26, మార్చి 2026, గురువారం

ఇంటింటారామాయణ

 *ఇంటింటారామాయణ*

 *దివ్యకథా పారాయణం* 

          *8 వ రోజు*

🏹🏹🏹🏹🏹🏹🏹🏹

*యుద్ధకాండ‌ కొనసాగింపు*

🏹🏹🏹🏹🏹🏹🏹🏹

*రావణ సంహారం*

*రామయ్యకు విజయం*

        🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

*****

ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే సరి. సముద్రాన్ని

 సముద్రంతోనే పోల్చగలం. అలాగే రామ రావణుల యుద్ధాన్ని మరి దేనితోను పోల్చడానికి వీలు లేదట.

*గగనం గగనాకారం సాగరం సాగరోపమం. రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ*

అని అంటారు.

*కుంభ‌క‌ర్ణుడి ప్ర‌వేశం*

అవమాన భారంతో కృంగిన రావణుడు, తన సోదరుడైన కుంభకర్ణుని నిద్ర‌లేప‌మ‌ని మంత్రులను పంపాడు. శూలాలతో పొడిచి, ఏనుగులతో త్రొక్కించి, కుంభకర్ణుడిని అతి కష్టంమీద నిద్ర‌నుంచి లేపారు. 

రావణుడు, కుంభకర్ణుడికి జరిగిన విషయం అంతా వివరించాడు. రాముడికి తమకు మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నదని చెప్పాడు. కుంభకర్ణుడు పెద్దగా ఆవులించి,

అనాలోచితంగా, సీతమ్మవారిని అపహరించి తప్పు చేశావని సోదర ప్రేమతో , రావణాసురుడిని నిందించాడు. సీతమ్మను అపహరించేటపుడు, ఆమెను అశోక వనంలో బంధించేటపుడు ఈ తెలివి ఏమైందని రావణాసురుడిని నిందించాడు. 

"కుంభ కర్ణా..నిన్ను నిద్ర లేపింది,యుద్ధంలో నీ ప్రతాపం చూపుతావని కానీ, జరిగిపోయిన విషయాల మీద నీ చేత తిట్లు తినడానికి కాదు."

ఆలస్యం చేయకుండా కదులు ,అన్నాడు రావణుడు.

స‌రే, జ‌రిగింది ఏదో జ‌రిగిపోయింది, ఇక తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు కుంభకర్ణుడు. 

ఆరు వందల ధనువుల ఎత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుడిని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. వానరులకు ధైర్యం చెప్పి, వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.

కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనపై విరుచుకు పడుతున్నాడు. అంతే , రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.వారి బాణాలు కుంభకర్ణుడిని ఆయుధ విహీనుడిని చేశాయి. రాముడు వాయవ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను కుంభకర్ణుడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. అయినా నోరు తెరుచుకొని వానరులను మింగేస్తున్న కుంభ‌కర్ణుడిని , రామచంద్రమూర్తి తన ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడిశరీరం క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నలిగిపోయారు.


*హనుమ వెళ్ళి*

*ఓషధి పర్వతాన్ని తెచ్చుట*

పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణుడికి ధైర్యం చెప్పి, ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను చీల్చి చెండాడ సాగాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు..మానవ రూపంలో ఉన్న రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని మన్నించి స్పృహ కోల్పోయాడు. లక్ష్మణుడు, అలాగే అటు పక్కగా ఉన్న కొందరు వానర నాయకులూ స్పృహ కోల్పోయారు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.

అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా, జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు స్పృహలో ఉంటే వానరసేన మరణించినా తిరిగి బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికిఉన్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు అన్నాడు. హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఔషధ పర్వతం మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని జాంబవంతుడు, హనుమంతుడిని కోరాడు.

జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శన చక్రంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. ఆ పర్వతంపై గల ఔషధ మొక్కల గాలి సోకగానే రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. మరణించిన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు అంతకుముందే ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.

*ఇంద్రజిత్తు మరణం*

రామలక్ష్మణులు స్పృహ నుంచి తేరుకోవడం, రాక్షసులు వందలు వేల సంఖ్యలో వానర సేన చేతిలో మరణిస్తుండడంతో, రావణుడు మళ్లీ ఇంద్రజిత్తును యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను ఇంద్రజిత్తు కల‌వ‌ర‌పెడుతున్నాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేద్దామంటే రాముడు అతనిని వారించాడు.

ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళుతున్నాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు. అయితే ఇంద్ర జిత్తు ప్రాణాలకు సంబంధించిన ఒక రహస్యాన్ని విభీషణుడు రామలక్ష్మణులకు తెలియజెప్పాడు. యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా అతడిని ఎవరు ఆపగలరో వారిచేతులలోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు అస‌లు ర‌హ‌స్యం చెప్పాడు. రాముని అనుజ్ఞ తీసుకొని, లక్ష్మణుడు ఆయుధ ధారియై, హనుమంతుని భుజాలపై కూర్చుని జాంబవంత, విభీషణ, అంగదాది వీరులతో కూడి నికుంభిలవైపు కదిలాడు. భయానక సంగ్రామానంతరం చుట్టూరా ఉన్న రాక్షసులను ఛేదించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నారు. సమంత్రకంగా ల‌క్ష్మ‌ణుడు దివ్య మహేశ్వరాస్త్రాన్ని విడిచాడు. అంతే...రెప్పపాటు కాలంలో ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు లక్ష్మణస్వామికి జయం పలుకుతూ రాముని వ‌ద్ద‌కు చేరుకొన్నారు.


*రామరావణ యుద్ధం ఆరంభం*

ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కావాలి కాని, యుద్ధం మధ్యలో పిరికివాడిలా ఇలాంటి పనులేమిటన్నాడు. దానితో ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి సైన్యంతో ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగు పెట్టాడు.

మ‌రోవైపు వాన‌ర వీరులు "శ్రీరామచంద్రునికి జయం", "లక్ష్మణునికి జయం", "సుగ్రీవునికి జయం", "ఆంజనేయునికి జయం", "అంగదునికి జయం", "జాంబవంతునికి జయం" అని పేరుపేరునా జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ రాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.

*లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ*

రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. 

రావణుడు విసిరేసిన శక్తి , వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కురిపించసాగాడు. కొంత సేపటికి హనుమ ఔషధ పర్వతాన్ని తెచ్చాడు. సుషేణుడు మూలికలను ఏరి రసం తీసి లక్ష్మణుడి నాలుకపై పోశాడు. లక్ష్మణుడికి స్పృహ వచ్చింది రాముడు లక్ష్మణుడిని గుండెలకు హత్తుకున్నాడు. అన్నా ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు నీ ప్రతిజ్ఞను చెల్లించుకో , రావణ సంహారం చేయి అన్నాడు.. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ వధను జగత్తు అంతా తిలకించాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి కాసేపు విశ్రాంతికోసం లంకలోకి వెళ్ళిపోయాడు.

రాముడు చిరున‌వ్వు న‌వ్వాడు. కీల‌క ఘ‌ట్టం స‌మీపిస్తున్న‌ది.

వాన‌ర సేన జ‌య జ‌య‌ధ్వానాలు మిన్నుముట్టుతున్నాయి.....

 *రావణ సంహారం*

రావణ సంహార ఘట్టం దగ్గర పడడంతో దేవతలు ఆకాశం నుంచి ఈ కీలక ఘట్టాన్ని ఆసక్తితో తిలకిస్తున్నారు. అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి, దివ్యమైన రథంతో రాముడికి సారథిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ఆ దివ్య రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి కొత్త వ్యూహం, కొత్త శక్తితో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు, మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి రావ‌ణుడిసారథి, రథాన్ని రాముడి కి ఎదురుగా లేకుండా దూరంగా తీసుకుపోయాడు.


అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన *"ఆదిత్య హృదయము"* ను ఉపదేశించాడు.

*ఆదిత్య హృదయం పుణ్యం

 సర్వశత్రు వినాశనం ।

జయావహం జపేన్నిత్యం

 అక్షయ్యం పరమం శివం ॥

సర్వమంగళ మాంగళ్యం

 సర్వ పాప ప్రణాశనం ।

చింతాశోక ప్రశమనం

 ఆయుర్వర్ధన ముత్తమం ॥ ॥

రశ్మిమంతం సముద్యంతం

దేవాసుర నమస్కృతం ।

పూజయస్వ వివస్వంతం

 భాస్కరం భువనేశ్వరం 


 సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. 

అక్షయం. 

పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. 

చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. 

సమస్త ఆపదాపహరణం.

 రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు.

ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.


*శ్రీరామ జయం*


రావణుని సారధి మళ్ళీ రథాన్ని రాముని ముందుకు తెచ్చాడు.

 సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రథాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు బాణాల వర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామ రావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి.

 రాముని బాణాలకు రావణుని రథ ధ్వజపతాకం కూలింది.

గుర్రాలు పక్కకు తొలగిపోయాయి.

మహా సర్పాలవంటి రాముని బాణాలకు ,

రావణుని తల తెగిపడింది.

