శ్రీరామ (14)
( వాల్మీకి రామాయణం -7 )
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(21-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)
బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్య రచనకు ఉపక్రమించాడు.
ఆచమనం చేసి తూర్పు అగ్రములుగా గల దర్భల మీద ఆశీనుడయ్యాడు.
దోసిలి కట్టి ధ్యానమగ్నుడయ్యాడు.
శ్లో// తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః/
పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా//
(ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి అప్పుడు యోగ దృష్టితో ఇంతకు ముందు జరిగిన రామ చరిత్ర అంతా అరచేతిలోని ఉసిరికాయను చూచినట్లు చూడగలిగాడు).
రాముడు, లక్ష్మణుడు,సీత, దశరథుడు మొదలైన వారందరూ ఎప్పుడు, ఏమి చేసింది,
ఏమేమి మాట్లాడింది,
వారి వారి మనస్సులలో ఏయే భావములు మెసలుతుండేవి,
మొదలైన అన్ని విషయములు వాల్మీకి కి గోచరించాయి.
శ్రీరామ జననం, తాటకి వధ,విశ్వామిత్ర యాగ సంరక్షణ,
శివ ధనుర్భంగం, సీతా కళ్యాణం,పరశురామ గర్వభంగం,
రాముని రాజ్యాభిషేకమునకు విఘ్నం కలగడం,
సీతా రామ లక్ష్మణుల దండకారణ్య వాసం,
విరాధుని సంహరించడం,
మారీచ వధ, సీతాపహరణం,
రాముడు కబంధుని సంహరించడం,
పంపాసరస్సును,శబరిని, చూడటం,
హనుమంతుడు రాముని కలవడం,
సుగ్రీవ సమాగమం, వాలి వధ,
వానరులు సీతాన్వేషణకు బయలుదేరటం,
హనుమంతుడు లంకలో సీతాదేవిని చూడటం,
లంకా దహనం,
విభీషణ శరణాగతి,
వానర సైన్యంతో రాముడు సముద్రంపై నలుని చేత వారధి కట్టించి, సముద్రం దాటి లంకను ముట్టడించటం,
కుంభకర్ణ,మేఘనాధులతో సహా రావణుని సంహరించడం,
అగ్ని పునీత అయిన సీతాదేవిని తిరిగి పొందడం,
ఆయోధ్యకు పునరాగమనం,
శ్రీరామ పట్టాభిషేకం,
మొదలైన సమస్త విషయములు ఆ మహాఋషికి గోచరించాయి.
ఆ విధంగా యోగబలంతో తాను దర్శించిన
లోకాభిరాముడైన రాముడి చరిత్రను ఉన్నది ఉన్నట్లు వాల్మీకి మహర్షి " రామాయణం " అనే పేరుతో వ్రాయడానికి ఉద్యుక్తుడయ్యాడు.
శ్లో//ఉదార వృత్తార్థ పదై ర్మనోరమై/
స్తదాస్య రామస్య చకార కీర్తిమాన్/
సమాక్షరైః శ్లోక శతైర్యశస్వినో/
యశస్కరం కావ్య ముదారధీర్మునిః//
(యశశ్శాలి, బుద్ధిశాలి,ముని, అయిన వాల్మీకి, కీర్తిమంతుడైన రాముని కీర్తిని విశ్వవిఖ్యాతం చేస్తూ,మనోహరములైన పదములు,వాక్యములు,అర్థములతో కూడిన వందలకొలదీ శ్లోకములలో యశస్కరమైన రామాయణ మహా కావ్యమును రచించాడు).
శ్లో//కామార్థ గుణ సంయుక్తం,ధర్మార్థ గుణ విస్తరమ్/
సముద్ర మివ రత్నాఢ్యం సర్వ శ్రుతి మనోహరమ్//
(ఆ రామాయణం పురుషార్థములైన కామము,అర్థములను గురించి, విశేషంగాను,
ఆ అర్థ కామములను ప్రసాదిస్తూ మోక్షమునకు దారి తీసే ముఖ్య పురుషార్థమైన ధర్మమును గురించి విస్తారంగాను తెలియజేస్తుంది,
రత్నములను గర్భంలో ధరించిన సముద్రం లాగా, అనేక వేద రహస్యములను ఆ రామాయణం తన గర్భంలో ఇముడ్చుకున్నది,
అంతేకాదు ఆ రామాయణ మహా కావ్యం సర్వ శ్రుతి మనోహరమైనది).
ఈ రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి
శ్రీరామ పట్టాభిషేకం వరకు ఆరు కాండలలోను, తరువాత జరిగిన వృత్తాంతమును ఉత్తర కాండలోను, వివరిస్తూ, మొత్తం ఏడు కాండములలో, ఐదు వందల సర్గలలో,రచించారు.
ఇరువది నాలుగు అక్షరములతో కూడిన గాయత్రీ మహామంత్రమును పొందుబరుస్తూ,
ఆ మహాముని ఇరువది నాలుగు వేల శ్లోకములలో ఈ రామాయణ మహా కావ్యమనే కల్పవృక్షమును సృష్టించాడు.
చరితవ్రతుడైన ఆ వాల్మీకి మహర్షి ఈ కావ్యమునకు "రామాయణము" అని, "మహత్తరమైన సీత చరిత్ర" అని,
"పౌలస్త్య వధ" అని ,
మూడు పేర్లు పెట్టాడు.
శ్లో// తదుపగత సమాస సన్ధి యోగం/
సమ మధురోపనతార్థ వాక్య బద్ధమ్/
రఘువర చరితం, ముని ప్రణీతం/
దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్//
(ఈ రామాయణ మహా కావ్యం దశగ్రీవుడైన రావణుని సంహరించిన శ్రీరాముని చరిత్ర.
ఇందులోని శబ్దములన్నీ శాస్త్ర సమ్మతమైన వేద శబ్దములు.
ఈ కావ్యములోని శ్లోకములన్నీ మృదు,మధురమైనవి.
అతి దీర్ఘములు కాని చక్కని సమాసములతోను,
శ్రావ్యమైన సంధులతోను,
గంభీరమైన అర్థములతోను, కూడినవి.
బ్రహ్మ దేవుని ఆదేశానుసారం మహాఋషి వాల్మీకి రచించిన ఈ మహాకావ్యమును పఠించి, విని,తరిద్దాం).
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
22-3-'26
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి