22, మార్చి 2026, ఆదివారం

అర్థం చేసుకుంది.”

 ఒక వ్యక్తి తన కోతులతో కలిసి పడవలో ప్రయాణిస్తున్నాడు.


ఆ పడవలోని ఇతర ప్రయాణికులలో ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు.


ఆ కోతి అంతకుముందెన్నడూ పడవలో ప్రయాణించలేదు, అందువల్ల అది అసౌకర్యంగా భావించింది. అది అరవడం, పైకి కిందకి గంతులు వేయడం మొదలుపెట్టింది, పడవలో ఉన్న ఎవరినీ ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు.


పడవ నడిపే వ్యక్తికి చిరాకు వచ్చింది, మరియు ఆ గందరగోళం వల్ల పడవ మునిగిపోతుందేమోనని ప్రయాణికులు ఆందోళన చెందారు.


ఆ కోతి శాంతించకపోతే, అది పడవ మునిగిపోయేలా చేయగలదు.


ఆ పరిస్థితి చూసి ఆ వ్యక్తి కలత చెందాడు కానీ కోతిని శాంతపరచడానికి ఏ మార్గాన్నీ కనుగొనలేకపోయాడు.


ఆ తత్వవేత్త అదంతా గమనించి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.


అతను, “మీరు నన్ను అనుమతిస్తే, నేను ఈ కోతిని ఇంటి పిల్లిలాగా శాంతపరచగలను,” అన్నాడు.


ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు.


ఇద్దరు ప్రయాణికుల సహాయంతో, ఆ తత్వవేత్త కోతిని పట్టుకుని నదిలోకి విసిరేశాడు.


నీటిపై తేలుతూ ఉండటానికి పోరాడుతూ, ఆ కోతి పిచ్చిగా ఈదడం ప్రారంభించింది.


అది దాదాపు చనిపోయే స్థితిలో ఉంది మరియు తన ప్రాణాల కోసం పోరాడుతోంది.


కొంత సమయం తరువాత, ఆ తత్వవేత్త కోతిని తిరిగి పడవలోకి లాగాడు.


ఇప్పుడు కోతి నిశ్శబ్దంగా ఉండి, ఒక మూలకు వెళ్లి కూర్చుంది.


కోతి ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ఆ వ్యక్తి మరియు ప్రయాణీకులందరూ ఆశ్చర్యపోయారు.


ఆ వ్యక్తి తత్వవేత్తను అడిగాడు, “ఇందాక అది అశాంతంగా అటూ ఇటూ గంతులు వేసింది. ఇప్పుడు పెంపుడు పిల్లిలా కూర్చుంది. ఎందుకని?”


ఆ తత్వవేత్త ఇలా జవాబిచ్చాడు, “నేను ఈ కోతిని నీటిలోకి విసిరినప్పుడు, అది నీటి శక్తిని, తన జీవితపు విలువను, మరియు పడవ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుంది.”


భారతదేశంలో నిరంతరం ప్రతిదాన్నీ విమర్శించే, వ్యాఖ్యానించే, వ్యతిరేకించే వారిని ఆరు నెలల పాటు ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా, ఇరాక్, పాలస్తీనా, పాకిస్తాన్, శ్రీలంక, లేదా చైనాకు పంపాలి. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, వారు వాటంతట అవే పెంపుడు పిల్లిలా ప్రశాంతంగా మారి, దేశం అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తాయి.


