి “దేవా! నీవు పుట్టిన ఆరుదినములకే లోకాలను జయించావు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, సుపరిపాలనా దేవేంద్రుని కర్తవ్యం. షణ్ముఖా నీవు అందుకు తగిన వాడివి కనుక ఇంద్ర పదవిని స్వీకరించుము” అని దేవతలు, ఋషులూ అడిగారు. 


ఇంద్రుడు “కుమారస్వామీ! నీవు శౌర్యవంతుడవు కనుక ఇంద్రపదవిని అంగీకరించుము” అని అడిగాడు. 


“దేవేంద్రా! నాకు ఇంద్ర పదవి అక్కర లేదు. నీ తేజస్సు చూసి దేవతలు తిరిగి నీవే ప్రభువు అని మోహంకలుగ చేసిన నీకు నాకు శత్రుత్వం వస్తుంది కనుక ఆ పదవిలో నీవే ఉండు!” అని కుమారస్వామి అన్నాడు. 


దేవేంద్రుడు ఆ మాటలకు ఆనందించాడు. “కుమారా! నీవు మా సేనలకు ఆదిపత్యం వహించు” 

అని ఇంద్రుడు కుమారస్వామిని అడుగగా అతడు అందుకు అంగీకరించాడు. 


ఋషులు దేవతలు జయజయధ్వానాలు చేసి కుమారస్వామిని దేవ సేనాధిపతిగా అభిషేకించారు. 


మహాశివుడు అక్కడకు వచ్చి కుమారస్వామిని చేరదీసి విశ్వకర్మచే కూర్చ బడిన బంగారు పుష్పమాలను బహూకరించాడు” అని చెప్పగా ధర్మరాజు ఇక్కడ ఒక సందేహం వెలిబుచ్చాడు “మహర్షీ! కుమారస్వామి రుద్రాంశ సంభూతుడంటారు కదా అదెలా సంభవించింది?” అని అడిగాడు.


మార్కండేయుడు ధర్మరాజుతో..  “ధర్మరాజా! పూర్వం శివుడు తన తేజస్సును అగ్నియందు ప్రవేశపెట్టాడు. ఆ వీర్యము చేత అగ్నిహోత్రుడు కుమారస్వామిని పుట్టించాడు. అగ్నికి రుద్రుడనే నామాంతరం కూడా ఉంది. అందుచే కుమారస్వామిని అగ్ని పుత్రుడు, శివపుత్రుడు అని కూడా అంటారు” అన్నాడు. 


అగ్నిదేవుని భార్య స్వాహాదేవి కృత్తికల రూపంలో ఆరుగురు ముని పత్నుల రూపంధరించి భర్తను చేరి కుమారస్వామికి జన్మ ఇచ్చినందున కార్తికేయుడనే నామం కలిగింది. ఈ సమయమున దేవేంద్రుడు తన వద్ద పెంచుకుంటున్న దేవసేనను అక్కడకు రప్పించి “కుమారా! ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు ఈమెను స్వీకరించు”అన్నాడు.


కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

నక్షత్ర స్తోత్ర మాలిక*

 🌹🌷💫⭐🛕⭐💫🌷🌹


          *నక్షత్ర స్తోత్ర మాలిక*

                

               *5 వ రోజు*

*నక్షత్రం- మృగశిర(Mrigashira)*


*అధిపతి - కుజుడు (Mars)*


*అధిదేవత_ సోముడు* (చంద్రుడు)


*ఆరాదించాల్సిన దైవం*


            *చంద్రశేఖరుడు* 


*అపమృత్యు భయాలు పోవడానికి, ఆరోగ్యానికి మరియు రక్షణ కోసం పఠించాల్సిన స్తోత్రం.*


 *శ్రీ చంద్రశేఖరాష్టకం* 


*చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్।*

*చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్॥*


*రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం*

*సింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానన సాయకమ్।*

*క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదివాలయై రభివందితం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 1 ॥*


*పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం*

*ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మథ విగ్రహమ్।*

*భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 2 ॥*


*మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం*

*పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్।*

*దేవసింధు తరంగశీకర సిక్తశుభ్ర  జటాధరం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 3 ॥*