 కానీ వెంటనే మరొకటి మొలుస్తున్నది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. 

"రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.

 అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని,సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం.

 రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై రావణాసురుడిపైకి విడిచాడు. 

వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడివ‌డిన‌ *బ్రహ్మాస్త్రం 🏹🏹🏹*

*నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను 🏹🏹చీల్చి, భూమిలో ప్రవేశించి, సావధానంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది.* 

రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతి నుతుడై శోభిల్లాడు. 

సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు.      


*సీత అగ్ని ప్రవేశం*


భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. 

రాముని ఆనతిపై విభీషణుడు రావణుడికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతమ్మవారికి నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతమ్మ‌కు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

లోకానికి సీత‌మ్మ పాతివ్ర‌త్యాన్ని తెలియ‌జేయాల‌నుకున్నాడు శ్రీ‌రాముడు. అందుకు లోకం కోసం చిన్న‌స‌న్నివేశాన్ని సృష్టించాడు.


"సీతా,.... ఇక్ష్వాకు కుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను.

 రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను. నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని అన్నాడు. ఆ మాట‌లు సీత‌కు పిడుగుపాటు లా అనిపించాయి.

సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది. రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయుగాక‌" అని పలికి సీతామహాసాధ్వి మంటలలోనికి నడచింది. 

అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ, రాముని సమక్షంలో నిలిచి "రామా! నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. దేవతలు నీవు విష్ణువు అవతారానివని కీర్తించారు.రాముడు మాత్రం

*ఆత్మానం మానుషం మన్యే*

*రామం దశరథాత్మజం*

నాపేరు రాముడు,దశరథ కుమారుడైన మానవ మాత్రుడననే అని వినయంగా అంటాడు. మానవుడిగానే రావణ సంహారం చేశానని లోకానికి చాటాడు.

వెంటనే అగ్ని, సీతమ్మవారిని వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు.


 సీత అప్పుడు ఉదయ సూర్యబింబంలా ఉంది.


 "*రామా! ఇదిగో నీ సీత.* *ఈమె పునీత. పావన చరిత*. *నిన్నే కోరిన పరమ సాధ్వి.*

 *ఈమెను అవశ్యం పరిగ్రహించు"* అని చెప్పాడు.

 అప్పుడు రాముడు ,"సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. 

ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. 

నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీతమ్మవారి చేతినందుకొన్నాడు రామచంద్ర మూర్తి.

 ఆకాశం నుంచి పుష్ప‌వ‌ర్షం కురిసింది.

*అయోధ్యకు పునరాగమనం*

యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ రాముని కోరికపై ఇంద్రుడు బ్రతికించాడు. వానర సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు, విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు.

 విభీషణుడు, వానరులు తోడు రాగా, పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. 

దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు.

*భరతుడికి వర్తమానం*

ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని భరతునికి సీతారామలక్ష్మణుల రాక గురించిన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రాముడికి, సీతమమ్మవారికి , లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని పలికాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేప‌ట్ట‌వలసిందిగా శ్రీరాముని ప్రార్థించాడు. భరతుడే సారథ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ, విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతో, 

ప్రజల జయ జయధ్వానాల మధ్య అయోధ్యలోనికి ప్రవేశించారు. 

తల్లులకు, పెద్దలకు, గురువులకు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వాములు మ్రొక్కారు. వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.

                *****

*శ్రీ రఘురామ*

*చారు తులసీదళ దామ* 

*శమక్షమాది*

 *శృంగార గుణాభిరామ* *త్రిజగన్నుత శౌర్య రమా లలామ*

*దుర్వార కబంధరాక్షస విరామ*

 *జగజ్జన కల్మషార్ణవో*

*త్తారకనామ*

 *భద్రగిరి దాశరథీ* *కరుణాపయోనిధీ*

 *****

రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ

స్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నీరద

శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధి సోమ సురారి దోర్భలో

ద్ధామ విరామ

 భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!*

         ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం ,వానర యూధ ముఖ్యం

శ్రీరాందూతం మనసా స్మరామి.