“భారతదేశం”ను దుర్వినియోగం చేసి, అపఖ్యాతి పాలు చేసే మిత్రులందరికీ అంకితం. 😌😉🇮🇳🚩

అన్నది ముఖ్యం*

 పాపమయ్యేలా 

సంపాదించకండి


అప్పు అయ్యేలా 

ఖర్చుచేయకండి


అజీర్తి అయ్యేలా

తినకండి


మనస్పర్ధలొచ్చేలా

మాట్లాడకండి


ఆలస్యమయ్యేలా

నడవకండి


చితికి చేరేలా 

చింతించకండి


ఆలస్యం చేస్తూ

కాలాన్ని నిందించకండి


అర్థం చేసుకోకుండా

అవమానపర్చకండి


నాదే లోకం అనుకోకుండా

ప్రపంచాన్ని చూడండి


ద్వేషాన్ని వదిలేసి

ప్రేమను ఆహ్వానించండి


ఇతరులు తక్కువ అనకుండా

మనమే తక్కువ చేసుకోండి


కోపంగా 10 మాటలు కాదు

ప్రేమగా ఒక్క మాట చాలు


జేబులో ఎంతున్నది కాదు

వెనక ఎంత ఖ్యాతి/ పుణ్యం ఉందో తెలియాలి👌 


ఎంత సీనియారిటి అన్నది కాదు

ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం


ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు


ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం


ఏమి సాదించామన్నది కాదు

ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం


ఎంతో మంది స్నేహితులన్నది కాదు

ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం👌 


కోట్లు సంపాదించి పిల్లలకి ఇచ్చే యంత్రము కంటే,


మీరు ఎదుటివారికి సహాయం చేసినప్పుడు వారి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత కు ... బానిస అవ్వండి 100% 💯 %👌 


అంతే తప్పా పొగరుగా మాట్లాడకండి 


*మనము వెనకట ఏమీ చేసాం అన్నది ముఖ్యం*


*అంతే కదా శివయ్య* ఓం 🙏 


*శివయ్య అన్నిటికీ మీరే సాక్షి*


శివయ్య నీవే దిక్కయ్యా !!!

రామాయణ

  శ్రీరామ (14)


               ( వాల్మీకి రామాయణం -7 )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (21-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)



బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్య రచనకు ఉపక్రమించాడు.


ఆచమనం చేసి తూర్పు అగ్రములుగా గల దర్భల మీద ఆశీనుడయ్యాడు.

దోసిలి కట్టి ధ్యానమగ్నుడయ్యాడు.


శ్లో// తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః/

పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా//

(ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి అప్పుడు యోగ దృష్టితో ఇంతకు ముందు జరిగిన రామ చరిత్ర అంతా అరచేతిలోని ఉసిరికాయను చూచినట్లు చూడగలిగాడు).


రాముడు, లక్ష్మణుడు,సీత, దశరథుడు మొదలైన వారందరూ ఎప్పుడు, ఏమి చేసింది, 

ఏమేమి మాట్లాడింది,

వారి వారి మనస్సులలో ఏయే భావములు మెసలుతుండేవి,

మొదలైన అన్ని విషయములు వాల్మీకి కి గోచరించాయి.


శ్రీరామ జననం, తాటకి వధ,విశ్వామిత్ర యాగ సంరక్షణ,

శివ ధనుర్భంగం, సీతా కళ్యాణం,పరశురామ గర్వభంగం,

 రాముని రాజ్యాభిషేకమునకు విఘ్నం కలగడం,

సీతా రామ లక్ష్మణుల దండకారణ్య వాసం,

విరాధుని సంహరించడం,

మారీచ వధ, సీతాపహరణం, 

రాముడు కబంధుని సంహరించడం,

 పంపాసరస్సును,శబరిని, చూడటం,

హనుమంతుడు రాముని కలవడం,

సుగ్రీవ సమాగమం, వాలి వధ,

వానరులు సీతాన్వేషణకు బయలుదేరటం,

హనుమంతుడు లంకలో సీతాదేవిని చూడటం,

లంకా దహనం,

విభీషణ శరణాగతి,


వానర సైన్యంతో రాముడు సముద్రంపై నలుని చేత వారధి కట్టించి, సముద్రం దాటి లంకను ముట్టడించటం,


కుంభకర్ణ,మేఘనాధులతో సహా రావణుని సంహరించడం,

అగ్ని పునీత అయిన ‌సీతాదేవిని తిరిగి పొందడం,

ఆయోధ్యకు పునరాగమనం, 

శ్రీరామ పట్టాభిషేకం, 

మొదలైన సమస్త విషయములు ఆ మహాఋషికి గోచరించాయి.