*యక్షరాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం*

*శైలరాజ సుతాపరిష్కృత చారువామ కళేబరమ్।*

*క్ష్వేలనీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 4 ॥*


*కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం*

*నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్।*

*అంధకాంధక నాశనం అమరాధిప ప్ర్రియం అద్వయం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 5 ॥*


*భేషజం భవరోగిణాం అఖిలాపదాం అపహారిణం*

*దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్।*

*భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 6 ॥*


*భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం*

*సర్వభూత పతిం పరాత్పరమ్ అప్రమేయమ్ అనుత్తమమ్।*

*సోమవారిన హుతాశన సోమ పాద్యఖిలాకృతిం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 7 ॥*


*విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం*

*సంహరంత మపి ప్రపంచమ్ అశేషలోక నివాసినమ్।*

*క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమన్వితం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 8 ॥*


*మృత్యుభీత మృకండుసూను కృతస్తవం శివసన్నిధౌ*

*యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్।*

*పూర్ణమాయు రరోగతాం అఖిలార్థ సంపదమాదరం*

*చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః॥*

॥ *ఇతి శ్రీ మార్కండేయ కృత చంద్రశేఖరాష్టకం సంపూర్ణమ్॥*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వాసనా త్రయం

 

వాసనా త్రయం దేహా వాసన, లోక వాసన శాస్త్ర వాసన 


*శాస్త్రాన్ని ఎంత తెలుసుకున్నా - ఎన్ని సాధనలు చేస్తున్నా ఎందువల్ల ఆత్మసాక్షాత్కారం కలగటం లేదు?* అంటే బుద్ధికి సూక్ష్మత్వం - శుద్ధత్వం లేకపోవటం వల్లనే అని తెలుస్తున్నది.

*బుద్ధికి శుద్ధత్వం ఎందుకు లేదు?* మలిన వాసన వల్ల –

*మలిన వాసనలు ఏవి?* - 1.లోక వాసన 2.శాస్త్ర వాసన 3.దేహ వాసన.

*(1) లోక వాసన* :- ఇతరులు నన్ను స్తుతించేటట్లు - నిందించకుండా ఉండేటట్లు పనులు చేయాలి అనే భావనతో పని చేయటం లోక వాసన. ఏం చేయాలి? ఇతరుల నిందాస్తుతులను పట్టించుకోకుండా తన హితం కొరకు పని చేయాలి.

*(2) శాస్త్ర వాసన* :- (i) శాస్త్రాలన్నీ చదివి పూర్తి చేయాలి అనే పాఠ వ్యసనం.

(ii) అభ్యాసం కోసం అనేక విధాలైన శాస్త్రాలను సంగ్రహించి, వెదకటమనే బహు శాస్త్ర వ్యసనం

(iii) వేద శాస్త్రాలలో విధించబడిన కర్మానుష్టానమునందే జీవిత కాలమంతా గడిపివేయటమనే అనుష్టాన వ్యసనం. కర్మలయందు శ్రద్ధ అనే జడత్వాన్ని విడిచిపెట్టాలి. ఈ కర్మ వాసన పునర్జన్మకు కారణమౌతుంది. అలాగే శాస్త్ర వాసన దర్పం పెరగటానికి తోడ్పడుతుంది.

మరేం చేయాలి? - పరమార్థ తత్వాన్ని తెలుసుకొనేంతవరకే శాస్త్రాలను తిరగేయాలి. స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఆచరణకు ప్రాధాన్యత నివ్వాలి.

*(3) దేహ వాసన* :- దేహాత్మ బుద్ధి. దేహమే ఆత్మ (నేను) అనే బుద్ధి. దేహ పోషణ యందే కాలమంతా వెచ్చించటం. కంఠాన్ని బాగుచేసుకోటానికి ఔషధాలు సేవించుట, సుగంధ తైలాలు, వస్త్ర భూషణాలు ఉపయోగించటం, పుణ్యం కోసం గంగా స్నానాలు, సాలగ్రామాదులు సంపాదించటం, దోషాలు పోగొట్టుకొనుటకు శౌచం, ఆచమనం ద్వారా పవిత్రమగుట - ఇవన్నీ జ్ఞాన ప్రతి బంధకాలు -

ఈ 3 రకాల వాసనలు తొలగించుకుంటే బుద్ధి శుద్ధమౌతుంది. ఇక *బుద్ధికి సూక్ష్మత్వం ఎందుకు లేదు? ఎలా వస్తుంది?* -

రాజస తామస వృత్తుల వల్ల (ఆలోచనల వల్ల) సూక్ష్మత్వం లేదు. ఆ వృత్తులను నిరోధించి బుద్ధికి పదును పెడితే సూక్ష్మమవుతుంది. దానిని రెండు విధానాల ద్వారా సాధించాలి.