*(రేపు, శ్రీరామ పట్టాభిషేక పరమ పావన ఘట్టం)*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌అష్టమి -‌ ఆర్ధ్ర -‌‌ గురు వాసరే* (26.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

*శ్రీ రాముడి కల్యాణం*

 

భద్రాచలంలో..```

     *శ్రీ రాముడి కల్యాణం*

              ➖➖➖✍️


```

భద్రాచలంలో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నంలో  నిర్వహిస్తారు. 

అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం...

ఇది దోషరహిత ముహూర్త సమయం....

దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు. 

అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం  శ్రీరామనవమి వేడుక!


శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు.

అది ఆయన పుట్టినరోజు కూడా.

చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం.


మరి పుట్టిన రోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం..


శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా  నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు? 


నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూల కారకుడు, ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త, సృష్టికర్త మన భక్త రామదాసు..


ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలంలో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం. 


రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్త రామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు. 


అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు. భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి.(శ్రీరంగంలో మాదిరిగా).


పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. 

అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు, దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన

```

*“ఎస్య  అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్”*``` (పరమ  పురుష సంహిత) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం.


రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి. అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు.

ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అందుకు ఆద్యుడు, రూపకర్త, ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.


వాల్మీకి రామాయణంలో కానీ, పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడ లేదు. కానీ, నాడు భద్రాచలంలో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై, చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా 

శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి.... 


ఆ ముహూర్తనిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా, ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.

✍️```

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀💐🌹

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ:  కర్మ యోగము.



తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।

గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ।। 28 ।।



ప్రతిపదార్థ:



.తత్త్వ-విత్ — సత్యమును ఎరిగినవాడు; తు — కానీ; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; గుణ-కర్మ — గుణములు మరియు కర్మలచే; విభాగయోః — తారతమ్యము గుర్తించును; గుణాః — ఇంద్రియ-మనస్సు రూపంలో ఉన్న ప్రకృతి గుణములు; గుణేషు — ఇంద్రియ గ్రాహ్య వస్తువుల రూపంలో ఉన్న ప్రకృతి గుణములు; వర్తంతే — ప్రవర్తిల్లును; ఇతి — ఈ విధంగా; మత్వా — తెలుసుకొని; న, సజ్జతే — ఆసక్తితో ఉండరు.



 తాత్పర్యము : 


 ఓ మహా బాహువులున్న అర్జునా, జ్ఞానులు, ప్రకృతి-గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే (ఇంద్రియములు, మనస్సు వంటి రూపంలో ఉన్న) గుణముల (ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో) యందు కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు.


  

 వివరణ:


 ఇంతకు పూర్వ శ్లోకం ఏం చెప్పిందంటే, 'అహంకార విమూఢాత్మా' (అహంకారంచే భ్రమకు లోనై తమను తాము శరీరమే అనుకునేవారు) తామే కర్తలము అనుకుంటారు. ఈ శ్లోకం తత్త్వ-విత్ (సత్యమును ఎరిగినవారు) ల గురించి చెపుతోంది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించుకున్న వారు శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛ పొంది, తమ ఆధ్యాత్మిక విలక్షణతని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు, బదులుగా, ప్రతి కార్యకలాపం కూడా మూడు గుణముల కదలిక వల్లనే జరుగుతున్నాయని తలుస్తారు. ఇటువంటి, భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇలా అంటారు: ‘జో కరఇ సో హరి కరఇ, హోతా కబీర్ కబీర్’ - ‘భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ జనులు నేను చేస్తున్నాననుకుంటున్నారు’

వాల్మీకి రామాయణం - 16 )

  శ్రీరామ ( వాల్మీకి రామాయణం  - 16 )


🙏మీ అందరికి సకుటుంబంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు🙏

ఈరోజు పరమపావనమైన సీతారామ కళ్యాణం చెప్పుకుందాము.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏



  (25-3-'26  'సాయంత్రం '  పోష్టు తరువాయి భాగము)


జగత్కళ్యాణ కారకమైన సీతా రామ కళ్యాణం నిశ్చయమైంది అని ఇంతకు ముందు పోష్టులో చెప్పుకున్నాము.


 జరగబోయే తన కుమారుల వివాహ విషయాలు బంధువులతో ముచ్చటించుకొంటూ, దశరథమహారాజు  మహదానందంతో  ఆ రాత్రి గడిపాడు.

తెల్లవారింది.

ప్రాతః:కాలమే కర్మవేత్త అయిన దశరథ మహారాజు దైవ కార్యాలన్నీ నిర్వహించి,జనకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు.


శ్లో// యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః/

భ్రాతృభిః సహితో రామః కృత కౌతుక మంగలః/

వసిష్ఠం పురతః కృత్వా మహర్షీ నపరానపి/

పితుః సమీప మాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః//


(విజయమనే ముహూర్తంలో, పెండ్లికొడుకును చేయడము, తోరణము కట్టుకోవడము మొదలైన మంగళ కార్యములు పూర్తి చేసుకుని, సర్వాభరణ భూషితులై,రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వశిష్ఠాదిమహర్షులను ముందు ఉంచుకొని యజ్ఞశాలలో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చారు).


శ్లో// తతో రాజా విదేహానాం వసిష్ఠ మిద మబ్రవీత్ /

కారయస్వ ఋషే సర్వమృషిభిః సహ ధార్మిక /

రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో //


(పిమ్మట జనక మహారాజు ,లోకాభిరాముడైన రాముని వివాహం,విశ్వామిత్ర, శతానందాది మునీశ్వరుల సహాయంతో జరిపించమని వశిష్ఠ మహర్షిని,ఎంతో వినయంగా ప్రార్ధించాడు)


" అలాగే "అని వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుని, శతానందుని, ముందిడుకొని,యథా శాస్త్రముగాను, మంత్రపూర్వకముగాను,వేదిని నిర్మించాడు.


ఆ వేదిని చక్కగా అలంకరించి, వేది చుట్టూ దర్భలను ఉంచాడు.


అగ్నిని ప్రజ్వలింపజేసి, ఆ వేదిలో హోమము చేసాడు.


శ్లో// తతః సీతాం సమానీయ సర్వాభరణ భూషితామ్/

సమక్ష మగ్నే:సంస్థాప్య రాఘవాభిముఖే తదా/

అబ్రవీ జ్జనకో రాజా కౌసల్యానంద వర్ధనమ్//


(ఆ శుభముహూర్తాన సీతాదేవిని సర్వాభరణములతో అలంకరించారు. జనకమహారాజు, ఆ భూజాతను అగ్ని సమక్షంలో రామునకు అభిముఖంగా నిల్చోబెట్టి, కౌసల్యాదేవికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించే ఆ రామచంద్రునితో ఇలా అన్నాడు).


శ్లో//ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ/

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా//


(ఓ రామా!ఇదిగో నా కుమార్తె అయిన సీత. ఇప్పటి నుండి నీకు సహధర్మ చారిణి అవుతున్నది.ఈమెను స్వీకరింపుము.  నీ హస్తముతో ఈమె పాణిని గ్రహించుము ).


శ్లో//పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా/

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా//


(సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతయై ఎల్లప్పుడూ నీడ వలే నిన్ను అనుసరిస్తుంది. 

జనకమహారాజు ఈ మాటలు అంటూ మంత్రములతో పవిత్రమైన జలమును వదలెను)


వెంటనే దేవతలు, ఋషులు "బాగు"  "బాగు"అన్నారు.

దేవ దుందుభులు మ్రోగినై.

పుష్ప వర్షం కురిసింది.


(ఈ ఘట్టం  స్కాంద పురాణం లోని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని తలపిస్తున్నది.

బ్రహ్మదేవుడు మంత్రము చెప్పుచుండగా, హిమవంతుడు,

"ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర/

భార్యార్థం ప్రతిగృహ్ణీష్వ మంత్రేణానేన దత్తవాన్//

అస్మై రుద్రాయ మహతే దేవదేవాయ శంభవే/

కన్యా దత్తా మహేశాయ గిరీంద్రేణ మహాత్మనా//


( ఓ పరమేశ్వరా! నేను ఈ కన్యను (పార్వతిని) నీకు సమర్పిస్తున్నాను. ఈమెను నీ భార్యగా స్వీకరింపుము,అని మంత్రము పఠించుచూ

మహాత్ముడు, దేవదేవుడు,రుద్రుడు,  శంభువునగు శివునకు,గిరీంద్రుడైన హిమవంతుడు మంత్రపూతమైన జలముతో కన్యాదానమును చేసెను).


మంత్రోదక పురస్సరంగా సీతను ఈ విధంగా రామునకు ఇచ్చి ఎంతో ఆనందపడుతూ జనకుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు,


శ్లో// లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా/

ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః//

(లక్ష్మణా!రమ్ము. నీకు క్షేమమగుగాక. నేనిచ్చుచున్న ఊర్మిళను స్వీకరింపుము.ఈమె పాణిని గ్రహింపుము.ఆలస్యము చేయవద్దు).


ఈ విధముగా లక్ష్మణునిచే ఊర్మిళ పాణిగ్రహణం చేయించి, జనకుడు,


శ్లో//తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత/

గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన//

(లక్ష్మణునితో ఇట్లు పలికి, జనకుడు భరతునితో,ఇట్లనెను. ఓ రఘునందనా,భరతా, నీ హస్తముతో మాండవి పాణిని గ్రహింపుము).