ఆ విధంగా యోగబలంతో తాను దర్శించిన  

లోకాభిరాముడైన రాముడి చరిత్రను ఉన్నది ఉన్నట్లు వాల్మీకి మహర్షి " రామాయణం " అనే పేరుతో వ్రాయడానికి ఉద్యుక్తుడయ్యాడు.


శ్లో//ఉదార వృత్తార్థ పదై ర్మనోరమై/

స్తదాస్య రామస్య చకార కీర్తిమాన్/

సమాక్షరైః శ్లోక శతైర్యశస్వినో/

యశస్కరం కావ్య ముదారధీర్మునిః//


(యశశ్శాలి, బుద్ధిశాలి,ముని, అయిన వాల్మీకి, కీర్తిమంతుడైన రాముని కీర్తిని విశ్వవిఖ్యాతం చేస్తూ,మనోహరములైన పదములు,వాక్యములు,అర్థములతో కూడిన వందలకొలదీ శ్లోకములలో యశస్కరమైన రామాయణ మహా కావ్యమును రచించాడు).


శ్లో//కామార్థ గుణ సంయుక్తం,ధర్మార్థ గుణ విస్తరమ్/

సముద్ర మివ రత్నాఢ్యం సర్వ శ్రుతి మనోహరమ్//


(ఆ రామాయణం పురుషార్థములైన కామము,అర్థములను గురించి, విశేషంగాను,

 ఆ అర్థ కామములను ప్రసాదిస్తూ మోక్షమునకు దారి తీసే ముఖ్య పురుషార్థమైన ధర్మమును గురించి విస్తారంగాను తెలియజేస్తుంది,

 రత్నములను గర్భంలో ధరించిన సముద్రం లాగా, అనేక వేద రహస్యములను ఆ రామాయణం తన గర్భంలో ఇముడ్చుకున్నది,

అంతేకాదు ఆ రామాయణ మహా కావ్యం సర్వ శ్రుతి మనోహరమైనది).


ఈ రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి 

శ్రీరామ పట్టాభిషేకం వరకు ఆరు కాండలలోను, తరువాత జరిగిన వృత్తాంతమును ఉత్తర కాండలోను, వివరిస్తూ, మొత్తం ఏడు కాండములలో, ఐదు వందల సర్గలలో,రచించారు.


ఇరువది నాలుగు అక్షరములతో కూడిన గాయత్రీ మహామంత్రమును పొందుబరుస్తూ,  

ఆ మహాముని ఇరువది నాలుగు వేల శ్లోకములలో ఈ రామాయణ మహా కావ్యమనే కల్పవృక్షమును సృష్టించాడు.


చరితవ్రతుడైన ఆ వాల్మీకి మహర్షి ఈ కావ్యమునకు "రామాయణము" అని, "మహత్తరమైన సీత చరిత్ర" అని,

 "పౌలస్త్య వధ" అని ,

 మూడు పేర్లు పెట్టాడు.



శ్లో// తదుపగత సమాస సన్ధి యోగం/

సమ మధురోపనతార్థ వాక్య బద్ధమ్/

రఘువర చరితం, ముని ప్రణీతం/

దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్//


(ఈ రామాయణ మహా కావ్యం దశగ్రీవుడైన రావణుని సంహరించిన శ్రీరాముని చరిత్ర.

ఇందులోని శబ్దములన్నీ శాస్త్ర సమ్మతమైన వేద శబ్దములు.

ఈ కావ్యములోని శ్లోకములన్నీ మృదు,మధురమైనవి.

 అతి దీర్ఘములు కాని చక్కని సమాసములతోను,

శ్రావ్యమైన సంధులతోను,

గంభీరమైన అర్థములతోను, కూడినవి.

బ్రహ్మ దేవుని ఆదేశానుసారం మహాఋషి వాల్మీకి రచించిన ఈ మహాకావ్యమును పఠించి, విని,తరిద్దాం).




                      శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

22-3-'26

ఉత్తమమైన ధర్మం ఏది ?

  శ్రీరామ (119)

శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఉత్తమమైన ధర్మం ఏది ?


క/ ఒరులేయవి యొనరించిన,

నరవర ! యప్రియము తన మనంబునకగు దా,

నొరులకు నవి సేయకునికి,

పరాయణము పరమధర్మ పథములకెల్లన్ //


(ఇతరులు ఏ పనులు చేస్తే మన మనస్సు బాధపడుతుందో,

అటువంటి పనులు మనం ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మముల కంటే శ్రేష్ఠమైన ధర్మము)

(తిక్కన సోమయాజి - మహాభారతం, విదురనీతి)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

22-3-'26.

సూర్య స్తుతి 🙏

 🌸సూర్య స్తుతి 🙏

కంద పద్యం


వెలుగులు నింపును సూర్యుడు 

బలమును చేకూర్చు పద్మ బంధువు మనకున్

పలుపంటలుపండించెడి 

ఖలునకు భక్తితో మనమున కైమోడ్చవలెన్


ఖలుడు__సూర్యుడు

సాహితీ శ్రీ జయలక్ష్మి

🌸శ్రీ రామ స్తుతి🙏

  🌸శ్రీ రామ స్తుతి🙏 


 సీ.ఘనమైన హారముల్ కాంచన చేలముల్

              ధరియించి కొలువైన ధర్మపాల !

     మహనీయ శ్రీరామ ! మధుర మధుర నామ !

              ధరణిపాలకరామ ! ధన్యచరిత !

     జానకీ ప్రాణేశ ! జగదభి రామయ్య !

               కాకుత్థ్సవంశజా ! ఘనచరిత్ర !        

     రఘువంశ చంద్రమా ! రాజిత గుణధామ             

              కమనీయరఘువరా ! కావు మమ్ము

తే.వల్కలమ్ముల ధరియించి వనము కేగి

    దనుజ దర్పమ్ము నణచిన ధర్మవీర !

    సవనమును గాచి బ్రోచిన శౌర్యరామ !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మతేజ !


        సాహితీ శ్రీ జయలక్ష్మి

సంక్షిప్త రామాయణ

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

*ఇంటింటా సంక్షిప్త రామాయణ*    

      *పారాయ‌ణం*


 ********

     *4వ రోజు పారాయ‌ణం* 

     🌸 *కిష్కింధ కాండ*🌸


 శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

              

   ***


శ్రీ‌ రామ లక్ష్మణులు శబరి ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపా సరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. సీతాదేవి అప‌హ‌ర‌ణం గురించి తెలుసుకుని విలపిస్తున్న రాముడికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు.

శ్రీ‌రామా , నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు.

ఉత్సాహం ఉంటే ఈ ప్ర‌పంచంలో సాధించ‌లేనిదంటూ ఏదీ లేదు. నీవు లోకైక వీరుడ‌వు. దుఃఖం, శోకం, భ‌యం,ఎవరి ప్ర‌తిభ‌ను అయినా బ‌య‌ట‌కు రాకుండా చేస్తాయి. ఈ అడ్డు తొల‌గించుకో, నీకు చెప్పేటంత‌టివాడ‌ను కాను. నిరుత్సాహానికి ఇది సమయం కాదు.

 అన్న‌య్యా... ఉత్సాహాన్ని పుంజుకో, ఈ బాధ విడిచిపెట్టి జ‌ర‌గ‌వ‌ల‌సిన దాని గురించి ఆలోచించు అని అన్నాడు లక్ష్మణుడు. త‌మ్ముడి మాట‌లు రాముడికి ఉత్సాహాన్నిచ్చాయి. 

 క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.


*శ్రీ‌రాముడి వద్దకు*

*హనుమ*..


వాలి, సుగ్రీవులు వానరులు. అన్నదమ్ములు.

తన అన్న అయిన వాలి కోపానికి గురై తరిమి వేయబడిన సుగ్రీవుడు , తనవారితో కలసి ఋష్యమూక పర్వతం పైననే తిరుగుతున్నాడు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భ‌య‌ప‌డ్డాడు. వాలి, వీరిని త‌న పైకి యుద్ధానికి పంపాడేమోన‌ని సుగ్రీవుడి భ‌యం. వారెవ‌రో తెలుసుకుని ర‌మ్మ‌ని హనుమంతుడిని వారి వద్దకి పంపాడు.