(i) యోగం. (ii) విచారణ (వివేకం)

*(i)* ధ్యాన యోగం ద్వారా రాజస తామస వృత్తులను నిరోధించవచ్చు.

*(ii)* ఆత్మ విచారణ ద్వారా బుద్ధి సూక్ష్మమవుతుంది.

*ఆత్మ విచారణ అంటే* -

దేహమనోబుద్ధుల కన్న - వేరుగా ఉన్నది, పంచకోశాలకు ఆవల ఉన్నది, మూడు అవస్థలకు సాక్షిగా ఉన్నది ఆత్మ అని విచారణ చేసి గ్రహించాలి, ఆ ఆత్మ నేనేనని మళ్ళీ మళ్ళీ స్మరించాలి.

ఇలా వాసనాక్షయం ద్వారాను, ధ్యాన యోగ, ఆత్మ విచారణ ద్వారాను బుద్ధి శుద్ధమౌతుంది, సూక్ష్మమవుతుంది. ఇట్టి బుద్ధి తత్వంలో నిలిస్తే - ఆత్మలో నిలిస్తే - బ్రహ్మంలో నిలిస్తే సమాధిలో నిలిస్తే ఆత్మానుభూతి కలుగుతుంది.


శ్రీ ఆదిశంకరాచార్యులవారి ఆత్మబోధ.

స్వామి--నేను*

  *స్వామి--నేను*

                 ➖➖➖✍️


*స్వామి:* ```

ఏంటయ్యా ఇలా వచ్చావ్, అది కూడా ఇంత చలిలో..?```


*నేను:* ```

నిన్ను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామీ..?```


*స్వామి:*```

ఐతే నా దర్శనం కోసం నువ్వేమైనా చేస్తావా..?```


*నేను:*```

అవును స్వామి, అలిపిరి మెట్లు ఎక్కమన్నా ఎక్కుతా, గంటల తరబడి waiting hall లో ఉండమన్నా ఉంటా, చలి చూడను,ఎండను పట్టించుకోను మంచుందని భయపడను..!```


*స్వామి:*```

 నా దర్శనం ఎందుకు నీకు?```


*నేను:*```

అదేంటి స్వామీ అలా అంటారు. నిన్ను చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అంతా ఇంత కాదు..!```


*స్వామి:*```

నన్ను చూస్తే నీకు ఇవన్నీ కలుగుతాయంటావు, అవునా..?```


*నేను:*```

అవును స్వామి..!```


*స్వామి:*```

దేవుడు అంటే ఏమిటి నీ దృష్టిలో?

```

*నేను:*```

దేవుడు అంటే మనల్ని నడిపించే నమ్మకం కాపాడే శక్తి, కాసే కాపు.```


*స్వామి:*```

ఇవన్నీ నేను చేస్తానా..?```


*నేను:*```

చేస్తున్నావు కాబట్టే కదా స్వామీ ఇంతమంది నిన్ను ఇలా కొలుస్తున్నది.

```

*స్వామి:*```

నీ దృష్టిలో ఇలాంటివి చేసేవాళ్లే దేవుళ్లు అంటావు, అంతేనా..?```


*నేను:*```

అవును స్వామీ..!```


*స్వామి:*```

ఇంత కన్నా ఎక్కువ చేస్తే..?```


*నేను:*```

అసంభవం స్వామీ, ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయరు, చేయలేరు. నిన్ను మించిన majesty ఎవరూ లేరు,ఉండరు.```