శ్లో// శత్రుఘ్నంచాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః/

శ్రుతకీర్త్యా మహాబాహొ పాణింగృహ్ణీష్వ పాణినా//


(పిమ్మటధర్మాత్ముడైన జనకమహారాజు శత్రృఘ్నునితోఇట్లనెను.ఓ మహాబాహూ!శ్రుతకీర్తి హస్తమును నీహస్తముతో పట్టుకొని పాణిగ్రహణముచేయుము).


జనకుని వాక్యము విని, ఆ నలుగురు రాజకుమారులు, వశిష్ఠుని అనుమతితో ఆ నలుగురు కన్యలయొక్క సుకుమారములైన హస్తములను, తమ హస్తములతో గ్రహించిరి.


శ్లో//అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవచ/

ఋషీంశ్చైవ మహాత్మాన స్సభార్యారఘుసత్తమాః/

యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్//


(మహాత్ములైన ఆ రఘుకుమారులు,

భార్యాసమేతులై అగ్నికి ప్రదక్షిణం చేశారు.

వేదికి,జనకమహారాజుకు, ఋషులకు, ప్రదక్షిణం చేసి, యధావిధిగా వివాహం చేసుకున్నారు).


అప్పుడు ఆకాశమునుండి గొప్ప ప్రకాశముతో కూడిన పుష్పవృష్టి కురిసింది.


దేవదుందుభులుమ్రోగినై. 


గీత, మంగళ వాద్య ధ్వనులతో అప్సరసలు నాట్యం చేశారు.

గంధర్వులు మనోహరంగా గానము చేశారు.


ఆ వివాహ సమయములో ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడ ఉన్నవారంతా ప్రత్యక్షముగా చూసి ఎంతో ఆశ్చర్యము చెందారు.

పిమ్మట రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ భార్యలతో కూడి తమకు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్లారు.

భార్యా సమేతులై అలా వెళ్తున్న పుత్రులను ఆనందంగా చూస్తూ, బంధు సహితుడైన,దశరథుడు వారిని అనుసరించాడు. 

ఈ విధంగా వాల్మీకి మహర్షి, శ్రీమద్రామాయణం,బాలకాండలో, సీతా రామ కళ్యాణాన్ని వర్ణించారు.


                                స్వస్తి.


శ్లో//ధర్మ్యం యశస్య మాయుష్యం రాజ్ఞాంచ విజయావహం/

ఆదికావ్యమిదం చార్షం పురా వాల్మీకినా కృతం/

పఠేద్య: శృణుయాల్లోకే నర: పాపాత్ ప్రముచ్యతే//


(పూర్వము వాల్మీకిమహర్షి చేత రచింపబడిన  ఈఆదికావ్యము,ధర్మసమ్మతమైనది.చదివినవారికి కీర్తిని ఇస్తుంది. రాజులకు విజయాన్ని చేకూరుస్తుంది. ఋషికృతమైన ఈ ఆదికావ్యాన్ని చదివేవారు, వినేవారు,సమస్తపాపములనుండి

విముక్తులవుతారు).


రామాయణం చదివే వారికీ, వినేవారికీ, దీర్ఘాయుర్దాయము లభిస్తుంది. 

కొరినకోరికలన్నీ తీరుతాయి.

అందరూ జీవపుత్రులవుతారు. 

ఉత్తమమైన సంతానము లభిస్తుంది. 

ఇంట్లో ఉండి, అశాంతిని కలిగించే భూతములు తొలగిపోతాయి. 

పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు.


శ్లో//ఆయుష్య మారోగ్యకరం యశస్యం/

సౌభ్రాతృకమ్ బుద్ధికరం శుభంచ/

శ్రోతవ్య మేతన్నియమేన సద్భిః/

ఆఖ్యాన మోజస్కర మృధ్ధికామైః//


(ఆయుర్దాయమును, ఆరోగ్యమును, కీర్తిని,  సోదరప్రేమను, సద్బుద్ధిని, శుభములను, తేజస్సును, వృద్ధి చేసే ఈ రామాయణమును సత్పురుషులు నియమపూర్వకముగా వినవలెను).

                                     

                    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


        శ్లో// స్వస్తి:ప్రజాభ్య:పరిపాలయంతాం/

               న్యాయ్యేన మార్గేణమహీం మహీశా:/

               గో బ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం/

               లోకా: సమస్తాః సుఖినో భవంతు//


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

26-3-'26.