హనుమంతుడు స‌న్యాసి రూపంలో రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను సమీపించాడు– 

ఓ పుణ్యపురుషులారా! తమరు, వేషధారణను బట్టి తాపసులవలెనున్నారు. ధరించిన ఆయుధాలను బట్టి చూస్తే ,సర్వ శత్రు సంహరణా దక్షుల వలె ఉన్నారు. నర నారాయణుల లాగా, సూర్యచంద్రులలాగా, అశ్వినీ దేవతల లాగా కనిపిస్తున్నారు. నేను సుగ్రీవుడు అనే వానరుని మంత్రిని. అతడు తన అన్న వాలి ఆగ్రహానికి గురై దీనుడై ఉన్నాడు. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కోరుకున్న రూపాన్ని ధరించగలను. గనుక బ్ర‌హ్మ‌చారి వేషంలో మిమ్ములను కలవడానికి వచ్చాను. నేను వాన‌రుడ‌ను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి .....అని మృదువైన మాటలతో హనుమ అన్నాడు.


హనుమంతుని మాటలకు, అతడి వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు. 

ల‌క్ష్మ‌ణుడివైపు తిరిగి రాముడు,....

 చూశావా ల‌క్ష్మ‌ణా....

 ఇత‌ని మాటలలో ఎక్కడా అనవసర శబ్దం గాని, అపశబ్దం గాని లేవు. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వానిని మంత్రిగా కలిగిన రాజు ఏద‌యినా సాధించగలడు అని చెప్పాడు.

రాముడి అనుమ‌తి తీసుకుని లక్ష్మణుడు తమ రాకకుగల కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు.


*శ్రీరామ, సుగ్రీవుల మైత్రి*:


హనుమంతుని ద్వారా రామ ల‌క్ష్మ‌ణుల గురించి తెలుసుకుని సుగ్రీవుడు వారికి స్వాగ‌తం ప‌లికి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడతాన‌న్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ ని రాక్ష‌సుడు అప‌హ‌రించుకు పోతుండ‌గా చూశాం. ఆమె జారవిడచిన నగలు మావ‌ద్ద ఉన్నాయి అని వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు, క‌న్నీళ్ల ప‌ర్యంతం అయ్యాడు. క‌న్నీళ్ల‌తో రాముడి క‌ళ్లు మ‌స‌క‌బారాయి.

 ఈ ఆభ‌ర‌ణాలు మీ వ‌దిన సీత‌మ్మ‌వో కాదో చూడ‌మ‌ని,ల‌క్ష్మ‌ణుడికి చూపాడు రాముడు.


*నాహం జానామి కేయూరే* *నాహం జానామి కుండలే*

*నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్*

 అన్న‌య్యా.... ఈ కేయూరాలు, కుండలాలను నేను గుర్తించలేను. కాని నిత్యం వదినకు పాదాభివందనం చేయడం వలన ఈ నూపురాలు ఆమెవని మాత్రం చెప్పగలను అన్నాడు . ఆ ఆభ‌ర‌ణాల‌ను చూస్తూ

 రాముడు ఇంకా దుఃఖిస్తున్నాడు. రామా చింతించ‌కు సీత జాడ తెలుసుకుని తెచ్చి అప్ప‌గించే బాధ్య‌త నాది అని అనున‌య‌వాక్యాలు ప‌లికాడు సుగ్రీవుడు.

 రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి కుదుర్చుకున్నారు.

సుగ్రీవుడికి తన అన్న అయిన వాలితో వైరం ఎందుకు వ‌చ్చిందో రాముడు అడిగి తెలుసుకున్నాడు.

 కిష్కింధకు రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. ఒక సారి మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలం లోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే కాప‌లాగా ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒక నెల‌ గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని, రాక్ష‌సుడు బ‌య‌ట‌కు వ‌చ్చి చంపేస్తాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజును చేశారు.