*స్వామి:* ```

అదేంటయ్యా, ఉంటే ఏం చేస్తావ్?

```

*నేను:* ```

ఉండనే ఉండరు. స్వామీ

ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఉంటే నా ఊపిరి ఆగే వరకూ వాళ్లకు సేవ చేస్తా!```


*స్వామి:* ```

సరే, ready ఐపో..!```


*నేను:*```

ఏంటి స్వామి, నిజంగా నీకన్నా నాకోసం ఎక్కువ కష్టపడే వాళ్లు ఉన్నారా..?```


*స్వామి:* ```

ఉన్నారు..!```


*నేను:*```

ఎవరు స్వామి, వాళ్లు ఎక్కడ ఉంటారు..?```


*స్వామి:*```

ఉన్నారు```


*నేను:*```

ఎవరు స్వామి, వాళ్లు ఎక్కడ ఉంటారు..?```


*స్వామి:*```

నీ కోసం నీకంటే ముందు మేల్కొన్న వాళ్లు, నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్లు, నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్లు, నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్లు.```


*నేను:*```

స్వామీ, అలా మాట్లాడొద్దు, అర్థమవుతోంది..!```


*స్వామి:* ```

నీవు అలిపిరి మెట్లు ఎక్కుతావన్నావు కదా, వాళ్లు నీ పుట్టుక నుంచే జీవితమంతా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. నీవు గంటల తరబడి waiting hall లో ఉంటానన్నావు. వాళ్లు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు.```


*నేను:*```

స్వామీ, ఆపండి, నా గుండె తట్టుకోలేకపోతోంది..!```


*స్వామి:*```

నీవు చలిని పట్టించుకోనన్నావు. వాళ్లు వర్షాన్ని, ఎండను, ఆకలిని కూడా పట్టించుకోలేదు. నీవు మంచుకి భయపడనన్నావు. వాళ్లు అప్పుల్ని, అవమానాల్ని, ఒంటరితనానికీ భయపడలేదు.```


*నేను:*```

స్వామీ, వాళ్లేనా..```


*స్వామి:* ```

అవును నిన్ను భవిష్యత్తులా చూసిన వాళ్ల. నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్లు.

నీ ఓటమిలో కూడా నిన్ను వదలని వాళ్లు..!```


*నేను:*```

వాళ్లు ఎవరో కాదు, మా అమ్మా, నాన్నా కదా స్వామీ..!```


*స్వామి:*```

నువ్వు నా కోసం వచ్చావ్! కానీ నిన్ను నా దగ్గరకు నడిపించింది వాళ్లే! నన్ను చూసి ధైర్యం వస్తుందన్నావు. నీకు ధైర్యం నేర్పింది వాళ్లే..!```


*నేను:*```

స్వామీ, నేను ఇంతకాలం దర్శనాల వెంటే పరిగెత్తాను కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్లను చూడలేకపోయాను.

```

*స్వామి:*```

అందుకే చెప్పాను నా దగ్గరకు రావడం పుణ్యం. కానీ వాళ్ల దగ్గర ఉండటం మోక్షం..!```


*నేను:*```

స్వామీ, ఇక నా సేవ అక్కడే! 

నా ఊపిరి ఆగే వరకూ ఆ ఇద్దరికీ

ఆఇద్దరి సేవకే పరిమితం.```


*స్వామి:*```

ఎప్పుడైతే నీ తల్లితండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావో అప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు.

అంతవరకూ నువ్వెన్ని సార్లు మెట్లెక్కినా ఎన్ని ముడుపులు కట్టినా 

నా హుండీలోకి ఎన్ని డబ్బులేసినా నాకోసం నీ తల నీలాలిచ్చినా 

నా తలకు బంగారు కిరీటం పెట్టినా అవన్నీ వేస్ట్.


వచ్చి నా దర్శనం చేసుకుని రెండు reels చేసి, అవి social media లో post చేసి వైరల్ అవుతావు తప్ప లైఫ్ లో సక్సెస్ అవ్వవు.


నీ తల్లితండ్రుల కళ్లలో హాయిగా నిద్ర వస్తే అదే నీ first success. వాళ్ల ఒంటికి, మెదడుకి రోగాలు లేకుండా వాళ్ల ముఖంలో భయం తగ్గితే అదే నీ real ప్రమోషన్.


వాళ్ల బాధ్యతలు కొన్ని నీ భుజాన వేసుకో! నన్ను పూజించడమంటే పూలు, కొబ్బరికాయలు కాదు.

మీ అమ్మ అలసినప్పుడు ఒక్క గ్లాస్ నీళ్లు ఇవ్వడం!