మహాభారతం

 🙏మహాభారతం _ శాంతి పర్వం 🙏

                     తొమ్మిదవ భాగం 

అప్పుడు ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! తినకూడనివి ఏవి ? త్రాగ కూడనివి ఏవి ? ఎవరు యోగ్యులు ? ఎవరు అయోగ్యులు ? వివరించండి " అని ఆడిగాడు. వ్యాసుడు బదులుగా " ధర్మనందనా ! గుర్రము, ఒంటె, గాడిద పాలు త్రాగ కూడదు. బ్రాహ్మణుడు ఆడగుర్రము, ఆడఒంటె, ఆడగాడిద దరిదాపులకు వెళ్ళ కూడదు. మనిషిపాలు అసలు త్రాగ కూడదు. ఈనిన పది రోజుల లోపల ఆవు పాలు త్రాగ కూడదు. ప్రేతము వెళ్ళిన ఇంటి భోజనం, పురుటి భోజనం, తలారి ఇచ్చిన భోజనం, కులట ఇచ్చిన భోజనం, స్త్రీ సంపాదన మీద బ్రతికేవాడు పెట్టిన అన్నం, ఆట పాటలతో జీవించేవాడు ఇచ్చే అన్నం, జూదరి ఇచ్చే అన్నం, పూలు అమ్ముకునేవాడు ఇచ్చిన అన్నం, ఊరి నుండి వెలివేసినవాడు ఇచ్చే అన్నం, అన్న కంటే ముందు వివాహంచేసుకునే వాడు ఇచ్చే అన్నం తినరాదు. అవి అభోజ్యములు. ఇతరులను పొగడుతూ జీవించేవాడు ఇచ్చిన అన్నం అత్యంతహేయం. నిలవఉన్న అన్నం పాచిపోయిన అన్నం తినరాదు. సురాపానంతో సంబంధించిన అన్నం తినరాదు. పులగము, పాయసం, అప్పములు, నువ్వులతో చేసిన వంటకములు, దేవుడికి అర్చనచేసి నివేదన చేసిన తరువాత కాని తినకూడదు. ఇవి మామూలుగా వండుకుని తినరాదు.


గృహస్థాశ్రమ ధర్మమును పాటించే వారు దేవతార్చన చేయకుండా దేవతలకు నివేదించక, పితృదేవతలకు పెట్టక, అతిథులకు పెట్టక తినరాదు. గృహస్థు అయిన వాడు భార్యాబిడ్డలు బంధువులతో సంచరిస్తూనే అంటీ అంటక ఉండాలి. వారి ప్రేమాభిమానాలాకు పూర్తిగా లొంగకూడదు. ధర్మనందనా ! ఇంక అయోగ్యుల గురించి చెప్తానువిను. పాటలుపాడుతూ నృత్యములు చేస్తూ జీవించేవారు. విదూషకులు, దుర్జనులు, నపుంసకులు, మోసగాళ్ళు, వేదం చదవనివాళ్ళు, తక్కువ కులమువాళ్ళు, ఇతరులకు హానిచేయడమే వృత్తిగాపెట్టుకున్న వాళ్ళు దానం స్వీకరించడానికి అనర్హులు. పేదవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, దానానికి అర్హులు. నీకు దానగుణం ఎక్కువగా ఉన్నా చెడ్డవాళ్ళకు దానం చేయకూడదు. దాని వలన ప్రయోజనం శూన్యం. అపాత్రాదానం మంచిది కాదు. అనర్హులకు చేసే దానం నపుంసకుడికి కన్యను ఇచ్చినట్లు, బూడిదలో నెయ్యిపోసినట్లు, ఓటికుండలో నీళ్ళుపోసినట్లు ఔతుంది. అర్హుడైనవాడికి చేసేదానం చేసినవాడికి పుచ్చుకున్న వాడికి ఇహ లోకసౌఖ్యం పరలోక సౌఖ్యం కలుగుతుంది. ధర్మజా ! నీకు నేను మంచీచెడు సంక్షిప్తంగా మంచిచెడు గురించి వివరంగా చెప్పాను. నా పలుకులు మన్నించి ధర్మబద్దంగా ప్రవర్తించు " అన్నాడు.


ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! మీరు చెప్పిన మాటలు నా మనసుకు చాలా హర్షం కలిగించాయి. మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను ధర్మమార్గం అవలంబించి రాజ్యభారం వహించి అమంగళం కలగకుండా చూస్తాను. నా మీద కృపతో మీరు రాజధర్మములు వర్ణాశ్రమ ధర్మాలు ఆపద్ధర్మాలు నాకు తెలియ చెప్పండి. నాకు రాజధర్మం ధర్మాచరణ పరస్పర విరుద్ధం తోస్తుంది. అందుకని మిమ్ము ఇలా ప్రార్ధిస్తున్నాను " అన్నాడు. అప్పుడు వ్యాసుడు నారదుడిని చూసి " మహర్షీ ఈ మహారాజును భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళాలి. భీష్ముడే ధర్మజుడికి సకల ధర్మములు చెప్పగల సమర్ధుడు " అన్నాడు. అప్పుడు నారదుడు " మహర్షీ ! మీరు చెప్పినది చాలా యుక్తంగాఉన్నది " అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు ధర్మనందనుడితో " ధర్మనందనా ! భీష్ముడు కురువృద్ధుడు. ఇంద్రాదులకు కూడా పూజనీయుడు. కుటిలత్వం తెలియనివాడు. పరశురాముడి వద్ద విద్యలునేర్చి విలువిద్యా రహస్యాలను తెలుసుకున్న వాడు. పవిత్రగంగా గర్భమున జన్మించిన వాడు. సుగుణాలకు పుట్టిల్లు. ఆయనకు తెలియని ధర్మసూక్ష్మములు లేవు. చ్యవనుడు, మార్కండేయుడు, వశిష్ఠుడు మొదలగు మహర్షుల వద్ద ధర్మసూక్ష్మములు తెలుసుకున్న వాడు. తండ్రినుండి స్వచ్ఛందమరణం వరంగాపొంది తన ప్రాణములు మేనిలో నిలుపుకుని ఉన్నాడు. నీవంటే ఎంతో అభిమానం ఉన్న అంతటి మహానుభావుడి వద్దకు నీవు వెళ్ళి ప్రార్ధించిన అతడు నీకు అత్యంత వాత్సల్యంతో నీకు ధర్మసూక్ష్మములు తెలుపగలడు. దీనివలన నీవు ఎంతో కీర్తిమంతుడవు కాగలవన్నది మా అందరి అభిమతం. పైగా భీష్ముడికి అవసాన కాలం సమీపిస్తుంది. ఇంక ఆలస్యంచేయకు " అన్నాడు.


ధర్మరాజు వ్యాసుడితో " మునివర్యా ! ఎంతో మంది బంధువులను, మిత్రులను వధించిన వాడను ఆయన ఎదుట ఎలా నిలువగలను ? విలువిద్యా విశారదుడైన భీష్ముడిని కృత్రిమసమరంలో కూల్చిన పాతకుడిని తిరిగి ఆయన ఎదుట ఎలా నిలువగలను ఆయన మొహంచూసి ధర్మసూక్ష్మములు చెప్పమని ఎలా అడగను " అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మజా ! అలా అనుకోవడం ఎందుకు. నీవు వ్యాసమహాముని ఆజ్ఞమేరకు భీష్ముడి వద్దకు వెళుతున్నావు. కాని ఇంతశోకంతో భీష్ముని వద్దకు వెళ్ళకు ముందు నీవు రాజ్యానికి వెళ్ళు తరువాత భీష్ముడి వద్దకు వెళ్ళవచ్చు. నీకొరకు నీతమ్ములు, బ్రాహ్మణులు, పురజనులు ఎదురుచూస్తున్నారు. హస్థినాపురప్రవేశం చేసి వారందరికి ఆనందం కలిగించు " అని పలికాడు. ఈ ప్రకారం వ్యాసుడు, నారదుడు, శ్రీకృష్ణుడు, దేవలుడు చెప్పిన మాటలతో తన శోకమును వదిలిపెట్టిన ధర్మరాజుకు రాజ్యపాలన పట్ల ఆసక్తి కలిగింది. ధర్మరాజు ఆ మునులందరికీ ప్రదక్షిణంచేసి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తరువాత మునులందరూ తమతమ స్థానాలకు వెళ్ళారు.


ధర్మరాజు దేవతలను బ్రాహ్మణులను పూజించాడు. తనదర్శనం కొరకు వేచిఉన్న సామంతులను కలుసుకుని వారిచ్చిన కానుకలను స్వీకరించాడు. మరునాడు వేకువనే లేచి అభ్యంగనం ఆచరించి తెల్లనివస్త్రములు విలువైననగలు అలంకరించుకున్నాడు. పదునారు తెల్లనిగుర్రములను కట్టిన రథమును అధిరోహించాడు. భీముడు సారథిస్థానమున కూర్చున్నాడు. అర్జునుడు వెనుక నిలబడి తెల్లనిగొడుగు పట్టుకున్నాడు. నకులసహదేవులు వింజామరలు వీస్తున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి వెంటవస్తున్నారు. విదురుడు, కుంతీదేవి, ఇతర అంతఃపుర స్త్రీలు వారవారి వాహనములలో పల్లకీల మీద వస్తున్నారు. సామంతరాజులు తమతమ సైన్యములతో పక్కన వస్తున్నారు. ఇలా ధర్మరాజు హస్థినాపురానికి పయనమయ్యాడు.

                     సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