కొంత‌కాలానికి వాలి బిలంలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి , సుగ్రీవుడు రాజ్యం కాజేయ‌డానికే బిలానికి బండ‌రాయిని అడ్డంగా పెట్టి వ‌చ్చాడ‌ని భావించి అత‌డిని నిందించాడు. సుగ్రీవుడి భార్య రుమ‌ను చేప‌ట్టి

 సుగ్రీవుడిని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.

దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.


*వాలి- సుగ్రీవుల పోరు*

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీ కొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవ‌రో పోల్చుకోలేక రాముడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో త‌న‌ను కాపాడ‌నందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.


 వాలి , సుగ్రీవులు ఇద్ద‌రూ ఒకేరకంగా ఉండ‌డంవ‌ల్ల కాపాడ‌లేక‌ పోయానన్నాడు రాముడు. మరో సారి వాలితో యుద్ధానికి వెళ్ల మన్నాడు రాముడు. సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు. ఈ సారి ఒక పుష్ప‌మాల‌ను గుర్తుగా సుగ్రీవుని మెడలో వేసి పంపాడు . మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార అడ్డుకునింది. సుగ్రీవుడితో పోరు వ‌ద్ద‌ని వారించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు వెంట‌నే మళ్లీ యుద్ధానికి వ‌స్తున్నాడంటే,ఇందులో ఎదో రహస్యమ్ దాగి వున్నదని తార అనుమానించింది. రామ ల‌క్ష్మ‌ణుల‌ అండ చూసుకుని సుగ్రీవుడు వ‌స్తున్నాడ‌ని గ్ర‌హించ‌మ‌నింది. కాని ,వాలి త‌న భార్య తార మాట వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక తనకు వారు ఏ హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.

అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు చెట్టు చాటునుంచి కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని ,వాలి గుండెలపైకిసంధించాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.

కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ క‌నిపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--


*రాముని వాలి నిందించుట*:

రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చాటుగా వేసిన బాణం వ‌ల్ల‌ నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, నీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. ధ‌ర్మం త‌ప్పి వ్య‌వ‌హ‌రించావు అని రాముడిని నిందించాడు.

నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? – అని వాలి అన్నాడు.


*రాముని సమాధానం*

వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.


నేను వేట మిష మీద నిన్ను చంపలేదు. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. కిష్కింధ మా రాజ్యంలోదే నని మరువకు.

నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు అధిపతివైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపానంటున్నావు... నీ మెడలోని కాంచన మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయం చేత నిన్ను కూల్చాను. పైగా నీది జంతు సంతతి .మాటు వేసి చంపడం సరయినదే.

అధ‌ర్మ వ‌ర్త‌నుడిని వధించడానికి యుద్ధ ధర్మాలు కూడా వర్తించవు. నీవు శిక్షార్హుడవు అన్నాడు. రాముడి స‌మాధానంతో వాలి తృప్తి చెందాడు. ధ‌ర్మ‌సూక్ష్మాల‌ను గ్ర‌హించాడు. 

 రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. అయితే గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో, సుగ్రీవుడు నా భార్య‌ తారను హింసించకుండా చూడు. నా అపరాధాలనూ మన్నించు అని వాలి వేడుకున్నాడు.


తరువాత వాలి సుగ్రీవుని పిలిచి ప్రాణాలు పోయే లోగా తన మెడలోని కాంచనమాలను తీసి అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. 

తార మాట విననందువల్లే తనకు ఈ దుర్గతి పట్టిందన్నాడు.. రాముడికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకోమ‌న్నాడు. అలక్ష్యం చేయవద్దన్నాడు.


పిన తండ్రిని కూడా తండ్రి లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని వాలి ప్రాణాలు వ‌దిలాడు.

 అనంతరం రాముడి ఆజ్ఞ‌పై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు , సుగ్రీవ ప‌ట్టాభిషేకానికి కిష్కింధకు వెళ్ళలేదు.

 అప్ప‌టికే వ‌ర్ష‌రుతువు వ‌చ్చేసింది. వర్షఋతువులో సీతా అన్వేషణా యత్నం సాధ్యం కాదు గనుక నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే. సీతాన్వేషణకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవుడికి చెప్పాడు.