నీ నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కన కూర్చోవడం.

నువ్వు నాకోసం వ్రతాలు చేస్తే ఆకాశం నుంచి నేను చూడగలను.

కానీ వాళ్ల కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు,

నేనే నీ ఇంటికొచ్చి కూర్చుంటాను.


నా గుడిలో నువ్వు భక్తుడిగా కాదు మీ ఇంట్లో ..

మీ అమ్మానాన్నలకు సేవ చేసే

అర్చకుడిగా ఉండిపో అందుకే! గుర్తుంచుకో నా కాళ్ల దగ్గర పువ్వులు కాదు.

మీ తల్లితండ్రుల చేతుల్లో నేనున్నానే భరోసా పెట్టు.

నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే!

మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే..!!


24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్లు, అలాంటి వాళ్లకోసం నువ్వెంత చేసినా తక్కువే.


మా అమ్మ వకుళ మాత ఎప్పుడూ 

నా పక్కనే ఉంటుంది బిడ్డ ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అని!

అలాంటి తల్లితండ్రులను మించిన దేవుళ్లు ఉండరు.


చివరగా ఒక్క మాట..


దేవుళ్లకు, అమ్మానాన్నలకు ఉండే చిన్న తేడా ఏంటో చెప్తా విను! పడిపోయాక పట్టుకునే వాళ్లు దేవుళ్లు.

పడిపోకుండా పట్టుకునే వాళ్లు మీ తల్లితండ్రులు..!

వాళ్లను మించిన దేవుళ్లు లేరు✍️```

. శుభరాత్రి

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀🙏.``

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ:  సాంఖ్య యోగము.


శ్రీ భగవానువాచ ।

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ।। 55 ।।



ప్రతిపదార్థ:


శ్రీ భగవాన్ ఉవాచ — పరమేశ్వరుడైన భగవంతుడు ఇలా పలికెను; ప్రజహాతి — త్యజించి (విడిచి పెట్టి); యదా — ఎప్పుడైతే; కామాన్ — స్వార్థ కోరికలు; సర్వాన్ — అన్నీ; పార్థ — అర్జునుడా, ప్రిథ తనయుడా; మనః-గతాన్ — మనస్సు యొక్క; ఆత్మని — ఆత్మ యొక్క; ఏవ — మాత్రమే; ఆత్మనా — పరిశుద్ధ మనస్సుతో; తుష్టః — సంతుష్టుడై; స్థిత-ప్రజ్ఞః — స్థితప్రజ్ఞుడు; తదా — అప్పుడు; ఉచ్యతే — అందురు.



 తాత్పర్యము :


భగవానుడు పలికెను: ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.

 

  

 వివరణ:


శ్రీ కృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు జవాబు చెప్పటం ఇక్కడ నుండి మొదలుపెట్టి, ఈ అధ్యాయం చివరి వరకు చెప్తాడు. ఒక రాయి, భూమి వైపు గురుత్వాకర్షణ శక్తిచే గుంజబడినట్టు, ప్రతి 'అంశము' సహజంగానే తన పూర్ణ భాగం వైపు ఆకర్షింపబడుతుంది. జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశము. అంటే, జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క ఒక భాగం, అందుకే అది సహజం గానే ఆనందం కోసం అభిలాషిస్తుంది. అది భగవంతుని నుండి ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించటానికి కృషి చేసినప్పుడు, దానిని ‘దివ్య ప్రేమ’ అని అంటారు. కానీ, తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరిచి, తనను తాను శరీరమే అనుకుని, జగత్తు నుండి శారీరక ఆనందాన్నిఆస్వాదించటానికి ప్రయత్నించినప్పుడు దానిని ‘కామము’ అంటారు.


ఈ ప్రపంచం 'మృగ తృష్ణా' అని ఆగమ గ్రంథాలలో చెప్పబడింది, అంటే 'జింకలకు అగుపించే ఎండ మావి' వంటిది అని అర్థం. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్య కిరణాల పరావర్తనం చేత అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి మృగమునకు కలుగుతుంది. అది అక్కడ నీరు ఉన్నదనుకుని దాహం తీర్చుకోవడానికి పరుగుపెడుతుంది. కానీ అది దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ ఎండమావి మాయమైపోతుంటుంది. దాని అల్పబుద్ధి తాను ఓ భ్రాంతితో పరుగిడుతున్నట్టు తెలుసుకోలేదు. ఆ దీనమైన జింక, లేని నీళ్ళ కోసం వెంటపడుతూ చివరికి నీరసంతో ఆ ఎడారి ఇసుకపై మరణిస్తుంది. ఈ విధంగానే, భౌతిక శక్తి అయిన 'మాయ' కూడా ఆనందం అనే భ్రాంతిని కలుగచేస్తుంది, మనం ఆ లేని ఆనందం వైపు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవటానికి పరుగులు పెడుతున్నాము. కానీ, మనం ఎంత ప్రయత్నించినా, ఆనందం మన నుండి దూరమయిపోతున్నది. గరుడ పురాణం ఇలా పేర్కొంటున్నది:


చక్రధరోఽపి సురత్వం సురత్వలాభే సకలసురపతిత్వం

భవ్తిరుం సురపతిరూర్ధ్వగతిత్వం తథాపి ననివర్తతే తృష్ణా


(2.12.14)


 


‘ఒక రాజు, ప్రపంచం మొత్తానికే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు; చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు; ఒక దేవత, స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు; ఇంద్రుడు, సృష్టికర్త బ్రహ్మ దేవుడు అవ్వాలని కోరుకుంటాడు. అయినా, భౌతిక భోగముల కొరకు ఉన్న తృష్ణ, తృప్తితీరదు.’


కానీ, మనస్సుని భౌతిక ప్రలోభముల నుండి దూరంగా తిప్పివేయటం నేర్చుకుని మరియు ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి, తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ, స్థిత ప్రజ్ఞుడు అవుతాడు. కఠోపనిషత్తు మరింత ముందుకెళ్ళి, ఆశ/కోరికలను త్యజించినవాడు భగవంతునిలా అవుతాడు అని పేర్కొంటున్నది:


యదా సర్వే ప్రముచ్యంతే కామా యేఽస్య హృది శ్రితః

అథ మర్త్యోఽమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే (2.3.14)


‘హృదయం నుండి అన్ని స్వార్థ కోరికలు తొలగించిన పిదప, భౌతిక సంకెళ్ళు వేయబడ్డ జీవాత్మ, జన్మమరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది మరియు సద్గుణములలో దేవుని వలె అవుతుంది.’ స్థిత-ప్రజ్ఞుడు అంటే, అన్ని స్వార్థ కోరికలను, ఇంద్రియ లౌల్యములను త్యజించి, ఆత్మ యందే సంతుష్టి నొందినవాడు, అని శ్రీ కృష్ణుడు ఈ పై శ్లోకం లో వ్యక్తీకరించాడు.

మాఘ పురాణం - 15వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷సోమవారం 2 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 15వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *2వ తేదీ సోమవారం*

         *వేకువఝామున*

        *చదువు కొనుటకు*


మాఘ పురాణం పదిహేనవ అధ్యాయంలో, బ్రాహ్మణుడైన జ్ఞాన శర్మకు పుత్రుడు కలిగాడు. కానీ, నారద మహర్షి ఆ బాలుడు 12 సంవత్సరాల తరువాత చనిపోతాడని చెబుతాడు. దుఃఖించిన జ్ఞాన శర్మ శ్రీహరి కోసం తపస్సు చేస్తాడు. శ్రీహరి కనిపించి, జ్ఞాన శర్మ భార్య పూర్వ జన్మలో మాఘ పూర్ణిమ నాడు పాయసదానం చేయలేదని, అందుకే ఈ గండం ఏర్పడిందని చెబుతాడు.

మాఘమాస స్నానం, వ్రతం గురించి శ్రీహరి వివరిస్తాడు. మాఘమాస స్నానం ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తుంది. మాఘ పూర్ణిమ నాడు గంగోదకంతో పుత్రుడిని తడిపితే గండం తొలగిపోతుందని చెబుతాడు. జ్ఞాన శర్మ శ్రీహరి చెప్పినట్లు చేస్తాడు. బాలుడి గండం తొలగిపోయి, చిరంజీవి అవుతాడు. జ్ఞాన శర్మ, భార్య, పుత్రుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ కథ ద్వారా మాఘమాస వ్రతం యొక్క మహిమ తెలుస్తుంది. మాఘమాస స్నానం, వ్రతం చేయడం వల్ల పాపాలు పోయి, పుణ్యం, శ్రీహరి అనుగ్రహం లభిస్తాయి. …