*లక్ష్మణుని ఆగ్రహం*


వర్షా కాలం అయిపోయింది. ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్ధ విముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. రామకార్యం మరచిపోయాడు . ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని పొందడానికి కారణమైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్ధాలు తప్పవు. శ్రీరామ చంద్రునికి కోపం తెప్పించకు. వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు – అని మంచి మాట‌లు చెప్పాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుడిని పిలిచి, అన్ని దిశలనుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.


రాముడు సీతా వియోగంతో కుములుతున్నాడు. తాను చేసిన మేలు మరచి సుఖభోగాలలో మునిగి తేలుతున్నా సుగ్రీవుని ప్ర‌వ‌ర్త‌న రాముడికి మరీ బాధ కలిగించింది. అది చూసి లక్ష్మణునికి ఆగ్రహం పెల్లుబుకింది. ఆగ్ర‌హంతో కిష్కింధకు వెళ్ళాడు. కోపంతో వచ్చిన లక్ష్మణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు. అంగదుడు, మంత్రులు లక్ష్మణుని రాకను సుగ్రీవునికి తెలియజేశారు. వినయంతో మెలిగి ల‌క్ష్మ‌ణుడిని ప్రసన్నం చేసుకోమని హనుమంతుడు హితవు చెప్పాడు. భ‌యంతో సుగ్రీవుడు ముందుగా తార‌ను పంపాడు.

 తార వచ్చి సుగ్రీవుని త‌ప్పుని మన్నించమనీ, అతడు తన మిత్ర ధర్మాన్ని తప్పక నెరవేరస్తాడనీ లక్ష్మణుని ప్రాధేయపడుతూ విన్నవించుకొని అతనిని శాంతింపజేసింది. దానితో సుగ్రీవుడు కాస్త ధైర్యం తెచ్చికొని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. సమస్త వానర గణాలనూ కిష్కింధకు రావాలని ఆజ్ఞాపించాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని వ‌ద్ద‌కు వెళ్ళి రాముని పాదాలపై పడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.


*సీతాన్వేషణ ఆరంభం*


సుగ్రీవుని ఆజ్ఞపై తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర దిక్కుల‌కు వాన‌ర సేన వెళ్లింది.. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయకాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.

ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియ‌ద‌ని విచార వ‌ద‌నంతో మనవి చేశారు.


*దక్షిణ దిశలో అన్వేషణ*


దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు

రామ లక్ష్మణుల జననం నుంచి సీతా అపహరణమ్ వరకు గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు. అక్కడ కొండపైన ఉండే వృద్ద పక్షి సంపాతి ఇదంతా వింటున్నాడు. సంపాతి జటాయువు సోదరుడు. ముందు వానర మూకను తినవచ్చని అనుకున్నాడు. కానీ వారి మాటలలో వానరులు దశరధుడి కుమారుడయిన రాముడికి సహాయం చేస్తున్నారని గ్రహించాడు. దశరధుడి తో తనకు గల స్నేహం గుర్తు చేసుకున్నా డు. తమ్ముడు జటాయువు మరణ వార్త విని బాధపడ్డాడు. రావణాసురుడు సీతమ్మ ను అపహరించి ఆకాశ మార్గంలో లంకకు తీసుకుపోతుండగా సంపాతి చూసి వున్నాడు.

   రావణుడు సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలోసీతమ్మని దాచాడని వారికి చెప్పాడు.


*హనుమంతుని సంకల్పం*


 సంపాతి ద్వారా సీత జాడ తెలిసి వానరులు ముందు సంబరపడ్డారు. అయితే సముద్రం దాటడం ఎలా అన్న ప్రశ్నతో ఉత్సాహం నీరుగారిపోయింది. వానర సేనలోని గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు. అంద‌రిమాట‌లూ విన్న‌త‌ర్వాత‌....

జాంబవంతుడు హనుమంతునితో ఇలా అన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహు వర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు మాత్ర‌మే సాధ్యం. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరిచాడు.

ఆంజనేయుడు సముద్రంలా ఉప్పొంగిపోయాడు. 