           *జ్ఞాన శర్మ కథ*```


గృత్నృమదుడు జహ్నువుతో నిట్లనెను. తపము ఆచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నా రాకను కోరి  తపము ఆచరించితివి ఎందులకు? నీ మనస్సులోన ఏమి యున్నది చెప్పుమని అడిగెను. అప్పుడు ఆ  విప్రుడు ‘స్వామీ ! నాకు పుత్ర వరము నిచ్చి సంతోషము కలిగించితివి, నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారద మహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవు ఇచ్చిన వారము ఇట్ల అయినది, నా దుఃఖమును పోగొట్టుకొన కోరి తపమును ఆచరించితిని అని శ్రీహరికి విన్నవించెను.

అప్పుడు శ్రీహరి ‘ఓయీ ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరము నందు  గండము కలుగుటకు కారణమును చెప్పెదను వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరు ఇరువురును భార్యా భర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము, గుణములు కలిగియుండినది. ఆమె భర్త యగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును శ్రద్దగా చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందున్న (తీర్థము) గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందు వలన గండ దోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.

ఓయీ ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘ స్నానము చేయనివరికి, వారి సంతానమునకు ఆపదలు కల్గును, అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను.  మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.

బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుడిని శ్రీహరి చెప్పిన విధముగా మాఘ వ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును శ్రీహరి దయ వలన మృత్యుగండ దోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యు భయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా, పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని కావించి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్ను మునివర్యా ! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*మాఘపురాణం పదిహేనువ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

02ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    🕉️ *సోమవారం*🕉️

 *🌹02ఫిబ్రవరి2026🌹*        

   *దృగ్గణిత పంచాంగం* 

                   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : పాడ్యమి* ‌రా 01.52 వరకు ఉపరి *విదియ*

*వారం   : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : ఆశ్లేష* రా 10.47 వరకు ఉపరి *మఖ*

*యోగం : ఆయుష్మాన్* ఉ 07.21 *సౌభాగ్య* రా.తె 04.46 వరకు

*కరణం  : బాలువ* మ 02.41 *కౌలువ* రా 01.52 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు*

          *—ఈరోజు లేవు—*

అమృత కాలం  : *రా 09.16 - 10.47*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.44*

*వర్జ్యం    : మ 12.08 - 01.39*

*దుర్ముహూర్తం  : మ 12.44 - 01.30 & 03.01 - 03.47*

*రాహు కాలం  :ఉ08.04- 09.30*

గుళికకాళం      : *మ 01.47 - 03.13*

యమగండం    : *ఉ 10.55 - 12.21*

సూర్యరాశి : *మకరం*                                     

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 06.48*

సూర్యాస్తమయం :*సా 06.12*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ06.38- 08.55*

సంగవ కాలం      :*08.55 - 11.13*

మధ్యాహ్న కాలం    :*11.13 - 01.30*

అపరాహ్న కాలం    :*మ 01.30- 03.47*

*ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ పాడ్యమి*

సాయంకాలం      :*సా03.47- 06.04*

ప్రదోష కాలం       :*సా 06.04- 08.35*

రాత్రి కాలం         :*రా 08.35- 11.56*

నిశీధి కాలం        :*రా11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57 - 05.48*

******************************

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*స్వాత్మార్థం గురువాక్యతో*

*భజ భజ శ్రీపార్వతీవల్లభమ్*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసిం హా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

రోజుకో సూక్తి..

 స్వామి వివేకానంద స్ఫూర్తి..రోజుకో సూక్తి..


శీల సంపదను వృద్ధిచేసి, మనోబలాన్ని పెంపొందించి ఋద్ధిని వికసింపజేసి, స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యే మనకు కావలసింది.


శుభ సోమవారం 🔱Happy Monday. 


Swami Vivekananda’s Wisdom for

Daily Inspiration. 


We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded, and by which one can stand on one’s own feet.

పంచాంగం



  

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - ప్రతిపత్ - ఆశ్రేష -‌‌ ఇందువాసరే* (02.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*