దీర్ఘ దేహుడై విజృంభించాడు. జాంబవంతునికీ, వానర ప్రముఖులకూ వందనం చేశాడు.సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను.నాకు అనేక శుభశకునాలు క‌నిపిస్తున్నాయి. మీరు ఇక నిశ్చింతగా ఉండండి. అన్నాడు.


కార్య సాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు,హనుమను ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలు పెట్టిన‌ చోట పర్వతం బీటలువారి కొత్త సెలయేళ్ళు పుట్టాయి.

శత్రు నాశన సమర్ధుడు, వాయువేగంతో ప్ర‌యాణించ‌గ‌ల ధీరుడు అయిన హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంక వైపు తిరిగి నిలుచున్నాడు......

లంకకు బయలుదేరేందుకు సన్నద్దుడు అవుతున్నాడు...


శ్రీ‌రామ రామ రామేతి 

రమే రామేమ‌నోర‌మే

స‌హ‌స్ర‌నామ త‌త్తుల్యం 

రామ‌నామ వ‌రాన‌నే

              *****

*మనోజవం మారుత తుల్యవేగం*

*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం!*

*వాతాత్మజం వానరయూధ ముఖ్యం*

*శ్రీరామదూతం మనసా స్మరామి!!!*

         

*(కిష్కింధ కాండ స‌మాప్తం)*

*ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 58*


*పంచదశవర్ణరూపం కంచన కాంచీవిహారధౌరేయమ్।*

*పంచశరీయం శంభోర్వంచన వైదగ్ధ్యమూలమవలంబే॥*


*భావము :*


*జగన్మాత మంత్ర శరీరము కలది. పంచదశియే ఆ మంత్ర స్వరూపము. పంచ బాణములను చేత ధరించి, ఈశ్వరుని మైమరపింపజేసి తన వశము చేసుకుని, కాంచీపురమునందు విహరించే తల్లి నాకు ఆలంబన మగుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ ।

సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ।। 24 ।।



ప్రతిపదార్థ:



ఉత్సీదేయుః — నాశనమగును; ఇమే — ఇవన్నీ; లోకాః — లోకములు; న, కుర్యాం — నేను చేయకపోతే; కర్మ — కర్తవ్యమును; చేత్ — ఒకవేళ; అహం — నేను; సంకరస్య — అసాంస్కృతిక జనుల; చ — మరియు; కర్తా — బాధ్యుడను; స్యామ్ — అగుదును; ఉపహన్యామ్ — నాశనమగును; ఇమాః — ఇవన్నీ; ప్రజాః — ప్రాణులు.

  

 తాత్పర్యము : 


  నేను నా కర్తవ్యములను చేయకపోతే, ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను, మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది.


 వివరణ:


శ్రీ కృష్ణుడు ఈ భూలోకంలో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు, ఆయన రాజ వీరుల కుటుంబీకునిగా, సమాజంలో అన్నివిధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే, ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని, మిగతా జనులు, ఆయన చేసినట్టే చేయ ప్రారంభిస్తారు. శ్రీ కృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే, ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు, కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు. అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి, శ్రీ కృష్ణుడు దానికి దోషుడు అనబడుతాడు. ఈ విధంగా, తను చేయవలసిన విధులను చేయకపోతే, సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమౌతాయి అని శ్రీ కృష్ణుడు, అర్జునుడుకి వివరిస్తున్నాడు.


అదే విధంగా, అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడని ప్రపంచ ప్రఖ్యాతినొందాడు, అతను ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే తన ధర్మ బద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే, ఏంతో మంది ఉన్నతమైన ఇతర వీరులు, యోధులు ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యమును విడిచి పెట్టవచ్చు. ఇది ప్రపంచ సమతుల్యతని నాశనం చేసి, ధర్మాత్ములు, అమాయకులు అయిన ప్రజల వినాశనానికి కారకమవుతుంది. అందుకే, సమస్త మానవ జాతి కళ్యాణం కోసం, తన వేద విహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చచెప్పుతున్నాడు